breaking news
Networking company
-
సందర్భం: నెట్వర్కింగ్ క్వీన్..జయశ్రీ ఉల్లాల్
‘భవిష్యత్ అనేది మూసిపెట్టిన పెట్టెలాంటిది. అందులో నీ కోసం ఎన్నో అద్భుతాలు ఎదురు చూస్తుంటాయి’ అనే ఆంగ్ల సినిమా డైలాగ్‌ను గుర్తు తెచ్చుకుంటే ‘అవును. నిజమే’ అని చాలా సందర్భాలలో అనిపిస్తుంది. ఫోర్బ్స్ ‘అమెరికాస్ రిచెస్ట్ సెల్ఫ్‌మేడ్ ఉమెన్’ జాబితాలో చోటు సాధించిన జయశ్రీ ఉల్లాల్ విజయాలను చూస్తే ఆ డైలాగ్‌లోని సత్యం మరింత బలపడుతుంది. ఊహకు కూడా అందని అద్భుతాలు ఆమె జీవితంలో జరిగాయి... లండన్‌లో పుట్టిన జయశ్రీ దిల్లీలో పెరిగింది. శాన్ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్శిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, శాంటా క్లారా యూనివర్శిటీలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ చేసింది. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే నెట్వర్కింగ్ హార్డ్‌వేర్, నెట్వర్కింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ ‘సిస్కో’లో చేరింది. ‘అలా జరుగుతుందనుకోలేదు’ అని గతాన్ని గుర్తు చేసుకుంటుంది జయశ్రీ. ఆ కంపెనీలో ఆమె కాంట్రాక్ట్ రెండు సంవత్సరాలే. అయితే పదిహేను సంవత్సరాలు ఆ కంపెనీతో కలిసి నడిచింది. కంపెనీ సీయివో జాన్ చాంబర్, తన బాస్ మారియో మజోలా విలువైన ప్రోత్సాహం తో ‘జీరో’ స్థానంలో ఉన్న కంపెనీని లాభాల బాటలోకి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించింది. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయికి చేరింది. ‘ఈ స్థాయికి వస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు’ అంటుంది వినమ్రంగా జయశ్రీ. నిజమే మరీ, అది నల్లేరు మీద నడకలాంటి ప్రయాణం కాదు. రెండు ముక్కల్లో చెప్పాలంటే కత్తి మీద సాము. తన తెలివితేటలు, వ్యూహాలు, దార్శనికతను ఏకం చేసి కంపెనీకి శక్తి ఇచ్చింది. తనలోని ‘శక్తి’ని కంపెనీ గుర్తించేలా చేసుకుంది. మూడు దశాబ్దాల నెట్వర్కింగ్ అనుభవం ఉన్న జయశ్రీ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ (2015), వరల్డ్స్ బెస్ట్ సీయివో (2018) అవార్డ్లు అందుకుంది. ‘టెక్ల్యాండ్ అనేది పురుషుల ప్రపంచం అనే భావన ఉంది’ అనే సందేహానికి జయశ్రీ స్పందన: ‘నెట్వర్కింగ్ ఇండస్ట్రీ ప్రతిభావంతుల కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తుంటుంది. ఈ నేపథ్యంలో లింగ వివక్షకు చోటు ఉండదు అని నమ్ముతున్నాను. అయితే, వృత్తిని, కుటుంబజీవితాన్ని సమన్వయం చేసుకోవడమే అసలైన సవాలు. ‘సిస్కో’లో పనిచేసే కాలంలో కొన్ని నెలల పాటు ప్రసూతి సెలవులు తీసుకుంది. ఆ సమయంలో డోలాయమాన స్థితిలో ఉండిపోయింది. ‘ఒక బిడ్డకు తల్లిగా ఉండిపోవాలా? తిరిగి ఉద్యోగంలో చేరాలా?’ ‘ఇంటికే పరిమితమై మాతృత్వాన్ని ఆస్వాదించాలి’ అని కొన్నిసార్లు...‘మళ్లీ ఉద్యోగం చేయాల్సిందే. నేను సాధించాల్సింది ఎంతో ఉంది’ అని కొన్నిసార్లు అనిపించేది. అయితే కుటుంబసభ్యులు, సన్నిహితుల సలహాతో ఒక బిడ్డకు తల్లిగా మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే, మరోవైపు కెరీర్లో దూసుకుపోయింది. జయశ్రీ భర్త సెమికండక్టర్–ఇండస్ట్రీలో హైటెక్ ఎగ్జిక్యూటివ్. అలా అని ఇంట్లో సాంకేతిక కబుర్లు మాత్రమే వినిపిస్తాయి అనుకోవద్దు. దంపతులిద్దరూ ఇద్దరు కూతుళ్లతో సరదా సరదాగా గడుపుతారు. బాలీవుడ్ సినిమాలు తెగ చూస్తారు. హాయిగా పాటలు పాడుకుంటారు. వీటి ద్వారా వృత్తికి, వ్యక్తిగత జీవితానికి మధ్య స్పష్టమైన విభజన రేఖను ఏర్పాటు చేసుకోగలిగారు. ప్రస్తుతం కంప్యూటర్ నెట్వర్కింగ్ సంస్థ ‘అరిస్టా’కు ప్రెసిడెంట్‌గా... సీయీవోగా విధులు నిర్వహిస్తున్న జయశ్రీ, ఆ సంస్థను శక్తిమంతం చేయడం ద్వారా తనలోని ప్రతిభను మరోసారి నిరూపించుకుంది. ఆహారం, కుటుంబ విలువలు, సంస్కృతి పరంగా తనను తాను భారతీయురాలిగా చెప్పుకునే జయశ్రీ బిజినెస్ ఫిలాసఫీకి సంబంధించిన ఆలోచనా విధానంలో మాత్రం తాను ‘గ్లోబల్ సిటిజన్’ అంటుంది. ‘నెట్వర్కింగ్ ఇండస్ట్రీ ప్రతిభావంతుల కోసం వెయ్యికళ్లతో ఎదురు చూస్తుంటుంది. ఈ నేపథ్యంలో లింగ వివక్షకు చోటు ఉండదు అని నమ్ముతున్నాను. అయితే, వృత్తిని, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకోవడమే అసలైన సవాలు. -
కొత్త రూటర్‌తో తగ్గనున్న ఇంటర్నెట్ కష్టాలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దేశంలోని ప్రముఖ నెట్వర్కింగ్ కంపెనీ ‘స్మార్ట్‌లింక్ నెట్వర్క్ సిస్టమ్స్ లిమిటెడ్’ ఏసీ750 అనే వైర్లెస్ డ్యూయల్ బ్యాండ్ బ్రాడ్‌బ్యాండ్ రూటర్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. డీజీ-బీఆర్4400ఏసీ అనే ఈ కొత్త తరం రూటర్కున్న రెండు ప్రత్యేక ఎల్ఈడీలు...2.4 జీహెచ్‌జడ్, 5 జీహెచ్‌జడ్ ఫ్రీక్వెన్సీలను సూచిస్తాయని, తద్వారా కనెక్టెడ్ వైర్లెస్ నెట్‌వర్క్‌ను సులభంగా గుర్తించవచ్చని సంస్థ ఒక ప్రకటనలో వివరించింది. భారతీయ ఇంటర్నెట్ స్పేస్ అనేక డివైజ్‌లలో విశ్వ రూపాన్ని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో బహుళ ఇంటర్నెట్ డివైజ్‌లు అనేక సమస్యలు సృష్టిస్తున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో నెట్వర్క్ అత్యుత్తమంగా పని చేయడానికి ఈ రూటర్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. అంతేకాకుండా రూటర్‌లోని ఇన్‌బిల్ట్ గిగాబైట్ వై-ఫై, కంటెంట్‌ను వేగంగా డౌన్లోడ్ చేసుకోవడానికి సాయపడుతుందని పేర్కొంది. పెద్ద వీడియో, మ్యూజిక్ ఫైళ్లను సత్వరమే వినియోగించుకోవడానికి కూడా వీలవుతుందని తెలిపింది. దీని ధర రూ.3,490 అని, ఇళ్లు, వ్యాపారాల్లో అత్యుత్తమ పనితీరుకు దీనికి మించిన ప్రత్యామ్నాయం లేదని వివరించింది. అమ్మకాల తదనంతర సేవలను కూడా సమర్థంగా అందిస్తామని తెలిపింది.