breaking news
Net signals
-
ఎరువులపై సిగ్నల్ దరువు
భీమవరం : ఎరువుల అమ్మకాల్లో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఈ పోస్ విధానంతో రైతులు, వ్యాపారులు అనేక ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ పోస్ యంత్రాలకు సక్రమంగా సిగ్నల్స్ అందకపోవడంతో గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల వాడకం తగ్గించడం ద్వారా ఎరువుల కొరత నివారణ, ఆహార పదార్థాలపై విష ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఈ విధానం అమలులోకి తీసుకువచ్చినా ప్రభుత్వ నిబంధనలతో రైతులకు సకాలంలో ఎరువులు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఎరువులు పొందాలంటే ఎరువుల డీలర్లు, సహకార ‡సంఘాల వద్ద పట్టాదార్ పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు నకళ్లను తీసుకువెళ్లి దానిలో నమోదుచేయించుకుని ఎరువులు పొందాల్సి ఉంది. అయితే ప్రస్తుతం రైతులు ఈ పోస్ విధానంలో ఎంత ఎరువునైనా కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. సరిగా పనిచేయని సిగ్నల్స్ రైతులు ఎరువులు కొనుగోలు చేయాలంటే వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (సొసైటీలు), ఎరువుల వ్యాపారుల వద్దకు ఆధార్ కార్డుతో వెళ్లాలి. దాని ద్వారా రైతుకు ఏ ఎరువు ఎంత మొత్తంలో కావాలో ఈ పోస్ విధానం ద్వారా ఆన్లైన్లో దానిని పొందుపర్చి కొనుగోలు చేసిన ఎరువుల మొత్తానికి రశీదు ఇచ్చి ఎరువులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ పోస్ యంత్రాలకు సిగ్నల్స్ సరిగా అనుసంధానం కాకపోవడంతో రైతులు గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. డీసీసీబీ, డీసీఎంఎస్ సమావేశాల్లో చర్చ ఎరువుల విక్రయంలో ఈ పోస్ విధానం అమలు కారణంగా సహకార సంఘాల్లో ఎదురవుతున్న సమస్యలను ఇటీవల జరిగిన డీసీసీబీ, డీసీఎంఎస్ జనరల్ బాడీ సమావేశాల్లో సహకార సంఘాల ఉద్యోగులు, రైతులు ఏకరవు పెట్టారు. ఈ పోస్ విధానం వేగవంతంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని లేకుంటే రైతులు సొసైటీలపై అభాండాలు వేసే ప్రమాదముందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేయగా చేతిలో సొమ్ము, ఎదురుగా ఎరువులున్నా పంట పొలాలకు వినియోగించుకోలేకపోతున్నామని రైతులు ధ్వజమెత్తారు. కొనుగోలులో కష్టాలు ఈ పోస్ విధానంలో ఎరువుల కంపెనీలు, డీలర్ల నుంచి సహకార సంఘాలు, వ్యాపారులు కొనుగోలు చేసి దిగుమతి చేసుకున్న ఎరువుకు ఆయా కంపెనీల నుంచి ఎక్‌నాలేడ్జ్‌మెంట్ పొందాల్సి ఉంటుంది. ఎరువులు దిగుమతి చేసిన వాహనదారుడు తిరిగి వెళ్లి ఆయా కంపెనీలు, డీలర్లకు వారు దింపుకున్న మొత్తం వివరాలను తెలిపిన తరువాత వాటిని ఆన్లైన్లో పొందుపరిస్తే స్టాక్ రిజిస్టర్లో చూపిస్తుంది. అప్పటివరకు వ్యాపారులు ఎరువులు అమ్ముకునే అవకాశం లేదు. డీలర్లు, కంపెనీలు వెనువెంటనే ఆన్లైన్ చేయకపోవడంతో స్టాక్ రిజిస్టర్లో చూపించకపోవడం వల్ల తమ వద్ద సరుకు ఉన్నా అమ్ముకునే వీలులేకుండా పోతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి సరికొత్త విధానం ప్రస్తుతం రైతుల భూముల వివరాలను వెబ్‌ల్యాండ్‌లో పొందుపరుస్తున్నారు. దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్ నెల నుంచి రైతులు ఎరువులు కొనుగోలుకు వెళ్తే వెబ్‌ల్యాండ్‌ను పరిశీలించి దానిలో వివరాల మేరకే ఎరువుల వ్యాపారులు, సొసైటీల్లో ఎరువులను విక్రయించాల్సి ఉంది. భూసార పరీక్షల ఆధారంగా రైతులకు ఎరువులను అందించనున్నారు. రైతులు ఏ ఎరువులు కొనుగోలు చేసినా పూర్తి ధరకే కొనాలి. అనంతరం ఆయా ఎరువులపై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. -
ఆఫ్‌లైన్‌లో గూగుల్ మ్యాపులు...
కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు గూగూల్ మ్యాపులు తోడుంటే ఎంత భరోసాగా ఉంటుందో చెప్పలేం. మరి మీరు వెళ్లిన చోట నెట్ సిగ్నల్స్ రాకపోతే? ఇబ్బందేకదూ... ఆఫ్లైన్లోనూ గూగుల్ మ్యాపులను ఎలా చూడవచ్చో తెలుసుకుంటే ఈ చికాకు నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. గూగుల్ ఈమధ్యనే ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ ద్వారా ఇది సాధ్యమవుతోంది. ట్రాఫిక్, నావిగేషన్ అడ్రస్‌లు వంటి కొన్ని ఫీచర్లు లేకపోయినప్పటికీ మీరు ఎక్కడున్నారో తెలుసుకునేందుకు, తద్వారా గమ్యాన్ని సులువుగా చేరేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం... మ్యాప్‌లను ఆఫ్‌లైన్‌లో పొందండి ఇలా... ఆండ్రాయిడ్, ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. కాకపోతే ఐఫోన్ వినియోగదారులు తాజా మ్యాప్స్ ఆప్ (గూగుల్ మ్యాప్స్ వెర్షన్ 3), ఆండ్రాయిడ్ వినియోగదారులైతే (వెర్షన్ 8)ను ఉపయోగించాల్సి ఉంటుంది. 1. ముందుగా గూగుల్ అకౌంట్‌తో సైన్ ఇన్ కావాలి. 2. సెర్చ్బార్లో ‘ఓకే మ్యాప్స్’ అని టైప్ చేయండి. వెంటనే స్క్రీన్పైభాగంలో ‘సేవ్ దిస్ మ్యాప్’ అన్న డైలాగ్ కనిపిస్తుంది. 3. మ్యాప్‌ను అవసరమైతే జూమ్ ఇన్ లేదా జూమౌట్ చేసుకుని మీకు కావాల్సిన ప్రాంతాన్ని గుర్తించి సేవ్ చేసుకోండి. ఉదాహరణకు మీకు హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ ప్రాంతంకు కావాలనుకుందాం. అక్కడి వరకూ జూమ్ చేసుని సేవ్ బటన్‌ను ప్రెస్ చేయాలన్నమాట. ఆ తరువాత మీరు ఆఫ్లైన్లోనైనా ఆ ప్రాంతాన్ని మరింత జూమ్‌ఇన్ చేసుకుంటూ చూసుకోవచ్చు. 4. మ్యాప్ సేవ్ బటన్ నొక్కగానే మ్యాప్‌కు పేరుపెట్టమని కోరుతూ ఓ డైలాగ్ బాక్స్ ప్రత్యక్షమవుతుంది. నచ్చిన పేరు టైప్ చేసి సేవ్ చేసుకోండి. అంతే... ఆఫ్లైన్లోనూ మీకు అవసరమైన మ్యాప్‌లు అందుబాటులోకి వచ్చేస్తాయి. మ్యాప్స్ స్క్రీన్‌పై కనిపించే వ్యక్తి బొమ్మను క్లిక్ చేస్తే మీ ప్రొఫైల్ అందుబాటులోకి వస్తుందికదా... దాంట్లోనే మీరు సేవ్ చేసుకున్న మ్యాప్‌లు కూడా ఉంటాయి. కావాల్సిన దాన్ని ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు. ఆఫ్‌లైన్ మ్యాప్‌లతో కొన్ని పరిమితులు ఉంటాయన్న విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి. ముందుగా మరీ ఎక్కువగా జూమ్ చేసుకోలేరు. రెండో పరిమితి. సేవ్ చేసుకున్న మ్యాప్‌లు నెల రోజులపాటు మాత్రమే అందుబాటులో ఉంటాయి.