breaking news
nellore commissioner
-
అవినీతి కార్పొరేషన్..కమీషన్ ఇస్తేనే బిల్లులకు మోక్షం
సాక్షి, నెల్లూరు సిటీ: నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 54 డివిజన్న్లున్నాయి. ఆయా డివిజన్లలో రోడ్లు, కాలువలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి ఇంజినీరింగ్ విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లు పిలుస్తుంది. ఆ నిర్మాణాలను నిబంధనల ప్రకారం, నాణ్యతా ప్రమాణాలతో చేయించాల్సిన బాధ్యత ఇంజినీరింగ్ విభాగం అధికారులది. సదరు విభాగంలో ఇంజినీరింగ్ సూపరింటెండెంట్, ముగ్గురు ఈఈలు, ఐదుగురు డీఈలు, 12 మంది ఏఈలు, 60 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. వర్క్ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి ఉన్నతాధికారి వరకు కమీషన్లు ముందస్తుగా నిర్ణయించారని ఓ కాంట్రాక్టర్ తెలిపారు. కమీషన్ ఇవ్వకపోతే కాంట్రాక్టర్లను నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటారు. వారికి తప్పనిసరి.. కాంట్రాక్టర్ ఏదైనా రోడ్డు, కాలువ నిర్మాణాలు చేపట్టాలంటే అధికారులతోపాటు ప్రస్తుత అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు, ఇన్చార్జి లకు సైతం కమీషన్లు ఇవ్వాల్సిందే. వారి డివిజన్లలో పనులు చేయాలంటే తప్పనిసరిగా ఐదుశాతం ఇవ్వాలని హుకుం జారీ చేసినట్లు సమాచారం. కమీషన్ ఇవ్వకపోతే నాణ్యత లేదంటూ కుంటిసాకులు చెబుతూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తుంటారు. ఓ వైపు అ«ధికారులు, మరో అధికార పార్టీ నేతలకు కమీషన్లు ఇవ్వడంతో పలువురు నాణ్యతకు తూట్లు పొడుస్తున్నారు. కాగా ఇంజినీరింగ్ అధికారుల నుంచి సంతకాలు పూర్తయిన తర్వాత బిల్లుల మంజూరు విషయం అకౌంట్స్ విభాగంలో ఉంటుంది. దీంతో అకౌంట్స్ విభాగంలోని ఓ అధికారికి ఒక శాతం, ఎగ్జామినర్‌కు ఒక శాతం తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని చెబుతున్నారు. ఆ విభాగంలోని ఓ అటెండర్ కూడా కాంట్రాక్టర్ వద్ద నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రచారం ఉంది. పెట్రోల్, డీజిల్లోనూ.. కార్పొరేషన్ పరిధిలో చెత్తాచెదారాలు తరలించేందుకు వాహనాలు కుక్కలగుంటలోని వెహికల్ షెడ్లో పెట్రోల్, డీజిల్‌ను నింపుకోవాల్సి ఉంది. అయితే స్థానిక ఏఈ ఆంజనేయులరాజు (గురువారం ఏసీబీ దాడిలో పట్టుపడ్డ వ్యక్తి) ట్రిప్పులు ఎక్కువ తిరిగినట్లు లెక్కలు చూపి పెట్రోల్, డీజిల్‌లో చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రతిరోజూ 4 లీటర్ల నుంచి ఆరు లీటర్ల వరకు తప్పుడు లెక్కలు చూపుతున్నారని సమాచారం. ఏసీబీ దాడిలో ఆంజనేయులు పట్టుపడ్డంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధికారుల కార్లకు సైతం ఈ షెడ్ నుంచి డీజిల్‌ను సరఫరా చేస్తున్నారని తెలిసింది. నిబంధనల ప్రకారం అధికారుల వాహనాలకు ఇక్కడ డీజిల్ పట్టకూడదు. లంచం డిమాండ్ నగరపాలక సంస్థ అధికారులు 18 ట్రాక్టర్ల ద్వారా పలు ప్రాంతాల్లోని ప్రజలను తాగునీరు అందిస్తున్నారు. సదరు ట్రాక్టర్లు రోజూ సుమారు 97 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ఒక్కో ట్రిప్పునకు రూ.435 చెల్లిస్తున్నారు. ఒక్కో ప్రాంతంలో నాలుగు నుంచి 8 ఎనిమిది ట్రిప్పులు తిరగాలి. అయితే కొందరు ట్రిప్పులు తక్కువ నగదు స్వాహా చేస్తున్నారు. అధికారులు వారి నుంచి నగదు తీసుకుని పట్టించుకోవడంలేదు. కొందరు సక్రమంగా ట్రిప్పులు వేసినా అధికారులు బిల్లులు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేస్తున్నారు. ఇవిగో అక్రమాలు + నెల్లూరు మైపాడుగేట్ సెంటర్లో రూ.50 లక్షల వర్క్‌కు సంబంధించి రెండు శాతం కమీషన్ చెల్లించాలని ఓ అధికారి కాంట్రాక్టర్‌కు హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఆ కాంట్రాక్టర్ తనకు నష్టం వచ్చిందని చెప్పినా అధికారి పట్టించుకోలేదు. నగదు తీసుకున్నాకే సంతకాలు చేసినట్లు చెబుతున్నారు. + బారాషహిద్ దర్గాలో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేశారు. ఈ క్రమంలో ఓ అధికారి కాంట్రాక్టర్ వద్ద రూ.2 లక్షలు వసూలు చేసినట్లు చెబుతున్నారు. ఉన్నతాధికారి పేరు చెప్పి మరో రూ.లక్ష కూడా వసూలు చేసినట్లు ప్రచారంలో ఉంది. + గతంలో పంచాయతీరాజ్ శాఖ నుంచి బదిలీపై కార్పొరేషన్‌కు వచ్చిన ఓ అధికారి ఒకటో డివిజన్ నుంచి ఐదో డివిజన్ వరకు విధులు నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై తాను కూడా పనుల్లో భాగం తీసుకుంటున్నట్లు కార్పొరేషన్ వర్గాల సమాచారం. రూ.10 లక్షల పనిలో ఏఈ కూడా రూ.5 లక్షలు భాగంతో పనులు చేస్తున్నట్లు ప్రచారం ఉంది. దీంతో ఆయా పనుల్లో నాణ్యతను పట్టించుకోవడంలేదని విమర్శలున్నాయి. + ఇంజినీరింగ్ విభాగంలోని ఓ ఉన్నతాధికారి ఫిట్టర్లకు డివిజన్ కేటాయింపుల్లో చేతివాటం ప్రదర్శించినట్లు సమాచారం. ఒక్కొక్కరి వద్ద రూ.10 వేలు నుంచి రూ.50 వేలు వరకు వసూలు చేసినట్లు కొందరు చెబుతున్నారు. నగదు తీసుకుని ఓ ఫిట్టర్‌కు డివిజన్ కేటాయించకపోవడంతో అతను అధికారి వ్యవహారం బట్టబయలు చేశాడు. ఈ విషయం కార్పొరేషన్లో కలకలం రేపింది. అవినీతిపరులకు కీలక బాధ్యతలు మంత్రి నారాయణ అవినీతిపరులైన కొందరికి కార్పొరేషన్లో అధికార ప్రాధాన్యత ఇచ్చారని విమర్శలున్నాయి. గతంలో ఓ మున్సిపాలిటీలో పనిచేసిన కమిషనర్, నెల్లూరు కార్పొరేషన్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్పై ఏసీబీ దాడి చేసింది. వారు భారీగా అక్రమాస్తులు కుడబెట్టారనే విషయాన్ని గుర్తించింది. దీంతో వారిని సస్పెండ్ చేస్తూ మున్సిపల్ ఉత్తర్వులు జారీచేశారు. అలాంటి వారికి మంత్రి నారాయణ కార్పొరేషన్లో కీలక బాధ్యతలు అప్పగించారు. ఓ అధికారిని పారిశుద్ధ్య ం మెరుగుపరిచేందుకు ప్రత్యేకాధికారిగా మౌఖిక ఆదేశాలతో నియమించారు. బిల్డింగ్ ఇన్స్పెక్టర్కు నెల్లూరు కార్పొరేషన్లో బాధ్యతలు ఇవ్వకూడదని మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అతను మంత్రి ద్వారా మేయర్ పేషీలో కీలక స్థానం సంపాదించాడు. దీంతో కార్పొరేషన్‌లోని ఉద్యోగులు అవినీతిపరులకు ఈ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
కబంధ హస్తాల్లో మున్సిపల్ షాపులు
నెల్లూరు సిటీ: సొమ్మొకరిది..సోకొకరిది అన్నట్లుగా తయారైంది నగర పాలక సంస్థ మున్సిపల్ షాపుల పరిస్థితి. 20 ఏళ్లకుపైగా కొందరి కబంధ హస్తాల్లో మున్సిపల్ షాపులు కొనసాగుతున్నాయి. అధికార పార్టీ, రాజకీయ నాయకుల అండదండలతో షాపు లీజుదారులు కొనసాగుతున్నారు. బయట వ్యక్తులకు ఎక్కువ మొత్తానికి షాపులను అద్దెకు ఇచ్చి కార్పొరేషన్ ఆదాయానికి గండికొడుతున్నారు. మున్సిపల్ షాపులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సైతం వెనుకంజ వేస్తున్నారు. నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో 14 మున్సిపల్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. అందులో 234 షాపులు ఉండగా, వాటిలో 64 షాపులు 20 ఏళ్లకు పైబడి కొందరి చేతుల్లో ఉన్నాయి. మరో 100 నుంచి 120 షాపులను పదేళ్లకుపైగా కొందరు బినామీలు నడుపుతున్నారు. మున్సిపల్ నిబంధనల ప్రకారం షాపు లీజుకు తీసుకుని మూడేళ్లు దాటితే వేలం పాట నిర్వహించాలి. అయితే ఈ నిబంధనలు అమలు కావడంలేదు. కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు కొన్ని సార్లు వేలం పాటలు నిర్వహించేందుకు యత్నించినా బడాబాబులు, అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లతో అడ్డుకుని షాపు లీజుదారుడికే కట్టబెట్టుతున్నారనే విమర్శలు ఉన్నాయి. లీజుదారుడు ఒకరు.. బాడుగకు ఉండేది మరొకరు... మున్సిపల్ షాపులను లీజుకు తీసుకున్న వారు మాత్రమే షాపు నిర్వహణ చేయాలి. అయితే లీజుదారుడు కార్పొరేషన్‌కు తక్కువ బాడుగ చెల్లిస్తూ బయట వ్యక్తికి ఎక్కువ బాడుగలకు ఇస్తున్నారు. చిన్నబజారు, డైకాస్రోడ్డు, మద్రాసుబస్టాండు, గాంధీబొమ్మ సెంటర్లోని మున్సిపల్ కాంప్లెక్స్‌లో కొందరు షాపులను వేలం పాటలో రూ.5 నుంచి రూ.7వేలకు తీసుకుని, బయట వ్యక్తికి అదే షాపును రూ.10వేల నుంచి రూ.15వేలకు బాడుగకు ఇస్తున్నారు. వేలం పాటలు నిర్వహించపోవడంతో ఏటా లక్షల రూపాయల కార్పొరేషన్ ఆదాయానికి గండి పడుతోంది. మున్సిపల్ షాపుల వేలానికి అడ్డంకులు గతంలో పనిచేసిన కమిషన్ పీవీవీఎస్ మూర్తి కార్పొరేషన్ పరిధిలోని 25 ఏళ్ల లీజు నిండిన 65 షాపులకు వేలం పాట నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. షాపుల వేలం పాట తేదీని సైతం ప్రకటించారు. అయితే ఆయా షాపుల లీజుదారులు కోర్టుకు వెళ్లడంతో తాత్కాలికంగా వేలం పాట నిలిపివేశారు. ఇది జరిగి ఒకటన్నర ఏడాది కావస్తున్నా అధికారులు అటు వైపుగా కన్నెత్తి చూడకపోవడం విశేషం. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు స్పందించి వేలం పాటలకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. షాపింగ్ కాంప్లెక్ పేరు షాపుల సంఖ్య ప్రకాశం పంతులు కాంప్లెక్స్ 18 సుబేదారుపేట కాంప్లెక్స్ 13 బీవీఎస్ఎం కాంప్లెక్స్ 16 పప్పులవీధి కాంప్లెక్స్ 24 ఏసీ భవన్ కాంప్లెక్స్ 12 పనుతల వారి కాంప్లెక్స్ 13 చిన్నబజారు కాంప్లెక్స్ 38 డైకాస్రోడ్డు 06 సౌదాన్య కాంప్లెక్స్ 15 డైకాస్రోడ్డు కాంప్లెక్స్ 05 ఏసీ విహార్ కాంప్లెక్స్ 05 ఏసీ సుబ్బారెడ్డి కాంప్లెక్స్ 22 -
నేనెళ్లి పోతా
బదిలీ కోసం కమిషనర్ వెంకటేశ్వర్లు ప్రయత్నాలు నెలాఖరులో బదిలీ అవకాశం. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కమిషనర్ కె.వెంకటేశ్వర్లు బదిలీ చేయించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి సొంత జిల్లా కావడం, అధికార పార్టీలోని వర్గ రాజకీయాలు తనను ఇబ్బంది పెడుతున్నాయని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోతున్నారు. వ్యక్తిగత కారణాల రీత్యా తనను విజయవాడ, గుంటూరు కు కానీ, మున్సిపల్ పరిపాలనా విభాగానికి కానీ బదిలీ చేయాలని ఆయన ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్ అధికారి చక్రధర్‌బాబును కార్పొరేషన్ కమిషర్‌గా తెచ్చారు. పరిపాలనా వ్యవహారాలు, అభివృద్ధి పనుల విషయంలో తనను ఏ మాత్రం సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని మేయర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈయనతో పాటు అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్పొరేటర్లు కూడా చక్రధర్‌బాబును వ్యతిరేకించడంతో ఆయన్ను సాగనంపారు. ఆ తర్వాత పీవీవీ ఎస్ మూర్తిని కమిషనర్‌గా తెచ్చారు. కార్పొరేషన్‌కు ఉన్న బకాయిలు చెల్లించే వ్యవహారంలో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మేయర్ వ్యతిరేకించారు. పరిపాలనా వ్యవహారాల విషయంలో ముక్కు సూటిగా వెళ్లడంతో మేయర్ మంత్రి నారాయణ మీద ఒత్తిడి తెచ్చి ఆయన్ను కూడా బదిలీ చేయించారు. గుంటూరులో రీజనల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కె.వెంకటేశ్వర్లును ఆర్నెల్ల కిందట కిందట కమిషనర్‌గా తెచ్చారు. రెండు నెలల కిందట జరిగిన ఏసీబీ దాడులు కమిషనర్‌కు చిక్కులు తెచ్చి పెట్టాయి. మంత్రి నారాయణ ఆయన మీద అసంతృప్తితో ఉన్నారు. ఇదే సమయంలో మంత్రితో మేయర్‌కు, మేయర్‌తో ఆనం వివేకానందరెడ్డికి ఉన్న విభేదాలు కూడా పరిపాలనా వ్యవహారాల్లో ఆయనకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఒకరు ఉత్తరం అంటే ఇంకొకరు దక్షిణం అనే పరిస్థితి ఉంది. ఎవరు చెప్పింది చేయాలో అర్థం కాక కమిషనర్ ఇబ్బంది పడుతున్నారు. ఈ వాతావరణంలో తాను పనిచేయలేననీ ఇంకో చోటికి బదిలీ చేయాలని ఆయన ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఈ నెలాఖరులో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు ఉంటాయనీ, ఈ జాబితాలో వెంకటేశర్లు బదిలీ అవుతారని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.