సీఎం గారూ.. విత్తనాలివ్వండి
ఏలూరు, న్యూస్‌లైన్ : ‘ముఖ్యమంత్రి గారూ.. వరుస తుపాన్లు, భారీ వర్షాలకు మా జిల్లా రైతులు దారుణంగా నష్టపోయూరు. దాళ్వా నారుమడులు వేయూల్సిన తరుణం వచ్చింది. విత్తనాల కొరత ఉంది. రైతులందరికీ సబ్సిడీపై విత్తనాలు అందించి సాయం చేయండి’ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, ఆర్ అండ్ బీ శాఖల మంత్రి పితాని సత్యనారాయణ సీఎం ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరారు. పంట నష్టాల అంచనా తదితర అంశాలపై మంత్రులు, వివిధ జిల్లాల కలెక్టర్లతో సీఎం కిరణ్ శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కలెక్టరేట్ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పితాని ముఖ్యమంత్రితో మాట్లాడుతూ రైతులకు సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేసేందుకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పశుగ్రాస విత్తనాలను కూడా సబ్సిడీ ధరకు అందించాలన్నారు. తుపాన్లు, వర్షాలకు దెబ్బతిన్న ఆర్ అండ్ బీ రహదారుల మరమ్మతులకు పరిపాలనా ఆమోదం ఇప్పించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ సిద్ధార్థజైన్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 2.50 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రికి తెలిపారు. రైతులను ఆదుకోవడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో తేమ శాతం నుంచి మినహారుుంపు ఇవ్వాలని కోరారు. జిల్లాకు ఎంటీయూ 1010 రకం వరి విత్తనాలు 35 వేల క్వింటాళ్లు అవసరం అవుతాయని, ఆ మేరకు విత్తనాలు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.
10లోగా నివేదికలివ్వండి : సీఎం
తుపాను నష్టాలపై డిసెంబర్ 10లోగా నివేదికలు సమర్పించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్‌ను ఆదేశించారు. రాష్టంలో అక్టోబరు నుంచి వరుసగా భారీవర్షాలు, తుపానుల ప్రభావంతో ప్రజలు, ముఖ్యంగా రైతులు తీవ్ర నష్టాలకు గురికావడం తనను కలచివేసిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్కరైతూ నష్టపోకుండా నష్టాల అంచనాలను సమగ్రంగా రూపొం దించాలని, ప్రతి కౌలు రైతుకూ పంట నష్టపరిహారం అందించేందుకు బాధ్యత వహించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు, వ్యవసాయ శాఖ జేడీ వీడీవీ కృపాదాస్, డీఆర్వో వి.ప్రభాకరరావు, ఆర్ అండ్ బీ ఎస్ఈ బి.శ్రీమన్నారాయణ, ట్రాన్స్‌కో ఎస్ఈ సూర్యప్రకాశరావు, సీపీవో కె.సత్యనారాయణ పాల్గొన్నారు.