‘తీవ్రవాదుల తరపున ప్రధాని బహిరంగ ప్రచారం’
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన ప్రసంగం గర్హనీయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. నవాజ్ షరీఫ్ చేసిన ప్రసంగం పాకిస్థాన్ అధినేతగా చేసినట్టు లేదని, హిజ్బుల్ ముజాహిద్దీన్ సుప్రీంకమాండర్ గా మాట్లాడినట్టు ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు. బుర్హాన్ వాని వంటి తీవ్రవాద కమాండర్ల తరపున బహిరంగంగా ఆయన ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పాకిస్థాన్ ను తీవ్రవాద దేశంగా ప్రకటించాలని రాంమాధవ్ డిమాండ్ చేశారు.
నవాజ్ షరీఫ్ గురించి, పాకిస్థాన్ ప్రభుత్వం భారత్ చెబుతున్నదంతా వాస్తవేమని ఐక్యరాజ్యసమితిలో షరీఫ్ ప్రసంగం ద్వారా తేలిపోయిందన్నారు. తీవ్రవాదాన్ని పాక్ ప్రోత్సహిస్తోందన్న విషయం మరోసారి రుజువైందన్నారు. ఉడీ ఉగ్రదాడి కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టేందుకు దౌత్యపరంగా పాకిస్థాన్ పై ఒత్తిడి తెస్తామన్నారు. ఇందులో భాగంగా ప్రయత్నలు మొదలు పెట్టినట్టు చెప్పారు. ఉడీ ఉగ్రదాడి కుట్రదారులను వదిలిపెట్టే సమస్య లేదని స్పష్టం చేశారు.
ఐక్యరాజ్యసమితిలో నవాజ్ షరీఫ్ చేసిన ప్రసంగం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అభిషేక్ సింఘ్వి అన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తూ ఉగ్రవాదులను ప్రశంసించేలా మాట్లాడడం శోచనీయమన్నారు. ఈవిధంగా మాట్లాడడం వల్ల తమ మీద తామే జోక్ విషయాన్ని పాకిస్థాన్ గుర్తించలేకపోతోందని ఎద్దేవా చేశారు.