breaking news
National Panchayat Day
-
బుక్ చేసి బుక్కయ్యారు
రెవెన్యూ పెత్తనంపై హోటళ్ల హాహాకారాలు తాజాగా 18 నుంచి 20 వరకు రిజర్వ్ చేయాలని ఆదేశం సర్క్యులర్ జారీ చేసిన సబ్ కలెక్టర్ 19న జాతీయ పంచాయతీ దినోత్సవం దేశ వ్యాప్తంగా 1200 మంది వీవీఐపీల రాక 49 హోటళ్లలో 795 గదులు మూడు రోజుల పాటు బ్లాక్ పాత బకాయిలపై స్పందించని అధికారులు విజయవాడ : నగరంలోని హోటళ్లపై రెవెన్యూ శాఖ కర్రపెత్తనం పెరిగింది. విజయవాడ రాజధాని నగరం అయినప్పటి నుంచి స్టార్ హోటళ్లు మొదలుకొని సాధారణ హోటళ్ల వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నెలలో వివిధ రకాల సదస్సులు, సెమినార్ల పేరుతో వీవీఐపీలు వస్తున్నారని హోటళ్ల గదులన్నీ రిజర్వు చేసి వినియోగించుకోవటం, చివర్లో డబ్బు చెల్లించకుండా బకాయిలు పడటం నగరంలో షరామాములుగా మారింది. తాజాగా ఈ నెల 19న జాతీయ పంచాయతీ దినోత్సవాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగరంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడి హోటళ్లలో 80 శాతం గదులను రెవెన్యూ అధికారులు బ్లాక్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల కోసం వీటిని వినియోగిస్తున్నా నిధులు మాత్రం సక్రమంగా కేటాయించకపోవటంతో అటు అధికారులు ఇబ్బంది పడుతుండగా, ఇటు వ్యాపారులు నష్టపోతున్నారు. బుక్ చేస్తారు.. డబ్బు చెల్లించరు... విజయవాడ నగరంలో స్టార్ హోటళ్లతో కలుపుకొని 49 ప్రధాన హోటళ్లు ఉన్నాయి. వాటిలో మొత్తం 900 గదులు ఉన్నాయి. అందులో 795 గదులను ప్రభుత్వం రిజర్వు చేసింది. అసలే పెళ్లిళ్ల సీజన్ కావటం, ఆన్లైన్లో ఎక్కువ బుకింగ్‌లు జరగటంతో హోటళ్ల నిర్వాహకులు సతమతమవుతున్నారు. పోనీ వినియోగించుకున్న గదులకు భారీ డిస్కౌంట్‌తో అయినా డబ్బు చెల్లిస్తారా అంటే అదీ లేదు. సీఎం ప్రమాణ స్వీకారం మొదలుకొని ఇప్పటివరకు జరిగిన అనేక కార్యక్రమాలకు గాను హోటళ్లకు ప్రభుత్వం లక్షల్లో బకాయి పడింది. సర్పంచ్ల సదస్సుకు 1200 మంది... ఈ నెల 19న జాతీయ పంచాయతీ దినోత్సవాన్ని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా విజయవాడలో నిర్వహించనున్నాయి. దీనిని పురస్కరించుకొని జాతీయ స్థాయిలో గిరిజన మహిళా సర్పంచ్ల సదస్సును నిర్వహిస్తున్నారు. సదస్సుకు 1200 మంది వీవీఐపీలు హాజరవుతున్నారు. 10 రాష్ట్రాల నుంచి 1050 మంది గిరిజన మహిళా సర్పంచ్‌లు, 100 మంది అధికారులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి వివిధ క్యాడర్ల అధికారులతో కలిపి 1200 మంది వీవీఐపీలు, వీఐపీలు హాజరుకానున్నారు. ఈ క్రమంలో వచ్చిన వారందరికీ వసతి సౌకర్యాలు చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు అందాయి. దీంతో కలెక్టర్ బాబు.ఏ ఈ బాధ్యతను సబ్ కలెక్టర్ సుజనకు అప్పగించారు. ఈ క్రమంలో ఆమె హోటళ్ల నిర్వాహకులతో సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి హోటళ్లలో ఉన్న 80 శాతం గదులు రిజర్వు చేయాలని ఆదేశించారు. ఈ నెల 18 నుంచి 20 వరకు 49 హోటళ్లలో ఉన్న 900 గదుల్లో 795 గదులు బ్లాక్ చేయాలని, ఎవరికీ కేటాయించకుండా అన్ని చర్యలు చేపట్టాలని చెప్పారు. రిజర్వ్ చేసిన గదుల్లో వినియోగించిన గదులకు మాత్రమే నామమాత్రపు అద్దె చెల్లిస్తామని, మిగిలినవాటికి చెల్లించబోమని స్పష్టం చేశారు. వాస్తవానికి ప్రభుత్వ కార్యక్రమాలకు జీఏడీ విభాగం బిల్లు చెల్లిస్తుంది. లేదంటే జిల్లా స్థాయి కార్యక్రమం అయితే కలెక్టర్ నిధులు సమకూరుస్తారు. కానీ జాతీయ స్థాయి కార్యక్రమం అయినప్పటికీ నిధులు లేకపోవటం సమస్యగా మారింది. పాత బకాయిలు ఇవ్వండి సబ్ కలెక్టర్ సుజన నిర్వహించిన సమావేశానికి నగరంలో 20 మంది వరకు హోటళ్ల ప్రతినిధులు హాజరయ్యారు. ఇప్పటికే రూ.30 లక్షల వరకు ఉన్నాయని, వాటిని చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సబ్‌కలెక్టర్‌ను కోరారు. పెళ్లిళ్ల సీజన్ కావటంతో 50 శాతానికి పైగా గదులు ఆన్లైన్లో బుక్కయ్యాయని, కొన్ని హోటళ్లలో ఫంక్షన్ హాళ్లు కూడా పెళ్లిళ్లకు ఇచ్చామని చెప్పారు. అయినా వాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని ప్రభుత్వానికి గదులు కేటాయించాలని అధికారులు ఆదేశించినట్లు సమాచారం. ఈ క్రమంలో కేటాయించిన డబ్బు చెల్లించేలా చూడాలని కోరగా, సబ్‌కలెక్టర్ సానుకూలంగా స్పందించి అద్దె చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో హోటళ్ల వారీగా రెవెన్యూ అధికారులే గదులు నిర్ణయించారు. గేట్‌వేలో 98 రూమ్‌లు ఉంటే 49, మురళీ ఫార్చ్యూన్లో 84 గదులకు గాను 36, డీవీ మానర్‌లో 109కి గాను 50, మార్గ్ కృష్ణాయలో 49కి గాను 30, ఐలాపురంలో 65కు గాను 40 గదులు రిజర్వ్ చేశారు. -
సర్పంచ్‌లకు జాతీయ పురస్కారాలు
న్యూఢిల్లీ: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ గ్రామపంచాయతీలకు శుక్రవారమిక్కడ అవార్డుల్ని అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా పరిషత్, కోటబొమ్మాళి మండల పరిషత్ (శ్రీకాకుళం జిల్లా), తవనంపల్లి మండల పరిషత్ (చిత్తూరు), ఎర్రగొండపాలెం మండల పరిషత్ (ప్రకాశం జిల్లా), దువ్వూరు మండల పరిషత్ (వైఎస్సార్ కడప జిల్లా), పోట్లదుర్తి గ్రామపంచాయతీ (వైఎస్సార్ కడప జిల్లా), నందిగామ గ్రామపంచాయతీ (గుంటూరు జిల్లా), దర్శి గ్రామపంచాయతీ (ప్రకాశం), మాకవారిపాలెం గ్రామపంచాయతీ (విశాఖపట్నం), కరవేటినగర్ గ్రామపంచాయతీ (చిత్తూరు), అటపాక గ్రామపంచాయతీ (కృష్ణా జిల్లా)లకు, తెలంగాణలోని హాజిపల్లి, కిసన్‌నగర్ (మహబూబ్‌నగర్ జిల్లా), ధరూర్, చందుర్తి, ధర్మారం (కరీంనగర్ జిల్లా) గ్రామపంచాయతీలకు ‘ఉత్తమ గ్రామపంచాయతీ సశక్తీకరణ్’ పురస్కారాల్ని కేంద్ర మంత్రి అందజేశారు.