breaking news
National Energy Conservation Award
-
ప్రవర్తన మార్పుతోనే దేశ ఇంధన ప్రగతి
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని రంగాలలో శక్తి (ఇంధన) సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రతి పౌరుడిలోనూ ప్రవర్తన మార్పు చాలా కీలకమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన ’జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం’లో ఆమె మాట్లాడారు. ప్రకృతికి అనుగుణంగా సమతుల్య జీవనశైలిని అవలంబించాలనే చైతన్యం భారతదేశ సాంస్కృతిక సంప్రదాయంలో అంతర్లీనంగా ఉందని స్పష్టం చేశారు. ఈ భావనే ప్రపంచానికి మన సందేశంగా మారుతున్న ‘పర్యావరణం కోసం జీవనశైలి – లైఫ్’నినాదానికి ఆధారమన్నారు. కీలకమైన మార్పులు ‘భారతదేశ ఇంధన పరివర్తన విజయం కోసం ప్రతి రంగం, పౌరుల భాగస్వామ్యం అవసరం. అన్ని రంగాలకు ఇంధన సామర్థ్యాన్ని తీసుకురావడానికి ప్రవర్తనా మార్పు అత్యంత కీలకం.’.. అని రాష్ట్రపతి సూచించారు. ఇంధన సంరక్షణ అనేది కేవలం ఒక అవకాశం మాత్రమే కాదని.. ప్రస్తుత అత్యంత ముఖ్యమైన అవసరమని తెలిపారు. సమర్థ వినియోగం జరగాలి శక్తిని ఆదా చేయడం అంటే తక్కువగా ఉపయోగించడం మాత్రమే కాదని, దానిని తెలివిగా, బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా వినియోగించడమని రాష్ట్రపతి ఉద్ఘాటించారు. ‘అనవసరంగా విద్యుదుపకరణాలను వాడకుండా ఉండటం, శక్తి సామర్థ్యం గల పరికరాలను ఉపయోగించడం, మన ఇళ్లు, కార్యాలయాలలో సహజ కాంతి, గాలిని వినియోగించుకోవడం, లేదా సౌరశక్తి వంటి పునరుత్పాదక ఇంధన మార్గాలను స్వీకరించడం ద్వారా, మనం కేవలం శక్తిని ఆదా చేయడమే కాకుండా, కార్బన్ ఉద్గారాలను కూడా తగ్గించగలం’.. అని ముర్ము సూచించారు. పర్యావరణం, ఆర్థిక ప్రయోజనాలు స్వచ్ఛమైన గాలి, సురక్షితమైన నీటి వనరులు, సమతుల్య పర్యావరణ వ్యవస్థను నిర్వహించడానికి కూడా ఇంధన సంరక్షణ చాలా ముఖ్యమని రాష్ట్రపతి చెప్పారు. ‘మనం ఆదా చేసే ప్రతి యూనిట్ శక్తి, ప్రకృతిపై మన బాధ్యతకు, భవిష్యత్ తరాలపై మన సున్నితత్వానికి చిహ్నంగా నిలుస్తుంది’.. అని స్పష్టం చేశారు. యువత, పిల్లలు ఇంధన సంరక్షణపై అవగాహన పెంచుకుని, ఈ దిశగా ప్రయత్నాలు చేస్తే, దేశం స్థిరమైన అభివృద్ధిని సాధించగలదని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు. ఫలిస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలు ’ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన’, ’జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్’ వంటి కార్యక్రమాలు శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తున్నాయని ముర్ము గుర్తు చేశారు. ’పునరుత్పాదక వినియోగ బాధ్యత’, ’ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాల’ ద్వారా ప్రభుత్వం పునరుత్పాదక ఇంధనాన్ని, శక్తి సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు.గణనీయంగా శక్తి ఆదా 2023–24లో భారతదేశ ఇంధన సామర్థ్య ప్రయత్నాల ఫలితంగా 53.60 మిలియన్ టన్నుల చమురుకు సమానమైన శక్తి ఆదా అయిందని రాష్ట్రపతి తెలిపారు. ఈ ప్రయత్నాలు వార్షికంగా గణనీయమైన ఆర్థిక పొదుపులకు, ఉద్గారాల తగ్గింపునకు దారి తీశాయని వెల్లడించారు. చివరగా, ఇంధన సంరక్షణ రంగంలో కృషి చేస్తున్న వాటాదారులందరినీ రాష్ట్రపతి అభినందించారు. సామూహిక బాధ్యత, భాగస్వామ్యం, ప్రజల సహకార స్ఫూర్తితో భారతదేశం ఇంధన సంరక్షణలో ప్రధాన పాత్ర పోషించి, ’హరిత భవిష్యత్తు’ లక్ష్యాలను సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, ఆమె 2025 సంవత్సరానికి ’జాతీయ ఇంధన సంరక్షణ అవార్డులు’, ’ఇంధన సంరక్షణపై జాతీయ చిత్రలేఖన పోటీ’ విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. -
ఇంధన పొదుపులో ఏపీ నంబర్ 1
-
శిరిడిసాయి ఎలక్ట్రికల్స్‌కు ఎన్ఈసీఏ అవార్డు
సాక్షి ప్రతినిధి, కడప:నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు(ఎన్ఈసీఏ)-2014 జాతీయ స్థాయిలో కడపకు చెందిన శిరిడిసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌కు దక్కింది. మ్యాండెటరీ లేబులింగ్ విభాగంలోని డిస్ట్రిబ్యూషన్ టాన్సుఫార్మర్స్ వింగ్‌కు గాను శిరిడిసాయి ఎలక్ట్రికల్స్‌కు ఈ అవార్డు దక్కింది. ఆమేరకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పియూష్ గోయల్ చేతుల మీదుగా సంస్థ ఎండి నర్రెడ్డి విశ్వేశ్వరరెడ్డి ఈనెల 14న అందుకున్నారు. కడప కేంద్రంగా 1994లో స్థాపితమైన శిరిడిసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు, మహారాష్ట్రలకు టాన్స్‌ఫార్మర్స్ సరఫరా చేస్తున్నది. ఎన్ఈసీఏ-2014 అవార్డు దక్కడంతో తమ బాధ్యత మరింత పెరిగిందని విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్లు ఉత్పత్తిలో నాణ్యత ప్రామాణాలు పాటించడంతోనే జాతీయస్థాయిలో అవార్డు అందుకోగలిగామని తెలిపారు. భవిష్యత్‌లో మరింత బాధ్యతాయుతంగా సంస్థ కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు వివరించారు.


