breaking news
Narsapur chowrasta
-
Hyderabad: ఈ ప్రాంతాల్లో జనవరి 31 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: సనత్‌నగర్ రైల్వేస్టేషన్ సమీపంలోని జింకలవాడ ఎదురుగా ఉన్న నాలా కల్వర్టు స్థానంలో బాక్స్ టైప్ కల్వర్టు నిర్మాణం చేపడుతున్న దృష్ట్యా ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 1 నుంచి జనవరి 31 వరకు రెండు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని వాహనదారులు తాము సూచించిన మార్గాల్లో వెళ్లాలని ఆయన సూచించారు. ►బాలానగర్ నర్సాపూర్ క్రాస్‌రోడ్డు నుంచి జింకలవాడ మీదుగా భరత్‌నగర్ మార్కెట్‌కు వచ్చే ద్విచక్ర వాహనాలను అనుమతిస్తారు. అయితే ఖైతాన్నగర్ వద్ద వాహనాలను కుడివైపు మళ్లించి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఐటీఐ కళాశాల, ట్రాన్స్‌కాన్ ఇండస్ట్రీస్, జింకలవాడ నాలా, దుర్గామాత ఆలయం, సనత్‌నగర్ రైల్వే క్వార్టర్స్ మీదుగా భరత్‌నగర్ మార్కెట్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ►మినీ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, గూడ్స్ వాహనాలు, హెవీ గూడ్స్ వాహనాలు, బస్సులను నర్సాపూర్ క్రాస్ రోడ్డు నుంచి జింకలవాడ మీదుగా భరత్‌నగర్ మార్కెట్ వైపు అనుమతించరు. వాటిని నర్సాపూర్ క్రాస్‌రోడ్డు నుంచి కూకట్పల్లి వైపు మళ్లిస్తారు. వై జంక్షన్ వద్ద ఎడమ వైపు తీసుకుని మూసాపేట క్రాస్‌రోడ్డు మీదుగా భరత్‌నగర్ మార్కెట్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ► ద్విచక్ర వాహనాల రాకపోకలు మాత్రమే భరత్‌నగర్ మార్కెట్ నుంచి జింకలవాడ మీదుగా నర్సాపూర్ క్రాస్ రోడ్డు వైపునకు అనుమతిస్తారు. ఈ వాహనాలను సనత్‌నగర్ రైల్వే క్వార్టర్స్ (ఎదురుగా ఎడమ వైపునకు), దుర్గామాత ఆలయం(కుడి మలుపు), జింకలవాడ నాలా, ట్రాన్స్‌కాన్ ఇండస్ట్రీస్(కుడి మలుపు), సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఐటీఐ కళాశాల, ఖైతాన్నగర్ రహదారిలో ఎడమవైపు తీసుకుని నర్సాపూర్ క్రాస్‌రోడ్డుకు చేరుకోవాల్సి ఉంటుంది. ►ద్విచక్ర వాహనాలు మినహా ఇతర వాహనాలు, లైట్ మోటార్ వాహనాలు, మినీ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, గూడ్స్ వాహనాలు, హెవీ గూడ్స్ వాహనాలు, బస్సులను భరత్‌నగర్ మార్కెట్ నుంచి జింకలవాడ మీదుగా నర్సాపూర్ క్రాస్‌రోడ్డు వైపు అనుమతించరు. వాటిని భరత్‌నగర్ మార్కెట్ నుంచి కూకట్పల్లి వై జంక్షన్ వైపు మళ్లిస్తారు. వై జంక్షన్ వద్ద కుడివైపు మళ్లి ఐడీపీఎల్ కంపెనీ మీదుగా నర్సాపూర్ క్రాస్‌రోడ్డు వైపు వెళ్లాల్సి ఉంటుంది. చదవండి: జైళ్లో పెట్టుకోండి.. అంతకంటే ఏం చేయగలరు?: ఎమ్మెల్సీ కవిత ఫైర్ -
దుకాణం నుంచి రూ.4.38 లక్షల మద్యం చోరీ
తూప్రాన్(మెదక్): మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో రహదారికి పక్కనే ఉన్న వైన్స్‌లో మంగళవారం అర్థరాత్రి దొంగతనం జరిగింది. రూ. 4.38 లక్షల మద్యం, రూ.7వేల నగదును దుండగులు అపహరించుకెళ్లారు. దుకాణం యజమాని మహిపాల్‌రెడ్డి తెలిపిన వివరాలివీ.. నర్సాపూర్ చౌరస్తా వద్ద ఉన్న నవదుర్గా వైన్స్ వెనుక నుంచి లోపలికి ప్రవేశించిన దొంగలు సుమారు రూ.4.38 లక్షల విలువైన మద్యం బాటిళ్లను అపహరించుకెళ్లారు. దీంతోపాటు క్యాష్‌బాక్స్‌లో ఉన్న రూ.7వేలు కూడా ఎత్తుకుపోయారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేయటంతోపాటు డీవీఆర్‌ను తీసుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.