breaking news
Nari Niketan
-
అక్కడ ప్రత్యక్ష నరకంలా ఉంది...
న్యూఢిల్లీ: ఢిల్లీలో మహిళల పునరావాసం కోసం ఏర్పాటు చేసిన నారీ నికేతన్ నరకానికి నకలుగా ఉందని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్ వ్యాఖ్యానించారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా రాత్రంతా నారీ నికేతన్‌లో గడిపామన్నారు. ఈ సందర్భంగగా తమ అనుభవాలను, నారీ నికేతన్ సంస్థలోని పరిస్థితులు, సౌకర్యాల లేమి గురించి స్వాతి మాలివాల్ శనివారం మీడియాకు వెల్లడించారు. తమకు రాత్రంతా నరకంలో ఉన్న అనుభూతి కలిగిందని స్వాతి తెలిపారు. అక్కడ నెలకొన్ని భయంకరమైన పరిస్థితులను కళ్లారా చూశాక చాలా ఆశ్చర్యం కలిగిందన్నారు. అక్కడున్న మహిళలు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మతిస్థిమితం కోల్పోయిన మహిళలతో సామాన్య మహిళలు కలిసి జీవిస్తున్నారని, ఒకే మంచాన్ని ఇలాంటి ఇద్దరు మహిళలు పంచుకోవడం చాలా దుర్భరమని వ్యాఖ్యానించారు. నారీ నికేతన్‌లో చాలా సమస్యలు, సౌకర్యాలలేమి తమ దృష్టికి వచ్చాయని స్వాతి మాలివాల్ తెలిపారు. విడుదల చేయాలని కోర్టు ఆదేశాలున్నా కొంతమంది మహిళలు ఇంకా నారీ నికేతన్‌లో ఉండాల్సి వస్తోందన్నారు. కేవలం పోలీసులు, కార్యాలయ అధికారుల సమన్వయ లోపం వల్లనే ఇలా జరిగిందని ఆమె పేర్కొన్నారు. సాధ్యమైనంత వేగంగా నారీ నికేతన్ కార్యాలయంలోని సమస్యలను పరిష్కరిస్తామని ఆమె తెలిపారు. -
ఆమెను విడుదల చేయండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ప్రేమ పెళ్లి చేసుకున్న 19 ఏళ్ల యువతికి అత్యున్నత న్యాయస్థానం అండగా నిలిచింది. తన మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛ యువతికి ఉందని, ఎక్కడికైనా వెళ్లే హక్కు ఆమెకుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. నిర్బంధం నుంచి ఆమెకు విముక్తి కల్పించాలని చీఫ్ జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలోని బెంచ్ ఆదేశించింది. తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్న యువతిని జైపూర్ లోని నారీనికేతన్ లో ఉంచాలని గతంలో రాజస్థాన్ హైకోర్టు ఆదేశించింది. ఆమె మైనర్ అని తల్లిదండ్రులు పేర్కొనడంతో ఈ ఆదేశాలిచ్చింది. ఘజియాబాద్ కు చెందిన ఆమె భర్త సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు. తన భార్య మైనర్ కాదని నిరూపించడంతో ఆమెను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీరిద్దరూ జూన్ 16న ప్రేమ వివాహం చేసుకున్నారు.