breaking news
Nandini Sundar
-
మారణహోమానికి మరో పేరు ‘గఢ్’
సునీతారెడ్డితో మానవ హక్కుల కార్యకర్త నందినీ సుందర్ ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వ బలగాలు చేస్తున్న చట్టవ్యతిరేక పనులు ప్రజలకు, రాజ్య యంత్రాంగానికి మధ్య జరుగుతున్నదానికే పరిమితం కాదని.. ఢిల్లీ యూనివర్సిటీ సోషియాలజీ ప్రొఫెసర్, మానవ హక్కుల కార్యకర్త నందినీ సుందర్ చెబుతున్నారు. అభివృద్ధి పేరుతో ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న విధ్వంసం, ప్రభుత్వబలగాలకు, మావోయిస్టులకు మధ్య సాగుతున్న సంకుల సమరంలో అక్కడి గిరిజనులు పదేళ్లుగా కంటినిండా నిద్రకు కూడా కరువయ్యారని ఆమె అన్నారు. సుప్రీంకోర్టు ఆదే శాలు అమలుకాని రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్ అపఖ్యాతి పొందిందని ఆరోపించారు. కోట్లాది రూపా యలు వెచ్చించి గిరిజన యువతను ప్రత్యేక పోలీసులుగా మార్చి వారి గ్రామాలపై వారినే దాడు లకు పంపించడం కంటే వారిని అక్కడే టీచర్లుగా నియమిస్తే ప్రభుత్వం పట్ల ప్రజల ఆలోచనల్లో మార్పు వస్తుందంటున్న నందినీ సుందర్ ఇంటర్వ్యూలో చెప్పిన అభిప్రాయాలు ఆమె మాటల్లోనే.. సోషియాలజీ విద్యార్థి నుంచి బస్తర్‌లో కార్యకర్త వరకు మీ ప్రయాణం ఎలా సాగింది? ఇప్పటికీ నేను సోషియాలజీ విద్యార్థినే. బస్తర్ నాకెంతో నచ్చింది. అక్కడి వారి హక్కుల కోసం పోరాడాలనిపించింది. 1990లో విద్యార్థిగా తొలిసారి బస్తర్ సందర్శిం చాను. అక్కడి హక్కుల ఉల్లంఘన, అత్యాచారాలు, వేధింపులు నిజంగా వర్ణించలేనివి. గత 26 ఏళ్లుగా నా పరిశోధనలో భాగంగా బస్తర్‌లో ఎన్నో విషయాలు పరిశీలించాను. రెండు దశాబ్దాల కింద బస్తర్ ఎలా ఉండేది? బస్తర్ ఒక అద్భుతం. వర్ణించలేం. దేశంలోనే అదొక అందమైన అరణ్యం. ఇప్పడది పోలీసు క్యాంపుగా మారింది. చెట్లను నరికేసి క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. జగ్ దల్పూర్ చుట్టుపక్కల ఫ్యాక్టరీలు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే విధ్వంస మేనని పర్యావరణ నివేదికలు కూడా చెబుతున్నాయి. అక్కడ జీవ వైవిధ్యాన్ని ధ్వంసం చేశారు. స్థానికులను ఏమాత్రం పట్టించుకోలేదు. గ్లోబలైజేషన్ నేపథ్యంలో అక్కడ జరిగిన మార్పు ఏమిటి? ఛత్తీస్‌గఢ్ 2000 సంవత్సరంలో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. మైనింగ్ పాలసీని సరళీకరించారు. ప్రాజెక్టులకు పర్మిషన్ ఇచ్చారు. గూడేలను ఖాళీ చేయించారు. ఆ సమ యంలోనే మావోయిస్టులు వచ్చారు. వారికి పోటీగా సల్వాజుడుం మొదలైంది. సల్వాజుడుం కంటే ముందు నక్సల్స్ బస్తర్‌కి ఎలా వచ్చారు? 1980లో నక్సల్స్ బస్తర్‌కు వచ్చారు. స్థానికులపై వాళ్లు బలమైన ముద్ర వేశారు. స్థానిక యంత్రాంగం చేయలేని పనులు చేశారు. భూపంపిణీ చేశారు. పట్వారీలకు, ఫారెస్టు గార్డులకు వ్యతిరేకంగా ప్రజలకు మద్దతుగా నిల్చారు. స్థానికంగా భూపంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారు. 30 ఏళ్ల వ్యవధిలో వాళ్లు ఆ ప్రాంతంపై పట్టు సాధిం చారు. వాస్తవానికి 1975–78 నుంచే బస్తర్‌లో గనుల తవ్వకం మొదలైంది. బైలదిల్లా చుట్టుపక్కల ప్రాంతాలు అప్పటినుంచే కాలుష్యానికి గురయ్యాయి. ప్రజలకు సంబం« దించి చాలా తక్కువ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. హక్కుల పరిరక్షణ సరే. కానీ మీలాంటి వారు అభివృద్ధిని అడ్డుకుంటున్నట్లు ఆరోపణ? చాలామంది ప్రజలు నిజమైన అభివృద్ధిని కోరుకుంటున్నారు. వారు అభివృద్ధికి వ్యతిరేకం కాదు. అసమానాభివృద్ధికి మాత్రమే వారు వ్యతిరేకం. అసలు అభి వృద్ధి అంటే ఏమిటి? పారిశ్రామిక వేత్తలకు, కాంట్రాక్టర్లకు మేలు చేసేదా, ప్రజలకు మేలు కలిగించేదా? ప్రాజెక్టుల వల్ల నిర్వాసి తులవుతున్న వారికి అభివృద్ధి పేరుతో పోగుపడుతున్న సంపదలో వాటా కలిగిస్తే అది వారికి మేలు కలిగించే అభివృద్ధి. ప్రత్యేకించి వాతావరణ మార్పు జరుగుతున్న నేటి దశలో అభివృద్ధి గురించి పాతపద్ధతిలో మనం ఆలోచించలేం. ఆదివాసీలకు మాత్రమే కాదు.. దేశం మొత్తానికి, ప్రపంచానికి కూడా మేలు చేకూర్చగల ప్రత్యేక అభి వృద్ధి నమూనా కావాలి. ప్రతి ఒక్కరూ తమకు స్కూలు, ఆసుపత్రి, ఉపాధి ఇతర కనీస సౌకర్యాలను కోరుకుంటున్నారు. వాటిని పొందగలిగితే అది నిజమైన అభివృద్ధి. మావోయిస్టు సానుభూతిపరురాలంటూ ఓ వైపు, మరోవైపు హత్యారోపణ.. ఎలా? ఇది అర్థం పర్థంలేని వ్యవహారం. ఇష్టానుసారంగా కేసులు పెట్టారు. ఇప్పుడయితే వారు తెలంగాణకు చెందిన ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. నిజనిర్ధారణ కమి టీలో భాగంగా ఛత్తీస్‌గఢ్ వెళుతున్నవారిని నిర్బంధించారు. గత ఏడాది డిసెంబర్ 25న నిజనిర్ధారణకు వెళ్లిన వారిలో హైకోర్టు లాయర్లు, జర్నలిస్టులు, ఆదివాసీ నేత, దళిత నేత కూడా ఉన్నారు. మావోయిస్టులతో లక్ష రూపాయల పెద్ద నోట్లు మార్చుకుంటున్నా రని వారిపై ఆరోపించారు. తెలంగాణ పోలీసులు వీరిని పట్టుకుని ఛత్తీస్‌గఢ్ పోలీసు లకు అప్పగించారు. చట్టపరమైన ఉల్లంఘనలకు వ్యతిరేకంగా ఉన్నవారిని, వాటిని విమర్శించే వారిని ఏదో ఒక ఆరోపణతో అరెస్టు చేయడంలో భాగమే ఇది. మా విషయానికి వస్తే 2011లో ఛత్తీస్‌గఢ్‌లో మూడు గిరిజన గూడేలను తగుల బెట్టారు. మహిళలపై అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఉదంతంపై దర్యాప్తు చేయా లంటూ న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. అయిదేళ్ల విచారణ తర్వాత గిరిజన గూడేలను పోలీసులే తగులబెట్టారని సీబీఐ ఇటీవలే నివేదిక ఇస్తే ఛత్తీస్‌గఢ్ ఐజీ దాన్ని ఖండించారు. సీబీఐ అబద్దాలు చెబుతోందని డీఐజీ కల్లూరి ప్రెస్ వాళ్లను పిలిచి మరీ చెప్పారు. తర్వాత పోలీసులు మా దిష్టిబొమ్మలను తగులబెట్టారు. నాతోటి పిటిష నర్లలో ఒకరైన మనీష్ కుంజాంపై దాడి చేశారు. ఈయన ఛత్తీస్‌గఢ్ ఆదివాసీ నేత. ఆ తర్వాత వెంటనే మాపై కల్పిత హత్యానేరం మోపారు. హత్యకు గురైన వ్యక్తి భార్యే నాకు తెలీదన్నారు. ఆమె ఎవరి పేరూ చెప్పలేదు. ఆమెకు ఏమీ తెలీదు. హతుడి గ్రామ ప్రజలు కూడా మా పేర్లు చెప్పలేదు. ఆ కేసు వివరాలను చూస్తే ఇది పోలీసులు అల్లిన కట్టుకథే అని స్పష్టంగా తెలుస్తుంది. జాతీయ మానవ హక్కుల సంస్థ నుంచి మీకు ఏమైనా మద్దతు దొరికిందా? మా పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఈ కేసును విచారించడానికైనా, అరెస్టు చేయడానికైనా నాలుగు వారాల ముందే నోటీసు ఇవ్వాలని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ కార్య దర్శికి, ఐజీకి ఆదేశాలు జారీ చేసింది. ఆ సమయంలో మేము కోర్టుకు వెళ్లవచ్చన్న మాట. అంటే గతంలోనే కాకుండా భవిష్యత్తులో కూడా కోర్టు మాకు రక్షణ కల్పించింది. మా విషయంలో వారు ఏం చేయాలనుకున్నా నాలుగు వారాలకు ముందుగా నోటీసు ఇవ్వాలి. దాన్ని బట్టి మేం కోర్టును సంప్రదించవచ్చు. ఈ మొత్తం ప్రక్రియను పరిశీలిస్తే మీ ప్రత్యర్థిని జైలులో పెట్టడం ద్వారా మీరు కేసును ఎన్నటికీ గెలవలేరు. న్యాయమూర్తులు చాలా శక్తివంతమైన ఆదేశాలిచ్చినా, అది అమలు జరుగుతోందా? ఏమాత్రం అమలు జరగడం లేదు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును అస్సలు పట్టించుకోలేదనే చెప్పాలి. సల్వాజుడుం సంస్థ ఏ పేరుతో కూడా ఎలాంటి చర్యలూ చేపట్టరాదని సుప్రీంకోర్టు చెప్పింది. ఎస్పీవోల వ్యవస్థను నిషేధించాలని చెప్పింది. అక్కడి ఎస్పీని తొలగించాలని చెప్పింది. కేవలం ట్రాఫిక్ విభాగంలో మాత్రమే పోస్ట్ ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు చెప్పినదానికి విరుద్ధంగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చేసింది. కోర్టు అలా ఆర్డర్ ఇచ్చిన నాటినుంచి సల్వాజుడుం పేరు మాత్రమే మార్చింది. ఎస్పీఓలకు గతంలో కంటే ఇప్పుడే మంచి జీతాలు ఇస్తున్నారు. వాళ్లవద్ద ఇప్పటికీ ఏకే–47 తుపాకులున్నాయి. వాటితో వారు ప్రజలను కాల్చి చంపుతున్నారు. నిజానికి ఎస్పీవోలు తమ పేరు మార్చుకున్నాక ఛత్తీస్‌గఢ్‌లో దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే దాడి చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో మార్పు వస్తుందంటారా? అలాంటి మార్పు జరుగుతుందని నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. కొలంబి యాలో ప్రభుత్వానికి, గెరిల్లాలకు మధ్య నాలుగు దశాబ్దాల పోరాటం తర్వాత సయోధ్య కుదిరినప్పుడు అలాంటిది ఇక్క డెందుకు జరగదు? సుప్రీంకోర్టు కూడా గత సంవత్సరం శాంతిస్థాపన కోసం ఎవరో ఒకరు ఎందుకు చొరవ తీసుకోరని ప్రశ్నిం చింది. రాజకీయంగా తలుచుకుంటే శాంతిని నెలకొల్పలేరా? నక్సలైట్ల కాల్పుల్లో లేదా పోలీసుల కాల్పుల్లో చనిపోయినా నష్టపరిహారం అందించే చర్యలు చేపట్టాలి. నక్సల్స్ వ్యతిరేకం కార్యకలాపాలకు వెచ్చించే భారీ మొత్తంతో అభివృద్ధి చేయలేరా? ఎందుకు చేయలేం. సల్వాజుడుం పేరుతో పోలీసులుగా తయారు చేసేకంటే వారికి టీచర్ ఉద్యోగమే మంచిది కదా. అలా చేసినప్పుడు ప్రజలు తమ ప్రభుత్వం గురించి ఆలోచించే తీరులో చాలా మార్పు వస్తుంది. ప్రజలు పెద్ద స్థాయిలో తమ స్వరాలు వినిపించినప్పుడు శాంతి తప్పక ఏర్పడుతుంది. ఈశాన్య రాష్ట్రాలు, ఛత్తీస్ గఢ్‌లో పరిస్థితి సరిగా లేదు. 5వ షెడ్యూల్ ప్రకారం, చట్టం ప్రకారం సంక్షేమ కార్య క్రమాలు జరిగేలా చూడాలి. ఛత్తీస్‌గఢ్‌లో శాంతి సాధ్యమేనా? పదేళ్లుగా ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనులు భయంతో బతుకుతున్నారు. సాధారణ జీవి తమే అక్కడ లేదు. తమ గూడెం ఉంటుందా లేదా అనే భయంతో బతుకుతున్నారు. ఎప్పుడు గూడేన్ని భద్రతా బలగాలు చుట్టుముడతాయో తెలీదు. తమ గూడేల చుట్టూ పర్వతాలు ఉన్నా వారు శాంతియుతంగా రాత్రిపూట నిద్రించే పరిస్థితి ఉండటం లేదు. పదేళ్లుగా ఇదే పరిస్థితి. ఛత్తీస్‌గఢ్‌లో శాంతి సాధ్యమే కానీ చాలా సమయం పడు తుంది. ఆ విశ్వాసం నాకుంది. (నందినీ సుందర్ ఇటీవల హైదరాబాద్ సందర్శించిన సందర్భంగా సాక్షికి ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇది కొంత భాగం) (నందినీ సుందర్‌తో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/Ckn8np https://www.youtube.com/watch?v=KG9pYret&Gc -
చంపుడు పందెం!
త్రికాలమ్ నోట్ల గందరగోళంలో దేశం యావత్తూ ఉక్కిరిబిక్కిరి అవుతుంటే కొన్ని రాష్ట్రాలలో మాత్రం ‘చట్టం’ తన పని తాను చేసుకుపోతోంది. ఉదాహరణకు, ఛత్తీస్‌గఢ్‌లో రమణ్‌సింగ్ చెప్పిందే చట్టం. బస్తర్ రేంజి పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్ఆర్పీ కల్లూరి చేసిందే న్యాయం. రాజ్యాంగాన్ని కానీ, న్యాయవ్యవస్థను కానీ, మానవ హక్కులను కానీ అక్కడి ప్రభువులు గుర్తించరు. తమకు రాజ్యాంగంపైన నమ్మకం లేదంటూ మావోయిస్టులు ముందే ప్రకటించారు. జనతన సర్కార్ నడుస్తోంది ఆ సిద్ధాంతం ప్రాతిపదికపైనే. ఆ సర్కార్‌ను నడవనివ్వడం రాజ్యానికి అవమానకరమంటూ పాలకులు భావిస్తున్నారు. రాజ్యాంగంపైన విశ్వాస రాహిత్యాన్ని బాహాటంగా ప్రకటించిన మావోయిస్టులు ఒకవైపు. రాజ్యాంగం ధర్మమా అని అందలాలు ఎక్కి ఆ రాజ్యాంగాన్నే తుంగలో తొక్కి తమ వ్యక్తిగత రాగద్వేషాలనే చట్టాలుగా చెలామణి చేయిస్తున్న రాజకీయ నాయకులూ, అధికారగణం మరోవైపు. రెండు పక్షాల మధ్యా నలిగిపోతున్న అమాయక ఆదివాసీ ప్రజలది దయనీయ స్థితి. ఈ రక్తచరిత్రకు శాంతియుతంగా స్వస్తి చెప్పడానికి ప్రయత్నించినవారిని శత్రువులుగా పాలకులు భావిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో సైతం మానవహక్కులకు రక్షణ ఉండాలని వాదిస్తున్నవారిని మావోయిస్టుల మద్దతుదారులుగా ముద్రవేసి రాజద్రోహులుగా చిత్రిస్తున్నారు. ఈ నీతిలో భాగమే ఢిల్లీ విశ్వవిద్యాయానికి చెందిన ప్రొఫెసర్ నందినీ సుందర్, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలు ప్రొఫెసర్ అర్చనా ప్రసాద్, వినీత్ తివారీ, సంజయ్ పరాటే, తదితరులపైన ఐజీ కల్లూరి వ్యూహం ప్రకారం పెట్టిన కేసు. నందిని దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించి నాలుగువారాల వ్యవధి తర్వాతనే వారిపైన చర్య తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఈ నెల 15న ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జాతీయ మానవ హక్కుల సంస్థ (ఎన్హెచ్ఆర్సీ) ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివేక్ధండ్నీ, ఐజీ కల్లూరినీ ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు తన ఎదుట హాజరు కావలసిందిగా ఆదేశించింది. మానవ హక్కుల కోసం వీరోచితంగా పోరాడుతున్న అధ్యాపకులపైన పోలీసులు పెట్టిన అన్యాయపు కేసు ఎటువంటి మలుపు తిరుగుతుందో చూడాలి. ఇది జరుగుతుండగానే గత మూడు రోజులలో 11 మంది మావోయిస్టులను ఛత్తీస్‌గఢ్‌లోని భద్రతాదళాలు హతమార్చాయి. మన మేధావులకు పట్టని హక్కులు ఛత్తీస్‌గఢ్‌కు సమీపంలో ఆంధ్ర–ఒడిశా సరిహద్దులో 30 మందికి పైగా మావోయిస్టులను పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత దాడి చేసి ‘ఎన్కౌంటర్’ చేసినా, శేషాచలం అడవులలో తమిళనాడు కూలీలను దారుణంగా కాల్చి కాల్చివేసినా ఆంధ్రప్రదేశ్‌లోని పౌరసమాజం తగినంతగా స్పందించలేదు. పౌరహక్కుల సంఘాల బాధ్యతగానే పరిగణించారు కానీ పోలీసులు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అతిపోకడలు పోవడాన్ని ప్రజాస్వామ్యవాదులు గుర్తించి ప్రతిఘటించలేదు. వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోనూ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనూ అధ్యాపకులుగా పని చేస్తున్న మేధావులు ఎవ్వరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. కొన్ని దశాబ్దాల కిందట వియత్నాంపైన అమెరికా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు హైదరాబాద్‌లోనూ, విజయవాడలోనూ, విశాఖపట్టణంలోనూ, ఇతర పట్టణాలలోనూ జరిగాయి. ఇప్పుడు పక్కవాడి మీద పిడుగుపడినా చలించని జడత్వం పెరిగింది. ఛత్తీస్‌గఢ్‌కు చాలా దూరంలో ఉన్న ఢిల్లీలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు మానవ హక్కుల పరిరక్షణ బాధ్యతను తమ భుజస్కంధాలపైన వేసుకున్నారు. ప్రజాస్వామ్యవాదులందరూ వారిని అభినందించాలి. సల్వాజుడుం అరాచకాలను అరికట్టాలనీ, ఆ సంస్థను రద్దు చేయాలనీ సుప్రీంకోర్టు 2011లో ఆదేశించడానికి కారణం నందినీ సుందర్ చేపట్టిన ప్రజాప్రయోజన వ్యాజ్యమే (పిల్). బస్తర్‌లో కోయ కమాండోలు సృష్టిస్తున్న మారణహోమాన్ని సాక్ష్యాధారాలతో సహా సర్వోన్నత న్యాయస్థానం ఎదుట నిరూపించిన కారణంగా సల్వాజుడుంకు స్వస్తి చెప్పాలన్న ఆదేశం వెలువడింది. అరుంధతీరాయ్ వంటి అగ్రశ్రేణి రచయిత నక్సలైట్ల వెంట కీకారణ్యంలో నడిచినా, నందినీ సుందర్, అర్చనా ప్రసాద్, తదితరులు నిజనిర్ధారణ బృందం సభ్యులుగా మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న అటవీ ప్రాంతాలలో పర్యటించినా చట్టపాలన సవ్యంగా జరగాలనీ, రాజ్యాంగం ప్రాతిపదికగా అధికారంలోకి వచ్చినవారు అదే రాజ్యాంగాన్ని తు.చ. తప్పకుండా పాటించాలనీ, మానవ హక్కులను పరిరక్షించాలనీ ఉద్ఘోషించడానికే. ఈ మేధావులు మావోయిస్టులు ఈ దేశంలో సాయుధ పోరాటం ద్వారా అత్యంత బలమైన రాజ్యాన్ని ఓడించి అధికారం హస్తగతం చేసుకుంటారనే విశ్వాసం ఉన్నవారు కాదు. ఆ మార్గంలో అధికారం హస్తగతం చేసుకోవాలని అభిలషిస్తున్నవారు సైతం కాదు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను అందరూ ఆదరించాలని తపిస్తున్నవారు. సంవిధానానికి లోబడి పనిచేయవలసిన రాజకీయ నాయకులూ, ప్రభుత్వాధికారులూ, పోలీసు అధికారులూ చట్టపాలనను గౌరవించాలని కోరుతున్నవారు. అంతులేని రక్తచరిత్ర ఆంధ్రప్రదేశ్ నుంచి 1980లలో నక్సలైట్లు bè త్తీస్‌గఢ్ ప్రాంతానికి వలస వెళ్ళారు. 2000 నవంబర్ ఒకటిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడింది. ఈ రాష్ట్రంలోని మొత్తం 18 జిల్లాలలో ఏడు జిల్లాలు ఐదవ షెడ్యూల్ కిందికి వచ్చే ఆదివాసీ జిల్లాలు. ఆదివాసీల హక్కుల పరిరక్షణకోసం 1996లోనే పంచాయత్ ఎక్స్టెన్షన్ టు ది షెడ్యూల్డ్ ఏరియా (పెసా) చట్టాన్ని తీసుకువచ్చారు. స్వయంపాలన హక్కులను ఆదివాసీలకు ఇవ్వాలన్నది ఈ చట్టం లక్ష్యం. భారత భూభాగంలో నాలుగు శాతం విస్తీర్ణం ఛత్తీస్గఢ్ది. ఈ రాష్ట్రంలో 44 శాతం విస్తీర్ణంలో అడవులు. దేశంలోని ఖనిజ ఉత్పత్తులలో 13 శాతం ఈ రాష్ట్రం నుంచే. ఇనుము, బొగ్గు, సున్నపురాయి, బాక్సైట్ వంటి ఖనిజాలు అపారం. వజ్రాలు, బంగారు, రాగి, సీసం, జింక్, తదితర నిక్షేపాలు దండిగా ఉన్నాయి. దేశంలో ఉన్న బొగ్గులో 16 శాతం ఛత్తీస్‌గఢ్‌లోనే ఉంది. ఇంత ఖనిజ సంపద ఉన్న ప్రాంతంలో ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా పెత్తనం కాంట్రాక్టర్లదీ, వ్యాపారులదీ, అధికారులదీ, ఆదివాసీలు కానివారందరిదీ. రమణ్‌సింగ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2005లో కాంగ్రెస్ నాయకుడు మహేంద్రకర్మ నాయకత్వంలో నక్సలైట్లపైన పోరాటం చేయడానికి కోయతెగకు చెందిన యువకులకు ఆయుధాలు ఇచ్చి, శిక్షణ ఇచ్చి ప్రైవేటు సైన్యం తయారుచేశారు. దానికి వికాస్ సంఘర్ష్ సమితి అని పేరు పెట్టారు. అదే సల్వాజుడుం. అదే సంవత్సరం ఖనిజ సంపద వినియోగానికి టాటాలతో, ఎస్సార్ కంపెనీతో రమణసింగ్ సర్కార్ ఒప్పందాలు కుదుర్చుకోవడం కాకతాళీయం కాదు. దశాబ్దాలుగా ఆదివాసీలను దోచుకోవడం నిరాఘాటంగా సాగిపోతోంది. వారు న్యాయవ్యవస్థను ఆశ్రయించి హక్కులను సాధించే అవకాశం లేదు. చట్టాలున్నవి వారికి న్యాయం చేయడానికి కాదు. శాంతిసుస్థిరతలు నెలకొల్పేందుకు అసలే కాదు. హింసించే సాధనాలుగానే ఉపయోగపడుతున్నాయి. వాటివల్ల జైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రతి ఐదు కిలోమీటర్లకూ భద్రతాదళాల విడిది ఉంది. కొన్ని గ్రామాలలో అయితే రెండు కిలోమీటర్లకు ఒక మిలటరీ క్యాంపు ఉంటుంది. ప్రతి 45 మంది ప్రజలకు ఒక సాయుధ జవాను ఉంటాడు. మొత్తం 58,772 పారామిలటరీ జవాన్లు ఉన్నారు. ఒక్కొక్క ఇంటి ఆదాయం నెలకు వేయి నుంచి రెండున్నర వేల వరకూ ఉంటుంది. నరేగా (జాతీయ గ్రామీణ ఉపాధి కల్పన పథకం) ఇప్పుడు అమలు జరగడం లేదు. ఏడు సంవత్సరాల కిందట ఈ పథకం కింద చేసిన పనికి ఇంతవరకూ ప్రతిఫలం ముట్టలేదు. ప్రభుత్వం వందల కోట్లు ఖర్చుచేసి రోడ్లు వేయడానికి సిద్ధం. నక్సలైట్లు రోడ్లు వేయడానికి వ్యతిరేకం. అభివృద్ధి శూన్యం. సల్వాజుడుం కార్యకలాపాలకు తోడు 2009లో ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలయింది. నక్సలైట్లను ఏరివేయాలని సంకల్పం. అది నెరవేరలేదు కానీ సాయుధ దళాలకూ, నక్సలైట్లకూ మధ్య జరుగుతున్న పోరాటంలో నక్సలైట్లూ, భద్రతాదళ సిబ్బందీ, అమాయక గిరిజనులూ చనిపోతున్నారు. 2013లో నక్సలైట్లు సృష్టించిన హింసాకాండలో మహేంద్రకర్మ, వీసీ శుక్లా సహా అనేకమంది కాంగ్రెస్ నాయకులు మరణించారు. మహేంద్రకర్మ కుమారుడు ఇటీవల సల్వాజుడుం–2ను ప్రారంభించాడు. వారికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పూర్తి మద్దతు ప్రకటించింది. జర్నలిస్టులు దిక్కుతోచని పక్షులైనారు. ఇద్దరు గ్రామీణ జర్నలిస్టులు సాయిరెడ్డి, నెమీచంద్ జైన్‌ను నక్సలైట్లు చంపివేశారు. ఇటీవల 2016 ఫిబ్రవరి 8న స్క్రోల్ డాన్ ఇన్‌కు పనిచేస్తున్న జర్నలిస్టు మాలినీ సుబ్రమణియన్ ఇంటిపై దుండగులు దాడి చేశారు. నక్సలైట్లను సమర్థిస్తున్న కారణంగా జగదల్పూర్ వదిలి వెళ్ళాలంటూ ఆదేశించారు. బీబీసీ హిందీ విభాగంలో రిపోర్టర్‌గా పనిచేస్తున్న అశోక్ పుతుల్‌ను ‘సామాజిక్ ఏక్తా మంచ్’ సభ్యులు బస్తర్ వీడి వెళ్ళిపోవాలంటూ ఆజ్ఞాపించారు. ఐజీ, ఎస్పీలను కలుసుకునేందుకు అశోక్ ప్రయత్నిస్తే, ‘మేము జాతీయవాదులతోనూ, దేశభక్తులతోనూ మాత్రమే మాట్లాడతాం’ అంటూ అవమానించారు. ఇది కాదు పరిష్కారం సాయుధ పోరాటం పరిష్కారం కాదని రెండు పక్షాలూ గ్రహించినప్పుడే శాంతి నెలకొంటుంది. అంతవరకూ యుద్ధం కొనసాగుతుంది. యుద్ధంలో ధర్మాధర్మ విచక్షణ ఉండదనీ, అన్నీ ఆమోదయోగ్యమే కావాలనీ పోలీసు యంత్రాంగం వాదన. పోలీసు అధికారగణం మాట కాదనే సాహసం రాజకీయ నాయకత్వానికి లేదు. అందుకే చంపుడు పందెం ఆగడం లేదు. సల్వాజుడుం అత్యాచారాలకు ప్రతిగా నక్సలైట్ల హింసాకాండ కొనసాగింది. మాజీ నక్సలైట్లకూ, లొంగిపోయిన సంఘసభ్యులకూ, నిరుద్యోగ ఆదివాసీ యువకులకూ ఆయుధాలు ఇచ్చి వారిని స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్లు (ఎస్పీఓలు)గా పిలిచి నక్సలైట్లమీదికి పురిగొలిపే పేరుతో గ్రామాలపైకి పంపించారు. నక్సలైట్ల దళాలలోని సాయుధులలోనూ ఆదివాసీ యువతీయువకులే అధికం. ఆదివాసీలపైన ఆదివాసీలతోనే యుద్ధం చేయించడం తెలుగు పోలీసులు పాటించిన యుద్ధనీతి. నయీం వంటి నరహంతకుడు రెండు దశాబ్దాలపాటు పోలీసుల మద్దతుతో నేరసామ్రాజ్యాన్ని ఏలడానికి ఇదే నీతి కారణం. అటువంటి నీతి పాటించినందుకు రాజకీయ నాయకులు కానీ, పోలీసు ఉన్నతాధికారులు కానీ పశ్చాత్తాపం చెందిన దాఖలా లేదు. ఛత్తీస్‌గఢ్‌లో అంతులేని హింసాకాండతో విసిగిపోయి సుమారు లక్షమంది పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో తలదాచుకున్నారు. ఆదివాసీ మహిళలపైన భద్రతాదళాలు చేసిన అత్యాచారాలనూ, ఇన్ఫార్మర్లంటూ ఆదివాసీలను నక్సలైట్లు హత్య చేసిన ఉదంతాలనూ నమోదు చేసి మానవాధికారాలు ఛత్తీస్‌గఢ్‌లో అడుగంటాయంటూ నందినీ సుందర్ 2007లో సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. సోషియాలజీ ప్రొఫెసర్‌గా ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పనిచేస్తున్న నందిని ‘సబాల్టర్న్ అండ్ సావరీన్స్ :ఆంత్రొపొలాజికల్ హిస్టరీ ఆఫ్ బస్తర్ (1856–1996)’ పేరుతో ప్రామాణికమైన గ్రంథం రచించారు. ‘ది బర్నింగ్ ఫారెస్ట్: ఇండియాస్ వార్ ఇన్ బస్తర్’ పేరుతో తాజా పుస్తకం వెలువరించారు. ఛత్తీస్గఢ్పైన ఆమెకు పూర్తి అవగాహన ఉంది. తోటి ప్రొఫెసర్లూ, హక్కుల నాయకులూ, న్యాయవాదులతో కలిసి ఆమె మే 12 నుంచి 16 వరకూ బస్తర్ డివిజన్లోని బీజాపూర్, సుక్మ, బస్తర్, కంకెర్ జిల్లాలలో పర్యటించారు. సామ్నాథ్ బఘెల్ అనే ఆదివాసీ యువకుడిని నక్సలైట్లు నవంబర్ నాలుగో తేదీన హత్య చేశారు. హతుడి భార్య విమల పేరు మీద ఐజీ కల్లూరి ఎఫ్ఐఆర్ దాఖలు చేయించారు. నందినీ, తదితర హక్కుల కార్యకర్తలు సామ్నాథ్ను ఫోన్లో బెదిరిస్తూ ఉండేవారనీ, మావోయిస్టులకు వ్యతిరేకంగా ఉద్యమానికి స్వస్తి చెప్పాలంటూ ఒత్తిడి తెచ్చేవారనీ ఫిర్యాదు చేసినట్లు కల్లూరి అంటున్నారు. నందినిపైన కానీ, మరొకరిపైన కానీ తాను ఎటువంటి ఆరోపణా చేయలేదంటూ విమల ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. ఎన్హెచ్ఆర్సీ అధ్యక్షుడు జస్టిస్ హెచ్ ఎల్ దత్తు ఛత్తీస్‌గఢ్ పోలీసులనూ, ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. నందిని, తదితరులపైన చేసిన ఆరోపణలను నిరూపించడం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం వల్ల కాని పని. కానీ హక్కుల కార్యకర్తలను కోర్టుల చుట్టూ తిప్పడం, వారికి విసుగు కలిగి పోరాటం విరమించుకునే విధంగా వ్యవహరించడం పోలీసు వ్యూహంలో భాగం. మానవ హక్కుల పరిరక్షణకోసం పోరాడుతున్నవారిని నైతికంగా మద్దతు ఇచ్చి ప్రోత్సహించకపోతే సమాజంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి నశించి నియంతృత్వం వైపూ, అమానవీయమైన అరాచక వ్యవస్థవైపూ ప్రయాణం అనివార్యం అవుతుంది. కె. రామచంద్రమూర్తి -
ప్రొఫెసర్ నందినిపై హత్యకేసు
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్ నందిని సుందర్ పై హత్యకేసు నమోదయింది. ఛత్తీస్ గఢ్లోని మావోయిస్టు ప్రభావిత జిల్లా సుక్మాలో గిరిజనుడి హత్య కేసులో ఆమెతో పాటు జేఎన్ యూ ప్రొఫెసర్ అర్చనా ప్రసాద్, మావోయిస్టులపై అభియోగాలు నమోదు చేశారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు బస్తర్ రేంజ్ ఐజీ ఎస్ ఆర్పీ కాళ్లూరి తెలిపారు. కుమాకోనెంగ్ గ్రామ పంచాయతీ పరిధిలోని నామా గ్రామానికి చెందిన శ్యామనాథ్ బాగహెల్ ను నవంబర్ 4న సాయుధ మావోయిస్టులు హత్య చేశారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా తమ గ్రామంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి శ్యామనాథ్ పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాడు. ఈ కారణంగానే అతడిని మావోయిస్టులు హత్య చేశారు. తమకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని పేర్కొంటూ నందినికి వ్యతిరేకంగా మే నెలలో తన భర్త ఫిర్యాదు చేసినట్టు శ్యామనాథ్ భార్య తెలిపింది. నందినితో పాటు తన భర్త హత్యకు కారణమైన మావోయిస్టులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. రిచా కేశవ్ అనే పేరుతో నామా గ్రామానికి వెళ్లి మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టొద్దని నందిని బెదిరించినట్టు పోలీసులు తెలిపారు. నందిని, అర్చనపై దర్యాప్తు చేపట్టనున్నట్టు డీయూ, జేఎన్ యూ వీసీలకు తెలిపామన్నారు.