breaking news
Nanded Express fire
-
నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
కాజీపేట రూరల్: విశాఖపట్నం నుంచి నాందేడ్ వెళ్లే నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం ఉదయం మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన మెకానికల్ సిబ్బంది కాజీపేట జంక్షన్లో మంటలు ఆర్పి, మరమ్మతు చేసి పంపించారు. రైల్వే అధికారుల కథనం ప్రకారం.. నాందేడ్ ఎక్స్‌ప్రెస్ వరంగల్‌కు చేరుకున్న సమయంలో ఏసీ బోగీలో స్వల్పంగా మంటలు, పొగలు వ్యాపించి వాసన రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వరంగల్ రైల్వేస్టేషన్లో సిబ్బంది మంటలను గుర్తించి కాజీపేట రైల్వే అధికారులకు సమాచారమిచ్చారు. ఉదయం 6.45 గంటలకు నాందేడ్ ఎక్స్‌ప్రెస్ కాజీపేటకు రాగానే మెకానికల్ సిబ్బంది హుటాహుటిన ఏసీ కోచ్ వద్దకు చేరుకొని పరిశీలించారు. బోగీ కింద ఉన్న బ్యాటరీల్లో మంటలు రావడాన్ని గుర్తించి వెంటనే వాటిని ఆఫ్ చేసి మరమ్మతు చేశారు. అనంతరం 7.15 గంటలకు రైలును పంపించారు. ఈ ఘటనతో అరగంట పాటు రైలును కాజీపేట జంక్షన్లో నిలిపివేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. రైల్వే యార్డులో బోగీ దగ్ధం మరో సంఘటనలో కాజీపేట జంక్షన్‌లోని రైల్వే యార్డులో నిలిపి ఉన్న పాత రైలు బోగీలో మంటలు చెలరేగి అది పూర్తిగా దగ్ధమైంది. ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. రైల్వే అధికారుల కథనం ప్రకారం.. యార్డు లో ఒక వైపు గూడ్స్ వ్యాగన్లు, మరోవైపు ఆయిల్ ట్యాంకర్ల రైలు, కొద్ది దూరంలో వేరే లైన్లో కాలం చెల్లిన ప్యాసింజర్ కోచ్‌లను నిలిపి ఉంచారు. ఆదివారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో ఉన్నట్టుండి ఒక పాత బోగీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో స్టేషన్లో ఉన్న రైల్వే సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. ఈ లోగా రైల్వే సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం కనిపించలేదు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని తెల్లవారుజామున 4 గంటల వరకు మంటలు చల్లార్చారు. ఈ ఘటనలో బోగీ పూర్తిగా దగ్ధమైంది. మరో బోగీ స్వల్పంగా కాలిపోయింది. సికింద్రాబాద్ , కాజీపేట రైల్వే అధికారులు కోచ్ దగ్ధమైన ప్రాంతాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు కాజీపేట రైల్వే పోలీసులు తెలిపారు. ఒకే రోజు రెండు ఘటనలు.. నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు, కాజీపేట రైల్వే యార్డులో పాత బోగీ దగ్ధం కావడంతో అటు రైల్వే అధికారులు, ఇటు ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ రెండు ఘటనల్లో ప్రయాణికులకు ఎలాంటి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
షార్‌టసర్క్యూట్‌తోనే ‘నాందేడ్’ ప్రమాదం
నెల్లూరు, న్యూస్‌లైన్: నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ బోగీ దగ్ధమై 26 మంది ప్రాణాలు కోల్పోవడానికి షార్ట్‌సర్క్యూటే కారణమని ప్రాథమికంగా నిర్ధారించామని గుంతకల్ రైల్వే డివిజన్ ఎస్పీ ఎస్.జె.జనార్దన్ తెలిపారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని రైల్వే డీఎస్పీ కార్యాలయాన్ని బుధవారం సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్ 28వ తేదీ తెల్లవారు జామున అనంతపురం జిల్లా పుట్టపర్తి నుంచి నాందేడ్ ఎక్స్‌ప్రెస్ కదిలిన 10 నిమిషాల వ్యవధిలోనే ప్రమాదం సంభవించిందన్నారు. కొత్తచెరువు సమీపంలోకి వచ్చేసరికి మంటలు దట్టంగా వ్యాపించాయని, ఇది గమనించిన ఓ మహిళా ప్రయాణికురాలు ఘటనా స్థలానికి ఒకటిన్నర కిలోమీటర్ ముందు ఉన్న టన్నెల్ వద్ద రైలులో నుంచి దూకేసినట్లు ప్రత్యక్ష సాక్షులు, 108 సిబ్బంది తెలిపినట్లు ఎస్పీ పేర్కొన్నారు. దగ్ధమైన బోగీలో కొందరు ల్యాప్‌టాప్‌లు చార్జింగ్ పెట్టుకున్నారని, ఈ క్రమంలో ప్లగ్‌లో షార్ట్‌సర్క్యూట్ సంభవించి మంటలు వ్యాపించాయని వివరించారు. పొగలు దట్టంగా వ్యాపించడంతో కొందరు ప్రయాణికులు మొదట సృ్పహ కోల్పోయారని, అనంతరం మంటల్లో చిక్కుకుని ఆహుతైనట్లు నిర్ధారణకొచ్చామన్నారు. ఈ ఘటనకు సంబంధించి త్వరలో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రానుందన్నారు.