breaking news
Nallapati Venkatramaiah Chowdhury
-
ఉద్దండుల కోట.. నరసరావుపేట
సాక్షి,నరసరావుపేట: నరసరావుపేట అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలు మొదటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి ఉద్దండులనే అందించాయనడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. పలనాడు ముఖద్వారంగా ఉన్న నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం, గుంటూరు–ప్రకాశం జిల్లాలతో పాటు కలిసి కొన్నేళ్లపాటు కొనసాగిన నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం మొదటి నుంచి విలక్షమైనవే. ఈ నియోజకవర్గాల నుంచి పోటీచేసిన వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషించడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన నల్లపాటి వెంకటరామయ్యచౌదరి ఉమ్మడి ఆంధ్రరాష్ట్ర తొలిస్పీకర్‌గా 1953 నుంచి 1955 వరకు బాధ్యతలను నిర్వహించిచారు. 1967లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన కాసు బ్రహ్మానందరెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏడేళ్ల పాటు కొనసాగారు. కాసు కృష్ణారెడ్డి సైతం మూడుసార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించి మంత్రి పదవులను చేపట్టారు. డాక్టర్ కోడెల అత్యధికంగా నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి వరుసుగా ఐదుమార్లు విజయం సాధించి, 12ఏళ్ల పాటు మంత్రివర్గంలో వివిధ శాఖలు నిర్వహించారు. పార్లమెంట్ సీటు రూటే సెపరేటు.. 1952లో నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా సీఆర్ చౌదరి ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. ఆ తర్వాత 1967, 71 ఎన్నికల్లో మద్ది సుదర్శనం రెండుసార్లు గెలుపొందగా, 1977, 1980లో కాసు బ్రహ్మానందరెడ్డికి ప్రజలు పట్టం కట్టారు. ఈ క్రమంలోనే ఆయన కేంద్ర హోంశాఖమంత్రిగా అత్యున్నత పదవిని చేపట్టారు. ఆయనతో పాటు కాసు వెంకటకృష్ణారెడ్డి సైతం రెండుసార్లు ఎంపీగా విజయాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే 1999లో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థనరెడ్డి, 1998లో మరో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య, 2004లో మేకపాటి రాజమోహన్‌రెడ్డి, 2009లో మోదుగుల వేణుగోపాలరెడ్డి, 2014లో రాయపాటి శంభశివరావు ఎంపీలుగా ఇక్కడి నుంచి గెలిచినవారే. -
వీలైనంత తొందరగా ఏపీలో అసెంబ్లీ: కోడెల
సాక్షి, హైదరాబాద్: ‘‘మన రాష్ట్రం ఒక చోట.. సభ జరిగేది, చట్టాలు చేసేది ఇక్కడ... ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు వీలైనంత త్వరలో మన రాష్ట్రంలోనే శాసనసభ ఏర్పాటు చేసుకుందాం’’ అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత సీమాంధ్ర ప్రజలు నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నారని.. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు పరస్పరం అందరూ సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. శుక్రవారం స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సభనుద్దేశించి కోడెల మాట్లాడారు. స్పీకర్‌గా బాధ్యతలేంటో గుర్తెరిగి ప్రవర్తిస్తానని, సభ్యులు హద్దులు మీరి ప్రవర్తించరాదని సూచించారు. సభలో సభ్యులు హుందాగా వ్యవహరించాలన్నారు. అప్పుడూ ఇప్పుడూ నరసరావుపేట నుంచే... ఉమ్మడి మద్రాసు రాష్ట్రం విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు తొలి శాసనసభ స్పీకర్‌గా నల్లపాటి వెంకట్రామయ్య చౌదరి ఎన్నికయ్యారని, ఆయన నరసరావుపేట నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారని కోడెల గుర్తుచేశారు. ఇప్పుడు కొత్త ఆంధ్రప్రదేశ్‌కు కూడా నరసరావుపేటకు చెందిన తనను స్పీకర్‌గా నియమించడం ఆశ్చర్యకరమని, ఇది తన అదృష్టంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు.