breaking news
Nallamala Tiger Reserve
-
పెద్ద పులుల పంజా!
బల్మూర్ (అచ్చంపేట): నల్లమల టైగర్ రిజర్వు ఫారెస్టులో పెద్ద పులులు గాండ్రిస్తూ పంజా విసురుతున్నాయి. ఏకంగా పశువులపై దాడులు చేసి చంపుతుండటంతో అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని సరిహద్దు గ్రామాలైన అంబగిరి, బాణాల అటవీ ప్రాంతాల్లో మూడు రోజుల వ్యవధిలోనే ఆవుదూడ, కోడెను చంపాయి. రెండు నెలలల క్రితం అంబగిరిలోని రైతు బిచ్చాకు చెందిన ఎద్దు అడవిలోకి మేతకు వెళ్లి ఇప్పటికీ ఆచూకీ లేకపోవడంతో పులి దాడి చేసి చంపేసి ఉంటుందని భావిస్తున్నారు. అలాగే 15రోజుల క్రితం బల్మూర్‌కు చెందిన కాపరి రాములుకు చెందిన మేకపోతుపై అంబగిరి పమీపంలో పులి దాడి చేయగా గమనించిన అతను కేకలు వేయడంతో వదిలిపెట్టి అడవిలోకి వెళ్లిపోయింది. ఈ సంఘటనలో మేకపోతుకు గాయాలయ్యాయి. బిక్కుబిక్కుమంటున్న కాపరులు ఈనెల 5వ తేదీ అర్ధరాత్రి అంబగిరి సమీపంలోనే పశువుల పాకలో ఉన్న ఆవుదూడపై పులి దాడి చేసి చంపగా.. మరో దూడ ఆచూకీ లేకుండాపోయింది. తాజాగా సోమవారం రాత్రి బాణాలకు చెందిన రైతు భాస్కర్‌కు చెందిన కోడెను సమీప అటవీ ప్రాంతంలో మరో పులి దాడి చేసి చంపింది. ఇక గతంలో కంటే అధికంగా రైతులు తమ భూములను సాగు చేస్తుండటంతో బహిరంగ ప్రదేశాల్లో మేత లేక పశువులకు అడవే దిక్కుగా మారింది. దీంతో సరిహద్దు గ్రామాల నుంచి కాపరులు నిత్యం పశువులను అడవికి తీసుకెళ్లక తప్పడం లేదు. ఈ క్రమంలో పెద్దపులుల దాడులతో బిక్కుబిక్కుమంటున్నారు. అధికారులు హెచ్చరిస్తున్నా.. అడవిలో పులుల సంఖ్య పెరిగిందని, ఎవరూ లోపలికి వెళ్లొద్దని అధికారులు సమీప గ్రామాల్లో బోర్డులు ఏర్పాటుచేశారు. ఈ హెచ్చరికలను కాపరులతో పాటు వంట చెరుకు కోసం వెళ్లే వారు పట్టించుకోవడం లేదు. వీరికి గత్యంతరం లేక అడవిలోకి వెళ్లక తప్పడం లేదు. ఏమాత్రం అప్రమత్తంగా వ్యవహరించకపోవడంతో పులుల నుంచి పశువులతో పాటు కాపరుల ప్రాణాలకే ముప్పుగా మారింది. -
మన పులులు క్షేమమే..!
► రాష్ట్రంలో 23 పులులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు ► పులుల కోసం బిహార్ నుంచి వేటగాళ్ల ముఠా! ► సమాచారం అందడంతో పులుల లెక్క తేల్చిన అటవీ సిబ్బంది ► నల్లమలలో 14, కవ్వాల్ టైగర్ ప్రాజెక్టులో 9సీసీ కెమెరాలు, పాద ముద్రల ద్వారా గుర్తింపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అడవుల్లో ఉన్న పులులు క్షేమంగా ఉన్నాయని అటవీశాఖ అధికారులు గుర్తించారు. నల్లమల టైగర్ రిజర్వులో 14, కవ్వాల్ అభయారణ్యంలో 9 పులులు కలిపి మొత్తంగా రాష్ట్రంలో 23 పులులు ఉన్నట్లు లెక్కించారు. నల్లమలలో పెద్ద పులుల వేటగాళ్లు సంచరిస్తున్నారన్న సమాచారం అందడంతో అప్రమత్తమైన అధికారులు.. అటవీ ప్రాంత గిరిజనులను, సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు పులులను గుర్తించే ప్రక్రియను చేపట్టారు. సీసీ కెమెరాల చిత్రాలు, పులుల పాదముద్రలు, పెంటిక (మలం) పరీక్షల ద్వారా వాటి సంఖ్యను, ఆరోగ్యాన్ని నిర్ధారించారు. సీసీ కెమెరాల ద్వారా గుర్తింపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు పులుల గణనను చేపట్టారు. తెలంగాణ ఏర్పాటయ్యాక పూర్తిస్థాయిలో గణనను చేపట్టలేదు. కానీ వాటి సంఖ్యను నిర్ధారించుకునే ప్రయత్నాలు చేశారు. పులులు తిరిగే ప్రాంతాల్లో ప్రతి నాలుగు చదరపు కిలోమీటర్లకు ఒక జత చొప్పున సీసీ కెమెరాలను అమర్చి వాటి ఉనికిని నిర్ధారించారు. ఇక టైగర్ ట్రాకర్లు (పులుల ఆనవాళ్లను గుర్తించేవారు) కూడా తమకు కేటాయించిన చోట్ల ఆనవాళ్లను గుర్తించి అధికారులకు అందజేశారు. వీటన్నింటి ఆధారంగా నల్లమలలో 14 పులులు, కవ్వాల్ ప్రాజెక్టులో 9 పులులు ఉన్నాయని.. అవి వాటి పిల్లలతో సహా సురక్షితంగా ఉన్నాయని గుర్తించారు. మహారాష్ట్రలో పులుల సంఖ్య పెరగడంతో అక్కడి నుంచి మన రాష్ట్రంలోని కవ్వాల్ టైగర్ ప్రాజెక్టులోకి పులులు వలస వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. వేటగాళ్లను వదలబోం.. ‘‘బిహార్ ప్రాంతం నుంచి వేటగాళ్ల ముఠా ఒకటి వచ్చిందనే సమాచారం వచ్చింది. కానీ వాళ్లు అడవుల్లోకి ప్రవేశించినట్టు ఆనవాళ్లు దొరకలేదు. వేటగాళ్లు సాధారణంగా అడవిలోకి గుంపుగా వెళతారు. ఇక్కడి భాష కూడా మాట్లాడలేరు. దాంతో అడవుల్లోని గిరిజనులు, అటవీ సిబ్బంది వెంటనే పసిగడతారు. వారిని వదలబోం.’’ – అటవీ జంతు సంరక్షణ విభాగం ఓఎస్డీ శంకరన్ కృష్ణా నదిని దాటుతూ.. నల్లమల అటవీ ప్రాంతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సరిహద్దుగా కృష్ణా నది ప్రవహిస్తుంది. ఇక్కడ తెలంగాణ అటవీ ప్రాంతంలోని ఒకటి, రెండు పులులు ఏపీ అటవీ ప్రాంతంలోకి వెళ్లగా... అక్కడి పులులు కొన్ని తెలంగాణ ప్రాంతంలోకి వచ్చాయి. దీంతో పులులు కృష్ణా నదిని దాటుతూ.. అటూ ఇటూ తిరుగుతున్నాయని ఫారెస్టు అధికారులు భావిస్తున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లా మార్కాపురం ఫారెస్టు డివిజన్ నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూర్ ఫారెస్ట్ డివిజన్‌లోకి ఒక పులి వచ్చిందని.. మన్ననూర్ నుంచి కర్నూలు జిల్లా ఆత్మకూర్ ఫారెస్టు డివిజన్‌లోకి ఒక పులి వెళ్లిందని అధికారులు నిర్ధారించారు.