breaking news
Nallamala forest region
-
నల్లమలలో ప్రాచీన గణపతులు
సాక్షి, కర్నూలు : విఘ్నాలను భగ్నం చేసే వినాయకుడు.. తొలి మానవుడి ఆనవాళ్లున్న నల్లమలలో అక్కడక్కడా కనిపిస్తు తన ప్రాచీనత్వాన్ని, ఆదిదేవుడన్న బిరుదును సార్థకం చేసుకుంటున్నాడు. ఎవరు ఎందుకు అక్కడ ఉంచారో చరిత్ర కందని ఈ వినాయక విగ్రహాలు వివిధ ఆకృతులతో కనిపిస్తు భక్తజనానికి పారవశ్యాన్ని కలిగిస్తున్నాయి. ఇసుక రాతిపై ఏకదంతుడు ఆత్మకూరు మండలంలోని కొట్టాల చెర్వు సమీపంలో నల్లమల అడవుల్లో ఉన్న వరదరాజస్వామి ప్రాజెక్ట్ సమీపంలో ఒక చెట్టు కింద ఈ వినాయక విగ్రహం ఉంది. ఇసుక రాతిని వినాయకుడిగా ఎవరో ప్రాచీన శిల్పకారుడు ఈ విగ్రహాన్ని చెక్కినట్లు అర్థమవుతుంది. విగ్రహంపై ఎలాంటి ఆభరణాలు చెక్కి ఉండక పోవడం గమనిస్తే ఇది లోహ యుగానికి ముందుదా అన్న అనుమానమూ కలుగక మానదు. తలపై ఉన్న కిరీటం కూడా ఆకు దొన్నెనో, కర్రతో చేసిందా అన్నట్లుగా ఉంటుందే కాని లోహ కిరీటంగా కనిపించదు. అష్టభుజ వినాయకుడు.. నాగలూటి వీరభధ్రాలయం సమీపంలో శ్రీశైలం మెట్ల మార్గం వద్ద ఎనిమిది చేతులతో నల్లటి గ్రానైట్ శిలతో ఈ అష్టభుజ వినాయకుడి విగ్రహం ఆకట్టుకుంది. అష్ట కరములతో వివిధ ఆయుధాలను ధరించి ఉన్నాడు. ఎడమ వైపున కుమార స్వామి విగ్రహం కూడా ఉంటుంది. నాగలూటి వీరబధ్రాలయం విజయనగర పాలకులు నిర్మించారని స్థల చరిత్ర చెబుతుంది. దీంతో 14వ శతాబ్దానికి చెందినది తెలుస్తుంది. ఇది చదవండి : రోజురోజుకు పెరిగే యాగంటి బసవయ్య సిద్ధాపురం వినాయకుడు సిద్ధాపురంలో ఒక వేప చెట్టు కింద ఈ విగ్రహం కనిపిస్తోంది. సమీపంలోని ముర్తుజావలి దర్గా సమీపంలో వెయ్యేళ్లకు పూర్వం మహా పట్టణం ఉండేది. ఇక్కడ పలు ఆలయాల శిథిలాలు ఉన్నాయి. కోట గోడల రాళ్లను సిద్ధాపురం చెరువు రివిట్ మెంట్కు వాడారు. ఆ సందర్భంలో శిథిల పట్టణం నుంచి వినాయక విగ్రహం సిద్ధాపురం గ్రామానికి చేరింది. గుమ్మిత వినాయకుడు ఆత్మకూరు అటవీ డివిజన్లోని నాగలూటి రేంజ్లో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గుప్త మల్లికార్జున (గుమ్మితం) ఆలయ ఆవరణలో ఈ ప్రాచీన వినాయక విగ్రహం ఉంది. ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు నిర్మించారని స్థల పురాణం తెలుపుతోంది. ఇసుక రాతితో చెక్కిన ఈ విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. ఇది చదవండి : వినాయకుని విశిష్ట ఆలయాలు -
తెలుగు రాష్ట్రాల్లోని పెద్దపులుల సంఖ్య 104
కర్నూలు, గుంటూరు, ప్రకాశం. నల్లగొండ, మహబూబ్నగర్, ఉభయగోదావరి, ఆదిలాబాద్ జిల్లాల అటవీ ప్రాంతాలే ఆరంభం నుంచీ పెద్దపులులకు ఆవాసం. 1991 నాటికి 92 ఉన్న పులులు 1995 వరకు 34కు తగ్గిపోయాయి. నల్లమల అటవీ ప్రాంతంలో అనూహ్యంగా పెరిగిన మావోయిస్టుల కార్యకలాపాలే దీనికి ప్రధాన కారణం. సాక్షి ప్రతినిధి, హైదరాబాద్: భారతదేశంలో ఏ రాష్ట్రానికి తీసిపోని విధంగా రెండు తెలుగు రాష్ట్రాల పరిధుల్లో పెద్ద పులుల సంఖ్య వందకు పైగా పెరిగింది. అటవీ శాఖ వర్గాలు అందించిన తాజా సమాచారం ప్రకారం వీటి సంఖ్య 104. కర్నూలు, గుంటూరు, ప్రకాశం. నల్లగొండ, మహబూబ్నగర్, ఉభయగోదావరి, ఆదిలాబాద్ జిల్లాల అటవీ ప్రాంతాలే ఆరంభం నుంచి పెద్దపులులకు ఆవాసం. 70వ దశకానికి వచ్చేసరికి ఉభయగోదావరి, ఆదిలాబాద్ జిల్లాల కన్నా ఇతర ఐదు జిల్లాల్లో పులుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అప్పట్లో అటవీ ప్రాంతాల్లో నక్సలైట్ల సంచారం పెద్దగా లేకపోవడం, పోడు వ్యవసాయం తక్కువగా ఉండటమే దీనికి కారణం. 1989-90 మొదలు 2004 వరకూ రాష్ట్రంలో పోలీసులకూ, నక్సలైట్లకూ మధ్య జరిగిన విధ్వంసకర ఘటనల్లో పులులు కూడా బలయ్యాయి. 92 నుంచి 34కు... కేంద్ర ప్రభుత్వం 1983లో ఆంధ్రప్రదేశ్లోని 5 జిల్లాల పరిధిలో 10,000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతాల్లో నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. అప్పుడు తీసుకున్న సంరక్షణ చర్యల ఫలితంగా 1980 ఆరంభం వరకూ 40 వరకు ఉన్న పులుల సంఖ్య 1991 నాటికి 92కి చేరింది. 1995 నాటికి ప్రాజెక్టు పరిధిలోని పులుల సంఖ్య 34కు తగ్గిపోయింది. నల్లమల అటవీ ప్రాంతంలో అనూ హ్యంగా పెరిగిన మావోయిస్టు కార్యకలాపాలే దీనికి ప్రధాన కారణం. పోలీసులకు, నక్సలైట్లకు మధ్య భీకరపోరు కారణంగా పులులు చెల్లాచెదుర య్యాయి. తమకు అడ్డు వస్తున్నాయనీ, రాకపోక లకు ఇబ్బందిగా మారిందనీ నక్సలైట్లు కొన్నింటికి విషం పెట్టి చంపారని అటవీ అధికారులు తమ రికార్డుల్లో నమోదు చేశారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదించారు. 2006 నుంచి ఏటా పది చొప్పున పెరిగాయి 1995 తరువాత నక్సలైట్లు తమ శిబిరాలను నల్లమల నుంచి ఆంధ్రప్రదేశ్-ఒరిస్సా (ఏవోబీ) సరిహద్దు ప్రాంతానికి మార్చడంతో నల్లమలలో 80 శాతం మేర వారి కార్యకలాపాలు తగ్గాయి. 2005 నాటికి పూర్తిగా నిలిచిపోయాయి. అటవీ సిబ్బంది స్వేచ్ఛగా అడవిలో తిరుగాడటం మొదలుపెట్టారు. అందుబాటులో ఉన్న పరిజ్ఞానంతో పులుల సంర క్షణకు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. ఫలితంగా 2006 నుంచి 2015 మార్చి దాకా ఏడాదికి పది చొప్పున పెరుగుతూ వచ్చాయి. ‘వాటి సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. దాంతో మేము తీసుకున్న చర్యలు మంచి ఫలితాలిచ్చాయి. ఇప్పుడు నల్లమలలో వాటి సంఖ్య వంద దాటింది’ అని అటవీ శాఖ సీనియర్ అధికారి ఒకరు గర్వంగా చెప్పారు. ఉభయగోదావరి, ఆదిలాబాద్లో నిల్ ఉభయగోదావరి అటవీ ప్రాంతాల్లో ఒకప్పుడు చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్న పులులు దాదాపుగా కనుమరుగయ్యాయి. పాపికొండల్లో 2 నుంచి 3 పులులు ఉన్నాయని స్థానికులు చెపుతున్నప్పటికీ అటవీ శాఖ ఇంకా నిర్ధారణకు రాలేదు. ఆదిలాబాద్ జిల్లాలో 2000 చదరపు కిలోమీపటర్ల పరిధిలో విస్తరించిన కవాల్ అటవీ ప్రాంతంలో కూడా ఒక్క పులి కూడా కనిపించడం లేదు. ఇక్కడ పులుల సంచారం ఉన్నదని గిరిజనులు చెబుతున్నా తమకు వాటి ఆనవాళ్లు కనిపించలేదని అటవీ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.