breaking news
Nagaland issues
-
కనురెప్పే కాటేస్తే... కన్నుకేది రక్ష?
కిందటి వారాంతంలో సాయుధబలగాలు నాగాలాండ్‌లోని ఓ మారుమూల సరిహద్దులో పదమూడు మంది గనికూలీలను ‘గుర్తెరుగక’ కాల్చి చంపిన దుర్ఘటన తాలూకు విషాదమింకా తాండవిస్తూనే ఉంది. ఎడతెగని దుఃఖం నుంచి పుట్టిన నిరసన క్రమంగా విస్తరిస్తోంది. మనిషి పచ్చి రక్తం మరోమారు నేలను తడిపాక... సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం మరోసారి చర్చకు వస్తోంది. ‘దేశ పౌరులపై చర్యలకు తలపడేటప్పుడు సాయుధ బల గాలు సంయమనం, కనీస బలప్రయోగం అనే సూత్రాలకు కట్టుబడి, జాగ్రత్తపడాలి’ అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం (1997) చెప్పింది. సుప్రీం కోర్టు, ఈశాన్య ప్రాంత ప్రజలు, అక్కడి ముఖ్యమంత్రులు సైతం నిరంకుశ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. మరెప్పుడు రద్దు? ఢిల్లీ సరిహద్దుల్లో రైతు నాయకులు తమ నిరసన శిబిరాన్ని గురువారం ఎత్తివేస్తున్న సమయానికి నాగాలాండ్‌లోని ఓ మారుమూల సరిహద్దులో పరిస్థితి భిన్నంగా ఉంది. మయన్మార్‌తో సరిహద్దు కలిగిన మోన్ జిల్లా ఓటింగ్ పరిసరాల్లోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లో నల్ల జెండాలు దర్శనమిస్తున్నాయి. క్రిస్టమస్ కొనుగోళ్లతో సందడిగా ఉండాల్సిన దుకాణాలపైన, దారి పొడుగు స్థంబాలపైన, వాహనాలపైన నల్లజెండాలు ఎగురవేస్తూ స్థానికులు నిరసన చెబుతున్నారు. కిందటి వారాంతంలో సాయుధ బలగాలు పదమూడు మంది గనికూలీలను ‘గుర్తెరుగక’ కాల్చి చంపిన దుర్ఘటన తాలూకు విషాధమింకా తాండవిస్తూనే ఉంది. ఎడతెగని దుఃఖం నుంచి పుట్టిన నిరసన క్రమంగా విస్తరిస్తోంది. సైనికులతో సహా ఎవరినీ తమ ప్రాంతంలోకి ఓటింగ్ గ్రామస్తులు ఇపుడు అను మతించడం లేదు. కేంద్ర గృహమంత్రి అమిత్‌షా పార్లమెంటులో చేసిన ప్రకటనను ‘నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్’ (ఎన్ఎస్సీఎన్) ఖండిస్తూ తీవ్రంగా ద్వజమెత్తింది. రక్షణ బలగాలకు విశృంఖల స్వేచ్చ, అధికారం కల్పిస్తున్న ‘సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాల) చట్టం–ఏఎఫ్ఎస్పీయే’ ఒక నల్లచట్టమంటూ, వ్యతిరే కంగా ప్రకటన జారీ చేసింది. ఆ చట్టం ఎత్తివేయకుండా, ఏ రాజకీయ ప్రక్రియనూ సాగనివ్వబోమని తేల్చి చెప్పింది. పలు నాగా తిరుగు బాటు సంస్థల్ని ఒప్పించి, కేంద్ర ప్రభుత్వం కొంత కాలంగా నిర్వ హిస్తున్న శాంతి ప్రక్రియపై తాజా పరిణామాలు ఏ మేరకు ప్రభావం చూపిస్తాయన్నది వేచి చూడాల్సిందే! కానీ, ఇదంతా దేశపు ఈశాన్యం లోని ఓ మారుమూలలో జరుగుతున్న చిన్నపాటి ‘కుంపటి రగలడం’ మాత్రమే! దినకూలీతో బతికే సామాన్యుల్ని, కర్కషంగా సాయుధ బలగాలు నలిపేసిన ఓ దుర్ఘటనపై దేశం తగు రీతిలో స్పందించలేదనే భావన వ్యక్తమౌతోంది. అంతర్జాతీయంగా... మానవహక్కుల పరి రక్షణ సూచీలో మనది ఎప్పుడూ నేల చూపే! తాజా ఘటనతో సహా ‘సైనికులది తప్పే’ అని ఏలినవారు ముక్తసరిగా అంగీకరించినా... అటువంటి తప్పులు పునరావృతం కాకుండా తీసుకుంటున్న చర్య లేమీ లేవు. బలగాల అకృత్యాలను నిలువరించే కట్టుదిట్టమైన వ్యవస్థ ఏర్పడటం లేదని ఈశాన్య రాష్ట్రాల మానవహక్కుల కార్యకర్తలు, పౌర సంఘాల ప్రతినిధులు అంటున్నారు. పదమూడు నెలలకు పైబడి రైతాంగం, ఫలితం రాబట్టుకునే దాకా జరిపినట్టు పోరాటం అన్ని సందర్భాల్లో, అందరివల్లా అవుతుందా? పలు ఈశాన్య రాష్ట్రాల్లో దశా బ్దాలుగా పోరాడినా... ఒక నల్లచట్టాన్ని ప్రభుత్వాలు రద్దు చేయటం లేదనే ఆందోళన ఉంది. మనిషి పచ్చి రక్తం మరోమారు నేలను తడి పాక సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం మరోసారి చర్చకు వస్తోంది. మానవ తప్పిదమా, మానని జాడ్యమా? తప్పు చేసినా తప్పించుకోవచ్చు, శిక్ష ఏమీ ఉండదన్న ధీమాయే సాయుధ బలగాల దుశ్చర్యలకు కారణమని పలుమార్లు రుజువైంది. ఈ చట్టంలోనూ అటువంటి లొసుగులే ఉన్నాయి. చట్టం కల్పించిన అధికారం, చేతిలో ఆయుధం ఇచ్చే బలం ఉన్నాయని అక్కడక్కడ రక్షణ బలగాలు చేసే ఆగడాలను ఉపేక్షించడం తప్పు. ఇలాంటి దుర్ఘటనల వల్ల ప్రభుత్వానికి అపకీర్తి వస్తుందని, పాలకులు సదరు ఆగడాలను వెనుకేసుకొస్తున్నారు. అతకని వాదనల్ని సమర్థిస్తూ మాట్లాడటం, చిన్న తప్పిదంగా కొట్టిపారవేసే వైఖరి మంచిది కాదు. దేశ సరిహద్దుల్లో, కల్లోలిత ప్రాంతాల్లో ఉగ్రమూకల తీవ్రవాదం, హింస, వి«ధ్వంస కార్యకలాపాలను నియంత్రించే క్రమంలో ఇటువం టివి మామూలే! అని బాధ్యత కలిగిన పౌరసమాజం కూడా సాధార ణీకరించడం దుర్మార్గం. ఎవరివైనా ప్రాణాలే! దేశవాసులకు తాము నిరంతర రక్షణ కల్పిస్తున్నామనే ‘త్యాగ భావన’ నీడలో... ఏ సామా న్యుల ప్రాణాలో నిర్హేతుకంగా తీసే హక్కు రక్షణ బలగాలకు ఉంటుందా? ఈ ప్రశ్న ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పలు తెగల గిరిజ నులు, ఆదివాసీలు, అల్ప సంఖ్యాకులు, విభిన్న జాతుల వారు తరచూ లేవనెత్తుతున్నారు. జాతుల సమస్య, అస్తిత్వ ఆరాటాలుండే నిత్య పోరాట నేలల్లో సామాన్యుల బతుకు సదా దర్బరమౌతోంది. బలగాల దీష్టీకాలకు అడ్డు–అదుపూ ఉండదు. కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా వీరిపై ఏ విచారణా జరుగదు. సాయుధబలగాలు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలపై అకృత్యాలు, అత్యాచారాలు, యువకుల్ని ఎత్తుకుపోవడం, ఎదురుకాల్పుల పేరిట మట్టుపెట్టడం... మానవ హక్కుల హననానికి ఎన్ని రూపాలో! వీటిని నిరసిస్తూ... హక్కుల కార్యకర్త – ఉక్కు మహిళ, ఇరోమ్ షర్మిల పద హారేళ్లు మౌన–నిరాహార దీక్ష చేసి ప్రపంచ దృష్టినాకర్శించినా మన ప్రభుత్వాలు కదల్లేదు, చట్టం రద్దవలేదు, ఫలితం శూన్యం! 2000–12 మధ్య ఒక్క మణిపూర్‌లో సాయుధబలగాలు జరిపిన 1528 ఎన్‌కౌం టర్ల పై సీబీఐ ప్రత్యేక దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదే శానికి ఇవాల్టికీ అతీ–గతీ లేదు. కట్టుకథలదే ‘రాజ్యం’! గత శని–ఆది వారాల దుర్ఘటనలు పుండైతే, మాన్పే ప్రయత్నం చేయక పోగా కేంద్రం వైఖరి దానిపై కారం రుద్దినట్టుందనే విమర్శ వస్తోంది. మూడు రోజుల తర్వాత నోరిప్పిన ఓటింగ్ గ్రామస్తులు చెప్పే విష యాలు గగుర్పాటు కలిగిస్తున్నాయి. కాల్పుల్లో మరణించిన గని కూలీల శవాలను పక్కకు తీసి, వారి చొక్కాలు విప్పి మిలిటెంట్ల గుడ్డలు, బూట్లు తొడిగి, వారి చేతుల్లో ఆయుధాలు పెట్టి... బమటి ప్రపంచానికి చూపే యత్నం చేశారని! తద్వారా తమ దాష్టీకానికి హేతుబద్ధత తెచ్చే ప్రయత్నంలో సాయుధబలగాలు గ్రామస్తులకు దొరికాయి. ఆగ్రహోదగ్రులైన గ్రామస్తులు ప్రతిదాడికి దిగారు. నిరసన చల్లార్చే క్రమంలో మరో ఏడుగురు గ్రామస్తుల్ని బలగాలు పొట్టన పెట్టుకున్నాయి. ట్రాలీ కూలీల్లో బతికిన∙షీవాంగ్ చెప్పడమేమిటంటే, సాయుధులు తమ వాహనాన్ని అడ్డుకోలేదు, ఆపమని అడగలేదు, అదుపులోకి తీసుకునే ఏ ప్రయత్నమూ చేయకుండానే నేరుగా కాల్పులు జరిపారని. మయన్మార్ సరిహద్దుల్లో మిలిటెంట్లు ఎకే–47 మారణాయుధాలు, మర తుపాకులు, గ్రెనేడ్ల అక్రమ రవాణాకు పాల్ప డుతున్నట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది అనేది ‘21 పారా స్పెషల్ ఫోర్స్’ బృంద కథనం! సరే, వాదన కోసమైనా, ‘వారు చెప్పేది’ కాసేపు నిజమనుకుందాం, ఈ విషయం స్థానిక పోలీసులకు, అస్సాం రైఫిల్స్‌కి ఎందుకు చెప్పలేదు? దారికాచి వాహనాన్ని అడ్డ గించే ప్రయత్నమో, టైర్లనో, ఇంజన్నో కాల్పులతో పనికి రాకుండా చేసి అనుమానితుల్ని నిర్బంధంలోకి తీసుకోవడమో, బలవంతపు లొంగుబాట్లకో ఎందుకు యత్నించలేదు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. అసలక్కడ కవ్వింపులే లేవు! వారు జరిపింది ఆత్మరక్షణ కాల్పులు కాదు, అణచివేసే అహంతోనో, అధికారాలున్నాయనే మిడి సిపాటో, ట్రిగ్గర్ మోజో... అయి ఉంటుందనేది విశ్లేషణ! వదలని వలసవాద మూలాలు ఎన్ని కమిటీలు? ఎన్ని అధ్యయనాలు? ఎన్నెన్ని నివేధికలున్నా.... చట్టంపై పునరాలోచనే లేదు. 1958 సాయుధ బలగాల ప్రత్యేక అధి కారాల చట్టమైనా,1972 కల్లోలిత ప్రాంతాల చట్టమైనా... వీటి మూలాలు బ్రిటిష్ వాలసపాలకులు, 1942లో ‘క్విట్ ఇండియా’ ఉద్య మాన్ని అణచివేసేందుకు తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌లో ఉన్నాయి. సర్వ సత్తాక సార్వభౌమ దేశానికి అవి పొసగేవి కావు. ‘దేశ పౌరులపై చర్య లకు తలపడేప్పుడు సాయుధ బలగాలు సంయమనం, కనీస బల ప్రయోగం అనే సూత్రాలకు కట్టుబడి, జాగ్రత్తపడాలి’ అని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం (1997) చెప్పింది. జస్టిస్ సంతోష్ హెగ్డే కమిషన్, జస్టిస్ జె.ఎస్.వర్మ కమిషన్ కూడా ఈ చట్టం వద్దనే సిఫారసు చేశాయి. ప్రస్తుతం నాగాలాండ్, మెఘాలయ ముఖ్యమం త్రులే కోరుతున్నారు. కేంద్రం 2004లో, జస్టిస్ జీవన్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, సమాచారం సేకరించి 2005లో ఇచ్చిన నివేదికలో ‘సత్వరమే ఈ చట్టాన్ని రద్దు చేయాలి’ అని నివేదించింది. మరెప్పుడు రద్దు? దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
విద్యార్థులను సూపర్ మార్కెట్లోకి..
-
ఈశాన్యంలో శాంతి వీచిక!
ఎప్పుడూ విషాద ఘటనలతో ముడిపడి మాత్రమే ప్రసార మాధ్యమాలకెక్కే ఈశాన్య ప్రాంతం చాన్నాళ్ల తర్వాత తొలిసారి చల్లని కబురుతో పతాక శీర్షికల్లో చోటు సంపాదించుకుంది. మన దేశానికి స్వాతంత్య్రంతోపాటే సంక్రమించి, గత ఆరు దశాబ్దాలుగా రుధిర అధ్యాయాన్ని రచిస్తున్న నాగాలాండ్ సమస్యపై తొలిసారి నేషనలిస్టు సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్-ఇసాక్, మ్యువా (ఎన్ఎస్సీఎన్- ఐఎం) వర్గంతో కేంద్ర ప్రభుత్వం ఒడంబడిక కుదుర్చుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించినట్టు ఈ ఒప్పందం నిజంగా చరిత్రాత్మకమే. 1986లో ఆనాటి ప్రధాని రాజీవ్‌గాంధీ మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్)తో శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాక ఆ ప్రాంతంలోని మరో పెద్ద గ్రూపుతో కేంద్రం అవగాహనకు రావడం ఇదే ప్రథమం. అయితే, దీన్ని నిజమైన అర్ధంలో ఒప్పందం అనడానికి లేదు. ఎందుకంటే సోమవారం ఇరు పక్షాలూ సంతకాలు చేసింది ఒప్పందానికి సంబంధించిన స్వరూపం (ఫ్రేమ్‌వర్క్)పైన మాత్రమే. దానికి అనుగుణంగా స్పష్టమైన అంశాలతో, విధివిధానాలతో, నిబంధనలతో సవివరమైన ఒప్పందం రూపొందాల్సి ఉంది. ఆ ప్రక్రియంతా పూర్తికావడానికి మరికొంత సమయం పట్టవచ్చునని అంటున్నారు. ఆ తర్వాతనే ఎవరు ఏమేరకు రాజీ పడ్డారో, సరిపెట్టుకున్నారో తెలిసే అవకాశం ఉంది. నాగాలాండ్ సమస్య అత్యంత జటిలమైనది. దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందే అక్కడ తిరుగుబాటు కుంపటి రగుల్కొంది. ఇప్పటి మయన్మార్, ఈశాన్యం లోని మరికొన్ని ప్రాంతాలనూ విలీనం చేసి తమను ప్రత్యేక దేశంగా ఏర్పరచాలని బ్రిటిష్ పాలనలోనే డిమాండు బయల్దేరింది. దానికి మద్దతుగా విస్తృత స్థాయిలో ఉద్యమమూ ప్రారంభమైంది. ఈశాన్యంలోని మిగిలిన తిరుగుబాటు ఉద్యమాల తరహాలోనే నాగా ఉద్యమం కూడా ఎందరో నాయకుల్ని చూసింది. వారు వర్గాలుగా విడిపోవడం, తిరిగి కలవడం... మళ్లీ వేరు కుంపట్లు పెట్టుకోవడం గమనించింది. ఈ క్రమంలో ఎంతో హింసను చవిచూసింది. అటు నాగా ప్రజలు, ఇటు భద్రతా బలగాలకు చెందినవారూ ఎందరో బలయ్యారు. తెగల మధ్య తరచు ఘర్షణలు తలెత్తి వందలాదిమంది ఊచకోతకు గురయ్యారు. చెట్టుకొకరు... పుట్టకొకరయ్యారు. 1960లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నాగా సమస్య పరిష్కారానికి ప్రయత్నించారు. తిరుగుబాటుదార్లతో న్యూఢిల్లీ హైదరాబాద్ హౌస్‌లో ఆరు దఫాలు చర్చలు జరిగాయి. కానీ, హఠాత్తుగా ఒక విదేశీ బృందం కోసం ఆ ప్రాంగణం నుంచి నాగా బృందాన్ని ఖాళీ చేయించడంతో అది తమను అవమానించడంగా వారు భావించారు. చర్చలకు స్వస్తి చెప్పి వెళ్లిపోవడమే కాక ఆ తర్వాత తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. తమకు సమాన స్థాయినిచ్చి మాట్లాడాలన్నది ఆనాటినుంచీ వారి కీలక షరతు. సోమవారం నరేంద్ర మోదీ పక్కన కూర్చోవడం ద్వారా మ్యువా దాన్ని నెరవేర్చుకున్నారు. నాగా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నది ఒక్క ఎన్ఎస్సీఎన్ (ఐఎం) మాత్రమే కాదు... అక్కడ ప్రస్తుతం అనేకానేక గ్రూపులున్నాయి. 1997లో తొలిసారి ఎన్ఎస్సీఎన్ (ఐఎం)తో ఆనాటి ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే అంతకు ముందూ, ఆ తర్వాతా కూడా కేంద్రంలోని ప్రభుత్వాలు అక్కడి గ్రూపుల మధ్య ఉన్న అంతర్గత వైరుధ్యాలను ఉపయోగించుకుని వాటిని బలహీనపర్చడంలో చూపిన శ్రద్ధ...ఆ ప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి వినియోగించలేదనే చెప్పాలి. ఒకరిని నిర్లక్ష్యంచేసి మరో పక్షానికి ప్రాధాన్యమిస్తున్నట్టు కనబడటంవల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగింది. ఇటీవలికాలంలో ఐఎంతో మాత్రమే కేంద్రం తరచుగా సంప్రదింపులు చేస్తున్నదని అలిగిన ఎన్ఎస్సీఎన్ (ఖప్లాంగ్) వర్గం 2001 నాటి కాల్పుల విరమణకు చెల్లుచీటి ఇచ్చింది. మొన్నీమధ్యే మణిపూర్‌లో మాటుగాసి 18 మంది సైనిక జవాన్లను పొట్టనబెట్టుకుంది. దాదాపు చెప్పుకోదగిన హింసాత్మకఘటనలు లేకుండా పద్దెనిమిదేళ్లపాటు కొనసాగిన కాల్పుల విరమణ కాలాన్ని సక్రమంగా ఉపయోగించుకుని ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. ఎన్ఎస్సీఎన్ (ఐఎం) తొలుత స్వతంత్ర నాగాలాండ్ కావాలన్న డిమాండుతో ఉద్యమం ప్రారంభించినా అనంతర కాలంలో తన పంథాను మార్చుకుంది. నాగా ప్రజలు అధికంగా ఉన్న మణిపూర్‌లోని నాలుగు జిల్లాలు, అస్సాంలోని రెండు జిల్లాలు, అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలనూ కలిపి విశాల నాగాలాండ్ ఏర్పాటు చేయాలని కోరడం ప్రారంభించింది. ఇలా వివిధ ప్రాంతాల్లో ఉన్న 12 లక్షలమంది నాగా ప్రజలూ ఆయా రాష్ట్రాల్లో వివక్షకు గురవుతున్నారని, వారి చరిత్ర, సంప్రదాయాలూ ధ్వంసమవుతున్నాయని ఎన్ఎస్సీఎన్, ఇతర గ్రూపులూ ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు కుదిరిందంటున్న ఒప్పందంలో ఈ విలీనం ప్రతిపాదన ఉందా, లేదా అన్నది తెలియదు. అది మినహా దేన్నీ ఒప్పుకునేది లేదని ఎన్ఎస్సీఎన్ (ఐఎం) తరచు చెబుతున్నది. అందుకే అస్సాం, మణిపూర్, అరుణాచల్ రాష్ట్రాల్లో ఈ ఒప్పందంపై అనుమానాలు తలెత్తడం మొదలైంది. ఇప్పుడున్న భౌగోళిక సరిహద్దులేమీ మారవని కేంద్ర ప్రభుత్వం భరోసానిస్తున్నా ఆ ప్రాంత నాయకులు ఆందోళనపడుతున్నారు. ఒప్పందంలోని అంశాలు బయట పెట్టకుండా అంత హడావుడిగా సంతకాలు చేయడమెందుకని అస్సాం సీఎం తరుణ్ గొగోయ్ ప్రశ్నించింది దాన్ని దృష్టిలో పెట్టుకునే. ఇలాంటి ఒప్పందం కుదుర్చుకునే ముందు సమస్యతో సంబంధం ఉన్న అన్ని పక్షాలతోనూ, రాష్ట్రాలతోనూ సంప్రదింపులు జరిపితే మరింత మెరుగైన ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. అసలు ఈశాన్య ప్రాంతం కార్యకలాపాలను నిత్యం పర్యవేక్షిస్తుండే కేంద్ర హోంశాఖలోని సీనియర్ అధికారులకే చర్చల ప్రక్రియ సంగతి తెలియదంటున్నారు గనుక ఇతర రాష్ట్రాలతో, నాగాలాండ్‌లోని ఇతర పక్షాలతో ముందస్తుగా చర్చించలేదని అనుకోవడం దండగ. ఏదేమైనా ప్రస్తుత అవగాహన నాగాలాండ్‌లో శాంతిని నెలకొల్పగలిగితే అది మొత్తం ఈశాన్య ప్రాంత సత్వరాభివృద్ధికి బాటలు పరుస్తుంది. నరేంద్ర మోదీ సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించినవారవుతారు.