breaking news
nafed centers
-
మంత్రి గారి మాటలకు అర్థాలే వేరులే !
ప్రొద్దుటూరు :‘‘రైతులు పండించిన కందులన్నీ కొనుగోలు చేస్తాం, కేంద్రం నాఫెడ్ ద్వారా కొనగా మిగిలే కందులను రాష్ట్రమే సొంతంగా కొనుగోలు చేస్తుంది. ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 25 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 45వేల టన్నుల కందుల కొనుగోళ్లకే అనుమతి ఇచ్చింది, అదనంగా 55వేల టన్నులు కొనుగోలు చేయాలని కోరినా అంగీకరించలేదు. కందుల దిగుబడి పెరిగిన నేపథ్యంలో మొత్తం పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది’’ అని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి గత సోమవారం అమరావతిలో నిర్వహించిన అధికారుల సమీక్షా సమావేశంలో వెల్లడించారు. అయితే గురువారం ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రంలో పరిస్థితి చూస్తే మాత్రం భిన్నంగా ఉంది. దీంతో రైతులు మంత్రుల మాటలకు, వాస్తవ పరిస్థితికి పొంతనే లేదని విమర్శిస్తున్నారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో డీసీఎంఎస్ అధికారులు మినుముల కొనుగోలుకు సం బంధించి కడప మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగా కందుల కొ నుగోలుకు కడప, రాయచోటి, ఎర్రగుంట్ల, శనగ కొనుగోలుకు సంబంధించి కడప, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, పులివెందుల, కమలాపురం మార్కెట్ యార్డుల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతుల పేరుతో వ్యాపారులు మినుములు అమ్ముతున్నారని అధికారులు బుధవారం కడప మార్కెట్ యార్డులో దాడులు చేయడంతో అక్కడ కొనుగోలు తాత్కాలికంగా నిలిపేశారు. మిగతా కొనుగోలు కేంద్రాలతో పోల్చితే చివరగా ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో శనగలు, కందులు, మినుములు కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి బుధవారం నుంచి టోకన్లు జారీ చేస్తున్నారు. వాస్తవానికి ముందే ఇక్కడ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నా తీవ్ర జాప్యం చేశారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రం ప్రారంభమైందనే విషయం తెలుసుకున్న రైతులు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మిగతా కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిపివేయడంతో ఎలాగైనా తాము పండించిన పంటను అమ్ముకోవాలని ఆశతో వచ్చారు. కందులు, మినుములు క్వింటాలు ధర బయట మార్కెట్లో రూ.4వేలు మాత్రమే ఉండగా కొనుగోలు కేంద్రంలో కందులు రూ.5,450, మినుములు రూ.5,400 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు ప్రొద్దుటూరు, రాజుపాళెం, జమ్మలమడుగు, కమలాపురం, ఖాజీపేట, వీరపునాయునిపల్లె, లింగాల, వేంపల్లి తదితర దూరప్రాంతాల నుంచి తరలి వచ్చారు. కొనుగోలు కేంద్రంలోని డీసీఎంఎస్ అధికారులు ససేమిరా అంగీకరించలేదు. కేవలం శనగల కొనుగోలుకు మాత్రమే అనుమతి ఉండటంతో టోకన్లు ఇస్తున్నామని, తొలి రోజు కందుల కొనుగోలుకు టోకన్లు ఇచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు. పై అధికారుల అనుమతి వచ్చేంత వరకు కందులు, మినుములను కొనుగోలు చేసే ప్రసక్తే లేదన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. దీంతో నిరాశతో రైతులు వెనక్కి వెళ్లారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువగా వ్యాపారుల హవా నడుస్తోందని, ఈ కారణంగానే తాము నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. -
నాఫెడ్ కొనుగోలు కేంద్రాలు మూసివేత
అంబాజీపేట : సంక్షోభంలో ఉన్న కొబ్బరి రైతులను ఆదుకునేందుకు ఈ ఏడాది జూ¯ŒS 24వ తేదీన ప్రారంభించిన నాఫెడ్ కొనుగోలు కేంద్రాల గడువు ముగియడంతో మూసివేస్తున్నట్టు ఏపీ ఆయిల్ ఫెడ్ అసిస్టెంట్ మేనేజర్ యు.సుధాకరరావు తెలిపారు. వాటిని మూసివేయాలని ఆయిల్ ఫెడ్ ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు అందాయని శుక్రవారం ఆయన విలేకరులకు వివరించారు. కోనసీమలోని అంబాజీపేట, నగరం, తాటిపాక, ముమ్మిడివరం, కొత్తపేటలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో నవంబర్ 30 వరకు 33,185 క్వింటాళ్లు కొనుగోలు చేశామన్నారు. వీటికి సంబంధించి రూ.19.75 కోట్లు రైతులకు చెల్లించామన్నారు. ఇంకా రూ.2.70 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. బహిరంగ మార్కెట్లో కొత్త కొబ్బరి ధర రూ.5,900 నుంచి రూ.6వేలు వరకు పెరగడం, గడువు ముగిడంతో కొనుగోలు కేంద్రాలను మూసివేశామన్నారు. -
కొబ్బరి కొనుగోలుకు రైతుల ధర్నా
అంబాజీపేట : నాఫెడ్ కొబ్బరి కొనుగోలు కేంద్రాల్లో 18 రోజులుగా కొబ్బరి కొనుగోలు చేయడం లేదంటూ రైతులు సోమవారం సాయంత్రం ధర్నాకు దిగారు. ఈ నెల 5 నుంచి నాఫెడ్ కేంద్రంలో కొబ్బరిని కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాఫెడ్ కేంద్రాల నుంచి కొబ్బరిని కొనుగోలు చేయాలంటూ మార్కెట్ యార్డు గేటు వద్ద, రహదారిపై ధర్నా నిర్వహించారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న రోజుల్లో కొబ్బరిని కొనుగోలు చేయకుండా తాత్సారం చేశారన్నారు. కొబ్బరి సరకులు నాణ్యత ఉన్నా కొబ్బరిని ఎందుకు కొనుగోలు చేయలేదంటూ నిలదీశారు. నాఫెడ్ కేంద్రానికి సెలవు వస్తే ముందుగా ప్రకటించాలన్నారు. ఆందోళనకారులతో ఎంపీపీ దాసరి వీరవెంకట సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ అరిగెల బలరామమూర్తి, స్థానిక నాయకుడు సుంకర బాలాజీ చర్చించారు. నాఫెడ్ కేంద్రం నుంచి కొబ్బరిని కొనుగోలు చేస్తామని స్పష్టమైన హామీ ఇస్తే మినహా ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. దాంతో ఇక్కడ జరుగుతున్న విషయాన్ని అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, ఆయిల్‌ఫెడ్, నాఫెడ్ అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధులు ఫోన్లో వివరించారు. నాఫెడ్‌లో కొబ్బరిని కొనుగోలు చేసేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో స్థానిక నాయకుల సూచనలతో ఆందోళన విరమింపజేశారు. అనంతరం స్థానిక మార్కెట్ యార్డులో కొబ్బరి రైతులు సమావేశమయ్యారు. రైతుల సమస్యలను చైర్మన్‌తో పాటు సొసైటీ అధ్యక్షుడు గణపతి వీర రాఘవులు ఫోన్ ద్వారా ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తికి, నాఫెడ్, ఆయిల్ ఫెడ్ అధికారులకు వివరించారు. ఆయిల్ ఫెడ్ డిప్యూటీ మేనేజర్ సుధాకరరావు, నాఫెడ్ అధికారి రామచంద్రారెడ్డి, క్వాలిటీ కంట్రోల్ అధికారులు మార్కెట్ యార్డుకు చేరుకుని రైతులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. నిబంధనల మేరకు మంగళవారం నుంచి కనీసం రోజుకు వెయ్యి బస్తాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.