breaking news
Mustard crop
-
పచ్చని పంటపై కమ్ముకున్న కారుమేఘం
ఒట్టావా: ఆవాల పంటపై కుండపోత కురిపిస్తుందా అన్నంతగా కమ్ముకుంటున్న కారు మబ్బులివి. కెనడాలోని ఆల్బెర్టా రాష్ట్రంలోని క్రిమోనా గ్రామంలో శనివారం తీసిన ఫొటో ఇది. ఇదీ చదవండి: వరదలో మునిగిపోయిన ఇల్లు.. ప్రాణంగా ప్రేమించే శునకం కోసం బాలిక రిస్క్.. గంటలపాటు రూఫ్ పైనే.. -
రైతుగా మారిన టీమిండియా మాజీ కెప్టెన్..
Dhoni Farming Mustard Crop: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రైతుగా మారాడు. ఇదేదో సరదా కోసం చేసిన పని అనుకుంటే పొరపాటే. అతను నిజంగానే పూర్తి స్థాయి రైతుగా మారి పంటలు పండిస్తున్నాడు. అంతర పంట పద్ధతిలో ఆవాలను సాగు చేస్తున్నాడు. దీంతో పాటు క్యాబేజీ, అల్లం, క్యాప్సికమ్ వంటి అనేక రకాల కూరగాయలు, స్ట్రాబెర్రీలు కూడా పండిస్తున్నాడు. ఇటీవల పంటను పరిశీలించేందుకు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన ధోని, అతని సాగు సలహాదారుడు రోషన్‌తో కలిసి సెల్ఫీకి పోజిచ్చాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. Latest pictures of Mahi in Mustard field at his farmhouse. 🤩❤️#MSDhoni • #Dhoni • #WhistlePodu pic.twitter.com/owSA57ccEO— Nithish Msdian (@thebrainofmsd) January 16, 2022 ధోనికి కూరగాయాలంటే అమితంగా ఇష్టమని, రాంచీ వచ్చిన ప్రతిసారి తాను పండించిన కూరగాయలు మాత్రమే తింటాడని రోషన్ తెలిపాడు. ఇదిలా ఉంటే, ధోని.. ఐపీఎల్ మినహా క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2022లో భాగంగా అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 12 కోట్లు వెచ్చించి మరోసారి రిటైన్ చేసుకుంది. వయో భారం రిత్యా అతను.. ఈ ఏడాది ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు పలికే అవకాశం ఉందని తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోనితో పాటు రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీలను రిటైన్ చేసుకుంది. చదవండి: "మ్యాచ్ ఫిక్సింగ్ నేరం కాదు.." హైకోర్టు సంచలన తీర్పు -
ఆవాల సాగు.. లాభాలు బాగు
సాక్షి, అమరావతి: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఆవాల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని కేంద్ర వ్యవసాయశాఖ నిర్ణయించింది. మిషన్ మస్టర్డ్–2025లో భాగంగా వచ్చే 4 ఏళ్లలో ఆవాల సాగును కనీసం 2 లక్షల ఎకరాలకు తీసుకెళ్లేలా రైతుల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తుంది. ఈ బాధ్యతను ఆయిల్ సీడ్స్ విభాగానికి అప్పగించనుంది. నీటివసతి ఉన్నా లేకున్నా ఆవాలను సాగు చేయవచ్చు. నానాటికీ మారిపోతున్న సీజన్లు, నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే స్వల్పకాలిక పంటల్ని ప్రోత్సహించాలన్నది లక్ష్యం. రెండో పంటగాను సాగు చేయవచ్చు అంతర్జాతీయంగా సోయాబీన్ తర్వాత ఆవనూనెకు గిరాకీ పెరిగింది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రస్తుతం ఉన్న 86.93 లక్షల టన్నుల ఆవాల దిగుబడిని 2025–26 నాటికి రెట్టింపు చేయాలని వ్యవసాయశాఖ ఆధ్వర్యంలోని నూనెగింజల విభాగం నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 13 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. ఈ లక్ష్యసాధనకు అటు రైతులు, ఇటు పరిశ్రమవర్గాల సహాయ సహకారాలను తీసుకోనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాధార ప్రాంతాల్లో తప్ప ఎక్కడా ప్రధానపంటగా ఆవాల సాగు లేదు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఆవాల సాగు పెరిగినా.. మిగతా ప్రాంతాల్లో కూడా పెంచేందుకు నూనెగింజల విభాగం నడుంకట్టనుంది. కోస్తా జిల్లాల్లో తొలిపంటగా వేసే వరి తర్వాత రెండోపంటగా ఆవాల సాగును పెంచనుంది. ఇందుకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయడమేగాక సాగు పద్ధతులపై రైతులకు శిక్షణ ఇవ్వనుంది. ఎకరా సాగు ఖర్చు రూ.5 వేలకు మించదు మాగాణి భూముల్లో తేమ ఎక్కువ. 90 రోజుల్లో చేతికి వచ్చే ఆవాల సాగుకు అనువుగా ఉంటుంది. విత్తనాలను ఆయా కంపెనీలతోనే రైతులకు ఇప్పిస్తారు. ఎకరానికి రూ.500 వరకు విత్తనాలకు ఖర్చవుతుంది. ఇతర పెట్టుబడి ఖర్చులు అన్నీ కలిపినా రూ.4 వేల నుంచి రూ.5 వేల మధ్య ఉంటాయి. కలుపు బెడద తక్కువ. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పండించాలి గనుక సేంద్రియ పద్ధతుల్లోనే పండించవచ్చు. కషాయాలు, వేపనూనెలతో తెగుళ్లను నివారించుకోవచ్చు. ఎకరానికి సగటున 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. విత్తనాలు ఇచ్చిన కంపెనీలే ఆవాలను కొనుగోలు చేస్తాయి. క్వింటాల్ ఆవాలను ప్రస్తుతం రూ.4,200 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఎకరానికి కనీసం రూ.30 వేలు సంపాదించవచ్చు. ప్రస్తుతం వేస్తున్న నువ్వు, మినుము, పెసర కన్నా ఆవాల సాగు సులువు. ఖర్చు తక్కువ. అంతరపంటగా కూడా సాగు చేయవచ్చు. ఆవాల సాగుకు అన్ని విధాల సహకరిస్తామని ఆయిల్ సీడ్స్ అధికారులు చెప్పారు. -
ఇప్పుడు ఆముదం వేసుకోవచ్చు
పాడి-పంట: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా చాలా మంది రైతులు ఇప్పటికీ ఆముదం విత్తనాలు వేసుకోలేదు. అలాంటి వారు ఈ నెలాఖరు వరకూ పంట వేసుకోవచ్చునని పరిష్కారం కాల్ సెంటర్ కో-ఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎ.ప్రతాప్ కుమార్ రెడ్డి, శాస్త్రవేత్తలు డాక్టర్ పి.స్వర్ణశ్రీ, డాక్టర్ యస్.హేమలత, డాక్టర్ వై.సునీత (వీరిని తెలంగాణ రైతులు 1800-425-1110, ఆంధ్రప్రదేశ్ రైతులు 1800-425-4440 మొబైల్ ఫోన్ నెంబర్లలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సంప్రదించవచ్చు) సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాలు, తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల రైతులకు ఈ అవకాశం ఉంది. అనువైన నేలలు-రకాలు ఆముదాన్ని రెండు రాష్ట్రాలలోనూ మెట్ట పంటగా సాగు చేస్తున్నారు. మెట్ట సాగులో నేలల ఎంపికే కీలకం. ఆముదాన్ని అన్ని రకాల నేలల్లోనూ వేసుకోవచ్చు. అయితే మురుగు నీరు బయటికి పోయే సదుపాయం లేని నేలలు, చౌడు నేలలు పనికిరావు. ఆముదం సాగుకు సూటి రకాలైన జ్యోతి, క్రాంతి, జ్వాల, కిరణ్, హరిత అనువుగా ఉంటాయి. నీటి పారుదల సౌకర్యం ఉన్న వారు సంకర రకాలైన జీసీహెచ్-4, డీసీహెచ్-177, 519, పీసీహెచ్- 222, 111 రకాలను వేసుకోవచ్చు. సూటి రకాలైతే ఎకరానికి 2-2.5 కిలోలు, సంకర రకాలైతే 2 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. వరుసల మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తనాలు వేసుకోవాలి. విత్తనశుద్ధి తప్పనిసరి చీడపీడల బారి నుంచి ఆముదం పంటను కాపాడుకునేందుకు విత్తనాలను విధిగా శుద్ధి చేయాలి. కిలో విత్తనాలకు 3 గ్రాముల థైరమ్/కాప్టాన్ పట్టించాలి. దీనివల్ల మొలకకుళ్లు, ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగుళ్లను పూర్తిగానూ, వడలు తెగులును కొంత వరకూ నివారించవచ్చు. వడలు తెగులు ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనాలకు 3 గ్రాముల కార్బండజిమ్ లేదా 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడె కలపాలి. ఎరువుల యాజమాన్యం ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువును దుక్కిలో వేసి బాగా కలియదున్నాలి. విత్తనాలు వేసేటప్పుడు ఎకరానికి 12 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్‌ను అందించే ఎరువులు వేయాలి. విత్తిన 30-35 రోజులకు, 60-65 రోజులకు 6 కిలోల చొప్పున నత్రజనిని అందించే ఎరువును పైపాటుగా వేసుకోవాలి. సంకర రకాలు వేసే వారు విత్తనాలు విత్తిన 90-95 రోజులకు మరో 6 కిలోల నత్రజనిని అందించే ఎరువు వేయాలి. తొలి దశలో కలుపు బెడద ఆముదం పంటకు తొలి దశలో కలుపు బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విధిగా కలుపు నివారణ మందులు పిచికారీ చేయాలి. విత్తిన 24-48 గంటల లోపు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 1-1.25 లీటర్ల పెండిమిథాలిన్ (స్టాంప్/పెండిగార్డ్/పెండిస్టార్) లేదా అలాక్లోర్ (లాసో/అలాటాప్) కలిపి తేమ నేలపై పిచికారీ చేయాలి. విత్తనాలు వేసిన 15-20 రోజుల మధ్య ఎకరానికి 200 లీటర్ల నీటిలో 400 మిల్లీలీటర్ల క్విజలాఫాప్-పి-ఇథైల్ (టర్గా సూపర్) లేదా 250 మిల్లీలీటర్ల ప్రొపాక్విజాఫాప్ (ఎజిల్) కలిపి పిచికారీ చేసుకుంటే గడ్డి జాతి కలుపు మొక్కలు నశిస్తాయి. అంతరపంటలూ వేయొచ్చు ఆముదంలో అంతరపంటలు కూడా వేసుకోవచ్చు. ఆముదంలో కందిని 1:1, బొబ్బర్లను 1:2, మినుమును 1:2, వేరుశనగను 1:5, గోరుచిక్కుడును 1:2, ఉలవలను 1:8 నిష్పత్తిలో ఆయా ప్రాంతాలలోని పరిస్థితులను బట్టి అంతరపంటగా వేసుకునే అవకాశం ఉంది. ఇప్పటి నుంచే... ఆముదం పైరు మొలిచిన వెంటనే ఎర్ర గొంగళి పురుగుల తాకిడి మొదలవుతుంది. ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి పత్రహరితాన్ని గోకి తింటాయి. పురుగులు ఎదిగే కొద్దీ ఆకుల మీద రంధ్రాలు చేస్తూ కాడలు, ఈనెలు, లేత కొమ్మలను మాత్రం మిగులుస్తాయి. ఎదిగిన పురుగుల నివారణకు లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. దాసరి/నామాల పురుగులు ఆగస్ట్ నుంచే పైరుపై దాడి చేస్తాయి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పురుగులు లేత కొమ్మలు, కాడలు, పూలు, పెరిగే కాయలను తినేస్తాయి. వీటి నివారణకు తొలి దశలో లీటరు నీటికి 5 మిల్లీలీటర్ల వేపనూనె లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్/థయోడికార్బ్ లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ లేదా ఒక మిల్లీలీటరు నొవాల్యూరాన్ చొప్పున కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిసేలా పిచికారీ చేయాలి. పొగాకు లద్దె పురుగుల తాకిడి కూడా ఆగస్ట్ నుంచే మొదలవుతుంది. ఇవి తొలి దశలో గుంపులు గుంపులుగా ఆకుల కిందికి చేరి పత్రహరితాన్ని గోకి తింటాయి. దీంతో ఆకులు జల్లెడాకులుగా మారతాయి. తొలి దశలో లద్దె పురుగుల నివారణకు లీటరు నీటికి 5 మిల్లీలీటర్ల వేపనూనె లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పురుగు మధ్యస్థ దశలో ఉన్నప్పుడు తక్కువ గాఢత కలిగిన ఎసిఫేట్/ప్రొఫెనోఫాస్/థయోడికార్బ్ మందును లీటరు నీటికి 1.5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే లీటరు నీటికి ఒక మిల్లీలీటరు ఇండాక్సాకార్బ్/నొవాల్యూరాన్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి.