breaking news
Muppala
-
సస్పెన్షన్ అయినట్టా.. కానట్టా?
* ఎంపీడీవో సస్పెన్షన్‌పై మండలంలో చర్చ * పత్రికల్లో వార్త వచ్చిన రోజే విధులకు హాజరు.. ముప్పాళ్ళ: మండల పరిషత్ అభివృద్ధి అధికారి టి.ఉషారాణి సస్పెన్షన్ వ్యవహారం మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లకు తరచూ గైర్హాజరవడంతో పాటుగా విధులకు సక్రమంగా హాజరుకాకపోవడం, ప్రభుత్వం చేపట్టిన ప్రజా సాధికార సర్వే కూడా సక్రమంగా నిర్వహించకపోవడం వంటి చర్యలపై రెండు రోజుల క్రితం కలెక్టర్ ఆగ్రహానికి గురై ఆమె సస్పెన్షన్‌కు ఆదేశించారు. అభివృద్ధి పథకాల అమలులో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అందిన ఫిర్యాదుల మేరకు జెడ్పీ సీఈవో ఎస్.వెంకటసుబ్బయ్యను విచారణకు పంపించారు. విచారణలో భాగంగా ఆయన కార్యాలయానికి వచ్చి సిబ్బందిని వివరాలు నమోదు చేసుకొని సంబంధిత రికార్డులను తనతోపాటుగా తీసుకెళ్లారు. ఎంపీడీవో ఉషారాణికి ప్రజాప్రతినిధుల అండ మెండుగా ఉండడంతో రాత్రికి రాత్రే సస్పెన్షన్ రద్దయినట్టుగా స్థానిక నేతలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో గురువారం ఆమె విధులకు హాజరయ్యారు. సస్పెండ్ అంటూ పత్రికలలో వార్త వచ్చినరోజే విధులకు హాజరవడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ ఎంపీడీవో సస్పెండ్ అయినట్టా...విధుల్లో ఉన్నట్టా అని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇటు ఉద్యోగవర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎంపీడీవోను సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్‌కు లేదని అధికార పార్టీ నేతలు బహిరంగంగానే మాట్లాడుకోవడం గమనార్హం. సస్పెన్షన్ ఆదేశాలు అందలేదు : ఎంపీడీవో తనను సస్పెన్షన్ చేసినట్టు గాని, చర్యలు తీసుకుంటున్నట్టు గాని తనకు ఎలాంటి ఆదేశాలు అందలేదని, రోజువారీ విధుల్లో బాగంగానే స్మార్ట్ సర్వేను పరిశీలిస్తున్నట్లు ఎంపీడీవో టి.ఉషారాణి తెలిపారు. మండలంలో 288 మంది,104 కుటుంబాల వివరాలను సర్వేలో సేకరించామని చెప్పారు. అన్ని పంచాయతీల్లోను సర్వేను వేగవంతం చేసేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. -
ముప్పాల మాజీ ఎంపీటీసీ మృతి
గుంటూరు : గుంటూరు జిల్లాలోని ముప్పాల మండల మాజీ ఎంపీటీసీ పఠాన్ హుస్సేన్ అహ్మద్(64) శుక్రవారం గుండెపోటుతో మృతిచెందారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక ప్రార్థనలు చేసి ఇంటికి తిరిగి వచ్చిన ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా.. అప్పటికే మృతిచెందారు. నిస్వార్ధపరుడిగా, ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న హుస్సేన్ మృతి సమాచారం అందుకున్న పలు పార్టీల నాయకులు ఆయన ఇంటికి చేరుకొని ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.