'నన్ను ఇంట్లో బంధించారు'
ముంబయి: తనను గృహ నిర్బంధం చేశారని ముంబయి కాంగ్రెస్ పార్టీ చీఫ్ సంజయ్ నిరుపమ్ అన్నారు. పోలీసులంతా తన ఇంటిముందే ఎటు వెళ్లకుండా తిరుగాడుతున్నారని ఆయన ఆరోపించారు. భారత ప్రధాని మోదీ ముంబయిలోని అరేబియా సముద్రంలో చత్రపతి శివాజీ స్మారక నిర్మాణానికి సంబంధించి పూజకు వస్తున్న సందర్భంగా సంజయ్ ఆధ్వర్యంలో కొంతమందితో కలిసి మోదీకి వ్యతిరేకంగా మౌన పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు.
అయితే, మోదీ పర్యటనకు ఎలాంటి భంగం కలగకుండా ముంబయి పోలీసులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. దాదాపు ఆయన వెళ్లే రహదారుల వెంట గంటపాటు నిషేదం విధించినట్లుగానే ఎక్కడా ర్యాలీలు, నిరసనలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే సంజయ్‌ని ఇంట్లోనే బంధించినట్లు తెలిసింది. అయితే పోలీసులు మాత్రం ఈ విషయాన్ని ఖండించారు. తాము ఎవరినీ గృహ నిర్భందం చేయలేదని చెప్పారు.
'నా ఇంటి బయట భారీ ఎత్తున పోలీసు బందోబస్తు పెట్టారు. నన్ను బయటకు రాకుండా ఇంట్లోనే కదలకుండా చేశారు. ప్రస్తుతం నడుస్తున్న ప్రజాస్వామ్యంలో అధికార పక్షం విపక్షాలను గృహనిర్భందాలను చేయిస్తున్నారు' అని సంజయ్ నిరుపమ్ ఆరోపించారు. అందుకు బదులిచ్చిన డీసీపీ అశోక్ దుధే మాట్లాడుతూ.. 'మేం ఎవరినీ నిర్బంధించలేదు. ముఖ్యంగా ప్రధాని వచ్చే మార్గంలోనే పోలీసులను మోహరించాం. శాంతియుత పరిస్థితులకు భంగం కలగకూడదనే మేం ఆ పని చేశాం' అని చెప్పారు.