breaking news
Mukesh kumarmina
-
బోనాలకు సకల ఏర్పాట్లు
సీఎస్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ముఖేష్ కుమార్‌మీనా సాక్షి, సిటీబ్యూరో: రాష్ర్ట పండుగగా గుర్తించిన బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. బోనాలు, రంజాన్ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. జూన్ 29న గోల్కొండలోని అక్కన్న మాదన్న ఆలయంలో, జూలై 13న ఉజ్జయిని మహంకాళి , 20న లాల్ దర్వాజ ఆలయంలో నిర్వహించే బోనాలు ప్రధానమైనవని పేర్కొన్నారు. రంజాన్ సందర్భంగా జూన్ 29 నుంచి జూలై 29 వరకు (ఈదుల్ ఫితర్) మసీదులు, ప్రార్థనా స్థలాల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రూ.20 కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రహదారుల మరమ్మతులు, ఇతరత్రా పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. బోనాలు నిర్వహించే 10 ప్రధాన దేవాలయాల్లో ఆర్అండ్బీ ఆధ్వర్యంలో బారీకేడ్లు, మండపాలు, విద్యుత్ దీపాలంకరణ చే యిస్తున్నామన్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందన్నారు. రంజాన్ పనుల నిమిత్తం రూ.30 లక్షలు అవసరం కాగా, ఇప్పటికి రూ.20 లక్షలు అందాయని, మిగిలిన నిధులు మంజూరు చేయాల్సిందిగా సీఎస్‌ను కోరారు. సీఎస్ రాజీవ్ శర్మ మాట్లాడుతూ.. రెండ్రోజుల్లో నిధులను విడుదలయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. వివిధ ప్రభుత్వ విభాగాల ద్వారా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. అనంతరం వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులతో సమావేశమైన కలెక్టర్.. రంజాన్, బోనాలు ఉత్సవాలకు సంబంధించి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్అండ్బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు వై.లింగారెడ్డి, విష్ణు, మైనార్టీ సంక్షేమాధికారి సూరజ్‌కుమార్ పాల్గొన్నారు. -
రేపు,ఎల్లుండి చేప ప్రసాదం
పంపిణీకి అన్ని ఏర్పాట్లు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను పరిశీలించిన కలెక్టర్, పోలీసు కమిషనర్ సాక్షి,సిటీబ్యూరో: మృగశిరకార్తె సందర్భంగా ఈనెల 8,9వ తేదీల్లో ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ముఖేష్ కుమార్‌మీనా తెలిపారు. శుక్రవారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ను సందర్శించిన కలెక్టర్.. కార్యక్రమ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. చేపపిల్లల విక్రయ కేంద్రం, టోకెన్ కౌంటర్లు, పంపిణీ కౌంటర్లు, బారీకేడ్ల నిర్మాణం పనులతోపాటు మహిళలకు, వికలాంగుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. అవసరమైన మేరకు మంచినీటి ప్యాకెట్లను అందజేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు. రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్ల నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ప్రాంగణంలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులను చేపట్టేలా సిబ్బందిని నియమించుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు..శాంతిభద్రతలు, విద్యుత్ సరఫరాపై ఆయా శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో అదనపు జేసీ సంజీవయ్య, బత్తిన హరినాథ్‌గౌడ్, ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి అశ్విన్‌మార్గమ్, హైదరాబాద్ ఆర్డీవో నిఖిల, పలువురు తహశీల్దార్లు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ పర్యవేక్షణ అబిడ్స్: చేపప్రసాదం పంపిణీ ఏర్పాట్లను నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, కలెక్టర్ ఎంకేమీనా ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారం రాత్రి పర్యవేక్షించారు. ప్రసాదానికి వచ్చే వేలాదిమందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. 100 ప్రత్యేక బస్సులు : చేపప్రసాదం పంపిణీ సందర్భంగా నగరంలోని ఆయా ప్రాంతాల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్టు ఆర్టీసీ గ్రేటర్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కోటేశ్వర్రావు తెలిపారు. ఆదివారం ఉదయం 4 గంటల నుంచి సోమవారం రాత్రి రద్దీ ముగిసే వరకు ప్రత్యేక సర్వీసులను నడిపిస్తామని చెప్పారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ లతోపాటు మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్సుఖ్నగర్ బస్స్టేషన్ల నుంచి, శంషాబాద్ విమానాశ్రయం నుంచి మొత్తం 100 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు తెలిపారు. ‘చేపప్రసాదం స్పెషల్- ఎగ్జిబిషన్ గ్రౌండ్’ అనే పేర్లతో సర్వీసులు నడుస్తాయన్నారు.