మోసం చేశారు.. అయినా భయపడలేదు : టి. నరసింహారెడ్డి
‘‘ఎంతో తపన ఉంటేనే సినిమాలు నిర్మిస్తాం. ఎన్నో వ్యయప్రయాసలు పడితే కానీ మా ‘మిస్టర్ రెడ్డి’ సినిమా బయటకు రావడం లేదు. ఈ క్రమంలో నన్ను ఎంతోమంది మోసం చేశారు. కానీ నేను భయపడలేదు. నా ప్రతిభను నమ్ముకుని, ఇక్కడివరకు వచ్చాను’’ అని టి. నరసింహారెడ్డి (టీఎన్ఆర్) అన్నారు. ఆయన హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మిస్టర్ రెడ్డి’. వెంకట్ రెడ్డి వోలాద్రి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహాదేవ్, అనుపమా ప్రకాశ్, దీప్తి శ్రీరంగం, భాస్కర్, మల్లికార్జున్, శంకర్ మహతి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో టీఎన్ఆర్ మాట్లాడుతూ–‘‘నా జీవితంలో జరిగిన కథే ఈ చిత్రం. ఇందులోని ప్రేమకథ ఆడియన్స్ను అలరిస్తుంది’’ అని చెప్పారు. ‘‘అందరం కలిసి ఒక మంచి సినిమా తీశాం. ప్రేక్షకులు ఆదరించాలి’’ అని పేర్కొన్నారు వెంకట్ వోలాద్రి. హీరో మహదేవ్ మాట్లాడుతూ .. ‘మా ‘మిస్టర్ రెడ్డి’ కోసం టీఎన్ఆర్ గారు ఎంతో కష్టపడ్డారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా టీఎన్ఆర్ గారికి ధన్యవాదాలు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ చిత్రం అందరికీ కనెక్ట్ అవుతుంది. ఈ మూవీని అందరూ తప్పకుండా థియేటర్లోనే చూడండి. మాకు సపోర్ట్ చేస్తున్న మీడియాకు థాంక్స్. మా చిత్రం జూలై 18న రాబోతోంది. అందరూ చూసి విజయవంతం చేయండి’ అని అన్నారు.హీరోయిన్ అనుపమ ప్రకాష్ మాట్లాడుతూ .. ‘‘మిస్టర్ రెడ్డి’ టీం అంతా ఓ కుటుంబంలా కలిసి పని చేశాం. ఇంత మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా సినిమా అద్భుతంగా వచ్చింది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.