breaking news
more dowry
-
చీర విషయంలో ఘర్షణ, భార్య హత్య
మంథని (కరీంనగర్): కలకాలం కలిసి ఉంటామని బాస చేసిన భర్త పెళ్లి జరిగి ఏడాది పూర్తి కాకముందే భార్యను హత్యచేసిన ఘటన మంథనిలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..కమాన్‌పూర్ మండలం రొంపికుంట గ్రామానికి చెందిన కొండి పద్మ-రాజయ్య పెద్ద కూతరు శిరీష(22)ను మంథనికి చెందిన మేర్గు రాజమల్లు కుమారుడు చంద్రమోహన్‌కు ఇచ్చి గత ఏడాది జూన్ 20న వివాహం జరిపించారు. వివాహం సమయంలో రూ.3.70 లక్షల కట్నంతో పాటు ఇతర కానుకలు ముట్టజెప్పారు. దంపతులులు కొంతకాలంగా అన్యోన్యంగానే ఉన్నారు. వారం రోజుల్లో పెళ్లి రోజు ఉండటంతో చీర విషయంలో సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగి హత్యకు దారితీసినట్లు తెలిసింది. తాగిన మైకంలో మాటామాట పెరిగి ఓ చేత్తో ముక్కు నోరు మూసి మరో చేత్తో గొంతు నులిమి శిరీషను భర్త చంద్రమోహన్ హత్యచేసినట్లు సీఐ తెలిపారు. కొద్ది రోజులుగా తన కుమార్తెను ఆమె భర్త, తల్లిదండ్రులు, మేన త్త రూ. 3 లక్షల అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, ఈ విషయంపై మూడు నెలల క్రితం పంచాయితీ కూడా జరిగిందని మృతురాలి తల్లిదండ్రులు పద్మ-రాజయ్యలు తెలిపారు. కూలినాలి చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న తాము ఉన్న ఇరువై గుంటల పొలం అమ్మి కట్నం డబ్బులు ఇచ్చామని మరింత సొమ్ము ఇచ్చే స్థోమత లేదని కాళ్లావేళ్లపడి బతిమిలాడామని వారు తెలిపారు. తమ ఆర్థిక స్థోమతను పసిగట్టిన వీరు కావాలనే పథకం ప్రకారం తన కూతరుని హత్యచేశారని వారు కన్నీరుమున్నీరయ్యారు. కూతురు చనిపోయిన సమాచారం చుట్టుపక్కల వారి ద్వారా తెలిసిందని రోదించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ ప్రభాకర్, ఎస్సై షేక్ మస్తాన్అలీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
అలాంటి భర్త నాకు అక్కర్లేదు.. ఆగిన పెళ్లి
నిజామాబాద్: మరికొద్ది గంటల్లో జరగాల్సిన పెళ్లి అదనపు కట్నం కారణంగా ఆగిపోయింది. తనకు అదనంగా మరో రెండు లక్షలు కట్నం కావాలని వరుడు డిమాండ్ చేయడంతో ఇలాంటి భర్త తనకవసరం లేదని వధువు తేల్చి చెప్పింది. వివరాలిలా ఉన్నాయి.. నిజామాబాద్‌లోని ఎఫ్‌సీఐ కాలనీ (ఆర్యనగర్)కు చెందిన మీనాక్షి వివాహం జక్రాన్‌పల్లికి చెందిన సాయికుమార్‌తో శుక్రవారం జరగాల్సి ఉంది. వీరి నిశ్చితార్థం ఏడాది క్రితమే జరిగింది. కట్నకానుకల కింద వధువు సోదరుడు రూ.లక్షతో పాటు అర తులం బంగారం ఇచ్చారు. పెళ్లికి మూడు రోజుల ముందు పెండ్లి కొడుకు తనకు బైక్ కావాలని పేచీ పెట్టగా కొనిచ్చాడు. సంప్రదాయం ప్రకారం పెండ్లికి ఒకరోజు ముందు వరుడిని నిజామాబాద్ తీసుకువచ్చారు. అయితే అతడికి స్వాగతం పలికేటప్పుడే గొడవ జరగడంతో అదే రోజు రాత్రి తన ఇంటికి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం తిరిగి రమ్మని ఆహ్వానించగా తనకు అదనంగా మరో రూ. 2 లక్షలు కట్నం ఇస్తేనే వస్తానని మొండికేశాడు. దీంతో పీటలపైకి వచ్చిన పెండ్లి ఆగిపోయింది. దీంతో వధువు తరఫు వారు నిజామాబాద్ నాలుగో టౌన్ పోలీసులను ఆశ్రయించారు. పెండ్లికొడుకును అదుపులోకి తీసుకుని చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధు తెలిపారు. ఆ తర్వాత ఈ పెళ్లి తనకు ఇష్టమేనని వరుడు చెప్పగా.. ఇలాంటి భర్త తనకు అక్కర్లలేదని వధువు తేల్చిచెప్పటంతో పెండ్లి రద్దయింది.