breaking news
mobile wallets
-
మొబైల్ వాలెట్లతో పన్ను చెల్లింపులు..!
న్యూఢిల్లీ: మొబైల్ వాలెట్లు, క్రెడిట్ కార్డ్‌లు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపులను చేసే సౌలభ్యం త్వరలో అందుబాటులోకి రానుంది. వీలైనంత త్వరగా దీన్ని అమల్లోకి తేనున్నట్లు రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే సోమవారం చెప్పారు. ప్రస్తుతం నెట్ బ్యాంకింగ్‌తో పాటు కెనరా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే చెల్లింపులను చేయడానికి వీలుంది. ఈ పరిధిని విస్తరించడం, ఎలక్ట్రానిక్ చెల్లింపులను ప్రోత్సహించడం వంటి పలు సౌకర్యాలపై కసరత్తు చేస్తున్నట్లు మరో అధికారి మీడియాకు చెప్పారు. -
ఫండ్స్ వయా వ్యాలెట్స్!
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఒకప్పుడు కొన్ని రోజులు పట్టే కార్యక్రమం. కానీ, ఇప్పుడు క్షణాల్లోనే ఇన్వెస్ట్ చేసుకునేందుకు డిజిటల్ సాధనాలు ఉన్నాయి. అందులోనూ అరచేతిలోని స్మార్ట్‌ఫోన్ నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టుకునేందుకు వీలు కల్పించే సంస్థలు ఎన్నో పుట్టుకొచ్చాయి. పేటీఎం, మొబిక్విక్, ఈటీమనీతోపాటు ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు సైతం ఫండ్స్‌లో డైరెక్ట్ ప్లాన్లను ప్రత్యేక యాప్ ద్వారా ఆఫర్ చేస్తున్నాయి. ఇన్వెస్టర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లో సంబంధిత యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని, కేవైసీ, బ్యాంకు ఖాతా వివరాలు ఇస్తే చాలు... ఎప్పుడంటే అప్పుడు ఇన్వెస్ట్మెంట్, ఉపసంహరణలను ఎంతో సులభం. ఫండ్స్‌లో పెట్టుబడులకు ఈ సాధనాలు దోహదపడతాయని పలువురు భావిస్తున్నారు. అలాగే, కొత్తగా ఫండ్స్ వైపు అడుగులు వేసే వారు అవగాహన లేకుండా వ్యవహరిస్తే వీటితో నష్టాలూ ఉన్నాయంటున్నారు. మొబైల్ నుంచే చిటికెలో పెట్టుబడికి వీలు కల్పిస్తున్న ఈ యాప్స్ వల్ల లాభ, నష్టాలపై నిపుణుల అభిప్రాయాలను అందించే కథనమే ఇది. పేటీఎం, మొబిక్విక్, ఈటీమనీ వంటివి ఎటువంటి చార్జీల్లేకుండానే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతిస్తున్నాయి. పేటీఎంను 30 కోట్లకు పైగా కస్టమర్లు ఉపయోగిస్తుంటే, మొబిక్విక్ను 10.7 కోట్ల మంది వినియోగిస్తున్నారు. అంటే ఈ రెండు మొబైల్ వ్యాలెట్ల యూజర్లు కలిపితే 40 కోట్లకు పైనే ఉన్నారు. వీరందరికీ తమ వ్యాలెట్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం అందుబాటులో ఉన్నట్టే. మన దేశంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టుకునే అవగాహన ఈ మధ్య కాలంలోనే విస్తృతమైంది. ఇప్పుడు మొబైల్ యాప్స్ రాకతో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు మరింత పెరిగేందుకు దోహద పడనుంది. దీంతో ఇప్పటి వరకు నిదానంగా ఉన్న మ్యూచువల్ ఫండ్స్ విస్తరణ వేగాన్ని పుంజుకోనుంది. తమ మొబైల్ వ్యాలెట్ల నుంచే నచ్చిన మ్యూచువల్ ఫండ్ పథకం డైరెక్ట్ ప్లాన్‌లో రూ.100 నుంచీ పెట్టుబడి పెట్టుకునేందుకు అవకాశం ఉంది. పేటీఎం సంస్థ 2018 సెప్టెంబర్‌లో పేటీఎం మనీ యాప్‌ను తీసుకొచ్చింది. ఆరు నెలలు నిండకుండానే పేటీఎం మనీ యాప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య కోటి దాటినట్టు పేటీఎం ప్రకటించింది. పేటీఎం తొలుత వ్యాలెట్ల నుంచి కొనుగోళ్లకు అవకాశం కల్పించింది. విక్రయించినప్పుడు ఆ మొత్తాన్ని యూజర్ బ్యాంకు ఖాతాకు జమ చేసేది. అయితే, పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఖాతాను ప్రైమరీ బ్యాంకు ఖాతాగా పేటీఎం మనీలో ఇచ్చుకునే అవకాశం కల్పించింది. దీంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఖాతా ద్వారా పెట్టుబడులు, విక్రయించినప్పుడు అదే ఖాతాకు జమ చేసేందుకు అవకాశం వచ్చింది. అలాగే ఇతర బ్యాంకు ఖాతాలను సైతం ప్రైమరీ ఖాతాగా సెట్ చేసుకోవచ్చు. అలాగే, యూజర్లు నమోదు చేసిన బ్యాంకు ఖాతాకు సంబంధించి యూపీఏ, నెట్ బ్యాంకింగ్, డెబిట్‌కార్డుల ద్వారానూ చెల్లింపులు చేయవచ్చు. ఇక మొబిక్విక్ 2018 అక్టోబర్‌లో క్లియర్ఫండ్స్ను కొనుగోలు చేయడం ద్వారా వెల్త్ మేనేజ్మెంట్ (సంపద నిర్వహణ) వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఈ కొనుగోలు తర్వాత తన యూజర్లకు నేరుగా మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేసుకునే సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈటీమనీ, కార్వీకి చెందిన కేఫిన్కార్ట్, జీరోదా కాయిన్ ఇలా ఎన్నో సంస్థలు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. పదుల సంఖ్యలో సంస్థలు రావడంతో కొత్త ఇన్వెస్టర్లను సొంతం చేసుకుని, వారితో తమ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఇన్వెస్ట్ చేయించేందుకు ఇవి ఉచిత సేవలతోపాటు ప్రచారం కోసం నిధులను ఖర్చు చేస్తున్నాయి. సులభంగా ఇన్వెస్ట్ చేసుకునే సదుపాయాలు బాగానే ఉన్నాయి... కానీ, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు అంటే రిస్క్‌తో కూడుకున్నవే. ముఖ్యంగా ఈక్విటీ పథకాల్లో రిస్క్ అధికంగా ఉంటుంది. డెట్ పథకాల్లో రిస్క్ తక్కువ. మరి ఎంచుకునే పథకాలు తమ రిస్క్ ప్రొఫైల్‌కు సరిపోయేవేనా?, తాము ఆశించిన మేర పెట్టుబడులను ఇచ్చేవేనా? అన్న అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టి పెడుతున్నారా? అన్న సందేహం నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. వరమే... సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లేదా పెట్టుబడికి వీలు కల్పించే నూతన విధానాలు ఏవైనా సరే... ఇన్వెస్టర్లకు మరింత సులభతరం లేదా లాభదాయకం ఉంటే అది నిజంగానే మంచి ఆలోచనే అవుతుంది. దేశంలో మిలీనియల్స్‌కు వ్యాలెట్లు ఎంతో అనకూలమైనవిగా రుజువైంది. చిన్న వయసులోనే పెట్టుబడుల అలవాటును నేర్పించి, మిలీనియల్స్ మార్కెట్‌ను చేరుకునే మార్గం కోసం మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ ఇంత కాలం ఎదురు చూస్తోంది. వ్యాలెట్ల ద్వారా పెట్టుబడులకు వీలు కల్పించడం తదుపరి తరం ఇన్వెస్టర్లకు చేరువగా మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వెళ్లడమే. యువ ఇన్వెస్టర్లకు ఇది చిన్న వయసులోనే పెట్టుబడులు ఆరంభించేందుకు సౌకర్యంగా ఉంటుంది. అయితే, ఇన్వెస్టర్లు ముందుగా పెట్టుబడుల ప్రక్రియ, సంబంధిత సాధనాల గురించి పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఇన్వెస్టర్లకు అసలైన ప్రయోజనాలు లభిస్తాయి. – శ్రీకాంత్ మీనాక్షి, ఫండ్స్ ఇండియా సహ వ్యవస్థాపకులు నిపుణుల సలహాలతో చేస్తే లాభమే.. మొబైల్ ఫోన్లకు అతుక్కునిపోయే మిలీనియల్స్, ఓలా, స్విగ్గీ, బుక్‌మైషో తదితర వాటిని వినియోగించే వారు... మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు మొబైల్ వ్యాలెట్లను వినియోగిస్తున్నారు. అధిక రాబడులు లేదా పెట్టుబడులకు సౌకర్యంగా ఉందని వ్యాలెట్ల ద్వారా చేస్తున్నారు. తప్పుడు సలహాలు, బ్యాంకులు, ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్ల సరిపడని సూచనలతో గతంలో చేతులు కాల్చుకున్న రిటైల్ ఇన్వెస్టర్లు కూడా... పారదర్శకత ఉందని, స్వీయ నియంత్రణ ఉంటుందని చెప్పి కొనుగోలు చేస్తుండొచ్చు. మొబైల్ వ్యాలెట్ల ద్వారా అయితే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వేగంగా రిడీమ్ చేసుకోవచ్చు. లేదా అస్థిర మార్కెట్లలో అవగాహన లేమితో సిప్‌లను ఆపివేయవచ్చు. కేవలం వ్యయాలు, సౌకర్యం అని కాకుండా, మొబైల్ వ్యాలెట్ల పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్ల అనుభవమే ఈ విధానం విజయవంతం అవుతుందా, లేదా అన్నది నిర్ణయిస్తుంది. అయితే, ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక సలహాదారు సూచనలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో సలహాలు తీసుకుని ఆ తర్వాతే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. – సాధిక్ నీల్గుండ్, నెట్వర్క్ ఎఫ్పీ వ్యవస్థాపకులు అనుకూలమే... 130 కోట్ల దేశ జనాభాకు సుమారు నాలుగు కోట్ల మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు మాత్రమే ఉన్నాయి. వీటిల్లో ఒక ఇన్వెస్టర్‌కు ఉన్న ఒకటికి మించిన ఫోలియోలను తీసివేసి చూస్తే ఇందులో సగం తగ్గిపోతాయి. సంప్రదాయకంగా మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు బ్యాంకు ఖాతాల నుంచే ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. వ్యాలెట్ల కారణంగా చెల్లింపుల పరిశ్రమలో చోటు చేసుకున్న విస్తరణను గమనించే సెబీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను వ్యాలెట్ల ద్వారా అనుమతించింది. అయితే, వీటి వల్ల ఏ మేరకు ప్రయోజనాలు కలుగుతాయన్నది చూడాల్సి ఉంది. 2017 మే 8 నాటి సెబీ ఉత్తర్వుల ప్రకారం... యూజర్లు మొబైల్ వ్యాలెట్లలో లోడ్ చేసుకున్న డబ్బులను మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు వినియోగించుకోవచ్చు. దీంతో ఈ వ్యాలెట్లు వినియోగానికి సౌకర్యంగా ఉండడమే కాదు, మార్కెట్ విస్తరణకు ఎంతో దోహదం చేస్తాయి. నూతన తరం డిజిటల్ సాధనాల యూజర్లు పొదుపు చేసుకునేందుకు, నిపుణుల ఆధ్వర్యంలో నడిచే మెరుగైన మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు వీలు కలుగుతుంది. అయితే, నియంత్రణలు సరళీకరించినప్పుడే అది సాధ్యపడుతుంది. వ్యాలెట్లకు లోడ్ చేసుకున్న డబ్బులకు మూలం ఏంటన్నది గుర్తించే యంత్రాంగాన్ని ఏర్పాటు రూపంలో సవాలు ఒకటి ఉంది. ఏ వ్యాలెట్ కంపెనీ కూడా యూజర్ల డబ్బుల సోర్స్‌ను (అది సంబంధిత యూజర్ బ్యాంకు ఖాతా నుంచే జమ అవుతుందా? లేదా? అన్నది) గుర్తించే వ్యవస్థను కలిగి లేదు. – సమీత్ సిక్కా, ఎస్క్యూఆర్ఆర్ఎల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సేవింగ్స్ యాప్ అనుకూలం కాదు... మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు మొబైల్ వ్యాలెట్లను సూచించడం తగదు. మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఎన్నో మార్పులు, పునర్వ్యవస్థీకరణకు లోనయ్యాయి. అవగాహన ఉన్న ఇన్వెస్టర్లకు సైతం అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీలు) చేసిన మార్పులను అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. కనుక కొత్త ఇన్వెస్టర్లు తమ రిస్క్ సామర్థ్యం, లక్ష్యాలకు సరిపోయే సరైన పథకాన్ని మొబైల్ వ్యాలెట్ల ద్వారా ఎంచుకోవడం ఓ సవాలే అవుతుంది. సినిమా టికెట్లు లేదా ప్రయాణ టికెట్లు బుక్ చేసుకునేందుకు, యుటిలిటీ బిల్లుల చెల్లింపునకు మొబైల్ వ్యాలెట్ల వినియోగం వేగవంతం అయింది. కానీ, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు మొబైల్ వ్యాలెట్ల వినియోగం సున్నితమైన విషయం. మొబైల్ వ్యాలెట్ల ద్వారా పెట్టుబడులు పెట్టే ప్రక్రియ, పోర్ట్‌ఫోలియో పర్యవేక్షణ విషయమై స్పష్టత లేదు. మరింత సులభతర, నిర్మాణాత్మక ప్రక్రియలతో ఉండే పెట్టుబడి ప్లాట్‌ఫామ్‌లు ఎంచుకోవడం నయం. పోర్ట్‌ఫోలియోను పర్యవేక్షిస్తూ లాభ, నష్టాల గురించి తెలియజేసే ఆర్థిక నిపుణుల సాయం, మార్గదర్శకంతోనే ఇన్వెస్ట్ చేయాలన్నది మా సూచన. వ్యాలెట్లకు బదులు... నేరుగా మ్యూచువల్ ఫండ్స్ సంస్థల ద్వారా లేదా ఆర్థిక సలహాదారులు సూచించిన పథకాల్లో నేరుగా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. – కల్పేష్ ఆషర్, ఫుల్ సర్కిల్ ఫైనాన్షియల్ ప్లానర్స్ వ్యవస్థాపకుడు -
ఈ-వాలెట్స్కి పేటీఎం ఇన్సూరెన్స్
మొబైల్ వాలెట్లలో నగదును దాచుకునేందుకు భయాందోళనలు వ్యక్తంచేసే వినియోగదారుల కోసం ఆన్ లైన్ మార్కెట్ దిగ్గజం పేటీఎం సరికొత్త సేవలందించేందుకు సిద్దమైంది. తమ ఈ-వాలెట్లో దాచుకునే నగదుకు ఇన్సూరెన్స్ అందిస్తామని పేర్కొంది. మోసపూరిత లావాదేవీలతో వాలెట్లోని నగదు దొంగతనానికి గురైనా, నష్టం ఏర్పడినా యూజర్లకు ఆ నగదును రీఫండ్ చేస్తామని తెలిపింది. ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం ఎలాంటి అదనపు ఖర్చులుండవని వెల్లడించింది. సైబర్ దొంగతనాలు ఎక్కువవుతున్న క్రమంలో ఈ-వాలెట్, ఇన్సూరెన్స్ కంపెనీలు జతకలిసి పనిచేయాలని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ మేరకు ఈ-వాలెట్ సంస్థలు తమ యూజర్లకు ఇన్సూరెన్స్ కవరేజ్ ను అందిస్తున్నాయి. రూ.20వేల వరకు వాలెట్ బ్యాలెన్స్ ఉండే కస్టమర్లందరికీ ఇన్సూరెన్స్ అందిస్తామని కంపెనీ పేర్కొంది. ఫోన్ పోగొట్టుకున్నా లేదా దొంగతనానికి గురైనా కస్టమర్లు 12 గంటల లోపల ఈ-మెయిల్ ద్వారా లేదా కస్టమర్ కేర్ కు కాల్ చేసైనా కంపెనీకి రిపోర్టు చేయాలని పేటీఎం సూచించింది. ఐటీ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవలే బ్యాంకర్లు, మొబైల్ వాలెట్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ లతో భేటీ అయి, డిజిటల్ లావాదేవీల ఎలా సురక్షితంగా ఉంచాలి అనే అంశంపై చర్చించారు. డిజిటల్ లావాదేవీల సురక్షితంలో ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంతో కీలకమని ఓ సీనియర్ ప్రభుత్వాధికారి చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అంతకముందే లక్షల కొలదీ డెబిట్, క్రెడిట్ కార్డుల చోరి ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో డిజిటల్ లావాదేవీల భద్రత ప్రస్తుతం అతిపెద్ద సవాల్ గా మారింది.