breaking news
mlas salaries
-
మహారాష్ట్ర ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు
ముంబయి: రాష్ట్ర ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జీతాలను మహారాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జీతాలను దాదాపు 166 శాతం పెంచుతూ మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రూ. 75 వేలు ఉన్న శాసనసభ్యుల జీతాలను రూ.2 లక్షలకు పెంచుతూ దేవెంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాల పెంపు బిల్లును శుక్రవారం అసెంబ్లీ, శాసనమండలిలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఉభయసభలలో ఈ బిల్లు పాస్ కావడంతో జీతాల పెంపు వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. -
ఎమ్మెల్యేల జీతాలు పెంచారు..రైతులేం పాపం చేశారు?
♦ కరువుపై చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి ప్రశ్న ♦ రైతు పెట్టుబడి 300 శాతం పెరిగింది మద్దతు ధర పదేళ్ల క్రితందే ♦ ముఖ్యమంత్రి కేసీఆర్ అల్లంతోట ఎండిపోతే బాధపడ్డారట ♦ మరి సన్న, చిన్నకారు రైతుల పరిస్థితి ఏమిటని నిలదీత సాక్షి, హైదరాబాద్: ‘ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికుల జీతభత్యాలు పెంచారు. అడిగిన దానికన్నా పీఆర్సీ ఎక్కువిచ్చి సంతృప్తి పరిచారు. చివరికి ఎమ్మెల్యేల జీతాలు కూడా పెంచారు.. కానీ రైతులేం పాపం చేశారు. వారు పండించిన పంటకు మద్దతు ధర లేదు. కనీస మద్దతు ధర పదేళ్ల క్రితం నాటిదే ఇప్పుడూ ఉంది. రైతు పెట్టుబడి మాత్రం 300 శాతం పెరిగింది. అందుకే రైతుకు మద్దతు ధర ఏటా కనీసం 10 శాతం పెంచాలి. రైతు లేకుండా అన్నం దొరకదు. ఆ విషయాన్ని పాలకులు గుర్తించాలి’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. శాసనసభలో కరువుపై ప్రత్యేక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని వివరించారు. ‘ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది ప్రతీ ఎండాకాలంలో వచ్చే కరువు కాదు. గతంలో రాంరెడ్డి అనే రైతు 56 బోర్లు వేస్తే ఒక్కదాంట్లో నీళ్లు రాలేదని సీఎం చెప్పారు. కానీ నల్లగొండలో వందలాది మంది రాంరెడ్డిలున్నారు. ముఖ్యమంత్రి అల్లంతోట ఎండిపోతే బాధపడ్డారని పత్రికల్లో చూశా. మరి సన్న, చిన్నకారు రైతుల పరిస్థితి ఏంటి? కరువు ఇప్పుడుంటే తాత్కాలిక చర్యలు చేపట్టకుండా 5 ఏళ్ల తరువాతే తమ బాధ్యత అన్నట్లుగా ప్రవర్తించడం శోచనీయం’ అన్నారు. ‘మాట్లాడితే 60 ఏళ్ల కరువుకు మీరే బాధ్యులు అని కాంగ్రెస్‌ను వేలెత్తి చూపుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఇతర సాగునీటి ప్రాజెక్టులు ఎవరు కట్టారు. రైతులు ఇప్పటి వరకు వ్యవసాయం చేసుకోలేదా? మీరు అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది. చివరి సంవత్సరంలో ఎన్నికలే ఉంటాయి. మిగిలింది ఇంకా రెండేళ్లే. ఇంకా 60 ఏళ్ల పాలన, సమైక్యపాలన అంటే ప్రజలు క్షమించరు’ అని వ్యాఖ్యానించారు. కరువు ప్రాంత రైతులకు మధ్యాహ్న భోజనం అందించాలి రాష్ట్రంలో కరువు కరాళనృత్యం చేస్తున్నందున రైతులు, రైతు కూలీలను ఆదుకొనేందుకు గ్రామాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టాలి. కరువు మండలాలుగా కేంద్రం 231నే గుర్తించినందున వాటి సంఖ్యను పెంచి, కరువు సాయం అందించేందుకు తోడ్పడాలి. ఖరీఫ్‌కు ముందే ఇన్పుట్ సబ్సిడీని అందించి రైతులకు సాయపడాలి. కరువు ప్రాంత గ్రామాల్లో ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలకు ప్రభుత్వమే ఫీజులు చెల్లించాలి. కరెంటు బిల్లులతో పాటు రైతులు, రైతు కూలీలు చెల్లించాల్సిన అన్ని బిల్లులను మాఫీ చేయాలి. రాష్ట్రంలో పత్తి, వరి, మొక్కజొన్న, సోయాబీన్ పంటలు పూర్తిగా నష్టపోయిన ప్రాంతాల రైతులకు అండగా నిలవాలి. కరువు సాయంగా రూ. 3,064 కోట్లు కావాలని కేంద్రానికి రాస్తే రూ. 56.03 కోట్లు మాత్రమే మంజూరయింది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు మంజూరు చేయించాలి. - పాయం వెంకటేశ్వర్లు (వైఎస్ఆర్సీపీ) రుణఅర్హత కార్డులు ఇవ్వాలి కరువు నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకొని ఉంటే సమస్య తీవ్రత తగ్గేది. గోదావరి, కృష్ణాల నుంచి లిఫ్ట్‌ల ద్వారా నీటిని తీసుకుంటే ఉపయోగం ఉండేది. రైతులతో పాటు పంటకౌలు మీద ఆధారపడ్డ 14లక్షల మంది రైతుకూలీలు కూడా తీవ్రంగా నష్టపోయారు. రైతులకు రుణఅర్హత కార్డులు ఇవ్వాలి. మిశ్రమ దాణాను పశువులకు అందించే ఏర్పాట్లు చేయాలి. - సున్నం రాజయ్య (సీపీఎం) ఆ విధానమే లోపభూయిష్టం కరువు మండలాలుగా గుర్తించేందుకు సర్కార్ అనుసరిస్తున్న విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. ఓ రైతు పొలంలో వర్షం పడితే పక్క రైతు పొలంలో ఎండకాసే పరిస్థితుల్లో మండలాలను యూనిట్‌గా తీసుకొని రెయిన్‌గేజ్‌లు ఏర్పాటు చేశారు. మండలం మధ్యలో ఉండే గ్రామంలో రెయిన్‌గేజ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. తెలంగాణ మొత్తాన్ని కరువు రాష్ట్రంగా ప్రకటించాలి. - రవీంద్రకుమార్ (సీపీఐ) గత పాలకులదే తప్పు ‘పల్లెపల్లెన పల్లేర్లు మొలిచే పాలమూరులోన... నా తెలంగాణలోన ’ అని 15 సంవత్సరాల క్రితం పాడినం. అనావృష్టి కొత్తది కాదు. అప్పుడే సమస్యను పరిష్కరించుకుంటే ఇలా మాట్లాడే అవసరం రాకపోను. రాష్ట్రంలో 16 వేల పెద్ద చెరువులు, 50 వేల చిన్న చెరువులు ఉండేవి. ఇప్పుడు 11వేల చెరువులు కనిపించకుండా పోయాయి. - రసమయి బాలకిషన్ (టీఆర్ఎస్) -
పెరగనున్న ఎమ్మెల్యేల జీతాలు
ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలు త్వరలోనే పెరగనున్నాయి. ప్రస్తుతం రూ. 95 వేల వరకు ఉన్న జీతం దాదాపు రూ. 1.50 లక్షల వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. హెచ్ఆర్ఏ రూ. 50 వేలకు, కారు రుణం రూ. 40 లక్షలకు పెంచాలని ప్రతిపాదనలు వచ్చాయి. వీటిని ప్రభుత్వం ఆమోదిస్తే త్వరలోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీత భత్యాలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.