breaking news
MLA Thota Trimurthulu
-
తప్పుదోవపడుతున్న శిరోముండనం కేసు
ద్రాక్షారామ (రామచంద్రపురం రూరల్): రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెంకటాయపాలెం దళితుల శిరోముండనం కేసులో ప్రధాన ముద్దాయి, అధికార పార్టీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కేసు నుంచి బయట పడడానికి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని జిల్లాలోని 18 దళిత, ప్రజా సంఘాలకు చెందిన నాయకులు స్పష్టం చేశారు. బాధితులు ఎస్సీ కులానికి చెందినవారు కాదని, క్రైస్తవులుగా చిత్రించి, వారికి బీసీ సీ గా గుర్తించేలా చేయాలని చూస్తున్నారని ఆ సంఘాల నాయకులు ఆరోపించారు. నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడిన వారు విచారణ చేసి తమ నివేదికను ద్రాక్షారామలో గుర్రాల పరంజ్యోతి స్మారక గ్రంథాలయం వద్ద శుక్రవారం పత్రికలకు విడుదల చేశారు. బాధితులైన కోటి చినరాజు, దడాల వెంకటరత్నం కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని కోర్టు ఆదేశించిందన్నా రు. దీంతో మనుగడలో లేని ఒక పాస్టర్ ద్వారా బాధితులు బాప్తిజం తీసుకుని క్రైస్తవ మతం స్వీకరించారని, గ్రామంలోని కొందరితో క్రైస్తవులని చెప్పించారని, ఆ గ్రామంలో ఎటువంటి విచారణ చేయకుండానే స్థానిక తహసీల్దార్, ఆర్డీఓల చేత జాయింట్ కలెక్టర్‌కు గతంలో బాధితులు మోసం చేసి ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నట్లుగా నివేదిక ఇప్పించారని విచారణలో తేలిందన్నారు. అధికారులను పావులుగా వాడుకుని కేసు నుంచి బయట పడాలని చూస్తున్న ఎమ్మెల్యే తోట త్రిమూర్తులును ప్రభుత్వం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, ఎమ్మెల్యేకు తొత్తులుగా వ్యవహరించిన తహసీల్దార్, ఆర్డీఓలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకు సహకరించిన నకిలీ పాస్టరు ఎన్.సామ్యూల్, కాలకుర్చ జీవరత్నం, పువ్వుల వెంకటరమణ, కనికెల్ల గణపతి, గొల్ల సాల్మన్ రాజుపై చీటింగ్ కేసు నమోదు చేసి, వారిని అరెస్ట్ చేయాలన్నారు. మొత్తం వ్యవహారంపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేయాలని నిజ నిర్ధారణ కమిటీ డిమాండ్ చేసింది. పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు జిల్లెల్ల మనోహర్, ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సిద్దాంతుల కొండబాబు, భారత కార్మిక సంఘాల సమైఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు చీకట్ల వెంకటేశ్వరరావు, రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చా నాగయ్య, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.తిరుపతిరావు, దళిత సంఘం జిల్లా నాయకుడు దళిత బహుజన మహిళా శక్తి జాతీయ కన్వీనర్ కొంకి రాజామణి, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు జనిపల్లి సత్తిబాబు, మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాసరావు, మాదిగ దండోరా జిల్లా ఉపాధ్యక్షుడు మందపల్లి చిట్టిబాబు, చైతన్య మహిళా సంఘం జిల్లా కార్యదర్శి జి.రమ, పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆర్.రాఘవులు, కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కోనాల లాజర్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర నాయకుడు దమ్ము కృష్ణరాజు, దళిత ఐక్య పోరాట వేదిక కన్వీనర్ వెంటపల్లి భీమశంకరం, జై భీం దళిత సేవా సంఘం అధ్యక్షుడు గుబ్బల శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ఆశించాను కానీ... మంత్రి పదవి దక్కలేదు
సాక్షి, కాకినాడ : ‘‘చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి వస్తుందని నాతో పాటు నా కేడర్, నియోజకవర్గ ప్రజలు ఎంతగానో ఆశించారు. ఆ ఆశ నిరాశైంది. ఆ అసంతృప్తితోనే ప్రమాణస్వీకారానికి వెళ్లకుండా వెనక్కి వచ్చేశాను’’ అని రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అన్నారు. మంత్రి పదవి రాలేదని తాను ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. తాను టీడీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సోమవారం కాకినాడలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు... నాలుగు సార్లు గెలిచినా... ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు నాయకత్వాన్ని ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారని, ఇవాళ కాకపోయనా, రేపైనా తనకు తగిన గుర్తింపు లభిస్తుందని పార్టీ కేడర్‌కు నచ్చజెప్పానన్నారు. ‘పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో తాను ఆరుసార్లు తలపడితే బోసు గెలుపొందిన రెండు సార్లూ ఆయనకు కేబినెట్లో చోటుదక్కిందని, తాను నాలుగు సార్లు గెలుపొందినా మంత్రి పదవి లభించకపోవడం అసంతృప్తిమిగిల్చిందన్నారు. అవకాశం ఇవ్వమని కోరతా... మంత్రివర్గ విస్తరణలోనైనా తనకు అవకాశం కల్పించాలని బాబును కోరతాన్నారు. జిల్లాలో ఎస్సీలకు రిజర్వైన అమలాపురం ఎంపీతో సహా మూడు అసెంబ్లీ నియోజక వర్గాల ప్రజలు టీడీపీకీ పట్టంకట్టినా కేబినెట్లో వారికి కనీస ప్రాతినిధ్యం కల్పించకపోవడం ఆ సామాజిక వర్గీయుల్లోనూ అసంతృప్తిని రగిల్చిందన్నారు. త్వరలోనే వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. రుణమాఫీపై విధివిధానాలు రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకే కమిటీ వేశారన్నారు. కాపులను బీసీల్లో చేర్చే విషయంలో చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని విశ్వసిస్తున్నట్టు చెప్పారు.