breaking news
mla satya prabha
-
అధికార పార్టీలో ఐటీ దాడుల ప్రకంపనలు
చిత్తూరు: చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభకు చెందిన సంస్థలు, ఇళ్లలో జరిగిన ఐటీ దాడుల్లో సుమారు రూ.43 కోట్ల లెక్కల్లో చూపని నగదు స్వాధీనం చేసుకున్నారన్న సమాచారం రాజకీయవర్గాల్లో సంచలనమైంది. వీటితో పాటు సుమారు రూ.267 కోట్లు విలువ చేసే ఆస్తులు స్వాధీనం చేసుకున్నామని ఆదాయపు పన్ను శాఖ అధికారులు బెంగళూరులో తెలిపారు. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు టోపీపెట్టి దేశం నుంచి పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌మాల్యా వ్యవహారాల గురించి దర్యాప్తు చేస్తున్న అధికారులే సత్యప్రభ సంస్థలపై దాడులు జరపడంతో టీడీపీ నేతలు కలవరపాటుకు గురవుతున్నారు. విజయ్ మాల్యా కుటుంబానికీ.. డీఏ సత్యప్రభ కుటుంబానికీ అత్యంత సాన్నిహిత్యం ఉండటంతో ఆయన ఆస్తుల్లో చాలా భాగం సత్యప్రభ కుటుంబం పేరుతో బదలాయించారనే ఆరోపణలు రావడంతోనే ఆదాయపుపన్ను అధికారులు దాడులు నిర్వహించారని సమాచారం. రూ.267 కోట్లకు లెక్కలు చూపాలని సత్యప్రభకు ఐటీ అధికారులు తాఖీదులు ఇచ్చారు. టీడీపీని కలవరపెడుతున్న ఐటీ దాడులు.. అధికార టీడీపీని ఐటీ దాడులు కలవర పెడుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లు, సంస్థల్లో సోదాలు నిర్వహించడంతో వారు కక్కలేక మింగలేక వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడే ఐటీ దాడులు జరగడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అవినీతిపై ప్రతిపక్షాలను దుమ్మెత్తిపోస్తున్న దశలో టీడీపీలోనే అవినీతి చేపలు ఆదాయపన్ను అధికారులకు అడ్డంగా దొరికిపోవడంతో ఆ పార్టీ గుండెల్లో పచ్చివెలక్కాయ పడ్డట్టయింది. -
పచ్చ నేతలకు మేత
సాక్షి, చిత్తూరు : చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ కోసం నీరు-చెట్టు కింద నగర పరిధిలోని కాజూరు చెరువుకు ప్రభుత్వం రూ.9 లక్షలు మంజూరు చేసింది. ఈ పనులు సాక్షాత్తు చిత్తూరు ఎమ్మెల్యే అనుచరుల ఆధ్వర్యంలోనే జరిగాయి. పలమనేరు రోడ్డులోని నీవానది ఆనుకుని ఉన్న తన పొలాన్ని చదును చేసుకునేందుకు నీరు-చెట్టు పథకాన్ని ఆమె ఉపయోగించుకున్నారు. చెరువు మట్టిని ఏ ఒక్క రైతుకు ఇవ్వకుండానే ఎమ్మెల్యే సొంత పొలాన్ని లెవెల్ చేసుకునేందుకే వాడారు. ఆ పొలంలో గతంలో లిక్కర్ ఫ్యాక్టరీ వ్యర్థాలను తోలారు. ఇప్పుడు వాటిని కనిపించకుండా భూమిని లెవెల్ చేసి కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే వినియోగించనున్నట్లు సమాచారం. పదుల ఎకరాల్లో ఉన్న ఆ పొలాన్ని సొంతంగా లెవెల్ చేయాలంటే లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంది. కానీ నీరు-చెట్టు మాటున ఎమ్మెల్యే తన సొంత పొలాన్ని పైసా ఖర్చు లేకుండా చదును చేసుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వం నీరు- చెట్టు పేరుతో రూ.9 లక్షలు మంజూరు చేసింది. మొత్తంగా నీరు-చెట్టు కార్యక్రమం సాక్షాత్తు ఎమ్మెల్యే సొంతానికి ఉపయోగపడింది. ఐరాాల మండలం పందికొట్టూరు చెరువు కోసం నీరు-చెట్టు పేరుతో ప్రభుత్వం రూ.2 లక్షలు మంజూరు చేసింది. చెరువును ఆధునీకరించాల్సిన అధికార పార్టీ నేత ఆ పనులను పక్కన పెట్టి చెరువులో ఉపాధి పనుల్లో భాగంగా తీసిన పాత గుంతలపై జేసీబీలతో నగిషీలు చెక్కి బిల్లులు చేసుకున్నారు. ఇదే మండలం కలికిరిపల్లె గ్రామచెరువులో అధికార పార్టీ నేతలు మొక్కుబడిగా పనులు చేసి నీరు-చెట్టు నిధులను మింగినట్లు ఆరోపణలున్నాయి. పుంగనూరు మండలం గుర్రపల్లె కొత్తచెరువు నీరు-చెట్టు పనుల్లో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ సాక్షాత్తు అధికారపార్టీకి చెందిన ఎంపీటీసీల సంఘం జిల్లా కార్యదర్శి కేశవరెడ్డి పనులను రెండు రోజుల క్రితం అడ్డుకోవడం తెలిసిందే. ఇటీవలే అదే చెరువులో రూ.20 లక్షలు ఉపాధి పనులు చేశారు. తాజాగా నీరు-చెట్టు కింద రూ.6 లక్షల పనులు చేపట్టారు. రూ.6 లక్షలు స్వాహా చేసేందుకు పాత పనులపైనే మళ్లీ పని చేస్తుండడంతో ఆగ్రహించిన కేశవరెడ్డి పనులను అడ్డుకున్నారు. నీరు-చెట్టులో అక్రమాలు జరుగుతున్నాయంటూ సాక్షాత్తు టీడీపీ నేతలే ఆరోపిస్తుండడం గమనార్హం. జిల్లావ్యాప్తంగా 2015-16 ఏడాదికి గాను నీరు-చెట్టు కింద ప్రభుత్వం 17,677 పనులను మంజూరు చేసింది. ఇందుకు గాను రూ.412.48 కోట్లు ఖర్చుచేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పటివరకు 13,990 పనులను ప్రారంభించగా, 8866 పనులు పూర్తిచేసినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకోసం రూ.124.19 కోట్లు వెచ్చించారు. మరో 5,124 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. జిల్లాలో పుంగనూరు, పీలేరు, పలమనేరు, పూతలపట్టు, చిత్తూరుతోపాటు దాదాపు అన్ని నియోజకవర్గాల పరిధిలో నీరు-చెట్టులో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. పచ్చ నేతలకు నీరు-చెట్టు ఆదాయ వనరుగా మారడంతో అందిన కాడికి దండుకుంటున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో అధికార పార్టీ నేతల జోలికి వెళ్లేందుకు అధికారులు సాహసించడం లేదు. పనులు బాగా లేవంటే బదిలీ వేటు తప్పదని, అలాంటప్పుడు ఊరకుండడమే ఉత్తమమని చాలా మంది అధికారులు ఆ వైపు చూడడం లేదు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు ఖర్చు చేసిన రూ.124.19 కోట్లల్లో 70 శాతం నిధులు స్వాహా అయినట్లు తెలుస్తోంది.