breaking news
MLA redyanayak
-
నాకు..నా బిడ్డకు టిక్కెట్లు!
సాక్షి, మహబూబాబాద్: వచ్చే ఎన్నికల్లో తనకు, తన కూతురు, మాజీ ఎమ్మెల్యే కవితకు టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్లు ఇస్తామని హామీ ఇచ్చిందని డోర్నకల్ ఎమ్మె ల్యే రెడ్యానాయక్ చేసిన వ్యాఖ్యలు జిల్లాలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రెడ్యా వ్యాఖ్యల అంతరార్థం ఏమిటో తెలియక శ్రేణులన్నీ ఆలోచనల్లో తలమునకలయ్యాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రెడ్యానాయక్, ఆయన కూతురు మాలోతు కవిత పోటీచేశారు. రెడ్యానాయక్ టీఆర్ఎస్ అభ్యర్థి సత్యవతి రాథోడ్‌పై గెలిచి, ఆతర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కవిత టీఆర్ఎస్ అభ్యర్థి శంకర్‌నాయక్ చేతిలో ఓడిపోయి, ఆ తర్వాత గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అయినా ఎమ్మెల్యేతో కలిసి ఏ కార్యక్రమాల్లో పాల్గొనకుండా, నియోజకవర్గంలోనే పర్యటిస్తూ తన అనుచరులకు, కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో సత్యవతిరాథోడ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ నేపథ్యంలో 2019లో జరిగే ఎన్నికలను టార్గెట్‌గా చేసుకొని వారు పావులు కదుపుతున్నారు. రెండు నియోజకవర్గాల్లోనూ గెలిచిన, ఓడిన అభ్యర్థులు అధికార పార్టీలోనే ఉన్నప్పటికీ ఉప్పు, నిప్పులా వ్యవహరిస్తున్నారు. ఇరువర్గాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో పనిచేస్తూ వస్తున్నారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు అంటూ సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. తాజాగా సిట్టింగ్‌లకు మూడు నెలలు ముందుగానే టిక్కెట్లు ఇచ్చి నియోజకవర్గాలకు పంపుతానని ఆయన చెప్పారు. సీఎం కేసీఆ ర్ పదేపదే ఇలా చెప్పడంతో ఆశావహులు సీఎం వ్యా ఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తికమకపడుతున్నారు. ఇటీవల రాష్ట్ర కమిటీలో పలువురికి పదవులను కట్టబెట్టారు. ఇందులో భాగంగా డోర్నకల్ టికె ట్ ఆశిస్తున్న సత్యవతిరాథోడ్‌కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి, మహబూబాబాద్‌లో టికెట్ ఆశిస్తున్న కవిత కు రాష్ట్ర కార్యదర్శి పదవి దక్కింది. టిక్కెట్లు సర్థుబాటు చేయలేని వారికే పార్టీ పదవులను ఇచ్చారని కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. అందుకే సత్యవతిరాథోడ్ నియోజకవర్గంలో తిరగడాన్ని తగ్గించుకుందని కూడా చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో సత్యవతి అనుచరులను రెడ్యానాయక్ తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదన కూడా ఉంది. దంతాలపల్లి, నర్సింహులపేట మండలాల్లో రేపో, మాపో సత్యవతి వర్గీయులు రెడ్యా వెంట వెళ్లేందుకు సిద్ధమైనట్టు సమాచారం. కానీ, మహబూబాబాద్ నియోజకవర్గంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రెడ్యానాయక్ కూతురు, మాజీ ఎమ్మెల్యే కవిత నియోజవర్గంలో సిట్టింగు ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు తగ్గకుండా విస్తృతంగా పర్యటిస్తున్నారు. కార్యకర్తలకు, జనానికి ఎమ్మెల్యేతో పోటీపడుతూ పరామర్శిస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేస్తున్నారు. శంకర్‌నాయక్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నాడనే ఆలోచనలో ఉన్న ఆమె తనకే టికెట్టు ఖచ్చితంగా వస్తుందనే భావనలో ఉన్నారు. రెడ్యా వ్యాఖ్యలతో... అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రెడ్యానాయక్ వచ్చే ఎన్నికల్లో ‘నాకు.. నా కూతురుకు టిక్కెట్లు’ అని వ్యాఖ్యలు చేశారు. రెడ్యా వ్యాఖ్యల తీరు, నియోజకవర్గంలో కవిత పర్యటిస్తున్న జోరు చూస్తుంటే డోర్నకల్‌లో రెడ్యానాయక్‌కు, మహబూబాబాద్‌లో కవితకు టిక్కెట్లు వస్తాయనే భావన కలుగుతోంది. కానీ, ఒకే కుటుంబంలో తండ్రీ కూతుళ్లకు టిక్కెట్లు ఇస్తారా? మూడున్నరేళ్ల నుంచి రాష్ట్రంలో అన్ని పార్టీల నుంచి అధికార పార్టీలో చేరిన ఆశావాహుల సంగతేంటి? ఒకే కుటుంబంలో ఇద్దరికీ ఇస్తే రాష్ట్రంలోనూ మరెన్నో కుటుంబాల నుంచి ఈ డిమాండ్ వస్తుందనే చర్చ జరుగుతోంది. రెడ్యానాయక్ ఎంపీగా పోటీచేస్తారని, కవిత డోర్నకల్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని.. అలా రెడ్యానాయక్ రెండు టికెట్లు అని ప్రకటించి ఉంటారని మరో చర్చ వినిపిస్తోంది. అదే నిజమనుకుంటే రెడ్యానాయక్ రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడు రవిచంద్రనాయక్ ఇటీవల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారనే విషయం కూడా ఉంది. అదీకాక రెడ్యానాయక్ వ్యూహాత్మకంగా తన మనస్సులో ఉన్న మాటను అధిష్టానానికి తెలియజేసేందుకు ఈ ప్రకటన చేశారనే వాదన కూడా లేకపోలేదు. మొత్తానికి రెడ్యానాయక్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే శంకర్‌నాయక్ వర్గీయుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. శంకర్‌నాయక్ కూడా ఎంత వరకైనా సరే నియోజకవర్గాన్ని, టిక్కెట్టును వదిలేది లేదనే పట్టుదలగానే ఉన్నట్టు తెలుస్తోంది. సిట్టింగులకే సీట్లన్న సీఎం కేసీఆర్ అభీష్టానికి వ్యతిరేకంగా రెడ్యానాయక్ మాట్లాడటం, కవిత వ్యవహరిస్తుండటం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని శంకర్‌నాయక్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి జిల్లాలో రెడ్యానాయక్ వ్యాఖ్యల అంతరార్థమేమిటో అంతుబట్టక టీఆర్ఎస్ శ్రేణుల్లో, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. -
కమిటీల కొట్లాట
టీఆర్ఎస్లో సంస్థాగత పోరు గ్రామ కమిటీ ఎన్నికల్లో పోటాపోటీ కొత్తవారికి, పాత వారికి మధ్య విభేదాలు పలు గ్రామాల్లో రెండు కమిటీలు డోర్నకల్‌లో ధర్నాకు దిగిన నాయకులు వరంగల్ : తెలంగాణ రాష్ట్ర సమితిలో కొత్త పంచాయతీ మొదలైంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు చేపట్టిన ఎన్నికల ప్రక్రియ నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలను బహిర్గతం చేస్తోంది. ఇన్నాళ్లు సర్దుకుని ఉన్న టీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు పార్టీ పదవుల విషయంలో పోటీ పడుతున్నారు. అధికార పార్టీ కావడంతో పోటీ ఎక్కువగా ఉంటోంది. ఇది సంస్థాగత ఎన్నికల ప్రక్రియకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఒకరి కంటే ఎక్కువ మంది నియోజకవర్గస్థాయి నేతలు ఉన్న నియోజకవర్గాల్లో.. రెండు వర్గాల నేతల పోటీ తీవ్రంగా ఉంటోంది. ఫలితంగా కొన్ని గ్రామాల్లో రెండు కమిటీలు ఏర్పాటవుతున్నాయి. ఇలా పోటాపోటీ కమిటీలతో పార్టీ బలోపేతం కోసం చేపట్టిన సంస్థాగత ప్రక్రియ అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. చాలా మండలాల్లో నాయకుల పోటీ కారణంగా కమిటీల ఏర్పాటు ఏకాభిప్రాయం లేకుండానే జరుగుతోంది. మాకు ఇంకేప్పుడు గుర్తింపు 2001లో ఏర్పాటైన టీఆర్ఎస్ తెలంగాణ ఏర్పాటు తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చింది. పార్టీలో, ఉద్యమంలో మొదటి నుంచి పని చేసిన వారికి తోడు.. గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు అన్ని పార్టీల నేతలు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటికే టీఆర్ఎస్లో ఉన్న నాయకులకు, వీరికి మధ్య అవకాశాల కోసం పోటీ మొదలైంది. ఇన్నాళ్లు ఇది బయటపడలేదు. తాజాగా చేపట్టిన సంస్థాగత ఎన్నికల ప్రక్రియతో పార్టీ పదవుల కోసం ఏకంగా నిరసనలు, ఘర్షణ వరకు దారితీస్తోంది. నియోజకవర్గస్థాయి నేతలు ఇతర పార్టీల వారు వచ్చి చేరిన నియోజకవర్గాల్లో.. మొదటి నుంచి పని చేసిన వారు ప్రస్తుతం అవకాశాల కోసం ఇబ్బంది పడుతున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చినవారు ఇప్పుడు పార్టీ పదవుల కోసం ప్రయత్నిస్తుండడంతో పాత వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీ కోసం పని చేసిన తమకు గుర్తింపు వచ్చేది ఇంకెప్పుడు అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ డోర్నకల్ నియోజకవర్గంలో క్లిష్టంగా మారింది. సాధారణ ఎన్నికల ముందు టీఆర్ఎస్లో చేరిన సత్యవతి రాథోడ్ ఆ పార్టీ తరుఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కాంగ్రెస్ తరుఫున పోటీ చేసిన రెడ్యానాయక్ గెలిచి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. రెండు వర్గాలతో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా రసవత్తరంగా సాగుతోంది. కురవి మండంలో కమిటీ ఏర్పాటు ఘర్షణకు దారి తీసింది. ఎమ్మెల్యే రెడ్యానాయక్ అనుచరులు కమిటీలు ఏర్పాటు చేయడంపై మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ అనుచరులు అడ్డుకున్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో రెండు వర్గాల వారు సగం సగం చొప్పున గ్రామాలను పంచుకున్నట్లుగా కమిటీలను ఏర్పాటు చేశారు. డోర్నకల్ గ్రామానికి సంబంధించి రెండు కమిటీలను ప్రకటించారు. నర్సింహులపేట మండలం దంతాలపల్లిలో సత్యవతి రాథోడ్ వర్గీయులు ఏకంగా రోడ్డుపై ధర్నా చేశారు. పార్టీకి సంబంధించిన విషయంలో రోడ్డుపై నిరసన తెలపడం విమర్శలకు దారి తీసింది. మొత్తంగా సత్యవతి రాథోడ్ వర్గీయుల వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నర్సంపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ చప్పగా సాగుతోంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే, జెడ్పీటీసీ సభ్యులు లేకపోవడంతో మండల స్థాయిలో పదవుల కోసం పెద్దగా పోటీ ఉండే పరిస్థితి కనిపించడం లేదు. గ్రామాల్లోనూ ఇదే రకంగా ఉంది. నియోజకవర్గంలో ఎన్నికల ముందు, ఆ తర్వాత.. ఇతర పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు పెద్దగా చేరకపోవడం దీనికి కారణంగా కనిపిస్తోంది.