breaking news
misses telangana
-
Miss and Mrs VogueStar India 2023: బ్యూటీ స్టార్ డాక్టర్ శ్రీ కీర్తి పల్మనాలజిస్ట్...
మరో కీర్తికిరీటం ‘మిసెస్ తెలంగాణ’. ‘మిసెస్ వోగ్స్టార్ ఇండియా’ విజేత. మహిళ ఎలా ఉండాలో చెప్పింది. మనిషి ఎలా జీవించాలో చెప్పింది. ‘మంచిని తీసుకోవాలి... చెడును వదిలేయాలి’ ఇదీ ఆమెను విజేతగా నిలిపిన సమాధానం. ‘మా ఊరికి వస్తే మా ఇంటికి రండి’ మరో ప్రశ్నకు బదులుగా ఆత్మీయ ఆహ్వానం. బ్యూటీ కంటెస్ట్ నాడి పట్టుకుంది. సంపూర్ణతకు ప్రతీకగా కిరీటధారి అయింది. ఏప్రిల్ 14,15,16 తేదీల్లో జైపూర్ వేదికగా వోగ్ స్టార్ పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో విజేతగా నిలిచిన తెలుగమ్మాయి డాక్టర్ కీర్తి. దేశవ్యాప్తంగా పన్నెండు వందల మంది పాల్గొన్న పోటీల్లో ‘మిసెస్ తెలంగాణ’ కిరీటంతో హైదరాబాద్‌కి తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా ఆమె తన బాల్యం నుంచి వోగ్స్టార్ కిరీట ధారణ వరకు తన విజయాలను, ఎదుర్కొన్న సవాళ్లను ‘సాక్షి’తో పంచుకుంది. ‘‘అమ్మ ఉద్యోగ రీత్యా నేను పుట్టింది ఒంగోల్లో, కానీ మా మూలాలు నెల్లూరులో ఉన్నాయి. అమ్మ బీఎస్ఎన్ఎల్, నాన్న సిప్లాలో ఉద్యోగం చేసేవారు. బాల్యం నుంచి నా జీవితమంతా హైదరాబాద్‌తోనే మమేకమైపోయింది. సైనిక్‌పురిలోని భారతీయ విద్యాభవన్‌లో టెన్త్ టాపర్‌ని. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో చురుగ్గా ఉండడానికి స్కూలే కారణం. నాలుగు రకాల డాన్స్‌లు ప్రాక్టీస్ చేశాను. యాక్టింగ్‌లోనూ శిక్షణ తీసుకున్నాను. త్రో బాల్ ఆడేదాన్ని. ఖోఖో స్టేల్ లెవెల్ ప్లేయర్‌ని. ఇదంతా ఒక దశ. నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే ఆకాంక్ష ఉండేది. రెండో ఆలోచన లేకుండా కాకతీయ కాలేజ్‌లో బైపీసీలో చేరిపోయాను. సీనియర్ ఇంటర్లో ఉండగా ఓ యాక్సిడెంట్. మల్టిపుల్ ఫ్రాక్చర్స్, తలకు కూడా గాయమైంది. సర్జరీలతో దాదాపు నాలుగు నెలలు బెడ్ మీదనే ఉన్నాను. పరామర్శకు వచ్చిన వాళ్లు సానుభూతి కురిపిస్తూ ‘నడవడం కూడా కష్టమే, ఆరోగ్యం ఒకింత కుదుటపడిన తర్వాత ఏదో ఓ సంబంధం చూసి పెళ్లి చేసేయండి’ అనే సలహా ఇచ్చేవాళ్లు. ఏఎస్రావు నగర్లో మా కాలనీ వాళ్లు నాకు చాలా సహాయం చేశారు. హాస్పిటల్లో ఎప్పుడూ ఎవరో ఒకరు తోడుగా ఉండేవారు. మా అమ్మానాన్న చిన్నప్పుడు చేయి పట్టుకుని నడిపించిన రోజులు నాకు గుర్తు లేవు, కానీ నన్ను మామూలు మనిషిని చేయడానికి మా తమ్ముడు కార్తీక్ నన్ను చేయి పట్టి నడిపించిన రోజుల్ని మాత్రం మర్చిపోలేను. అలాగే చదివి ఎమ్సెట్లో రెండు వేల ర్యాంకు తెచ్చుకుని ఎంబీబీఎస్‌లో సీటు తెచ్చుకున్నాను. టాప్ టెన్‌లో ర్యాంకు నా కల, యాక్సిడెంట్ వల్ల ఆ కల నెరవేరలేదు. ► ... డాన్స్ మానలేదు! కుప్పంలో ఎంబీబీఎస్ చేశాను. అప్పుడు కూడా డాన్స్ ప్రాక్టీస్ మానలేదు. నేను స్టేజ్ మీదకు వెళ్లకుండా కొరియోగ్రఫీ చేసి షోలు నిర్వహించాను. ఇక పీజీలో చదువు తప్ప మరిదేనికీ టైమ్ ఉండేది కాదు. పల్మనాలజీ తర్వాత కేరళలో ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ చేశాను. పెళ్లి తర్వాత మళ్లీ కొత్త ఉత్సాహం వచ్చింది. మాది లవ్ మ్యారేజ్. డాక్టర్ శశిధర్ ఎంబీబీఎస్‌లో నా సీనియర్. ఆయన గాయకుడు. ఇల్లు, హాస్పిటల్‌తో జీవితాన్ని పరిమితం చేసుకోవడం నాకే కాదు ఆయనకూ నచ్చదు. డాన్స్ కాకపోతే మరేదైనా ఆసక్తిని అభివృద్ధి చేసుకోమనేవారు. అలా గత ఏడాది మిస్ హైదరాబాద్ పోటీలకు నా ఫొటోలు పంపించాను. టాలెంట్ రౌండ్లో ర్యాంప్ వాక్, డాన్స్ వీడియోలు పంపించాను. అందులో ఫస్ట్ రన్నర్ అప్ని. ఆ తర్వాత కొన్నాళ్లకు ‘మిసెస్ తెలంగాణ ఆడిషన్’ పిలుపు వచ్చింది. డెలివరీ తర్వాత సెలవులో ఉండడంతో ఆ పోటీల్లో పాల్గొనే వీలు దొరికింది. గత ఏడాది నవంబర్ నుంచి దశల వారీగా అనేక సెషన్లు జరిగాయి. అన్నీ వర్చువల్‌గానే. ► పోటీల నుంచి నేర్చుకున్నాను! ఈ పోటీలో ఒకరికొకరు నేరుగా కలిసింది జైపూర్‌లో కిరీటధారణ సమయంలో మాత్రమే. ప్రతి రాష్ట్రం నుంచి విజేతలకు కిరీట ధారణ జరిగింది. విజేతల్లో నాతోపాటు మరో ఇద్దరు డాక్టర్లున్నారు. మనుమళ్లు, మనుమరాళ్లున్న మహిళలు కూడా పాల్గొన్నారు. ఈ పోటీల ద్వారా అనేక స్ఫూర్తిదాయకమైన జీవితాలను దగ్గరగా చూశాను. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక్కో ఎదురీత ఉంది. ఈ సందర్భంగా నేను మహిళలకు చెప్పేదొక్కటే... జీవితాన్ని నిత్యనూతనంగా ఉంచుకోవాలి. పెళ్లయిందనగానే ఇక జీవితం అయిపోయిందని, తమనెవరూ పట్టించుకోవట్లేదని ఇంట్లో వాళ్లను వేలెత్తి చూపుతూ తమను తాము నైరాశ్యంలోకి నెట్టేసుకుంటూ ఉంటారు. నిర్లిప్తతను దగ్గరకు రానివ్వకూడదు, ఒకవేళ ఆందోళన, ఆవేదనలు చుట్టు ముట్టినా సరే వాటి నుంచి బయటపడడానికి తమను తాము ఉత్తేజితం చేసుకోవాలి’’ ఎంపిక ఇలా! స్వయం శక్తితో జీవితంలో ఎదిగిన వాళ్లు, జీవితంలో పడిలేచిన వాళ్లు, సామాజికంగా సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వాళ్లు... ఇలా ఉంటుంది. అలాగే అందరిలో ఒకరిగా జీవించడం కాకుండా ప్రొఫైల్‌లో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. నేను పర్యావరణం కోసం చేసిన పనులు, కోవిడ్ వారియర్, జగిత్యాలలో ఐదేళ్లు సామాన్యులకు వైద్యం చేయడంతో సరిపెట్టుకోకుండా హెల్త్ ఎడ్యుకేషన్ కౌన్సెలింగ్ ఇవ్వడం వంటివి నాకు ఉపకరించాయి. – డాక్టర్ ఎం.వి. శ్రీకీర్తి, సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, టీఎక్స్ హాస్పిటల్స్, హైదరాబాద్. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
మణప్పురం సౌత్ ఇండియా మిస్సెస్ తెలంగాణగా రష్మి ఠాకూర్
బంజారాహిల్స్: మణప్పురం మిస్సెస్ సౌత్ ఇండియా–2021 గ్రాండ్ ఫినాలె పోటీల్లో మిస్సెస్ తెలంగాణ టైటిల్‌ను రష్మీ ఠాకూర్, మిస్సెస్ ఆంధ్ర టైటిల్‌ను సునీత ధవళ గెలుచుకున్నట్లు డిక్యూ వాచెస్, పెగసస్ సంస్థల ప్రతినిధులు అజిత్‌రవి వెల్లడించారు. గురువారం జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కొచ్చిలోని మెరీడియన్ హోటల్లో బుధవారం రాత్రి కనుల పండువగా గ్రాండ్ ఫినాలె పోటీలు జరిగాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఈ పోటీలకు దరఖాస్తు చేసుకున్నారని ఇందులో 20 మంది యువతులు టైటిల్‌పోరుకు ఎంపికయ్యారన్నారు. -
శ్రీమతి కరీంనగర్‌గా రాజశ్రీ
సప్తగిరికాలనీ(కరీంనగర్): క్యాట్‌వాక్‌లు.. జడ్జిల ప్రశ్నలు..కళ్లు చెదిరే సమాధానాలు...అదిరేటి స్టెప్పులు..కోకిల గొంతులు ఇలా కరీంనగర్లో ఆదివారం కరీంనగర్ జిల్లా శ్రీమతులు చేసిన ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. శ్రీమతి తెలంగాణ పేరుతో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పోటీలు నిర్వహిస్తుండగా ఆడిషన్స్‌కు కరీంనగర్ వేదికైంది. స్థానిక శ్వేత హోటల్లో జరిగిన ఆడిషన్స్‌కు పెద్దసంఖ్యలో శ్రీమతులు పాల్గొని అద్భుత ప్రదర్శన ఇచ్చారు. అచ్చు మిస్ యూనివర్స్ పోటీలను తలపించేలా కార్యక్రమం సాగింది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ హాజరై విజేతకు కిరిటాన్ని తొడిగారు. -
తెలంగాణ ప్రతిష్ట పెంచేలా ‘మిసెస్ తెలంగాణ’ పోటీలు
గోల్కొండ: తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంపొందించేందుకు మిసెస్ తెలంగాణ-2015 అందాల పోటీని నిర్వహిస్తున్నట్లు నక్షత్ర మీడియా మేనేజింగ్ డెరైక్టర్ లక్ష్మి స్పష్టం చేశారు. మాసబ్ ట్యాంక్‌లోని గోల్కొండ హోటల్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆమె పోటీల గురించి వివరించారు. ఈ పోటీలు రెండు విభాగాల్లో ఉంటాయన్నారు. మిసెస్ తెలంగాణ విభాగంలో 40 సంవత్సరాలలోపు మహిళలకు.. క్లాసిక్ మిసెస్ తెలంగాణ విభాగంలో 40 సంవత్సరాలపైబడిన మహిళలు మాత్రమే పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఈ ఈవెంట్‌ను నక్షత్ర మీడియా, యువ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయన్నారు. తెలంగాణలోని పది జిల్లాల మహిళల పాల్గొనే ఈ పోటీలలో ఫైనల్ రౌండ్ కు 30 మందిని అర్హత సాధిస్తారన్నారు. వీరిలోంచి మిసెస్ తెలంగాణను నిర్ణయిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ మోడళ్లు వాలంటీన మిశ్ర, నీలిమా నాయుడు, హీరోయిన్లు శ్రీముఖి, శ్యామలీలు హాజరయ్యారు.