breaking news
Miscarriages
-
ఆడబిడ్డకు మరణశాసనం!
శ్రీకాళహస్తికి చెందిన ఓ జంటకు గతేడాది వివాహం జరిగింది. గర్భం దాల్చడంతో కుటుంబ పెద్దల లింగ నిర్ధారణ పరీక్షల కోసం స్థాకంగా ఉన్న ఓ డాక్టర్‌ను సంప్రదించారు. తమకు తొలి సంతానం పురుషుడు కావాలని చెప్పారు. వెంటనే ఆ వైద్యుడు ఆమెకు పరీక్షలు నిర్వహించి కడుపులో పెరుగుతోంది బాలిక ఆనవాళ్లు అని నిర్ధారించి కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో లింగ నిర్ధారణకు రూ. 45 వేలు, గర్భస్రావానికి సుమారు రూ. 35 వేలు దండుకున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో అధికారులు ఆ డాక్టర్‌పై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. నాయుడుపేటకు చెందిన ఓ జంటకు ఇప్పటికే ఇద్దరు బాలికలు పుట్టారు. తమకు వంశోద్ధారకుడు కావలంటూ మూడవసారి ప్రెగ్నెన్సీ కావడంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు. దీంతో మూడవ సారి సైతం బాలిక పుట్టే ఆనవాళ్లు ఉన్నాయంటూ సంబంధిత పరీక్షా కేంద్రాలకు చెందిన డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఆమెకు గర్భస్రావం చేయాలని బంధువులు కోరారు. దీంతో పరీక్షించి డాక్టర్లు ఆ మాతృమూర్తి బంధువుల నుంచి వేలకు వేలు దండుకుని పని పూర్తి చేశారు.అమ్మగా.. అక్కగా.. చెల్లిగా..అర్ధాంగిగా.. చెయ్యిపట్టి నడిపించే ఆడబిడ్డకు కడుపులోనే మరణ శాసనం లిఖిస్తున్నారు. ఆడపిల్ల భారమనుకునే రోజుల నుంచి ఆడబిడ్డ కోసం ఎదురుచూసే రోజులు వచ్చినా తిరుపతి జిల్లాలోని కొన్ని మండలాల్లో ఆడపిల్లల లింగ నిష్పత్తి గణనీయంగా పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. భ్రూణ హత్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. లింగ నిర్ధారణ మాఫియా రెచ్చిపోతున్నా వైద్యశాఖ అధికారులు మామూళ్ల మత్తులోనే జోగుతుండడం విస్మయానికి గురిచేస్తోంది.సాక్షి ప్రతినిధి తిరుపతి : అయ్యో.. మాతృమూర్తుల కడుపులు చిదిమేస్తున్నారే... ప్రెగ్నెస్సీ అయిన నవ వధువులను సైతం వదలకుండా తొలి ప్రసవంలోనే మగబిడ్డ పుట్టాలంటూ స్కానింగ్ చేయించి రక్త ముద్దలపై దాడిచేసి హత్య చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో రోజు రోజుకు విచ్చలవిడిగా బ్రూణ హత్యలకు పాల్పడుతున్నా మామూళ్లకు అలవాటు పడ్డ ప్రభుత్వాధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో ఆధ్యాత్మిక నగరం తిరుపతితో పాటు, దేశంలోనే పేరొందిన శైవక్షేత్రం శ్రీకాళహస్తిలో సైతం బాలికల సంఖ్య రోజురోజుకు పడిపోతోంది. లింగనిర్ధారణ పరీక్షా కేంద్రాలు ధనార్జనే ధ్యేయంగా జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో విచ్చల విడిగా ఏర్పాటు చేసుకుని కోట్ల వ్యాపారం చేసుకుంటున్నారు. అధికారులకు ముడుపులు ముట్టచెప్పి లింగనిర్ధారణ పరీక్షల మాఫియా రెచ్చిపోతున్నా పట్టించుకున్న నాథుడు లేకపోవడంతో బ్రూణ హత్యలు రోజుకు పదుల సంఖ్యలో జరుగుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. ఈ విషయంపై వైద్య శాఖలోని వైద్యాధికారులు, వైద్య సిబ్బంది సైతం చర్చించుకుంటున్నారు. పడిపోతున్న బాలికల జనన రేటు జనగణన 2018 ప్రకారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వెయ్యి మంది బాలురకు 922 మంది బాలికలు ఉన్నారు. అదే 2021 లెక్కలకొచ్చేసరికి ఈ సంఖ్య 901కి పడిపోయింది. జిల్లాల విభజన అనంతరం 2024లో జరిగిన జనగణన లెక్కల ప్రకారం తిరుపతి జిల్లాలో బాలికల సంఖ్య స్వల్పంగా పెరిగి 916కు చేరింది. అయితే శ్రీకాళహస్తిలో మాత్రం జిల్లా నిష్పత్తికి వ్యతిరేకంగా నానాటికీ బాలికల నిష్పత్తి తగ్గుతూ వస్తోంది. బాలురు – బాలికల నిష్పత్తిలో తీవ్ర వ్యత్యాసం నమోదైన ప్రాంతాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రభుత్వ విభాగాలను భాగస్వామ్యం చేసి క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తేనే బాలికల నిష్పత్తి పడిపోకుండా ఆపగలమని మేధావులు సూచిస్తున్నారు. శ్రీకాళహస్తి ప్రాంతంలో తొలి సంతానం మగబిడ్డ పుట్టగానే కుటుంబ నియంత్రణ పాటిస్తున్న కుటుంబాలు ఎక్కువగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. మొద్దునిద్రలో వైద్యాధికారులు తిరుపతి జిల్లాలో బాలురు– బాలికల నిష్ఫత్తి దారుణంగా ఉందన్న విషయాన్ని కలెక్టరేట్లో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో సాక్షాత్తు జిల్లా కలెక్టరే ఈ అంశాన్ని బహిర్గతం చేయడం గమనార్హం. ఆరేళ్లలోపు బాలల్లో బాలికలు అతి తక్కువగా ఉన్న మండలాల్లో తొట్టంబేడు, శ్రీకాళహస్తి, ఏర్పేడు ఉన్నట్లు సమాచారం. మూడు నెలల కిందట స్థానిక ఆర్డీవో కార్యాలయంలో జరిగిన అడ్వయిజరీ కమిటీ సమావేశంలో సైతం ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి ఇదే అంశాన్ని లేవనెత్తారు. అయినా వైద్యాధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడంతో పెద్ద ఎత్తున బ్రూణ హత్యలు చోటు చేసుకున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. గర్భధారణ పూర్వ, గర్భస్థ పిండ లింగ ఎంపిక నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్న నిబంధనను అధికార యంత్రాంగం ఆచరణలో పెట్టకపోవడంతో ఆడ నలుసు అమ్మ గర్భంలోనే అంతమైపోయే పరిస్థితి ఏర్పడింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఆడ–మగ నిష్పత్తి వెయ్యికి తొమ్మిది వందలు ఉండగా శ్రీకాళహస్తిలో మాత్రం వెయ్యికి 629 మందే ఆడ బిడ్డలే ఉండటం ఇందుకు నిలువెత్తు సాక్ష్యం.వంశోద్ధారకుడు కావాలనే మూఢనమ్మకం.. ముందు మగబిడ్డ పుడితే చాలు.. ఆ తర్వాత ఎవరూ పుట్టినా పర్వాలేదు. మళ్లీ మగ బిడ్డ పుడితే ఇంకా మేలే.. ఒకవేళ ఆడ బిడ్డ పుట్టినా.. కొడుకూ, కూతురు పుట్టిందని సంబర పడిపోతాం.. ఇదీ ప్రస్తుత సమాజంలో పిల్లలు కావాలంకుంటున్న తల్లిదండ్రుల పరిస్థితి. ముందు కొడుకు పుట్టి మరో సంతానంగా కూతురు పుడితే అక్కడితో ఆపేస్తున్నారు. అలా కాకుండా ముందు ఎంత మంది కూతుళ్లు పుట్టినా కొడుకు కోసం కొందరు ఆరాటపడుతున్నారు. ఇంకొందరు కొడుకుల కోసం ఆడ నలుసులను గర్భంలోనే నులిమేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీకాళహస్తి ప్రాంతంలో వీధికో గాథ బయటపడుతోంది. ఇలా ఆడ నలుసు పురిటిలో కళ్లు కూడా తెరవకముందే బ్రూణ హత్యలకు గురవుతుంటే మరో పక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారత అంటూ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇకనైనా వైద్య శాఖ నిద్ర మేల్కొని లింగ నిర్ధారణ, గర్భ స్రావాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.విచ్ఛలవిడిగా లింగనిర్ధారణ పరీక్షలు పేదల మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకుని శ్రీకాళహస్తి, నాయుడుపేట, గూడూరుల్లో.. లింగ నిర్ధారణ పరీక్షల నిర్వాహకులు బ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. శ్రీకాళహస్తి ప్రాంతంలో బాలికల నిష్పత్తి లింగ నిర్ధారణ పరీక్షల కారణంగానే గణనీయంగా తగ్గిపోతుందన్న విమర్శలు వస్తున్నాయి. శ్రీకాళహస్తి పట్టణంలోని కొన్ని స్కానింగ్ కేంద్రాలు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో లింగ నిర్ధారణ పరీక్షకు రూ. 15 నుంచి రూ. 20 వేలు ఫీజులు తీసుకుంటున్నట్లుగా చెప్పుకుంటున్నారు. అదేవిధంగా నాయుడుపేట, గూడూరు కేంద్రంగా లింగ నిర్ధారణ పరీక్షలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు సమాచారం. గూడూరు పట్టణంలోని పేరుగాంచిన ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వైద్యులు, స్కానింగ్ కేంద్రాలు నడుపుతున్న నిర్వాహకులు లింగ నిర్ధారణ పరీక్షల పేరుతో కోట్లు గడిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఆ ఫలితమే బ్రూణ హత్యలకు కారణమవుతున్నాయని అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్య యంత్రాంగం అప్రమత్తమై ప్రైవేటు నర్సింగు హోముల్లో, స్కానింగ్ సెంటర్లలో విరివిగా తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.రూ.కోట్లలో వ్యాపారం లింగ నిర్ధారణ పరీక్షలు అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్నారు. దళారులు గర్భిణులను, సంబం«దీకులను గుట్టుగా తిరుపతి, గూడూరు తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్లాక ఒప్పందం కుదుర్చుకున్న ఆసుపత్రికి సమాచారం అందిస్తారు. గర్భిణితో ఎక్కువ మంది రాకుండా, ఆమెతోపాటు మరొకరిని వెంటబెట్టుకుని ప్రత్యేక వాహనంలో తరలిస్తారు. ఆస్పత్రి పేరుగానీ, చిరునామాగానీ ఎలాంటివి చెప్పకుండానే తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించి పుట్టబోయేది ఆడ.. మగ చెప్పి రిపోర్టులు చేతికి ఇవ్వకుండా పంపేస్తున్నారు. గర్భస్రావాలకు ప్రత్యేక ధర లింగ నిర్ధారణ స్కానింగ్ కోసం సుమారు రూ.25 నుంచి రూ. 30 వేలు వసూలు చేస్తుండగా గర్భస్రావం చేయించేందుకు మరో రేటు తీసుకుంటున్నారు. తిరుపతిలో అయితే రూ.25 వేలు, గూడూరు, శ్రీకాళహస్తి, నాయుడుపేట ఇతర ఆసుపత్రుల్లో రూ.20 వేలు తీసుకుంటున్నట్లు తెలిసింది. కొన్ని ఆసుపత్రులు ఈ దందాను గుట్టుగా సాగిస్తున్నాయి. గర్భం దాల్చిన 20 వారాల తర్వాత గర్భ విచ్ఛిత్తి చేయడం అత్యంత ప్రమాదకరం.అందుకే ప్రభుత్వాలు కఠిన నిబంధనలు, చట్టాలు తీసుకొచ్చాయి. కొందరు ధనార్జన కోసం ఇష్టారీతిగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలతో గర్భస్రావాలు ఎక్కువగా చేస్తున్నారు. ఈ ప్రభావం లింగ నిష్పత్తిపై పడుతోంది. ముఖ్యంగా గూడూరు, తిరుపతి నగరాల్లో ప్రసూతి ప్రైవేటు ఆసుపత్రుల కేంద్రంగా ఈ దందా సాగుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. కేసులు నమోదు చేస్తాం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో దీనిపైన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కమిటీలో స్పెషలిస్ట్ డాక్టర్లు జిల్లా అధికారులు నియోజకవర్గ స్థాయి వైద్యాధికారి ఈ కమిటీలో ఉంటారు. సమగ్రంగా దీనిపైన విచారించి ఒక నెల రోజుల్లో కలెక్టర్ కు నివేదిక సమర్పిస్తాం. గతంలో ఈ విధంగా స్కానింగ్ చేస్తూ దొరికిన ఓ ప్రైవేటు ఆసుపత్రిని సీజ్ చేసి మిషన్లు కూడా స్వా«దీనం చేసుకున్నాం. వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది. తప్పు చేసినట్టు తెలిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. లింగనిర్ధార ణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తాం. – డాక్టర్ బాలకృష్ణ నాయక్, డీఎంహెచ్ఓ, తిరుపతి -
అత్యవసర పరిస్థితుల్లోనే అబార్షన్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఇక నుంచి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అబార్షన్లకు అనుమతి ఉంటుంది. విచ్చలవిడి అబార్షన్ల (ఎంటీపీ–మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ)కు దేశవ్యాప్తంగా చెక్ పడనుంది. దీనిపై ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ, న్యాయ శాఖలు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశాయి. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇదో పెద్ద వ్యాపారంగా మారిన నేపథ్యంలో 1971లో చేసిన చట్టానికి 2021లో సవరణ చేసి కొత్త చట్టాన్ని రూపొందించారు. కొత్త సవరణ చట్టం అమలుకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కసరత్తు మొదలుపెట్టింది. ఏటా రాష్ట్రంలో 7.50 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. ఇందులో 50 వేలకు పైగా అబార్షన్లు ఉంటున్నట్లు వైద్యుల అంచనా. ఇక ప్రతి అబార్షన్ రికార్డుల్లోకి.. ఇకపై అబార్షన్ చట్ట నిబంధనలకు లోబడి చేయాల్సి ఉంటుంది. పైగా ప్రతి అబార్షన్ వివరాలను రికార్డుల్లో తప్పనిసరిగా నమోదు చేయాలి. కడుపులోని బిడ్డకు 20 వారాలకు మించి వయసుంటే అబార్షన్ చేయకూడదని గత చట్టంలో పేర్కొన్నారు. తాజా చట్టం ప్రకారం 24 వారాల వరకు పొడిగించారు. తల్లికి తీవ్ర మానసిక రుగ్మతలున్నా, అత్యాచారానికి గురైనా, కడుపులో అసాధారణ పరిస్థితుల్లో బిడ్డ ఉన్నా, కడుపులో బిడ్డ పెరగడం వల్ల తల్లి ప్రాణానికి ప్రమాదం ఉన్నా.. ఇలాంటి కేసుల్లో మాత్రమే 24 వారాల వరకు ప్రత్యేక పరిస్థితుల్లో అబార్షన్ చేయొచ్చు. మిగిలిన పరిస్థితుల్లో అబార్షన్ చేసినట్లు ఫిర్యాదులొస్తే సంబంధిత డాక్టరుపై కఠిన చర్యలు తీసుకుంటారు. అవసరమైతే డాక్టరు పట్టాను రద్దు చేయొచ్చు. ప్రతి జిల్లాకో మెడికల్ బోర్డు విచ్చలవిడి అబార్షన్లను అరికట్టేందుకు ప్రతి జిల్లాలో ముగ్గురు వైద్యులతో ఓ మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. వీరిలో గైనకాలజిస్ట్, పీడియాట్రిక్ వైద్యులు, రేడియాలజిస్ట్ లేదా సోనాలజిస్ట్ ఉంటారు. అబార్షన్ చేసే వైద్యులు రిజిష్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అయి ఉండాలి. ఎవరికైతే అబార్షన్ చేయాలో వారి వివరాలు, దానికి గల కారణాలు విధిగా పేర్కొని, బోర్డుకు నివేదిక ఇవ్వాలి. బాధితురాలి వయసు, ఆరోగ్య పరిస్థితులు, కడుపులో బిడ్డ వయసు విధిగా పేర్కొనాలి. కొత్త చట్టాన్ని త్వరలోనే అమలు చేయనున్నామని, దీనికి సంబంధించిన మెడికల్ బోర్డులు జిల్లాల వారీగా ఏర్పాటు చేస్తున్నామని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ హైమావతి తెలిపారు. -
రెండు సార్లు అబార్షన్.. చాలా డిప్రెషన్‌కు లోనయ్యా: నటి
Geeta Basra Reveals Why She Spoke About Her Miscarriages: టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ భార్య, నటి గీతా బస్రా ఇటీవలె రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కుమారుడి రాకతో మరోసారి మాతృత్వాన్ని అనుభవించిన ఆమె గతంలో రెండుసార్లు గర్భస్రావానికి గురైంది. తాజాగా ఈ విషయం గురించి సోషల్ మీడియాలో ఓపెన్ అప్ అయ్యింది. 'ప్రతి మహిళ తను ప్రెగ్నెంట్ అని తెలిసిన రోజు నుంచి వచ్చే తొమ్మిది నెలల కోసం ఎంతో ఎదురు చూస్తుంటుంది. ఎప్పుడెప్పుడు చిన్నారిని తమ చేతుల్లోకి తీసుకొని ముద్దు చేద్దామా అని కలలు కంటుంది. కానీ దురదృష్టవశాత్తూ అలాంటి సమయంలో మిస్ క్యారేజ్(గర్భస్రావం) జరిగితే జీవితమే కోల్పోయినట్లు అనిపిస్తుంది. నా స్నేహితుల్లో కూడా కొందిరికి ఇలానే జరిగింది. నేను కూడా దీన్ని అనుభవించాను. మొదటిసారి పాప హీర్ పుట్టాక రెండు సార్లు నాకు గర్భస్రావం అయ్యింది. ఆ సమయంలో చాలా డిప్రెషన్‌కు లోనయ్యా. రెండుసార్లు వరుసగా అబార్షన్ కావడంతో ఎంతో బాధపడ్డా. అయితే ఆ సమయంలో నా భర్త నాకు తోడుగా నిలిచారు. చాలామంది అనుకొంటారు సెలబ్రిటీలకు ఏముంటుంది? వాళ్ల జీవితం చాలా సాఫీగా గడుస్తుంది అని కానీ కానీ ప్రతి సెలబ్రిటీ జీవితం అంత సులభం కాదు. వాళ్లకూ అందరిలానే కష్టాలు ఉంటాయి. అమ్మతనం ఆస్వాదించాలనుకున్న వారికి గర్భస్రావం ఓ పీడకలలా మారుతుంది. దీన్నుంచి కోలుకోవడం అంత సులభమేమీ కాదు కానీ అసాధ్యం అయితే కాదు. ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి భయటపడేందుకు ప్రయత్నించాలి. ఆశను వదులుకోకూడదు అన్న ధైర్యాన్ని నింపేందుకు నేను నా అనుభవాల్ని పంచుకున్నాను. ఈ విషయాల గురించి మాట్లాడటం ఎంత ముఖ్యమో నేను తెలుసుకున్నాను. దీనికి సోషల్ మీడియాను మించిన బెస్ట్ ఫ్లాట్ ఫాం లేదనిపించింది. ఎట్టి పరిస్థిత్లుల్లోనూ నమ్మకాన్ని కోల్పోకూడదు' అంటూ మహిళల్లో ఎంతో స్పూర్తి నింపింది. కాగా ‘ద ట్రైన్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న గీత బస్రా 2015లో టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్‌సింగ్‌తో కలిసి ఏడడుగులు వేసింది. 2016 లో ఈ దంపతులు మొదటిసారిగా తల్లిదండ్రులయ్యారు. ఆ పాపకు హీర్ ప్లాహా అనే పేరు పెట్టారు. అనంతరం ఈ ఏడాది జోవన్ వీర్ సింగ్ ప్లాహా అనే బాబు పుట్టాడు. -
వరుసగా గర్భస్రావాలు...సంతానభాగ్యం ఉందా?
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 32 ఏళ్లు. పెళ్లయి ఆరేళ్లు అవుతోంది. మూడుసార్లు గర్భం వచ్చింది. కానీ గర్భస్రావం అయ్యింది. డాక్టర్‌ను సంప్రదిస్తే అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని అన్నారు. అయినా ఈ విధంగా ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదు. హోమియో ద్వారా నాకు సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉందా? – శైలజ, సికింద్రాబాద్ గర్భధారణ జరిగి అది నిలవనప్పుడు, ముఖ్యంగా తరచూ గర్భస్రావాలు అవుతున్నప్పుడు అది వారిని మానసికంగానూ కుంగదీస్తుంది. మరోసారి గర్భం ధరించినా అది నిలుస్తుందో, నిలవదో అన్న ఆందోళనను కలగజేస్తుంది. ఇలా రెండు లేదా మూడుసార్లు గర్భస్రావం అయితే దాన్ని ‘రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్’గా పేర్కొంటారు. కారణాలు: ఇలా గర్భస్రావాలు జరగడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో కొన్ని... ∙గర్భాశయం అసాధారణంగా నిర్మితమై ఉండటం (రెండు గదుల గర్భాశయం) ∙గర్భాశయంలో కణుతులు / పాలిప్స్ ఉండటం ∙గర్భాశయపు సర్విక్స్ బలహీనంగా ఉండటం ∙కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ వ్యాధులు ∙కొన్ని ఎండోక్రైన్ వ్యాధులు ∙వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం ∙రకరకాల ఇన్ఫెక్షన్లు రావడం వంటి ఎన్నో కారణాలు గర్భస్రావానికి దారితీస్తాయి. అయితే కొంతమందిలో ఎలాంటి కారణం లేకుండా కూడా గర్భస్రావాలు జరుగుతుండవచ్చు. చికిత్స: రోగనిరోధకశక్తిని పెంపొందించడం, హార్మోన్ల అసమతౌల్యతను చక్కదిద్దడం వంటి చర్యల ద్వారా సంతాన లేమి సమస్యను పరిష్కరించవచ్చు. అలాగే గర్భస్రావానికి దారితీసే అనేక కరణాలు కనుగొని, వాటికి తగి చికిత్స అందించడంతో పాటు కాన్స్టిట్యూషన్ పద్ధతిలో మానసిక, శారీరక తత్వాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందిస్తే సంతాన సాఫల్యం కలుగుతుంది. అయితే అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో కారణాలతో పాటు వేర్వేరు అంశాలను పరిగణనలోకి తీసుకొని సరైన ఔషధాలను వాడితే సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కూర్చుంటే లేవలేకపోతున్నాను... నా వయసు 29 ఏళ్లు. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. రెండేళ్ల నుంచి చాలాసేపు కూర్చున్న తర్వాత లేవలేక, నడవలేకపోతున్నాను. వెన్నుపూసలో పట్టివేసినట్లు ఉంటోంది. హెచ్ఎల్ఏ బి27 పాజిటివ్ వచ్చింది. నా సమస్యకు హోమియోలో చికిత్స ఉందా? – కె. అరుణ్‌కుమార్, విశాఖపట్నం మీరు చెబుతున్న అంశాలను బట్టి చూస్తే మీరు యాంకిలోజింగ్ స్పాండిలైటిస్‌తో బాదపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది దీర్ఘకాలికంగా బాధించే సమస్య. ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. అంటే తమ వ్యాధి నిరోధక శక్తే తమకు ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్య అన్నమాట. ముఖ్యంగా కీళ్లు, వెన్నెముక భాగాలలో సమస్యను కలిగిస్తుంది. యుక్తవయస్కులు అంటే... సాధారణంగా 18–30 ఏళ్ల వారిలో కీళ్లు, మెడ బిగుసుకొని, నొప్పి ఎక్కువగా ఉంటుంది. వ్యాధి పురుషుల్లో చాలా సాధారణం. అంతేకాదు... మరీ ఎక్కువ తీవ్రతతో కూడా వస్తుంది. హెచ్ఎల్ఏ బి27 అనే ప్రోటీన్ గల జన్యువు ఉన్నవారిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ సమస్య వెన్నుపూసల మధ్య వాపును కలగజేస్తుంది. ఈ వాపు వచ్చిన డిస్క్‌లు వెన్నెముకను పైకి పైకి జరుపుతాయి. ఫలితంగా ఇది పెల్విస్ భాగంలోని కీళ్లను ప్రభావితం చేస్తుంది. కారణాలు: ∙వాతావరణ/పర్యావరణ సంబంధిత అంశాలు ∙బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్తో వంశపారం పర్యం/జన్యుపరంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. లక్షణాలు: ∙కంటి సమస్యలు కనిపిస్తాయి. కళ్లు ఎర్రబారతాయి. ∙కీళ్లు, మెడ బిగుసుకుపోతాయి. నొప్పి తీవ్రత ఎక్కువగాఉంటుంది ∙నడుమునొప్పి, శరీరంలో చాలాచోట్ల స్టిఫ్నెస్ వస్తుంది. ∙శరీరకంగా కదలికలు తగ్గుతాయి. చికిత్స: యాంకిలోజింగ్ స్పాండిలైటిస్‌ను హోమియో మందులతో పూర్తిగా తగ్గించవచ్చు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన బయలాజికల్ మందులు వ్యాధి పెరగడాన్ని నిరోధిస్తాయి. హోమియోలో దీనికి కాల్కేరియా ఫాస్, ఫాస్ఫరస్, ఫాస్ఫారిక్ యాసిడ్, లైకోపోడియమ్, పల్సటిల్లా, నక్స్‌వామికా, ఆరమ్, సైలీషియా వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని హోమియో డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ చర్మంపై పొలుసుల్లాగా రాలుతున్నాయి... పరిష్కారం చెప్పండి నా వయసు 36 ఏళ్లు. ఐదు సంవత్సరాలుగా చర్మంపైన మచ్చలుగా ఏర్పడి పొట్టు రాలిపోతున్నది. ఎంతో మంది డాక్టర్లకు చూపించాను. ప్రయోజనం కనిపించడం లేదు. కీళ్లనొప్పులు కూడా వస్తున్నాయి. హోమియో మందులతో తగ్గుతుందా? – ఎల్. విజయ్, కర్నూలు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీ వ్యాధి సోరియాసిస్‌గా తెలుస్తోంది. ఇందులో చర్మంపై మచ్చలు లేదా బొబ్బల్లా ఏర్పడి, అవి పొలుసులుగా ఊడిపోతోంది. సోరియాసిస్ సాధారణంగా 15–30 ఏళ్ల మధ్యవయస్కులకి ఎక్కువగా వస్తుంది. కానీ వంశపారంపర్యంగా ఏ వయసువారికైనా రావచ్చు. లక్షణాలు: ∙చేతులు, కాళ్లు, తల, ముఖం, చర్మంపై మచ్చలు లేదా బొబ్బలు వచ్చి చేప పొలుసులుగా చర్మం ఊడిపోతుంది. ∙కేవలం చర్మం మీద మాత్రమే గాక గోళ్లపై మచ్చలు రావడం, కీళ్లనొప్పులు ఉంటాయి. ∙తలపై చుండ్రులాగా పొలుసులతో పాటు జుట్టు కూడా రాలిపోతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు తాము చూడటానికి కూడా బాగాలేకపోవడంతో మానసిక క్షోభకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇటీవలి వ్యాధి ట్రెండ్: ఆధునిక జీవన శైలి వల్ల ఇటీవల వంశపారంపర్యంగా వ్యాధి లేని వారిలోనూ ఇది కనిపిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. చాలా హడావుడి, ఆదుర్దా కలిగిన జీవనశైలి వల్ల ఇది చాలామందిలో కనిపిస్తోంది. కాబట్టి ఒత్తిడిని వీలైనంత దూరంగా ఉంచుతూ, మంచి పౌష్టికాహారం తీసుకుంటూ ఉండాలి. చర్మం మరీ పొడిబారిపోకుండా తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాలి. చికిత్స: ముందుగా రోగి స్వభావం, తత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని వాళ్లలో వ్యాధి నిరోధక శక్తి పెంచేలా జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతిలో చికిత్స చేయడం ద్వారా సోరియాసిస్ సమస్యకు సమూలమైన చికిత్స అందించడం హోమియో ప్రక్రియలో పూర్తిగా సాధ్యమవుతుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
ఎస్ఎల్ఈతో వరస గర్భస్రావాలు... ఏం చేయాలి?
నా వయసు 27 ఏళ్లు. నాలుగేళ్ల నుంచి ఎస్‌ఎల్‌ఈ అనే జబ్బుతో బాధపడుతున్నాను. నాకు పెళ్లయి మూడేళ్లు. ఇప్పటికే నాలుగు సార్లు గర్భాస్రావం అయ్యింది. ఈ జబ్బు ఉంటే తల్లయ్యే అవకాశం ఉండదని కొంతమంది అంటున్నారు. ఇంగ్లిష్ మందుల వల్ల దుష్ప్రభావాలు ఉంటాయని ఇప్పటివరకు వైద్యం చేయించుకోలేదు. గత మూడు నెలలుగా అధిక రక్తపోటు ఒళ్లంతా వాపు రావడం జరుగుతోంది. నాకు తగిన సలహా ఇవ్వండి. – ఒక సోదరి, విజయవాడ ఎస్‌ఎల్‌ఈ లేదా లూపస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి. వీళ్లలో యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ (ఏపిఎస్) అనే జబ్బు కూడా కలిసి ఉండే అవకాశం ఉంటుంది. 30 శాతం నుంచి 40 శాతం లూపస్ వ్యాధిగ్రస్తుల్లో ఏపీఎస్కు సంబంధించిన యాంటీబాడీస్ ఉంటాయి. దీనివల్ల రక్తం తరచూ గడ్డకట్టడం, తరచూ గర్భస్రావాలు, నెలలు నిండకముందే ప్రసవించడం, గర్భవతిగా ఉన్న సమయంలో అధికరక్తపోటు, దాంతో ఫిట్స్ రావడంజరుగుతుంది. ప్రసవం తర్వాత ఈ వ్యాధి తీవ్రత పెరిగి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి ప్రాణాంతకం అవుతుంది. లూపస్, ఏపీఎస్ వ్యాధుల దుష్ప్రభావం మూత్రపిండాల (కిడ్నీల) మీద కూడా ఉంటుంది. మీలో బీపీ పెరగడం, ఒంట్లో వాపు రావడం దీనివల్లనే అయి ఉండే అవకాశం ఉంది. మీరు వెంటనే రుమటాలజిస్టును కలిసి వ్యాధి తీవ్రతను నిర్ధారణ చేసుకోండి. మీ బరువు, ఎత్తు ఆధారంగా రుమటాలజిస్టులు మందుల మోతాదును సూచిస్తారు. ఈ మందుల వల్ల దుష్ప్రభావాలు వస్తున్నాయా లేదా అని కూడా కొన్ని రక్తపరీక్షలు చేయిస్తారు. మందుల మోతాదుతో ఒనగూరే ప్రయోజనాలు, వాడకపోవడం వల్ల నష్టాలపై రుమటాలజిస్టులకు అవగాహన ఉంటుంది. దాంతో వారు సరైన మోతాదును నిర్ణయించి, మీ జబ్బును వారు త్వరగా నియంత్రించగలరు. జబ్బు నియంత్రణలోకి వచ్చాక, మీ గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన కొన్ని ఇంజెక్షన్లను సూచిస్తారు. దాంతో తప్పక మంచి ఫలితం ఉంటుంది. అందుకే ముందుగా మీరు క్వాలిఫైడ్ రుమటాలజిస్ట్ను కలిసి, వారు సూచించిన విధంగా వైద్యచికిత్స ప్రారంభించండి. తల్లి కావాలన్న మీ కోరికను సాకారం చేసుకోండి. ఆర్థరైటిస్ అంటున్నారు... ఆహారం ఎలా ఉండాలి? నా వయసు 33 ఏళ్లు. ఇటీవలే నాకు కీళ్లవాతం (ఆర్థరైటిస్) ఉందని వైద్యులు నిర్ధారణ చేశారు. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఆహార నియమాలను వివరించండి. – ఎల్. రాజ్యం, ఒంగోలు కీళ్లవాతం (ఆర్థరైటిస్) అని వైద్యులు నిర్ధారణ చేసిన వెంటనే రోగులు, వాళ్ల బంధువులు రోగి అనుసరించాల్సిన ఆహార నియమాల గురించి మొట్టమొదట కలవరపడతారు. అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సావిధానాల కన్న ఆహారపు అలవాట్ల గురించి ఎక్కువగా ఆందోళన పడతారు. ఏ వస్తువులు తినాలి, ఏవి తినకూడదు, ఏయే పదార్థాల వల్ల వాతం తగ్గుతుంది లేదా పెరుగుతుంది లాంటి సందేహాలతో సతమతమవుతారు. చాలామంది వెంటనే దుంపకూరలు, గుడ్లు, మాంసం, వంకాయ, గోంగూర వంటివి తినడం మానేస్తారు. అలాగే కొంతమంది ఒక్కసారిగా చేపలు, వెల్లుల్లి ఎక్కువగా తినడం మొదలుపెడతారు. నిజానికి గౌట్ అనే ఒక రకమైన కీళ్లవాతంలో తప్ప వేరే ఏ ఇతర కీళ్లవాతాలలోనూ ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అనేక రకాల పరిశోధనలు, క్షుణ్ణంగా పరిశీలనలు జరిపిన తర్వాత శాస్త్రవేత్తలు తేల్చి చెప్పిన మాట ఇది. గౌట్ అనే వ్యాధిలో యూరిక్ యాసిడ్ అనే ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి జరిగి కీళ్లలోకి చేరుతుంది. దానివల్ల కీళ్లలో నొప్పి, వాపు, ఎర్రబారడం వంటివి జరుగుతాయి. ఈ వ్యాధితో బాధపడేవారు మాత్రమే యూరిక్ యాసిడ్ తక్కువగా ఉత్పత్తి చేసే ఆహారాన్ని ఎంపిక చేసేకోవాలి. గౌట్ వ్యాధిగ్రస్తులు మాత్రం మాంసం, చేపలు, పీతలు, రొయ్యలు, బీన్స్ వంటి పదార్థాలను తినకూడదు. అలాగే మద్యం వల్ల కూడా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. అందువల్ల పైన పేర్కొన్నవాటికి దూరంగా ఉండాలి. ఇక ఆర్థరైటిస్ వంటి ఇతర కీళ్లవాతాలతో బాధపడేవారు ఏ విధమైన ఆహార నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. మంచి పౌష్టికాహారంతో పాటు క్యాల్షియమ్ ఎక్కువగా లభించే గుడ్లు, పాలు, పాల పదార్థాలు, ఆకుకూరలు, నట్స్ ఎక్కువగా తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. దాంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కీళ్లకు ఎంతో అవసరం. అది కీళ్లకు మేలు చేస్తుంది. ‘ఆస్టియోపోరోసిస్’కు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నా వయసు 63 ఏళ్లు. ఇటీవల జారిపడటం వల్ల ఎడమవైపు తుంటి ఎముక విరిగిపోయింది. ఈ విషయం విన్న మా ఫ్రెండ్స్‌లో కొంతమంది ఇది ఆస్టియోపోరోసిస్ అని, దానివల్ల ఇలా జరిగిందని అంటున్నారు. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించండి. – రమణమ్మ, నిజామాబాద్ మన ఎముకల పటుత్వానికి, వాటిలో ఖనిజాలు చేరడానికి క్యాల్షియమ్ ఎంతో అవసరం. ఒంట్లో దీని మోతాదు తగ్గినప్పుడు ఎముకల మధ్య రంధ్రాలు ఏర్పడి, అవి బోలుగా మారి, బలహీన పడతాయి. ఇలాంటి కండిషన్‌నే ‘ఆస్టియోపోరోసిస్’ అంటారు. ఇది మెనోపాజ్ తర్వాత స్త్రీలలో ఎక్కువగా కనపడుతుంది. హార్మోన్ల అసమతౌల్యత, తక్కువ శరీర బరువు కలిగి ఉండటం, స్టెరాయిడ్స్ వాడటం వంటి అంశాల కారణంతో పాటు సాధారణంగా విదేశాలలో అయితే మహిళల్లోనూ ఉండే మద్యపానం, పొగతాగే అలవాట్ల వల్ల కూడా ఎముక పరిమాణం తగ్గి, పటుత్వం కోల్పోతుంది. దీనివల్ల ఎముకలు తరచూ విరిగిపోతాయి. సాధారణంగా వెన్నెముక, తుంటి ఎముకలపై ఆస్టియోపోరోసిస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చాలామందిలో ఏ లక్షణాలు లేకుండానే ఈ వ్యాధి తీవ్రమవుతుంది. కొంతమందిలో విపరీతమైన నడుము నొప్పి, తరచూ ఎముకలు విరగడం, కారణం లేకుండా ఎత్తు తగ్గి, కుంగినట్లుగా అయిపోవడం జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వాళ్లలో ఆస్టియోపోరోసిస్ ఉండవచ్చునని భావించి వెంటనే రుమటాలజీ నిపుణులను సంప్రదించాలి. వారు బీఎండీ అనే పరీక్ష ద్వారా ఈ వ్యాధిని నిర్ధారణ చేసి, ఎముక పటుత్వం పెరగడానికి మందులు సూచిస్తారు. ఇక పెద్దవయసు వారిలో తరచూ కిందపడటానికి గల కారణాలను గుర్తించి, వాటి నివారణకు కృషిచేయాలి. తద్వారా రెండోసారి ఎముకలు విరగడాన్ని నివారించడం సాధ్యమవుతుంది. ఈ జాగ్రత్తలతో పాటు ఆస్టియోపోరోసిస్‌తో బాధపడేవారికి క్యాల్షియమ్, విటమిన్–డి పుష్కలంగా దొరకే ఆహారం ఇస్తుండాలి. ఈ రోగులు క్రమం తప్పక వ్యాయామం చేయడంతో పాటు తమ శరీర బరువును ఎత్తుకు తగినట్లుగా ఉంచుకోవడం వల్ల ఎముకలూ ఆరోగ్యంగా ఉండాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని మీరు వీలైనంత త్వరగా రుమటాలజిస్టును సంప్రదించి, మీ వ్యాధి నిర్ధారణ చేయించుకొని, వారు సూచించిన విధంగా చికిత్స తీసుకోవడం వల్ల ఎముకలు మాటిమాటికీ ఫ్రాక్చర్ కావడాన్ని నివారించి, ఎముకల పటుత్వాన్ని పెంచుకోవచ్చు. డాక్టర్ విజయ ప్రసన్న పరిమి సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్. -
అబార్షన్ కిల్లర్స్
ఆర్ఎంపీ ముసుగులో నకిలీ డాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా గర్భస్రావాలు ప్రాణాలు కోల్పోతున్న గర్భిణులు మాతృత్వానికి దూరమవుతున్న యువతులు లబ్బీపేట : అక్రమ సంపాదనే లక్ష్యంగా ఆర్ఎంపీల ముసుగులో నకిలీ డాక్టర్లు యువతులకు గర్భస్రావాలు చేస్తూ వారి ప్రాణాలు తీస్తున్నారు. ఎటువంటి అనుభవం, నైపుణ్యం లేని వీరి నిర్వాకం వల్ల కొందరు యువతులు మాతృత్వానికి దూరమవుతుండగా, మరికొందరు ఇన్ఫెక్షన్లు సోకి జీవితాంతం రోగాలబారిన పడుతున్నారు. మరికొందరు ప్రాణాలే కోల్పోతున్నారు. రెండు రోజుల కిందట మచిలీపట్నంలో జరి గిన భ్రూణహత్య ఘటనకు సంబంధించి చేపట్టిన విచారణలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మహిళకు గర్భస్రావం చేసిన ఆస్పత్రికి వెళ్లగా, అక్కడ మరికొంత మందికి అదే తరహాలో అబార్షన్లు చేసిన విషయాన్ని గుర్తించిన అధికారులు నివ్వెరపోయారు. నిబంధనలు ఇలా.. పెళ్లయిన వారు అప్పుడే పిల్లలు వద్దనుకున్నప్పుడు, పిల్లల మధ్య ఎడం కావాలనుకున్నప్పుడు భార్యాభర్తలిద్దరి ఇష్టప్రకారం అబార్షన్ చేయొచ్చు. భార్యకు ఇష్టం లేకుండా అబార్షన్ చేయించడం నేరం. గర్భంలో పెరుగుతున్న శిశువులో లోపాలను గుర్తిస్తే గర్భస్రావం చేయవచ్చు. అవాంఛిత గర్భం దాల్చిన వారికి సైతం సరైన జాగ్రత్తలు పాటించి అబార్షన్ చేయాలి. గర్భం 12 వారాల లోపు అయితే సింగిల్ గైనకాలజిస్టు, 13 నుంచి 20 వారాల్లోపు అయితే ఇద్దరు స్పెషలైజ్డ్ వైద్యులు పరిశీలించి గర్భస్రావం చేయాల్సి ఉంటుంది. ఇవే నిదర్శనాలు.. ►గూడూరు మండలం మల్లవోలుకు చెందిన దుర్గాదేవికి మూడో కాన్పులోనూ ఆడపిల్లే పుడుతుందని లింగనిర్ధారణ పరీక్షలో తెలుసుకుని గర్భం దాల్చిన ఆరో నెలలో అబార్షన్ కోసం ఆమె అత్తింటివారు ఓ ఆర్ఎంపీని సంప్రదించారు. ఆ ఆర్ఎంపీ మరో ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసే నర్సు సత్యవతితో కలిసి దుర్గాదేవికి మూస పద్ధతిలో అబార్షన్ చేయడంతో ఇన్ఫెక్షన్ సోకి ప్రాణాల మీదకు వచ్చింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యులు సకాలంలో శస్త్రచికిత్స చేయడంతో ఆమె కోలుకుంటోంది. ఆర్ఎంపీ, నర్సు ఇదే తరహాలో మరిన్ని అబార్షన్లు చేసినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. ►విజయవాడ కృష్ణలంకకు చెందిన వివాహితకు సింగ్‌నగర్‌కు చెందిన ఆర్ఎంపీ చేసిన అబార్షన్ వికటించడంతో ఆ మహిళ తీవ్ర రక్తస్రావంతో వారంరోజులు పోరాడి మృత్యువాత పడింది. ఆ కేసులో ఆర్ఎంపీని పోలీసులు అరెస్టు చేసినప్పటికీ బెయిల్‌పై వచ్చి తిరిగి అబార్షన్లు చేసిన వైనం తెలిసిందే. ►రెండేళ్ల కిందట విజయవాడ నగరపాలక సంస్థలో నర్సుగా పనిచేస్తున్న విజయకుమారి కొత్తపేట ప్రాంతానికి చెందిన యువతికి చేసిన గర్భస్రావం వికటించింది. ఆ యువతి పదిరోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూసింది. ఇలాంటి ఘటనలు జిల్లాలో తరచూ జరుగుతున్నప్పటికీ నకిలీలపై వైద్యాధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో నకిలీల నిర్వాకానికి అమాయక యువతులు, మహిళలు బలవుతున్నారు. అవాంఛిత గర్భందాల్చిన యువతులు గర్భస్రావాలు చేయించుకుని మాతృత్వానికి శాశ్వతంగా దూరమైన ఘటనలు గతంలో నమోదయ్యాయని వైద్యాధికారులు చెబుతున్నారు.