breaking news
Ministry of Pensions
-
పెన్షన్ల కోతపై స్పష్టతనిచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్లు తగ్గించడం కానీ, నిలిపివేయడం కానీ చేయడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి కారణంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పింఛన్లలో కేంద్రం కోత విధించనుందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. అయితే తాజాగా ఆ వార్తలపై స్పందించిన సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ.. అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. ఇంతకు ముందు చెప్పినట్టుగానే పింఛన్లు తగ్గించే ఆలోచన ఏది లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని వెల్లడించింది. పింఛన్‌దారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది. పెన్షన్‌దారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. పింఛన్లు తగ్గించే ఎలాంటి ప్రతిపాదన తమ వద్ద లేదని స్పష్టం చేసింది. ‘కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లలో 20 శాతం కోత విధించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలు నిరాధారమైనవి’ అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. -
ఇంటర్వ్యూ రద్దుపై మిశ్రమ స్పందన
దిగువ స్థాయి ఉద్యోగాలపై కేంద్రానికి రాష్ట్రాల వివరణ సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కింది స్థాయి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు స్వస్తి పలకాలన్న కేంద్ర ప్రతిపాదనకు మిశ్రమ స్పందన లభిస్తోంది. జనవరి నుంచి జరిగే నియామకాల్లో ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించొద్దని కేంద్ర సిబ్బంది,పెన్షన్ల శాఖ అన్ని మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థలకు ఆదేశాలు జారీచేయడం తెలిసిందే. రాష్ట్రాలు సైతం ఇదే పాటించాలని రాష్ట్రాల సీఎంలకు కేంద్రం లేఖలు రాసింది. దీనిపై ఇటీవల కేంద్ర సిబ్బంది,పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఒక వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేసి రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించింది. వర్క్‌షాప్‌కు హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు టీచర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదని చెప్పారు. గ్రూప్ సీ, గ్రూప్ బీ పోస్ట్‌లకు మానేసే ప్రతిపాదన ఉందని హిమాచల్ ప్రదేశ్ పేర్కొంది. కొన్ని మంత్రిత్వ శాఖలలో ఈ విధానం కొనసాగుతోందని పంజాబ్ తెలిపింది. విద్యా శాఖలో ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదని, ఆరోగ్య శాఖ లో ఈ విధానం అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మణిపూర్ తెలిపింది. రాష్ట్రంలో కొన్ని పోస్ట్‌లకు మాత్రమే ఇంటర్వ్యూలు నిర్వహించడంలేదని రాజస్ధాన్ పేర్కొంది. నియామకాల ప్రక్రియలో 61 శాతం మేరకు ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదని మహారాష్ట్ర వెల్లడించింది. గ్రూప్ డీ పోస్ట్‌లకు ఇంటర్వ్యూలు లేవని హర్యానా తెలిపింది. నియామకాల ప్రక్రియలో 85 శాతం ఇంటర్వ్యూలు లేవని తమిళనాడు పేర్కొంది. గ్రూప్ సీ, గ్రూప్ డీ పోస్ట్‌లకు ఇంటర్వ్యూలు లేవని జార్ఖండ్, ఉత్తరాఖండ్, కేరళ పేర్కొన్నాయి. టీచర్ పోస్టులకు ఇంటర్వ్యూలు లేవని యూపీ తెలిపింది. గ్రూప్ సీ, డీ, నాన్ గెజిటెడ్ గ్రూప్ బీ పోస్ట్‌లకు ఇంటర్వ్యూలు ఉండబోవని నోటిఫికేషన్ జారీ చేస్తామని పుదుచ్చెరి తెలిపింది.