breaking news
Mike Atherton
-
భారత్, పాక్ మధ్య మ్యాచ్‌లు పదే పదే వద్దు
లండన్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టోర్నమెంట్లలో ఆర్థిక అవసరాల కోసం భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లు పెట్టే సంస్కృతిని ఇప్పటికైనా వీడాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ అన్నాడు. ఇటీవల జరిగిన ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో భారత్, పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌లు జరగగా... మూడింట్లోనూ టీమిండియానే విజయం సాధించింది. అయితే ఫైనల్లో పాకిస్తాన్‌పై విజయానంతరం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా ఉన్న పాకిస్తాక్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా విన్నర్స్ ట్రోఫీ అందుకునేందుకు టీమిండియా నిరాకరించింది. ఈ టోర్నమెంట్ ఆరంభం నుంచే ఇరు జట్ల కెపె్టన్లు, ఆటగాళ్ల మధ్య ‘షేక్ హ్యాండ్’ కూడా జరగలేదు. తొలి మ్యాచ్ అనంతరం భారత జట్టు చేయి కలపలేదనే అంశాన్ని పాకిస్తాన్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతూ అమాయకుల ప్రాణాల ను బలిగొంటున్న వారికి అండగా నిలుస్తున్నంత కాలం... తమ తీరు మారదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తదుపరి రెండు మ్యాచ్‌ల్లో తేల్చిచెప్పింది. ఈ పూర్తి విషయాన్ని దగ్గర నుంచి పరిశీలిస్తున్న పాకిస్తాన్ బోర్డు అధ్యక్షుడు... విన్నర్స్ ట్రోఫీ తానే అందించాలని మంకుపట్టు పట్టాడు. దీంతో టీమిండియా ట్రోఫీ అందుకోకుండానే... స్వదేశానికి తిరిగి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అథర్టన్... భారత్, పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలు... వాటిని ఐసీసీ వినియోగించుకుంటున్న తీరును ఓ పత్రికకు రాసిన కాలమ్‌లో వివరించాడు. వారానికో మ్యాచా? ఇలాంటి చేదు అనుభవాలకంటే... ఇరు దేశాల మధ్య క్రికెట్‌ను పూర్తిగా నిలిపివేయడం మంచిదని సూచించాడు. ‘మూడు వారాల పాటు సాగిన ఆసియా కప్‌లో... ప్రతి ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగేలా షెడ్యూల్ రూపొందించారు. కేవలం ఇదొక్కటే కాదు... ఆ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయినప్పటి నుంచి గమనిస్తే... అన్నీ ఐసీసీ టోర్నమెంట్లలో లీగ్ దశలోనే ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగేలా షెడ్యూల్ చేస్తున్నారు. 2013 నుంచి చూసుకుంటే 3 వన్డే ప్రపంచకప్‌లు, 5 టి20 ప్రపంచకప్‌లు, 3 చాంపియన్స్ ట్రోఫీలు జరగగా... వాటన్నింటిలో గ్రూప్ దశలోనే ఇరు జట్లు తలపడ్డాయి. రౌండ్ రాబిన్ పద్ధతైనా... లేక గ్రూప్‌ల విధానమైనా... ఆరంభ దశలోనే ఈ రెండు టీమ్‌ల మధ్య మ్యాచ్ పరిపాటిగా మారింది’ అని అథర్టన్ రాసుకొచ్చాడు. 2008 ముంబై దాడుల సమయం నుంచే భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోగా... ఇటీవల పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత సంక్లిష్టమయ్యాయి. ఈ ఘటనలో 26 మంది అమాయకులు మృతిచెందగా... దీనికి బదులుగా భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట శత్రు దేశంలోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసి తుదముట్టించింది. ఆర్థిక అంశాలే ముఖ్యమా! ప్రపంచ క్రికెట్లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్‌కు ఉన్న ప్రాధాన్యత ఎక్కువ అని అథర్టన్ అభిప్రాయపడ్డాడు. ‘భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఎన్నో ఆర్థిక అంశాలతో కూడింది. ఐసీసీ టోర్నమెంట్ ప్రసార హక్కులకు విపరీతమైన డిమాండ్ ఉండటానికి ఈ మ్యాచ్ ప్రధాన కారణం. ద్వైపాక్షిక సిరీస్‌లకు రోజురోజుకూ ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో... ఐసీసీ ఈవెంట్ల ప్రాముఖ్యత పెరిగింది. దీంట్లో తరచూ భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. దీన్ని ముగించాల్సిన సమయం ఆసన్నమైంది. ఒకప్పుడు దౌత్యానికి ఆట దోహదం చేస్తే... ఇప్పుడదే ఉద్రిక్తతలు, ప్రచారానికి ప్రతినిధిగా మారింది. కేవలం ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు ఆ రెండు జట్ల మధ్య పదే పదే మ్యాచ్‌లు నిర్వహించడం ఇప్పటికైనా మానుకుంటేనే మంచిది’ అని అథర్టన్ పేర్కొన్నాడు. విస్తృత ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ ఇలాంటి పనులు చేయడం సరికాదని ఇంగ్లండ్ మాజీ సారథి సూచించాడు. కావాలనే రెండు జట్ల మధ్య మ్యాచ్‌లు ఉండే విధంగా చూసుకోవడానికి బదులు... ‘డ్రా’ పారదర్శకంగా ఉండాలని అభిప్రాయపడ్డాడు. పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ అంశాన్ని సైతం అథర్టన్ లేవనెత్తాడు. పాకిస్తాన్లో ఆడేందుకు టీమిండియా నిరాకరించడంతో... భారత ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించగా... ఆతిథ్య హోదా ఉన్న పాకిస్తాన్ జట్టు టీమిండియాతో మ్యాచ్‌లు ఆడేందుకు పదేపదే దుబాయ్‌కు వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగకపోతుండటంతో దాన్ని సొమ్ము చేసుకోవాలని ఐసీసీ టోర్నీల్లో పదే పదే ఇలాంటి ఏర్పాట్లు చేయడం తగదని అథర్టన్ సూచించాడు. -
వరల్డ్‌కప్‌లో భారత్‌ను ఓడించినప్పటి నుంచి నాకు అన్ని ఫ్రీ: మహ్మద్ రిజ్వాన్
స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో 0-2 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన అనంతరం పాకిస్తాన్ స్టార్ ఓపెనర్, వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రిజ్వాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇంగ్లండ్‌తో సిరీస్ గురించి అనుకుంటే పొరపాటు పడ్డట్టే. రిజ్వాన్ మాట్లాడింది టీమిండియాను ఉద్దేశించి. స్కై స్పోర్ట్స్ ఛానల్లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ ఆథర్టన్‌తో రిజ్వాన్ మాట్లాడుతూ.. టీ20 వరల్డ్‌కప్-2021లో టీమిండియాపై విజయం తన జీవితాన్ని మార్చేసిందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ చేతిలో ఎదురైన ఘోర పరాభవాన్ని సైతం పక్కకు పెట్టిన రిజ్వాన్.. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. వరల్డ్‌కప్‌లో భారత్‌పై విజయం సాధించిన నాటి నుంచి స్వదేశంలో తనకు మర్యాద విపరీతంగా పెరిగిపోయిందని, తాను షాపింగ్‌కు ఎక్కడికి వెళ్లినా షాప్ యజమానులు తన వద్ద డబ్బులు తీసుకోవట్లేదని తెలిపాడు. ఇండియాను ఓడించావు.. అది చాలు, మాకు డబ్బులు వద్దు.. నీకు అన్నీ ఫ్రీ అంటూ షాప్కీపర్లు తెగ మెహమాట పెట్టేస్తున్నారని చెప్పుకొచ్చాడు. తానైతే టీమిండియాపై గెలుపును ఓ సాధారణ గెలుపులానే భావించానని, స్వదేశానికి వెళ్లాక ఆ గెలుపు ప్రత్యేకతేంటో తనకు తెలిసి వచ్చిందని అన్నాడు. కాగా, టీ20 వరల్డ్‌కప్-2021 తొలి మ్యాచ్‌లో టీమిండియాపై పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ పాక్‌కు 152 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. రిజ్వాన్ (55 బంతుల్లో 79 నాటౌట్), బాబర్ ఆజమ్ (52 బంతుల్లో 68 నాటౌట్) అజేయ అర్ధశతకాలతో తమ జట్టును గెలిపించుకున్నాడు.


