breaking news
Migraine pain
-
కొన్ని తలనొప్పులను.. సీరియస్‌గా తీసుకోవాల్సిందే! లేదంటే..
ప్రతి ఒక్కరి జీవితకాలంలో ఏదో ఒక సమయంలో కనీసం ఒక్కసారైనా తలనొప్పి సమస్యను ఎదుర్కొంటారు. అలా చూసినప్పుడు తలనొప్పి చాలా సాధారణ సమస్య. అయితే కొన్ని జబ్బులకు తలనొప్పి ఒక సూచనలా, ఒక లక్షణంగా కూడా కనిపించవచ్చు. అందుకే తరచూ తలనొప్పితో బాధపడేవారిలో దాని కారణం కనుగొనడం కూడా డాక్టర్లకూ తలనొప్పే. తలనొప్పుల్లో రకరకాలు ఉంటాయి. రకరకాల కారణాలతోనూ వస్తుంటాయి. ఎప్పుడో ఒకసారి తలనొప్పి కనిపించినా లేదా ఏదైనా ప్రత్యేక కారణంతో అప్పుడప్పుడూ వచ్చే తలనొప్పుల గురించి అంతగా పట్టించుకోనక్కర్లేదుగానీ... కొన్ని తలనొప్పులను చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిందే. అసలు స్థూలంగా చూసినప్పడు తలనొప్పులను ఎలా విభజించుకోవచ్చు. ఏయే సందార్భాల్లో తలనొప్పుల సీరియస్‌గా తీసుకోవాలో చూద్దాం.గతంతో పోలిస్తే ఇప్పుడు తలనొప్పులు మరింత తరచుగా కనిపిస్తూ ఉన్నాయి. పైగా ఒకప్పుడు కాస్త పెద్దవయసువారిలో తరచూ కనిపించే ఈ తలనొప్పులు ఇటీవల చిన్నవయసువారిలోనూ కనిపిస్తున్నాయి. ఇక కొన్ని తలనొప్పులు జీవనశైలి మార్పుల వల్ల వస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నప్పటికీ అన్నింటినీ ఒకేగాటన కట్టడమూ సరికాదు. ఇలా చిన్నవయసు వారిలో తలనొప్పులు కనిపించగానే కళ్ల డాక్టర్‌తో కళ్లను పరీక్షింపజేసుకోవడమూ మామూలే. అలాగని మొత్తం కేసులను కళ్ల సమస్య ఖాతాలోనూ వేయడం సరికాదు. అందుకే తరచూ వస్తున్న తలనొప్పులను... అవి వచ్చే వేళలనూ, ఏదైనా ప్రత్యేక సందర్భంలో అంటే ఏదైనా వాసనలు పీల్చినప్పుడో లేదా ఏవైనా కాలుష్యాలకు గురైనప్పుడో వస్తుంటే వాటిని డాక్టర్లకు వివరించడమూ అవసరం. అప్పుడవి ఏ కారణంగా వస్తున్నాయో అంచనా వేయడానికీ డాక్టర్లకు అవకాశముంటంది.తలనొప్పుల గురించి విపులంగా...ప్రైమరీ తలనొప్పులు : సాధారణంగా ఇవన్నీ మెదడులోని రసాయనాల సమతౌల్యత తప్పడం వల్ల తలలో ఉద్భవించే తలనొప్పులని చెప్పవచ్చు. వీటిలో ప్రధానమైనవి...మైగ్రేన్...తలనొప్పులన్నింటిలోనూ మైగ్రేన్ చాలా సాధారణమైనది. ఇది టీనేజీలో చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందునా యువకుల్లో కంటే యువతుల్లో మరింత ఎక్కువ. సాధారణంగా ఒక వయసు వచ్చాక దానంతట అదే తగ్గిపోయే అవకాశం ఉన్నప్పటికీ... అది వచ్చినప్పుడు నొప్పి తీవ్రత భరించలేనంతగా ఉంటూ చాలా ఎక్కువగా బాధిస్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పాదక వయసులో ఉన్న చాలా మందిలో వాళ్ల పనిగంటలనూ, స్కూలు పిల్లలూ, విద్యార్థుల్లో వాళ్లు చదివే సమయాన్ని ఎక్కువగా వృథాచేసే తలనొప్పి ఇదే.లక్షణాలు...ఈ తలనొప్పి చాలా సందర్భాల్లో తలకు ఒకే వైపు వస్తుంటుంది. అందుకే చాలా సందర్భాల్లో చాలాచోట్ల దీన్ని ‘పార్శ్వపు నొప్పి’ అని కూడా అంటుంటారు. అయితే కొంతమందిలో మాత్రం కొన్ని సార్లు ఇది తలకు ఇరుపక్కలా వస్తుంటుంది. వచ్చినప్పుడు రెండు నుంచి నాలుగు గంటలు మొదలుకొని... కొన్ని సందర్భాల్లో 72 గంటల వరకూ రావచ్చు. తీవ్రమైన తలనొప్పితో పాటు వికారం / వాంతులు; కాంతిని చూడలేకపోవడం, వెలుతురు లేని చీకటి గదిలో ఉండాలనిపించడం... లేదా చూసినా, శబ్దాలు విన్నా తలనొప్పి విపరీతంగా పెరగడం, నిద్రపడితే తగ్గడం వంటి లక్షణాలుంటాయి. కొంతమందిలో కళ్లకు చిత్రవిచిత్రమైన కాంతి వలయాలు, కాంతిపుంజాలు, మెరుపులూ (ఆరా / ఫ్లాషింగ్ లైట్స్) కనిపిస్తాయి.కారణాలు... మైగ్రేన్‌కు చాలా కారణాలే ఉండవచ్చు. ఉదాహరణకు... తీవ్రమైన ఒత్తిడీ, యాంగై్జటీ; తమకు సరిపడని పదార్థాలేవైనా తినడం (ఉదాహరణకు చాక్లెటు, ఛీజ్, వెన్న, సోయా సాస్, కాఫీలోని కెఫిన్, ప్రాసెస్ చేసిన మాంసాహార పదార్థాలు, సిట్రస్ ఫ్రూట్స్ అంటే నిమ్మ జాతి పండ్లు వంటివి... ఇవి వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉండవచ్చు); తగినంత నిద్రలేకపోవడం, సమయానికి తినకుండా ఆకలితోనే ఉండిపోవడం, తీవ్రమైన శారీరక శ్రమ తర్వాతా, వాతావరణంలో వచ్చే ఆకస్మిక మార్పులు, అగరుబత్తీలూ లేదా కొన్ని రసాయనాలతో తయారుచేసిన సెంట్ల నుంచి వచ్చే బాగా ఘాటైన వాసనలు, ఆల్కహాల్ (ముఖ్యంగా రెడ్‌వైన్), చైనీస్ ఫుడ్ ఐటమ్స్ (ముఖ్యంగా చైనా సాల్ట్ వాడిన పదార్థాలు), యువతుల్లో హార్మోన్ల మార్పులు, తలస్నానం చేస్తూనే తలకు బిగుతైన హెయిర్ బ్యాండ్ ధరించడం, ఎండకు ఒక్కసారిగా ఎక్స్పోజ్ కావడం, మలబద్దకం వంటి అంశాలు మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించడంతో పాటు మరింత తీవ్రతరం చేస్తాయి.ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్...ఇవే కాకుండా కొందరిలో వారికి మాత్రమే ప్రత్యేకమైన కారణాలు కూడా మైగ్రేన్‌ను ట్రిగర్ చేయవచ్చు. అంటే మైగ్రేన్ అన్నది ఒక్కొక్కరిలో ఒక్కోకారణం వల్ల వచ్చే అవకాశమూ ఉంది. అందుకే మైగ్రేన్ రావడానికి ముందు 6– 12 గంటల వ్యవధిలో ఏమైనా తిన్నారా, దేనికైనా ఎక్స్పోజ్ అయ్యారా వంటి అంశాలను డాక్టర్లు అడిగి తెలుసుకుంటారు. దీని ద్వారా నిర్దిష్టంగా తలనొప్పి ఏ కారణంగా వస్తుందో తెలుస్తుంది. ఈ కారణాలను మైగ్రేన్‌ను ప్రేరేపించే అంశాలు (ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్)గా చెబుతారు.నిర్ధారణ ఇలా...మైగ్రేన్ నిర్ధారణకు నిర్దిష్టంగా వైద్య పరీక్ష అంటూ ఏదీ ఉండదు. అంటే మైగ్రేన్ అనేది నిర్దిష్టంగా ఏ వైద్యపరీక్షలోనూ తెలిసేందుకు అవకాశం లేదు. ఎందుకంటే దాన్ని పట్టి ఇచ్చే ΄్యాటర్న్ అంటూ ఏదీ ఉండదు. అందుకే... తలనొప్పుల నిర్ధారణ కోసం చేసే అన్ని వైద్యపరీక్షల్లోనూ ఏ లోపమూ కనిపించకపోవడంతో పాటు... మైగ్రేన్‌లో కనిపించే ఒకవైపు తలనొప్పి లేదా దాని లక్షణాలతో అది తరచూ అదేపనిగా వస్తుండటం, మాటిమాటికీ తిరగబెడుతుండటం వంటి లక్షణాలతో దీన్ని నిర్ధారణ చేస్తారు.చికిత్స..మైగ్రేన్‌కు రెండు రకాల చికిత్స చేస్తారు. మొదటిది... తలనొప్పి తీవ్రతను వెంటనే తగ్గించడానికి చేసే తక్షణ చికిత్స. రెండోది... ఆ తర్వాత అది మళ్లీ తిరగబెట్టకుండా ఉండేందుకు ఇచ్చే దీర్ఘకాలిక చికిత్స. ఇందుకోసం డాక్టర్ల సలహా మేరకు మూడు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ముందులు వాడాల్సి ఉంటుంది. ఇక మైగ్రేన్‌కు మందులతో పాటు యోగా, ధ్యానం (మెడిటేషన్) వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా కొంతవరకు ఉపయోగపడతాయి. ఇటీవల మందులతో తగ్గని కొన్ని మైగ్రేన్లకు బొటాక్స్ ఇంజెక్షన్‌ను ఉపయోగించి కూడా చికిత్స చేస్తున్నారు. మెగ్నీషియమ్, రైబోఫ్లేవిన్ (బి2 విటమిన్) సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలు (గోధుమ వంటి ధాన్యాలు– పండ్లు, ఆకుకూరల్లో ఇవి అధికం) తీసుకోవడం ద్వారా కూడా ఉపశమనం దొరకుతుంది.క్లస్టర్ హెడేక్... మైగ్రేన్‌తో పోలిస్తే... ఇది కాస్తంత అరుదుగా కనిపించే తలనొప్పి. కంటి పాపల వెనక బాగా తీవ్రమైన నొప్పితో ఇది మొదలవుతుంది. రెండు మూడు గంటలపాటు తీవ్రంగా బాధిస్తుంది. ఒక్కోసారి ఇది మాటిమాటికీ తిరగబెడుతూ కొద్దిరోజుల పాటు వస్తూ ఉంటుంది. రోజూ ఒకే వేళకు కనిపిస్తూ ఉంటుంది. ఏడాదిలో 8–10 వారాల పాటు రావచ్చు. ఒకసారి అలా వచ్చాక మళ్లీ ఏడాది పాటు మళ్లీ రాకపోవచ్చు. అయితే... ఆ మరుసటి ఏడాది కూడా మొదటిసారి వచ్చినట్లే మళ్లీ 8–10 వారాల పాటు అదే వేళకు వస్తూ ఉంటుంది.చికిత్స...దీనికి తక్షణ చికిత్సగా ఆక్సిజన్‌ను అందిస్తారు లేదా ముక్కు ద్వారా పీల్చే ట్రి΄్టాన్ మందులను ఇస్తారు. ఇలా మొదట వచ్చే నొప్పిని తగ్గిస్తారు. ఇక ఆ తర్వాత ఈ తరహా తలనొప్పిని రాకుండా చేయడానికి దీర్ఘకాలిక చికిత్స అందించాల్సి ఉంటుంది.టెన్షన్ హెడేక్ : తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నవారికి విపరీతమైన తలనొప్పి రావడం మనలో చాలా మందికి తెలిసిన విషయమే. ఈ నొప్పి తలకు ఇరువైపుల గానీ లేదా కొన్నిసార్లు తలలో అన్నివైపులా ఉంటుంది. కొన్ని సార్లు చాలాకాలం (దీర్ఘకాలం పాటు) వస్తుంటుంది. ఒత్తిడి తీవ్రతను బట్టి తలనొప్పి తీవ్రత కూడా పెరుగుతుండటం, ఒక్కోసారి రోజులూ, నెలల తరబడి కనిపించడం కూడా జరుగుతుంటుంది. మార్కెట్లో దొరికే సాధారణ తలనొప్పి మందులతోనే దీన్ని తగ్గించుకోవచ్చు. రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబిస్తూ ఒత్తిడి తగ్గించుకోడానికి అవలంబించే మార్గాలతో ఈ తలనొప్పి కూడా తగ్గుముఖం పట్టే అవకాశముంది.క్రానిక్ డైలీ హెడేక్... దీర్ఘకాలం పాటు రోజూ వచ్చే మైగ్రేన్, టెన్షన్ తలనొప్పులను తగ్గించుకోడానికి తరచూ నొప్పి నివారణ మందులు వాడటం వల్ల వచ్చే తలనొప్పి ఇది. మాత్ర వాడగానే మొదట్లో తలనొప్పులు తగ్గినప్పటికీ ఒక దశ తర్వాత నొప్పి నివారణ మందు తీసుకోగానే ఈ తరహా తలనొప్పి వస్తూ ఉంటుంది.ప్రైమరీ కాఫ్ అండ్ లాఫ్ హెడేక్... తీవ్రంగా దగ్గడం లేదా గట్టిగా చాలాసేపు నవ్వడం లేదా గట్టిగా తుమ్మడం వల్ల అకస్మాత్తుగా వచ్చే తలనొప్పి ఇది. చాలా అరుదుగా ఇది తలలోని సెరిబ్రోస్పినల్ ఫ్లుయిడ్ వంటి ద్రవాలను అడ్డుకోవచ్చు. ఒక్కోసారి తలలోని రక్తనాళాలనూ అడ్డుకోవచ్చు. ఒక్కోసారి గుండె నుంచి మెడ ద్వారా తలలోకి రక్తాన్ని తీసుకెళ్లే కెరోటిడ్ ఆర్టరీ అనే మంచి రక్తనాళం సన్నబడటం వల్ల కూడా ఈ తరహా తలనొప్పి రావడానికి అవకాశముంది.ప్రైమరీ స్టాబింగ్ హెడేక్... తలలో కత్తితో పొడిచినట్లుగా ఉండే తలనొప్పిని ఈ పేరుతో పిలుస్తారు.ప్రైమరీ హెడేక్ అసోసియేటెడ్ విత్ సెక్సువల్ ఇంటర్‌కోర్స్... సెక్స్‌లో పాల్గొన్నప్పుడు భావ్రపాప్తి పొందే సమయంలో అకస్మాత్తుగా వచ్చే తలనొప్పి ఇది. సెక్స్ ముగిశాక వచ్చే ఈ తలనొప్పి సాధారణంగా పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎర్గాటమైన్ లేదా ఇండోమెథాసిన్ వంటి మందులను సెక్స్‌కు ముందుగా వాడటం ద్వారా ఈ తరహా తలనొప్పిని నివారించవచ్చు. ఇక దీర్ఘకాలం పాటు ఈ నొప్పి రాకుండా ఉండటానికి ప్రొపనలాల్, డిల్టియాజెమ్ వంటి మందులు సూచిస్తారు.హిప్నిక్ హెడేక్... ఈ తరహా తలనొప్పి నిద్రలో మొదలై... నిద్రలేచాక కూడా దాదాపు 15–30 నిమిషాల పాటు వస్తూనే ఉంటుంది. సాధారణంగా 60 ఏళ్లు దాటిన వారిలో అందునా మరీ ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. నిద్రకు ఉపక్రమించే ముందు ఒక కాఫీ తాగడం లేదా లిథియమ్ మాత్రలు వంటివి ఈ తరహా తలనొప్పికి చికిత్స.తలనొప్పులు స్థూలంగా ఎన్ని రకాలంటే...తలనొప్పుల తీరుతెన్నులు, వాటి నిర్ధారణ పద్ధతులు, చికిత్సలూ, ఇతరత్రా చాలా అంశాల ఆధారంగా తలనొప్పులను చాలారకాలుగా విభజించవచ్చు. అయితే... తలనొప్పులు ఎందుకొస్తున్నాయనే కారణాలూ లేదా అవి ఉద్భవించే తీరుతెన్నులను బట్టి నిపుణులు వాటిని ప్రధానంగా మూడు రకాలుగా విభజించవచ్చు. అవి...1. ప్రైమరీ తలనొప్పులు : ఈ తలనొప్పులు నేరుగా తలలోనే పుడతాయి. అంటే... ఈ నొప్పులకు కారణం తలలోనే ఉంటుంది. అంటే ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు వాటి రిఫరల్ పెయిన్ తలకు పాకడం వల్ల ఇవి రావడం లేదనీ... ఇవి నేరుగా తలలోనే పుడుతున్నాయని అర్థం.2. సెకండరీ తలనొప్పులు: ఈ తరహా తలనొప్పులు ఇంకేదో బయటి కారణంతోగానీ లేదా ఇతరత్రా ఆరోగ్య సమస్య కారణంగా గానీ వస్తుంటాయి. అంటే... తలలో గడ్డలు ఏర్పడటం లేదా తలకు గాయం కావడం లేదా పక్షవాతం వంటి కారణాల వల్ల ఈ తలనొప్పులు రావచ్చు. అందుకే వీటిని సెకండరీ తలనొప్పులుగా చెప్పవచ్చు.3. క్రేనియల్ న్యూరాల్జియా లేదా ఫేషియల్ పెయిన్స్‌తో పాటు ఇతర తలనొప్పులు : తల లోపల 12 నరాలు ఉంటాయి. వీటినే క్రేనియల్ నర్వ్స్ అంటారు. ఈ నరాలు ఏవైనా కారణాలతో ఉద్రిక్తతకు లోనైతే వచ్చే తలనొప్పులను ఇలా చెప్పవచ్చు.సెకండరీ తలనొప్పులు...నేరుగా తలలో పుట్టే నొప్పులు కాకుండా... ఇతరత్రా కారణాలతో వచ్చే తలనొప్పులివి. వీటిలో ఈ కింద పేర్కొన్నవి కొన్ని ప్రధానమైన తలనొప్పులు.మెనింజైటిస్... ఇది మెదడు పొరల్లో ఒకదానికి వచ్చే ఇన్ఫెక్షన్ కారణంగా తలనొప్పి వస్తుంది. ఇందులోని లక్షణాలు... తలనొప్పితో పాటు జ్వరం, వాంతులు, మెడ బిగుసుకుపోయి ఉండటం, వెలుగు చూడటానికి ఇబ్బందిగా ఉండటం లేదా శబ్దాలు వినడానికి ఇబ్బందిగా ఉండటం. మెనింజైటిస్ సమస్యను సీఎస్ఎఫ్ (మెదడులోని ద్రవం – సెరిబ్రోస్పినల్ ఫ్లుయిడ్)ను పరీక్షించడం ద్వారా నిర్ధారణ చేయవచ్చు.బ్రెయిన్ ట్యూమర్... మెదడులో ఏర్పడే గడ్డల వల్ల తలనొప్పి వస్తుంది. ఇలా వచ్చే తలనొప్పిలో.... మెదడులోని గడ్డ పెరుగుతున్న కొద్దీ నొప్పి కూడా పెరుగుతూ పోతుంది. కొన్ని సందర్భాల్లో వారాల తరబడి తలనొప్పి వస్తూనే ఉంటుంది. నిద్రలేవగానే నొప్పి ఎక్కువగా ఉండవచ్చు. కొందరిలో తలనొప్పితో పాటు వాంతులూ కావచ్చు. ఒక్కోసారి ఫిట్స్ కూడా రావచ్చు. ముందుకు ఒంగినప్పుడు తలనొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది లేదా ఏదైనా వస్తువులను ఎత్తినప్పుడు తలనొప్పి మరింత పెరుగుతుంది.ఇంట్రాక్రేనియల్ హేమరేజ్ తలనొప్పులు... తల (పుర్రె)లో అంతర్గత రక్తస్రావం కావడం వల్ల వచ్చే తలనొప్పి ఇది. అకస్మాత్తుగా తలనొప్పి వచ్చి శరీరంలోని ఏదైనా అవయవం బలహీనంగా కావడం లేదా చచ్చుబడిపోయినట్లుగా కావడం జరగవచ్చు. ఒక్కోసారి మాట ముద్దముద్దగా రావడం వంటి మార్పులూ కనిపించవచ్చు. ఈ తరహా తలనొప్పిని సీటీ స్కాన్ పరీక్షతో నిర్ధారణ చేయవచ్చు.టెంపోరల్ ఆర్టిరైటిస్... ఇది సాధారణంగా 60 ఏళ్ల వారిలో కనిపించే తలనొప్పి. ఆ వయసు వారిలో మొదటిసారి కనిపించే తలనొప్పి ఇది. దీనితో పాటు జ్వరం, బరువు తగ్గడం, దవడ నొప్పి, ఏదైనా నములుతున్నప్పుడు నొప్పి పెరగడం, రాత్రిళ్లు నొప్పి ఎక్కువగా ఉండటం, కణతల వద్ద నొక్కినప్పుడు నొప్పి ఎక్కువగా ఉండటం వంటివి ఇందులో కనిపించే లక్షణాలు. రక్తపరీక్ష చేయించినప్పుడు ఈఎస్ఆర్ చాలా ఎక్కువగా ఉంటుంది. టెంపొరల్ ఆర్టరీ బయాప్సీ ద్వారా దీన్ని నిర్ధారణ చేస్తారు.గ్లకోమా హెడేక్... కంట్లో ఇంట్రా ఆక్యూలార్ ప్రెషర్ అనే ఒత్తిడి పెరగడం వల్ల వచ్చే తలనొప్పి ఇది. ఇందులో తలనొప్పితో పాటు వికారం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. ఈ సమస్య నెమ్మదినెమ్మదిగా క్రమక్రమంగా బాధితులకు తెలియకుండానే చూపును హరించి వేస్తుంది. కాబట్టి తలనొప్పి బాధిస్తున్నప్పుడు డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి. ఇవే గాక... పక్క మీద తలగడ సరిగా లేనప్పుడు, మన దేహం భంగిమ (పోష్చర్) సరిగా లేనప్పుడు కూడా తలనొప్పులు వస్తుంటాయి. ఇలా ఇతరత్రా కారణాలతో వచ్చే తలనొప్పులు చాలా ఎక్కువగానే ఉంటాయి.క్రేనియల్ న్యూరాల్జియా...మన తలలోని పుర్రెను క్రేనియమ్ అంటారు. ఇందులో కీలకమైన 12 నరాలు ఉంటాయి. వీటినే క్రేనియల్ నర్వ్స్ అంటారు. వీటి నుంచి వచ్చే తలనొప్పులను ‘క్రేనియల్ న్యూరాల్జియా’ అంటారు. న్యూరా.. అంటే నరం అనీ, అలాగే ఆల్జియా అంటే నొప్పి అని అర్థం. అందుకే ఈ తరహా తలనొప్పులను క్రేనియల్ న్యూరాల్జియా అని చెబుతుంటారు.ఆక్సిపెటల్ న్యూరాల్జియా... ఎక్కువ తీక్షణమైన కాంతిని చూసినప్పుడు తలలోని వెనుక భాగంలో (ఆక్సిపెటల్ అనే ప్రాంతంలో) ఉండే నరాలు ఉద్రిక్తతకు గురై తలనొప్పి రావచ్చు. ఇలా వచ్చే తలనొప్పిని ఆక్సిపెటల్ న్యూరాల్జియా అంటారు.ట్రైజెమినల్ న్యూరాల్జియా... ట్రైజెమినల్ నర్వ్ అని పిలిచే ఈ నరం... నుదుటి నుంచి చెంప, దవడ వరకు అంటే దాదాపు పూర్తి ముఖానికి వెళ్లే తలనరాలలో ప్రధానమైనది. ఇది తీవ్రంగా ఉద్రిక్తమైనపుపడు ఏ పదార్థాన్ని కూడా నమలలేనంత / తినలేనంత తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇందులో ఉడికించిన కోడిగుడ్డులోని తెల్లటి భాగాన్ని కూడా నమలలేనంత తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. కనీసం మాట్లాడటం కూడా సాధ్యం కాదు. ప్రముఖ బాలివుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఈ నొప్పితో చాలాసార్లు బాధపడ్డాడు. ఈ తరహా తలనొప్పిని ముందుగా మందులతో తగ్గిస్తారు. 95 శాతం కేసుల్లో మందులతోనే తగ్గుతుంది. అయితే మందులతో తగ్గనప్పుడు చిన్న శస్త్రచికిత్స లేదా రేడియో శస్త్రచికిత్స ద్వారా ఈ నొప్పిని శాశ్వతంగా తగ్గించవచ్చు.ఒక అపోహ – వాస్తవం... కొంతమంది హైబీపీ వల్ల తలనొప్పి వస్తుందని అపోహ పడుతుంటారు. నిజానికి హైబీపీ కారణంగా తలనొప్పి రావాలంటే బీపీ కొలత 180 / 110 ఉండాలి. అప్పుడు హైబీపీ కారణంగా తలనొప్పి వస్తుంది.తలనొప్పిని తీవ్రంగా పరిగణించి, ఎప్పుడు చికిత్సకు వెళ్లాలంటే...జీవితంలో మొట్టమొదటిసారే అయినప్పటికీ అది భరించలేనంత తీవ్రమైన తలనొప్పిగా వస్తున్నప్పుడు. మొదలు కావడమే తలబద్ధలైపోతూ భరించలేనంతగా తలనొప్పి వస్తున్నప్పుడు.సమయం గడుస్తున్నకొద్దీ ఏమాత్రం ఉపశమనం లేకుండా అసలేమీ తగ్గకుండా తలనొప్పి తీవ్రత అంతకంతకూ పెరుగుతూ పోతున్నప్పుడు.తలనొప్పితో పాటు జ్వరం/నీరసం/ఫిట్స్/ చేయి లేదా కాలిలో బలహీనత వచ్చి కళ్లు మసకబారుతున్నప్పుడు.పైకి లేస్తున్నప్పుడు లేదా ఏదైనా వస్తువును ఎత్తుతున్నప్పుడు లేదా ముందుకు వంగుతున్నప్పుడు తలనొప్పి వస్తుంటే.నిద్రలో తలనొప్పి వచ్చి నిద్రాభంగం అవుతున్నప్పుడు పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తున్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించి సీటీ స్కాన్/ఎమ్మారై స్కాన్ అవసరాన్ని బట్టి మెదడు నుంచి నీరు తీసి చేసే సీఎస్ఎఫ్ (సెరిబ్రోస్పినల్ ఫ్లుయిడ్) పరీక్ష వంటివి చేయించాల్సి ఉంటుంది.సాధారణ తలనొప్పి నివారణ ఇలా...తరచూ తలనొప్పి వస్తోందా? డాక్టర్‌ను సంప్రదించేలోపు ఈ జాగ్రత్తలు తీసుకోండి. తలనొప్పి రాకపోయినా భవిష్యత్తులో రాకుండా నివారించడానికి ఇవే జాగ్రత్తలు పనికివస్తాయి. అవి...కంప్యూటర్‌పై పనిచేసేతవారు కంటిపై ఒత్తిడి పడకుండా స్క్రీన్ ముందు కూర్చునేటప్పుడు యాంటీ గ్లేయర్ గ్లాసెస్ ధరించడం. అలాగే ప్రతి గంటకోమారు అయిదు నిమిషాల పాటు రిలాక్స్ కావడం. కంప్యూటర్‌పై పని చేసేవారు అదేపనిగా కనురెప్ప కొట్టకుండా తదేకంగా స్క్రీన్‌ను చూడటం సరికాదు.కుట్లు, అల్లికలు వంటివి చేసేవారు, అత్యంత సూక్ష్మమైన ఇంట్రికేట్ డిజైన్ల అల్లకం పని చేస్తుండేవారు తమ పనిలో తరచూ బ్రేక్ తీసుకుంటుండటం అవసరం.పిల్లల్లో తలనొప్పులు వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఐ సైట్ వల్ల తలనొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. తలనొప్పితో పాటు తల తిరగడం, వాంతుల కావడం వంటివి జరిగితే వెంటనే న్యూరాలజిస్టుతో పాటు కంటి వైద్యులనూ సంప్రదించడం మంచిది.రోజూ ప్రశాంతంగా కంటినిండా కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలపాటు నిద్ర పోవాలి. కొంతమందికి వారి వ్యక్తిగత నిద్ర అవసరాలను బట్టి కాస్త ఎక్కువగా, తక్కువగా నిద్రపోతారు. కాబట్టి వ్యక్తిగతంగా ఎవరికి సరిపడినంతగా వారు నిద్రించడం మంచిది.మనకు సరిపడని పదార్థాలు తీసుకోవడం ఆపేయడం.ఆల్కహాల్, పొగతాగడం వంటి దురలవాట్లు తప్పనిసరిగా మానేయడం మేలు.కాఫీ, చాకొలెట్స్, కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ లాంటి పదార్థాలను మరీ ఎక్కువగా తీసుకోకూడదు. కెఫిన్ మోతాదు ఎక్కువగా ఉండే కొన్ని రకాల శీతల పానియాలకు దూరంగా ఉండటం మంచిది.ఏదైనా అలవాటు తలనొప్పిని దూరం చేస్తుందనే అపోహతో (ఉదాహరణకు టీ, కాఫీ తాగడం వంటివి) పరిమితికి మించి తీసుకోవడం సరికాదు.ఘాటైన వాసనలకు దూరంగా ఉండాలి. సరిపడని పెర్ఫ్యూమ్స్ను వాడటం మంచిదికాదు.తీవ్రమైన చప్పుళ్లకూ, చెవులు బద్దలు కొట్టే రణగొణ శబ్దాలకు ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. పరిసరాలు ప్రశాంతంగా ఉండటం వల్ల చాలారకాల తలనొప్పులు రాకుండా నివారించవచ్చు.ఇతర రకాల తలనొప్పులు... ఇవేగాక న్యూ డైలీ పర్సిస్టింగ్ హెడేక్ (ఎన్డీపీహెచ్), ప్రైమరీ థండర్‌క్లాప్ హెడేక్, క్లస్టర్ హెడేక్స్లో ఒక రకమైన ప్రైమరీ పారాక్సిస్మల్ హెమిక్రేనియా వంటి చాలా రకాల తలనొప్పుల కూడా ఉన్నాయి. కొన్నిసార్లు పంటినొప్పి, చెవినొప్పి, గొంతునొప్పి, కళ్లు నొప్పిగా ఉండటం వంటి కారణాలు కూడా తలనొప్పికి దారితీస్తాయి. అంటే దేహంలో ఒకచోట వచ్చిన నొప్పి మరోచోటికి పాకుతుంది. రిఫరింగ్ పెయిన్ కారణంగా ఈ నొప్పులు తలనొప్పి రూపంలో కనిపిస్తుంటాయి.తలనొప్పి వచ్చినప్పుడు అంతగా ఆందోళన పడకూడదు. అయితే మాటిమాటికీ తలనొప్పి వస్తుంటే మాత్రం డాక్టర్‌ను కలిసి కారణాన్ని కనుగొనేందుకు అవసరమైన నిర్ధారణ పరీక్షలు చేయించాలి. తెలిసిన కారణాన్ని బట్టి తగిన చికిత్స తీసుకోవాలి.చివరగా... ముందుగా చెప్పినట్లు ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో తలనొప్పి కనిపించకమానదు. అయితే మంచి జీవనశైలి (లైఫ్ స్టైల్) అలవాట్లతో చాలా రకాల తలనొప్పులను మాత్రమే కాదు... చాలా రకాల జబ్బులనూ నివారించుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఉదయం నిద్రలేవగానే కనిపించే తలనొప్పలూ, వాటితో పాటు వాంతులు, వికారం, స్పృహ తప్పిపడిపోవడం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే మాత్రం తప్పనిసరిగా, వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించాలని తప్పక గుర్తుపెట్టుకోవాలి.- డా. ఎస్. రమేశ్, సీనియర్ న్యూరోసర్జన్ నిర్వహణ : యాసీన్ -
Migraine.. మాత్రలు లేకుండానే తగ్గాలంటే మ తినకూడని ఆహారాలు ఇవే!
-
మైగ్రేన్‌తో బాధపడుతున్నారా? ఇవిగో బెస్ట్ యోగాసనాలు
తరచుగా తలనొప్పి , మైగ్రేన్ బాధపడుతున్నారా? మందులతో విసిగిపోయారా? ఆగండాగండి యోగా మీకు తప్పకుండా సాయపడుతుంది.. లోతైన శ్వాస వ్యాయామాలతో కలిపి మైండ్‌ఫుల్ ఆసనాలు, ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవడం, మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడం, రక్త ప్రసరణను మెరుగు పర్చుకోవడం ఉపశమనం పొందవచ్చు. ఇవాల్టీ టిప్ ఆప్ ది డేలో భాగంగా మైగ్రేన్ తలనొప్పిని తగ్గించుకునేందుకు ఉపయోగపడే కొన్నియోగాసనాల గురించి తెలుసుకుందాం.దీర్ఘకాలిక తలనొప్పిని తగ్గించడానికి నెమ్మదిగా కదిలే, విశ్రాంతినిచ్చే యోగా ఉత్తమం. తలనొప్పి లేదా మైగ్రేన్‌తో బాధపడే ఎవరైనా వయస్సు లేదా ఫిట్నెస్ స్థాయితో సంబంధం లేకుండా ఈ యోగాసనాలను ప్రయత్నించవచ్చు. మైగ్రేన్ నుండి ఉపశమనం పొందడానికి సున్నితమైన, నెమ్మదిగా చేసే యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయాలి. మైగ్రేన్ నొప్పిని ప్రేరేపించని లేదా తీవ్రతరం చేయని సున్నితమైన, విశ్రాంతినిచ్చే యోగా పద్ధతులను ఎంచుకోవాలి. ముఖ్యంగా బాలాసనం, సేతు బంధాసనం, శవాసనం వంటివి మేలు చేస్తాయి. వేగవంతమైన, శక్తివంతమైన యోగా, చేయకూడదు. ఎందుకంటే అవి మైగ్రేన్లను ప్రేరేపించగలవు. ప్రాణాయామం (శ్వాస వ్యాయామాలు):అనులోమ విలోమ (ముక్కు రంధ్రాలు మార్చి చేసే శ్వాస), బ్రహ్మరి (తేనెటీగ శబ్దం చేసే శ్వాస) వంటివి మనస్సును ప్రశాంతపరుస్తాయి .ఒత్తిడిని తగ్గిస్తాయి. ధ్యానం ద్వారా మనస్సును శాంతపర్చి, ఒత్తిడిని తగ్గిస్తుంది. మెడ, భుజాలు ,వెన్నెముకలో ఉద్రిక్తత తరచుగా తలనొప్పికి దోహదం చేస్తుంది. కనుక వీటిని “సున్నితంగా సాగదీయడం ఈ కండరాలను సడలిస్తుంది, లోతైన శ్వాస మెదడుకు ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, హార్మోన్లను తగ్గిస్తుంది. అతి చురుకైన నరాలను శాంతపరుస్తుంది. మైండ్‌ఫుల్ అభ్యాసాలుబాలాసనం: యోగా మ్యాట్‌మీద మోకాళ్లపై కూర్చోవాలి. తరువాత పాదాలపై పిరుదులు ఆనేలా కూర్చోవాలి. తరువాత నుదురు భాగం మ్యాట్‌కు తగిలేలా మెల్లిగా ముందుకు వంగాలి. తర్వాత రెండు చేతులను ముందుకు పూర్తిగా చాపాలి. అలా ఉండి నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, వదలడం చేయాలి. శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకోనివ్వాలి. 30 సెకన్ల పాటు ఈ ఆసనం వేసినా చాలు. బాలాసనంతో ఒత్తిడిని తగ్గించి, శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మోకరిల్లి, ముందుకు మడిచి, మీ నుదిటిని నేలపై లేదా కుషన్‌పై ఉంచండి. ఇది భుజం, మెడ మరియు నుదిటి ఉద్రిక్తతను తక్షణమే తగ్గిస్తుంది.అధో ముఖ స్వనాసన: అధో ముఖ స్వనాసన అరచేతులు , పాదాలను నేలపై ఉంచి తుంటి భాగాన్ని (సూర్య నమస్కారంలో చేసినట్టుగా)పైకి లేపడం. వెన్నెముకను బలాన్నిస్తుంది. నడుము నొప్పిని తగ్గిస్తుంది. మెదడులో రక్త ప్రసరణను మెరుగుపరిచి దాని పనితీరును మెరుగుపరుస్తుంది. తలకు రక్త ప్రసరణను అందించి రిఫ్రెష్ చేస్తుంది.విపరీత కరణి: విపరీత కరణి అంటే "ప్రవాహానికి వ్యతిరేకం" అనే సంస్కృత అర్థాన్ని సూచించే యోగా భంగిమ. దీనిని "లెగ్స్ అప్ ది వాల్ పోజ్" అని కూడా పిలుస్తారు. వెల్లకిలా పడుకుని , కాళ్ళు , పాదాలను గోడకు ఆనించాలి. అరచేతులు క్రిందికి ఎదురుగా ఉండేలా చేతులను శరీరానికి దగ్గరగా ఉంచండి.ఆలోచనకు కళ్లెం వేసి, తలనొప్పి ఒత్తిడిని తగ్గిస్తుంది.సుప్త బద్ధ కోణాసన : ఇది పడుకుని చేసే సీతాకోకచిలుక భంగిమ. మనస్సును ప్రశాంతపరుస్తుంది. నేలపై వెల్లకిలా పడుకుని, పాదాల అరికాళ్ళను ఒకదానికొకటి తాకించి, మోకాళ్ళను పక్కలకు వంచండి. కావాలంటే వెన్నెముక కింద కుషన్ పెట్టుకోవచ్చు. ఈ భంగిమలో కొంత సమయం పాటు విశ్రాంతి తీసుకోండి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. హార్మోన్లను సమతుల్యం చేయడంలో, నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆందోళనతోవచ్చిన తలనొప్పిని తగ్గిస్తుంది.సేతు బంధాసనం: ఈ భంగిమ నొప్పి నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.శవాసన (శవ భంగిమ): రిలాక్స్డ్, ఫ్లాట్‌గా పడుకోండి. ఈ అంతిమ విశ్రాంతి భంగిమ మీ నాడీ వ్యవస్థను రీసెట్ చేస్తుంది. విశ్రాంతి కోసం ఈ ఆసనం చాలా ముఖ్యమైనది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసుకు ప్రశాతంతనిచ్చి, నొప్పులను తగ్గిస్తుంది.నోట్ : అవగాహనకోసం, తాత్కాలిక ఉపశమనం కోసం అందించిన చిట్కాలుమాత్రమే. మైగ్రేన్ మరింతగా బాధిస్తోంటే వైద్యుడిని సంప్రదించం మేలు, అలాగే యోగా నిపుణుని సలమా మేరకు యోగాను ప్రారంభించడం చాలా ముఖ్యం. -
నొప్పి భరించలేక యువతి ఆత్మహత్య
పెదగంట్యాడ(గాజువాక): భరించలేని తలనొప్పి కారణంగా ఓ యువతి శనివారం ఆత్మహత్య చేసుకుంది. న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాలు.. పందిరి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి టైలరింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకువస్తున్నాడు. ఇతనికి కుమారుడు, కుమార్తె శ్రావణి (22) ఉన్నారు. కుమార్తె మూడేళ్లుగా మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతోంది. ఆమె డిగ్రీ కూడా మధ్యలో ఆపేసింది. ఎంతమంది వైద్యులకు చూపించినా ఫలితం లేకపోయింది. శనివారం యువతి తండ్రి పని మీద నగరానికి వెళ్లగా, తల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లింది. సోదరుడు మిత్రులతో కలసి బయటకు వెళ్లిపోయారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే ఆమెను గాజువాకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక వైద్యం అనంతరం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడికి చేరే సరికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. యువతి త్రండి ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ రవి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మైగ్రేన్ వేధిస్తోందా? ఇలా చేయండి..
ఎన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహించినా ఏలోపం కనిపించకుండా వేధించే తలనొప్పే మైగ్రేన్. చాలామంది ఉద్యోగుల ఆఫీసు పనిగంటలూ, చాలామంది పిల్లల స్కూల్ అవర్స్ వృథా అయ్యేలా చేస్తుందీ మైగ్రేన్ సమస్య. సాధారణం మగపిల్లలతో పోలిస్తే అమ్మాయిల్లో ఇది ఎక్కువ. మైగ్రేన్‌కు కారణాలు, నివారణ, చికిత్స వంటి అంశాలను తెలుసుకోవడం కోసమే ఈ కథనం. మైగ్రేన్ సమస్య ఉన్నవారి మెదడు చుట్టూ ఉండే రక్తనాళాలు, వాటి పరిమాణం అకస్మాత్తుగా వ్యాకోచిస్తాయి. దాంతో ఆ పరిసరాల నరాలపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. అప్పుడు ఆ నరాల నుంచి రసాయనాలు విడుదల అవుతాయి. వీటివల్ల నొప్పి, వాపు వస్తాయి. రక్తనాళాల పరిమాణం విస్తరించిన కొద్దీ నొప్పి ఎక్కువ అవుతుంది. ఈ సమస్య వల్ల శరీరంలోని సింపాథెటిక్ నరాల వ్యవస్థ ఉత్తేజానికి గురికావడంతో తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ఈ తలనొప్పినే మైగ్రేన్ అంటారు. కారణాలు : ► తీక్షణమైన వెలుతురుకు ఎక్స్పోజ్ కావడం ► తీవ్రమైన మానసిక ఒత్తిడి ►నిద్రలేమి తరచూ ఉపవాసాలుండటం ►హార్మోన్ల సమస్యలుసరిపడని వాసనలు ►ఆల్కహాల్ అలవాటు, పొగాకూ... దాని ఉత్పాదనలు వాడటం, పొగతాగడం ►ఎక్కువగా కాఫీ తాగడం లేదా కెఫిన్ ఉండే పదార్థాలు తీసుకోవడం ►మహిళల్లో బహిష్టు ముందర ఈస్ట్రోజెన్ హార్మోన్స్ ఎక్కువగా స్రవించడం వల్ల మైగ్రేన్ కనిపించవచ్చు. లక్షణాలు : తలనొప్పి చాలా తీవ్రంగా వస్తుంది. ►తల బద్దలవుతున్నట్లుగా నొప్పి రావచ్చు. అది ఒక్కోసారి తలకు ఒకవైపు లేదా కొన్నిసార్లు రెండు వైపులా రావచ్చు. ►ఒక్కోసారి కళ్లచుట్టూ, కణతలో, తల వెనక భాగంలో తీవ్రమైన నొప్పి రావచ్చు .తలనొప్పి ఒక పక్క నుంచి మరో పక్కకు మారవచ్చు. ►రోజువారీ పనులు చేస్తుంటే నొప్పి మరీ ఎక్కువవుతుంది ►కొందరిలో వికారం, వాంతులు కనిపించవచ్చు. ►మరికొందరిలో అరుదుగా విరేచనాలు కావచ్చు. ►ఇకొందరిలో ముఖం పాలిపోవడం, కాళ్లూచేతులు చల్లబడటం జరగవచ్చు. ►సాధారణంగా చాలామందిలో వెలుతురు తట్టుకోలేకపోవడం, శబ్దం వినకలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ►చిరాకు, నీరసం, ఉత్సాహాంగా లేకపోవడం వంటి లక్షణాలూ ఉంటాయి. ∙తరచూ ఆవలింతలు కనిపిస్తుండవచ్చు. ముందస్తు హెచ్చరికలూ ఉంటాయి... ►మైగ్రేన్ సమస్య ఉన్నవారిలో తలనొప్పి వచ్చేముందర కొన్ని లక్షణాలను గమనించవచ్చు. వీటినే మైగ్రేన్ ఆరా అంటారు. అవి... కళ్ల ముందు మెరుపులు, ప్రకాశవంతమైన వెలుగులు కనిపించడం. ఈ మెరుపులు మధ్యలో మొదలై చివరలకు వెళ్లినట్లుగా ఉంటాయి. జాగ్రత్తలివే... ∙ఎక్కువ శబ్దాలూ, వెలుతురూ లేని గదిలో విశ్రాంతిగా పడుకోవాలి. ∙కంటినిండా నిద్రపోవాలి ∙మద్యం, పొగతాగే అలవాట్లు పూర్తిగా మానుకోవాలి. ∙కొవ్వుపదార్థాలు, తలనొప్పి ఉన్నప్పుడు ప్రోటీన్ ఫుడ్ అంటే మాంసం, పప్పులు తగ్గించాలి ∙రోజూ తగినంత నీరు తాగాలి. ∙జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి, రోజూ వ్యాయామం చేయాలి. ∙మానసిక ఒత్తిడి తగ్గించుకోడానికి బ్రీతింగ్ వ్యాయామాలూ, యోగా వంటివి అలవరచుకోవాలి. చికిత్స : మైగ్రేన్‌కు రెండు రకాల చికిత్సలు చేస్తారు. ఒకటి నొప్పి వచ్చినప్పుడు దాన్ని తగ్గించడానికి చేసే తక్షణ చికిత్స. మళ్లీ మళ్లీ నొప్పి రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన దీర్ఘకాలిక చికిత్స. డాక్టర్లు ఈ రెండు రకాల మందులు వాడుతూ చాలావరకు మైగ్రేన్‌ను నియంత్రణలో ఉంచుతారు. అయితే ఇది తీవ్రమైన తలనొప్పి కలిగించినప్పటికీ చాలామందిలో వయసు పెరుగుతున్న కొద్దీ ఇది రావడం తగ్గిపోతుంది. పైగా ప్రాణాపాయం లేని నిరపాయకరమైన సమస్య కావడం వల్ల దీనిపట్ల పెద్దగా ఆందోళన అక్కర్లేదు. -
మైగ్రేన్ బాధితులకు శుభవార్త !
మైగ్రేన్ తలనొప్పి ఎంతగా బాధపెడుతుందో అనుభవించేవారికి మాత్రమే తెలుసు.ప్రాణాంతకం కాకపోయినా... అది వచ్చిందంటే మాత్రం విద్యార్థులైతే చదువునూ, పనిచేసేవారైతే వాళ్ల పనినీ తీవ్రంగా ఆటంకపరుస్తుంది. అలాంటి మైగ్రేన్ బాధితులందరికీ ఇది ఒక శుభవార్తే. వాళ్ల కోసం లాస్మిడిటాన్ అనే మందు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీయే) ఆమోదం పొందింది. కాకపోతే లాస్మిడిటాన్ మందు వాడాక కనీసం 8 గంటల పాటు డ్రైవ్ చేయకూడదు. అదొక్కటే ఈ మందుతో ఉన్న ఇబ్బంది. ఇక త్వరలోనే మరో కొత్త ఔషధం కూడా అందుబాటులోకి రాబోతోంది. ట్రయల్స్ ముగించుకొని త్వరలో అందుబాటులోకి రానున్న ఈ కొత్త మందు పేరే ‘ఉబ్రోజపాంట్’. ప్రస్తుతం మైగ్రేన్‌కు వాడుతున్న మందులు... రక్తనాళాలను కాస్తంత సన్నబరిచేలా చేసి, బాధ ఉన్న చోట రక్తం ఒకింత తక్కువ అందేలా చేయడం ద్వారా పనిచేస్తాయి. కానీ ఇలాంటి చికిత్స గుండెజబ్బులు / రక్తనాళాలకు సంబంధించిన వాస్కు్కలార్ జబ్బులు ఉన్నవారికి అంత మంచిది కాదు. అలాంటివారిలో అది గుండెపోటు లేదా పక్షవాతానికి కారణం కావచ్చు. కానీ లాస్మిడిటన్, ఉబ్రోజపాంట్ అలా కాదు. తలనొప్పికి కారణమవుతుందని భావిస్తున్న ప్రోటీన్‌ను టార్గెట్ చేస్తాయి. నొప్పి కలిగించే ఆ ప్రోటీన్‌పై దాడి చేయడం ద్వారా వారి తలనొప్పిని, ఇతర ఇబ్బందులను అరికడతాయి. న్యూయార్క్‌లోని మోంటెఫోయిర్ హెడేక్ సెంటర్లో ఆధ్వర్యంలో ట్రయల్స్‌లో ఉన్న ఉబ్రోజపాంట్ మందు గురించిన వివరాలు ప్రముఖ మెడికల్ జర్నల్ ‘జామా’లో ప్రచురితమయ్యాయి. ఇది కూడా అందుబాటులోకి మైగ్రేన్ రోగులకు ఎంతగానో వెలుసుబాటు కలుగుతుంది. -
మండే మైగ్రేన్
త్వరలో మైగ్రేన్ నొప్పికి మరింత మెరుగైన చికిత్స! కళ్లు మిరుమిట్లు గొలుపుతూ వెలుగుతూ ఆరుతూ (ఫ్లిక్కరింగ్) ఉన్న శక్తిమంతమైన కాంతిపుంజాలతో ఒకవైపు నొప్పి అని పిలిచే పార్శ్వపు నొప్పి వచ్చేస్తుంది. పైగా ఈ వేసవిలోని అత్యధిక కాంతికి మైగ్రేన్ సాధారణం. దీనికితోడు సమ్మర్ సెలవులంటూ ఈతకు వెళ్లేవారిలోనూ మైగ్రేన్ కనిపిస్తుంటుంది. వీకెండ్, ఆదివారాల్లో విశ్రాంతిగా ఉండే... సోమవారంనాడు తప్పనిసరిగా ఆఫీసుకు వెళ్లాల్సివచ్చి... తీవ్రమైన ఒత్తిడికి గురైనా మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంది. మైగ్రేన్ ఎంతకూ తగ్గని వ్యాధిగా పేరొందింది. ఒకవేళ తగ్గినా మళ్లీ మళ్లీ వచ్చే వ్యాధి అనే అపప్రథా ఉంది. దీని బాధ అంతా ఇంతా కాక అనుభవించేవారికే తెలుస్తుంది. అయితే ఇటీవల దీన్ని తీవ్రతను తగ్గించేందుకు, గతంలో ఉన్న సంప్రదాయ మందులు, చికిత్స ప్రక్రియల స్థానంలో సాధ్యమైనంత త్వరలోనే చాలా కొత్తదైన ఓ చికిత్స ప్రక్రియ అందుబాటులోకి రానుంది. మైగ్రేన్ గురించి వివరాలతో పాటు... త్వరలో అందుబాటులోకి రానున్న ఆ సరికొత్త చికిత్స గురించి తెలుసుకుందాం... యువతీయువకులు తమ బాల్యం వీడి యుక్తవయసులోకి వచ్చే సమయంలో చాలామందిలో కనిపించే ఈ వ్యాధి యువతుల్లో మరీ ఎక్కువ. ఈ వ్యాధి బారిన పడేవారిలో 70 శాతం మంది కౌమార బాలికలే (అడాలసెంట్ గళ్స్). చాలా సందర్భాల్లో ఇది నుదుటికి ఒకవైపే వస్తుంది కాబట్టి మన వాడుక భాషలో దీన్ని పార్శ్వపు నొప్పి అని కూడా వ్యవహరిస్తుంటారు. దోహదపడే అంశాలు ఎన్నో అంశాలు మైగ్రేన్‌కు దోహదపడు తుంటాయి. అవి... తీవ్రమైన మానసిక ఒత్తిడి, అలసట (మానసిక, శారీరక) పెద్ద శబ్దాలు కళ్లు మిరుమిట్లుగొలిపే కాంతులు ఘాటైన దుర్వాసనలు డీహైడ్రేషన్ ఎక్కువ ఉపవాసాలు చేయడం, నిద్రలేమి లేదా అతిగా నిద్రపోవడం చాక్లెట్లు ఎక్కువగా తినడం, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం. ఆల్కహాల్ లేదా నైట్రేట్ పాళ్లు ఉండే కొన్ని మందులతో మైగ్రేన్ వస్తుంది లేదా మరింత తీవ్రమవుతుంది. ప్రస్తుత చికిత్స సాధారణంగా మైగ్రేన్ ఉన్నవారికి రెండు రకాల చికిత్స చేస్తుంటారు. ఒకటి తక్షణం నొప్పి తగ్గించేందుకు మందులు ఇస్తుంటారు. దీన్ని అబార్టివ్ ట్రీట్మెంట్గా పేర్కొంటారు. దీనికి తోడుగా మైగ్రేన్ మళ్లీ మళ్లీ రాకుండా ఉండేందుకు మందులు ఇస్తారు. దీన్ని ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ అని వ్యవహరిస్తారు. కొన్ని సందర్భాల్లో మైగ్రేన్‌ను మామూలు తలనొప్పిగా భావించి, తలనొప్పి తగ్గేందుకు ఇచ్చే ఇబుప్రొఫెన్, కాంబీఫ్లామ్, సారిడాన్ వంటి సాధారణ నొప్పి నివారణ మందులు ఇస్తే అది మందులకు లొంగని మొండి వ్యాధిగా పరిణమిస్తుంది. ఈ పరిస్థితినే ‘ఎన్ఎస్ఏఐడీ రీబౌండ్ హెడేక్’ అంటారు. అబార్టివ్ చికిత్స నొప్పి వచ్చినప్పుడు తక్షణ చికిత్స కోసం కొన్ని అరుదైన ఎన్ఎస్ఏఐడీ (నాన్‌స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్) వాడతారు. నొప్పి తరచూ వస్తుంటే ట్రిప్టాన్స్, ఎర్గాట్స్ అనే మందులు ఉపయోగిస్తారు. ఫ్రొఫిలాక్టిక్ చికిత్స కాల్షియుం ఛానెల్ బ్లాకర్స్, బీటా బ్లాకర్స్ వంటి వుందులు ఇస్తారు. యాంటీడిప్రెస్సెంట్స్ కూడా ఇస్తారు. ఇక బొటాక్స్తోనూ చికిత్స చేస్తారు. ఇది జీవనశైలికి సంబంధించిన వ్యాధి. కాబట్టి మైగ్రేన్‌కు దోహదపడే అంశాలను పాటిస్తూ దాన్ని రాకుండా నివారించుకోవడం అవసరం. లేకపోతే అది ఏదో దశలో మళ్లీ మళ్లీ కనిపిస్తూ బాధించే అవకాశాలున్నాయి. కొన్ని పరిస్థితుల్లో ఆకస్మిక మార్పులు కొన్ని సందర్భాల్లో హార్మోన్ల మార్పుల వల్ల మైగ్రేన్ ఆకస్మికంగా తగ్గిపోవచ్చు లేదా రావచ్చు. ఉదాహరణకు రుతుస్రావం ఆగిపోయిన (మెనోపాజ్ వచ్చిన) మహిళల్లో హార్మోన్ల మార్పుల వల్ల అంతకు ముందు వచ్చే మైగ్రేన్ తలనొప్పి ఆకస్మికంగా మాయం కావచ్చు. లేదా ఇంకొంతమందిలో ఆకస్మికంగా మొదలుకావచ్చు. గర్భం దాల్చిన మహిళల్లో 70 శాతం మందిలో ఇది ఆకస్మికంగా తగ్గిపోవచ్చు. పొరబాట్లకు తావిచ్చేదిలా కొంతమంది చిన్న పిల్లలలో మైగ్రేన్ తన మామూలు లక్షణాలతో కాకుండా కాస్త వేరుగా కనిపిస్తుంటుంది. ఉదాహరణకు వాంతుల వంటివి. దాంతో ఒక్కోసారి కొందరు డాక్టర్లు సైతం దీన్ని మైగ్రేన్‌గా గాక... అపెండిసైటిస్‌గా పొరబడే అవకాశం ఉంది. కాబట్టి పిల్లల్లో దీన్ని నిర్ధారణ చేసే సమయంలో చాలా నిశితంగా, అప్రమత్తంగా ఉండాలి. + త్వరలోనే తాజాగా అందుబాటులోకి రానున్న సరికొత్త చికిత్స ప్రక్రియ... ఇప్పుడు ఒక సరికొత్త చికిత్స ప్రక్రియను త్వరలోనే మైగ్రేన్ బాధితులకు అందుబాటులోకి తెచ్చేందుకు పరిశోధకులు, డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా లాపరోస్కోపిక్ చికిత్సతో ముక్కు లోపలే ‘నూడుల్స్’ (స్పాఘెటీ) షేప్‌లో ఉండే ఒక పైప్ లాంటి దాన్ని అమర్చుతారు. అందులో నొప్పినివారణ మందు అయిన ‘లిడోకెయిన్’ (జైలోకెయిన్) నిండి ఉంటుంది. పార్శ్వపు నొప్పి వచ్చినప్పుడు ఇందులోంచి కొంత మోతాదులో మందు విడుదల అవుతూ ఉంటుంది. 1 నుంచి 10 వరకు నొప్పి స్థాయులు ఉండే నొప్పిని కొలిచే స్కేలుపై 8.25 నొప్పి తీవ్రతతో బాధపడుతున్న 112 మంది మైగ్రేన్ బాధితులకు ప్రయోగాత్మకంగా ఈ తరహా చికిత్స చేశారు. వారిలో ఒక నెల తర్వాత 88 శాతం మందికి నొప్పి చాలావరకు తగ్గడమో లేదా పూర్తిగా తగ్గడమో జరిగింది. అయితే తీవ్రంగా నొప్పి వచ్చే సమయంలో మాత్రల అవసరం లేకుండా నొప్పిని తగ్గించడానికి ఈ ప్రక్రియను ఉపయోగిస్తారు. ఆ తర్వాత మళ్లీ మళ్లీ రాకుండా ప్రొఫిలాక్టిక్ చికిత్స కోసం వాడే మందులు ఇస్తారు. ఏడాదికి ఒకసారి నిర్వహించే ‘‘ద యాన్యువల్ మీటింగ్ ఆఫ్ ద సొసైటీ ఆఫ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ’’ సమావేశాల్లో ఈ సరికొత్త పరిశోధన ఫలితాలను పరిశోధకులు వెల్లడించారు. డాక్టర్ పద్మ వీరపనేని సీనియర్ న్యూరో అండ్ స్ట్రోక్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, హైదరాబాద్


