Metformin
-
మెట్ఫార్మిన్ ఎన్ని రోగాలకు మందో తెలుసా?
దేశంలో సుమారు 10 కోట్ల మంది మధుమేహలున్నారు. వీరిలో చాలామంది వాడే మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ ఒక్క మధుమేహానికి మాత్రమే కాదు.. అనేక ఇతర రోగాలకూ చికిత్సగా ఉపయోగపడుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. పైగా.. ఈ మందు ఇప్పటివరకూ అనుకుంటున్నట్లు కాలేయంలో కాకుండా... మన ప్రేగుల్లో పనిచేస్తూ రకరకాల వ్యాధుల ఉపశమనానికి పనికొస్తున్నట్లు నార్త్వెస్ట్ర్న్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు.ఈ తాజా పరిశోధన వివరాలు.. మీకు తెలుసా.. మెట్ఫార్మిన్కు వందేళ్లకుపైగా చరిత్ర ఉంది. 1922లో బ్రిటిష్, ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా తొలిసారి దీన్ని తయారు చేస్తే... ఆ తరువాత 1957 నుంచి ఫ్రాన్స్‌లో వాడకంలో ఉంది. కానీ.. 1995లో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతులు ఇచ్చిన తరువాత మాత్రమే ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పుడు ఒక్క అమెరికాలోనే సుమారు రెండు కోట్ల మంది ఈ మందు వాడుతూ రక్తంలోని చక్కెర మోతాదులను నియంత్రించుకుంటున్నారు. కాలేయంలో చక్కెర ఉత్పత్తిని కట్టడి చేయడం ద్వారా ఈ మందు పనిచేస్తున్నట్లు ఇప్పటివరకూ అనుకునే వారు కానీ.. వాస్తవానికి ఈ మందు ప్రేగుల్లోని మైటోకాండ్రియాపై ప్రభావం చూపడం ద్వారా కణాలు ఎక్కువ గ్లూకోజును శోషించుకునేలా చేస్తోంది అంటున్నారు నవదీప్ ఛండేల్.నార్త్ వెస్ట్ర్న్ యూనివర్శిటీ ఫీన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన ఈ శాస్త్రవేత్త మెట్ఫార్మిన్ మన పేవుల్లో ఎలా పనిచేస్తున్నాయో గుర్తించేందుకు పరిశోధనలు చేశారు. ఈ క్రమంలోనే మెట్ఫార్మిన్ అనేది పేగు కణాల్లోని మైటోకాండ్రియా సిట్రులిన్ అనే రసాయనం ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు గుర్తించారు. ఈ రసాయనం చిన్న పేగు కణాల్లోని మైటోకాండ్రియాలో మాత్రమే ఉత్పత్తి అవుతుండటం విశేషం. అలాగే మెట్ఫార్మిన్ అనేది ఆకలిని తగ్గించే సంకేతాలు పంపే గ్రోత్ డిఫరెన్షియయేషన్ ఫ్యాక్టర్ 15 ఉత్పత్తిని పెంచుతున్నట్లు తేలింది. ఫలితంగా పేగు కణాలు మరింత ఎక్కువ గ్లూకోజును శోషించుకున్నట్లు నవ్‌దీప్ ఛండేల్ వివరించారు. ఇలా శోషించుకున్న అధిక గ్లూకోజును కణాలు లాక్టేట్, లాక్ఫే అనే పదార్థాలుగా మార్చేస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. మధుమేహ నియంత్రణకు ఉపయోగపడుతుందని భావిస్తున్న బెర్బెరిన్, ఫిన్ఫార్మిన్ వంటివి కూడా ఇదే పద్ధతిలో పేగుల్లోనే చక్కెరలను నియంత్రిస్తున్నట్లు వీరు తెలిపారు. పరిశోధన వివరాలు నేచర్ మెటబాలిజమ్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.శుభవార్త ఏమిటంటే...మెట్ఫార్మిన్ ఒక్క చక్కెర నియంత్రణకు మాత్రమే పరిమితం కాదని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. ఒజెంపిక్, మంజారో వంటి జీఎల్పీ-1 మందుల వాడకాన్ని నిలిపివేసిన వాళ్లు శరీర బరువును నియంత్రించుకునేందుకూ మెట్ఫార్మిన్ ఉపయోగపడుతున్నట్లు తెలుస్తోంది. వయసుతోపాటు కణాలను చుట్టేసే మంట/వాపులను నియంత్రించడం, ప్రొస్టేట్ కేన్సర్ బాధితుల్లో వ్యాయామంతో వచ్చే లాభాలను అదేదీ లేకుండానే ఇవ్వడం మెట్ఫార్మిన్ తాలూకూ లక్షణాలని శాస్త్రవేత్తలు గుర్తించారు.ఎముకలు. కీళ్లు అరిగిపోయిన సందర్భంలో వచ్చే నొప్పిని కూడా ఈ మందు నియంత్రిస్తుందని, మెదడు పనితీరును కూడా పరిరక్షిస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ పరిశోధనలు తొలి దశలో మాత్రమే ఉండటం గమనార్హం. మరిన్ని విస్తృత స్థాయి పరిశోధనలు జరిగి ఫలితాలు నిర్ధారణ అయితేగానీ.. ఇతర ఆరోగ్య సమస్యలకు మెట్‌ఫార్మిన్‌ను మందుగా వాడటం ప్రారంభం కాదు. అప్పటివరకూ వేచి చూడాల్సిందే మరి. -గిళియారు గోపాలకృష్ణ మయ్యా. -
వయసు తగ్గించే పిల్ వస్తుందా?
వాషింగ్టన్: మధుమేహ చికిత్సకు ఉపయోగించే ఔషధం వయసును తగ్గించేందుకు, ఎక్కవకాలం ఆరోగ్యంగా జీవించేందుకు కూడా తోడ్పడుతుందట. మెట్ఫార్మిన్..అనే మందును ఇప్పటికే మధుమేహ చికిత్సకు వినియోగిస్తున్నారు. ఇది జంతవుల వయసును తగ్గించడంలో ఉపయోగిపడిందని కార్డిఫ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. వీరి అధ్యయనం ప్రకారం టైప్-2 మధుమేహ రోగులకు మెట్‌ఫార్మిన్‌ను అందించారు. ఇతర సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే వీరిలో 15శాతం ఆయుఃప్రమాణం మెరుగైనట్లు పరిశోధకులు గుర్తించారు. మధుమేహం లేనివారికి కూడా ఈ మందు వయసును తగ్గిస్తుందా అనే అంశంపై 3000 మందిని వారు అధ్యయనం చేయనున్నారు. జంతువులపై ఇదివరకే ఈ ఔషధాన్ని ప్రయోగించారు. ఈ మందు జీవక్రియా రేటుని, వయసు పెరుగుదలకు కారణమయ్యే కణ విభజన ప్రక్రియల్ని తగ్గించిందని వారు కనుగొన్నారు. ఇప్పుడు ఈ ఔషధాన్ని మనుషులపై ప్రయోగించేందుకు అమెరికా యత్నిస్తోంది. ఇది విజయవంతమైతే మానవులు ఎప్పుడూ యవ్వనంగానే కనిపిస్తారు. -
‘మెట్ఫార్మిన్’తో గుండెపోటుకు చెక్!
మధుమేహ మందుతో గుండెజబ్బులకు మేలు గుర్తించిన ఐఐసీటీ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీగిరిధర్ సాక్షి, హైదరాబాద్: మధుమేహం చికిత్స కోసం ఉపయోగించే మెట్‌ఫార్మిన్‌ను వాడటం ద్వారా గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయా? అవుననే సమాధానం చెపుతున్నారు.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) శాస్త్రవేత్త డాక్టర్ కోటంరాజు శ్రీగిరిధర్. కాలేయంలో గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా పనిచేసే మెట్ఫార్మిన్ వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేసి, జీవితకాలాన్ని పెంచుతుందని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఐఐసీటీ, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు అపోలిపో ప్రోటీన్‌ను తొలగించిన ఎలుకలకు మెట్‌ఫార్మిన్‌ను అందించినప్పుడు ఈ మందుతో అదనపు ప్రయోజనాలు ఉన్నట్లు గుర్తించారు. మెట్‌ఫార్మిన్‌తో మాక్రోఫేజెస్ల మోతాదు గణనీయంగా తగ్గడంతోపాటు ఆరోగ్యకరమైన కొవ్వుల (హెచ్‌డీఎల్) మోతాదు పెరుగుతుందని, అదేసమయంలో హానికారక కొవ్వుల (ఎల్డీఎల్) మోతాదు తగ్గుతుందని శ్రీగిరిధర్ ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. డయాబెటిస్ ద్వారా వచ్చే గుండె జబ్బును ఇది తగ్గిస్తుందని.. డయాబెటిస్ లేని వారికి వచ్చే గుండె జబ్బును కూడా తగ్గిస్తుందని డాక్టర్ శ్రీగిరిధర్ ‘సాక్షి’కి చెప్పారు. వి.సతీశ్, కె.సంతోష్, కె.కోటేశ్వరరావు, డాక్టర్ జె.మహేశ్‌కుమార్, అవినాశ్రాజ్ తదితరులు పాల్గొన్న ఈ పరిశోధన వివరాలు ప్రఖ్యాత అమెరికన్ జర్నల్ ‘డయాబిటీస్’ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.


