మెట్‌ఫార్మిన్‌ ఎన్ని రోగాలకు మందో తెలుసా? | Metformin manage high blood sugar levels helps control weight | Sakshi
Sakshi News home page

మెట్‌ఫార్మిన్‌ ఎన్ని రోగాలకు మందో తెలుసా?

May 9 2026 1:09 PM | Updated on May 9 2026 2:14 PM

Metformin manage high blood sugar levels helps control weight

దేశంలో సుమారు 10 కోట్ల మంది మధుమేహలున్నారు. వీరిలో చాలామంది వాడే మెట్‌ఫార్మిన్‌ ట్యాబ్లెట్‌ ఒక్క మధుమేహానికి మాత్రమే కాదు.. అనేక ఇతర రోగాలకూ చికిత్సగా ఉపయోగపడుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. పైగా.. ఈ మందు ఇప్పటివరకూ అనుకుంటున్నట్లు కాలేయంలో కాకుండా... మన ప్రేగుల్లో పనిచేస్తూ రకరకాల వ్యాధుల ఉపశమనానికి పనికొస్తున్నట్లు నార్త్‌వెస్ట్‌ర్న్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఈ తాజా పరిశోధన వివరాలు.. మీకు తెలుసా.. 
మెట్‌ఫార్మిన్‌కు వందేళ్లకుపైగా చరిత్ర ఉంది. 1922లో బ్రిటిష్‌, ఫ్రెంచ్‌ శాస్త్రవేత్తలు సంయుక్తంగా తొలిసారి దీన్ని తయారు చేస్తే... ఆ తరువాత 1957 నుంచి ఫ్రాన్స్‌లో వాడకంలో ఉంది. కానీ.. 1995లో అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అనుమతులు ఇచ్చిన తరువాత మాత్రమే ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పుడు ఒక్క అమెరికాలోనే సుమారు రెండు కోట్ల మంది ఈ మందు వాడుతూ రక్తంలోని చక్కెర మోతాదులను నియంత్రించుకుంటున్నారు. కాలేయంలో చక్కెర ఉత్పత్తిని కట్టడి చేయడం ద్వారా ఈ మందు పనిచేస్తున్నట్లు ఇప్పటివరకూ అనుకునే వారు కానీ.. వాస్తవానికి ఈ మందు ప్రేగుల్లోని మైటోకాండ్రియాపై ప్రభావం చూపడం ద్వారా కణాలు ఎక్కువ గ్లూకోజును శోషించుకునేలా చేస్తోంది అంటున్నారు నవదీప్‌ ఛండేల్‌.

నార్త్‌ వెస్ట్‌ర్న్‌ యూనివర్శిటీ ఫీన్‌బర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన ఈ శాస్త్రవేత్త మెట్‌ఫార్మిన్‌ మన పేవుల్లో ఎలా పనిచేస్తున్నాయో గుర్తించేందుకు పరిశోధనలు చేశారు. ఈ క్రమంలోనే మెట్‌ఫార్మిన్‌ అనేది పేగు కణాల్లోని మైటోకాండ్రియా  సిట్రులిన్‌ అనే రసాయనం ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు గుర్తించారు. ఈ రసాయనం చిన్న పేగు కణాల్లోని మైటోకాండ్రియాలో మాత్రమే ఉత్పత్తి అవుతుండటం విశేషం. అలాగే మెట్‌ఫార్మిన్‌ అనేది ఆకలిని తగ్గించే సంకేతాలు పంపే గ్రోత్‌ డిఫరెన్షియయేషన్‌ ఫ్యాక్టర్‌ 15 ఉత్పత్తిని పెంచుతున్నట్లు తేలింది. ఫలితంగా పేగు కణాలు మరింత ఎక్కువ గ్లూకోజును శోషించుకున్నట్లు నవ్‌దీప్‌ ఛండేల్‌ వివరించారు. ఇలా శోషించుకున్న అధిక గ్లూకోజును కణాలు లాక్టేట్‌, లాక్‌ఫే అనే పదార్థాలుగా మార్చేస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. మధుమేహ నియంత్రణకు ఉపయోగపడుతుందని భావిస్తున్న బెర్‌బెరిన్‌, ఫిన్‌ఫార్మిన్‌ వంటివి కూడా ఇదే పద్ధతిలో పేగుల్లోనే చక్కెరలను నియంత్రిస్తున్నట్లు వీరు తెలిపారు. పరిశోధన వివరాలు నేచర్‌ మెటబాలిజమ్‌ జర్నల్‌ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.

శుభవార్త ఏమిటంటే...
మెట్‌ఫార్మిన్‌ ఒక్క చక్కెర నియంత్రణకు మాత్రమే పరిమితం కాదని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. ఒజెంపిక్‌, మంజారో వంటి జీఎల్‌పీ-1 మందుల వాడకాన్ని నిలిపివేసిన వాళ్లు శరీర బరువును నియంత్రించుకునేందుకూ మెట్‌ఫార్మిన్‌ ఉపయోగపడుతున్నట్లు తెలుస్తోంది. వయసుతోపాటు కణాలను చుట్టేసే మంట/వాపులను నియంత్రించడం, ప్రొస్టేట్‌ కేన్సర్‌ బాధితుల్లో వ్యాయామంతో వచ్చే లాభాలను అదేదీ లేకుండానే ఇవ్వడం మెట్‌ఫార్మిన్‌ తాలూకూ లక్షణాలని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఎముకలు. కీళ్లు అరిగిపోయిన సందర్భంలో వచ్చే నొప్పిని కూడా ఈ మందు నియంత్రిస్తుందని, మెదడు పనితీరును కూడా పరిరక్షిస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ పరిశోధనలు తొలి దశలో మాత్రమే ఉండటం గమనార్హం. మరిన్ని విస్తృత స్థాయి పరిశోధనలు జరిగి ఫలితాలు నిర్ధారణ అయితేగానీ.. ఇతర ఆరోగ్య సమస్యలకు మెట్‌ఫార్మిన్‌ను మందుగా వాడటం ప్రారంభం కాదు. అప్పటివరకూ వేచి చూడాల్సిందే మరి. 
-గిళియారు గోపాలకృష్ణ మయ్యా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement