చదువుతోనే ఉజ్వల భవిష్యత్
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి : చదువుతోనే ఉజ్వల భవిష్యత్ సాధ్యమని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని టీఎస్ యూటీఎఫ్ భవనంలో విశ్వ బ్రాహ్మణ ఉద్యోగుల సేవాసమితి ఆధ్వర్యంలో విశ్వకర్మ విద్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువు ఉంటే ఏదైనా సాదిం^è వచ్చన్నారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు చదువు దారి చూపిస్తుందన్నారు. విద్యాభివృద్ధికి విశ్వ కర్మ ఉద్యోగులు చేయూతనందించడం అభినందనీయమన్నారు. విశ్వకర్మ భవన నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కల్వకుర్తి ప్రాంతానికి చెందిన విద్యార్థులకు బ్రిలియంట్ కళాశాలలో ఇంజినీరింగ్ విద్య నాలుగు సంవత్సరాల పాటు ఉచితంగా అందిస్తానని ప్రకటించారు. ఎవరూ దోచుకోలేనిది విద్య అని చెప్పారు. ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం శుభపరిణామమన్నారు. విశ్వకర్మలు నిర్మించుకునే భవనానికి బోరు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో విశ్వకర్మ ఉద్యోగ సేవాసమితి అధ్యక్షుడు యాదగిరాచారి, ప్రధాన కార్యదర్శి జగన్మోహన్చారితో పలువురు పాల్గొన్నారు.