మత్స్యకార కుటుంబాలకు వైఎస్సార్ సీపీ భరోసా
- బాధితులను
- ఓదార్చిన నేతలు
- ఆర్ధిక సాయం అందజేత
- పిఠాపురం, తుని నియోజకవర్గాలలో పర్యటన
- ధైర్యం చెప్పిన జ్యోతుల, ఎమ్మెల్యే రాజా
తుని : చేపల వేటకు వెళ్లిన మత్సకారులు బతికి ఉన్నారో లేదో తెలియక దుఃఖసాగరంలో ఉన్న బాధిత కుటుంబాలకు అండగా మేమున్నామంటూ వైఎస్సార్ సీపీ నేతలు భరోసా కల్పించారు. తుని, పిఠాపురం నియోజకవర్గాలకు చెందిన మత్సకారుల కుటుంబాలను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ పిల్లి సుబాష్ చంద్ర బోస్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు గురువారం పరామర్శించారు. యు.కొత్తపల్లి మండలం రామన్నపాలెం, ఉప్పాడలకు చెందిన తంతాడ నాగబాబు, చెక్కా సూర్యారావు, తొండంగి మండలం హుకుంపేటకు చెందిన తిత్తి అప్పలరాజు, కోడా లోవరాజు, ఆర్జిల్లి రాంబాబు, పాత పెరుమాళ్లపురానికి చెందిన చొక్కా సింహాచలం, మెరుగు బాబూరావు, చొక్కా పెంటయ్య, చొక్కా రాజు కుటుంబ సభ్యులకు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆర్థిక సాయాన్ని అందజేశారు.
శోకంలో ఉన్న వారికి ధైర్యం చెప్పారు. వేటకు వెళ్లి జాడ లేని మత్సకారులను గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైందని జ్యోతుల నెహ్రూ విమర్శించారు. అధైర్య పడవద్దని, గల్లంతైన వారిని వెతికించేందుకు తాము ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువస్తామని పేర్కొన్నారు. ఇటీవల జగన్మోహన్రెడ్డి వచ్చినప్పుడు మీ బాధలను అర్థం చేసుకున్నారని, సాయం చేయాలని తమను పంపారని వెల్లడించారు. తాము 20 రోజులకుపైగా కంటిమీద కునుకు లేకుండా తమ వాళ్ల ఆచూకీ కోసం నిరీక్షిస్తున్నామని మత్సకారుల కుటుంబ సభ్యులు నాయకుల వద్ద కన్నీరు పెట్టుకున్నారు.
ప్రభుత్వం ఎటువంటి సాయం అందించ లేదని వివరించారు. వైఎస్సార్ సీపీ బాసటగా నిలిచిందన్నారు. వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం ఇంత వరకు అందలేదని ఎమ్మెల్యే రాజా విమర్శించారు. పది రోజులలో సాయం అందించకుంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం కనీస ధర్మమన్న విషయాన్ని మంత్రులు గుర్తించ లేదని మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మండిపడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాకినీడి గాంధీ, జిల్లా కార్యదర్శులు అత్తులూరి నాగబాబు, పెదపాటి అమ్మాజీ, బోపాలపట్నం ప్రసాద్, కురుమళ్ల రాం బాబు, సీజెసీ మాజీ సభ్యుడు గంపల వెంకటరమణ, రావు చిన్నారావు, కోడా వెంకటరమణ, కొయ్యా శ్రీనుబాబు, మోతుకూరి వేంకటేష్ పాల్గొన్నారు.