breaking news
maruthi reddy
-
వేటకొడవళ్లతో వెంటాడి.. వేటాడి
అది ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రధాన రహదారి.. జన సమ్మర్ధంతో ఆ రహదారి కిటకిటలాడుతోంది. ఎవరి పనుల మీద వారు బిజీగా వెళ్తున్నారు.. ఇంతలో ఒక్కసారిగా చేతుల్లో వేటకొడవళ్లు పట్టుకున్న నలుగురు వ్యక్తులు చంపండి.. చంపండి.. అంటూ కేకలు వేస్తూ ఓ వ్యక్తిని వెంటాడుతున్న దృశ్యం. అంతే.. క్షణాల్లో ఆ వ్యక్తిపై తమ చేతిలోని మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. తీవ్ర గాయాలతో అలాగే పరుగులు పెడుతూ.. ఇక పరుగెత్తలేక రోడ్డుపై నిస్సహాయంగా పడిపోయిన ఆ వ్యక్తిని ఒకరు ఒడిసి పట్టుకుంటే.. మరొకరు వేటకొడవలి తీసుకుని మొద్దులు నరికినట్లు కసితీరా నరికి చంపి తాపీగా నడుచుకుంటూ వెళ్లారు. పట్టపగలు.. నడిరోడ్డుపై.. జనం అంతా చూస్తుండగా జరిగిన ఈ దారుణ హత్య ప్రొద్దుటూరులో తీవ్ర భయోత్పాతాన్ని సృష్టించింది. ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరు పట్టణం టీబీరోడ్డులో గురువారం ఉదయం జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామానికి చెందిన బోరెడ్డి మారుతి ప్రసాద్‌రెడ్డి (34) ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. డీఎస్పీ భక్తవత్సలం తెలిపిన వివరాల మేరకు బోరెడ్డి మారుతి ప్రసాద్‌రెడ్డి తండ్రి మునిరెడ్డి కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో అతను ఇంటి వద్ద ఉండి పొలం పనులు చూసుకునేవాడు. అతని అక్క అనురాధా ప్రొద్దుటూరులోని శాస్త్రీనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈమె రూరల్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఈమెకు టీచర్స్ కాలనీకి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి అనే వ్యక్తితో స్నేహం ఏర్పడింది. ఈ విషయం అతని బామ్మర్దులు రఘునాథరెడ్డి, శ్రీనివాసులరెడ్డితోపాటు భార్య నిర్మలకు తెలిసింది. ఈ క్రమంలో 2014లో నిర్మల శాస్త్రీనగర్‌లోని అనురాధ ఇంటి వద్దకు వెళ్లి గొడవ పడ్డారు. ఇకపై తన భర్తను ఎప్పుడు ఇంటి వద్దకు రానివ్వద్దని హెచ్చరించారు. ఈ విషయం అనురాధ తమ్ముడు మారుతి ప్రసాద్‌రెడ్డికి తెలియడంతో నిర్మల ఇంటికి వెళ్లి ఎందుకు మా అక్కను తిట్టావని బెదిరించాడు. ఇకపై ఇలా చేస్తే నీ అంతు చూస్తానని ఆమెను హెచ్చరించాడు. ఈ సంఘటనపై నిర్మల రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మారుతి ప్రసాద్‌రెడ్డిపై 447, 507 సెక్షన్ల కింద బెదిరింపుల కేసు నమోదైంది. అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నిర్మల సోదరులు రఘునాథరెడ్డి, శ్రీనివాసులరెడ్డిలు మారుతి ప్రసాద్‌రెడ్డిపై పగను పెంచుకున్నారు. మారుతి ప్రసాద్‌రెడ్డిని హతమార్చాలని పథకం.. రఘునాథరెడ్డి ప్రకాశం జిల్లా, కనిగిరి తాలుకా, పామూరులో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. అతను ఏడాది క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రొద్దుటూరులోనే ఉంటున్నాడు. మారుతి ప్రసాద్‌రెడ్డిని చంపేందుకు పలువురితో కలిసి వ్యూహరచన చేసేవాడు. నెల రోజుల క్రితం పోలీసులకు ఈ విషయం తెలియడంతో రఘునాథరెడ్డి, పెద్ద దండ్లూరుకు చెందిన పట్నం ధరణి, ఈశ్వరరెడ్డినగర్కు చెందిన వెంకటరమణలను త్రీ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండుకు తరలించారు. ఇటీవల వీరు బెయిల్‌పై బయటికి వచ్చారు. రఘునాథరెడ్డి జైలులో ఉన్నప్పుడు నిర్మల ఇంటిలో ఒంటరిగా ఉన్న సమయంలో మారుతి ప్రసాద్‌రెడ్డి ఆమె ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. ఈ విషయం జైలు నుంచి రాగానే తన సోదరులతో ఆమె చెప్పింది. మారుతి ప్రసాద్‌రెడ్డి సింగపూర్‌లో ఉన్నందున చాలా కాలం నుంచి 2014లో నమోదైన కేసులో కోర్టు వాయిదాలకు రావడం లేదు. తల్లి వెంకటలక్ష్మమ్మకు గుండె ఆపరేషన్ చేయడంతో రెండు నెలల క్రితం అతను సింగపూర్ నుంచి వచ్చాడు. గురువారం వాయిదా ఉందని తెలియడంతో దేవగుడి నుంచి ప్రొద్దుటూరుకు వచ్చాడు. ఈ కేసులో వాయిదా కోసం నిర్మల కూడా తన సోదరులతో కలిసి కోర్టుకు వచ్చింది. ఉదయం 10.10 గంటలకు కోర్టు ముందు ఉండగా ఎందుకు మా అక్క ఇంటి తలుపులు తట్టావని రఘునాథరెడ్డి అతనితో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో పథకం ప్రకారం తమ వెంట తెచ్చుకున్న వేట కొడవళ్లతో రఘునాథరెడ్డి, శ్రీనివాసులరెడ్డితో పాటు మరో ఇద్దరు మారుతి ప్రసాద్‌రెడ్డిని వెంటాడారు. వారి నుంచి తప్పించుకునేందుకు అతను టీబీ రోడ్డు వెంట పరుగులు తీశాడు. మధ్యలోనే కత్తి పోట్లకు గురైన అతను మార్కెట్ యార్డు సమీపంలోకి రాగానే కింద పడిపోయాడు. శ్రీనివాసులరెడ్డి గట్టిగా పట్టుకోగా రఘునాథరెడ్డి వేట కొడవలితో అందరూ చూస్తుండగానే దారుణంగా నరికి చంపాడు. పట్టపగలే అతి దారుణంగా నరకడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. కళ్ల ముందే అతను దారుణ హత్యకు గురవుతున్నా నివారించడానికి ఎవరూ సాహసం చేయలేదు. చుట్టూ గుమి కూడిన ప్రజలు చంపొద్దు.. చంపొద్దు అంటూ గట్టిగా కేకలు వేశారు. అందరూ చూస్తుండగానే మారుతి ప్రసాద్‌రెడ్డి ప్రాణాలు గాలిలో కలిశాయి. విషయం తెలియడంతో సీఐలు బాలస్వామిరెడ్డి, ఓబులేసు, ఎస్ఐలు సంఘటనా స్థలానికి వచ్చారు. కొన్ని నిమిషాల్లోనే పోలీసులు రఘునాథరెడ్డి, శ్రీనివాసులరెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. అనురాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ ఓబులేసు తెలిపారు. డీఎస్పీ భక్తవత్సలం సంఘటన స్థలాన్ని పరిశీలించి స్థానిక పోలీసు అధికారుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో హత్య దృశ్యాలు సినిమా షూటింగ్‌ను తలపిస్తూ జరిగిన మారుతి ప్రసాద్‌రెడ్డి హత్య సంఘటనను స్థానికులు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు. కొన్ని సెకండ్లలోనే వాట్సాప్, ఫేస్బుక్లో హత్య దృశ్యాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి సెల్ఫోన్లలో హల్చల్ చేశాయి. అది ఫ్యాక్షన్ హత్య కాదు– వివాహేతర సంబంధమే కారణం ► పోలీసుల అదుపులో నిందితులు ► విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) సత్య ఏసుబాబు కడప అర్బన్ : ప్రొద్దుటూరు పట్టణం మార్కెట్‌యార్డు సమీపంలో గురువారం జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామానికి చెందిన బోరెడ్డి మారుతిరెడ్డి (36) దారుణంగా హత్యకు గురయ్యాడని, ఈ హత్యతో ఫ్యాక్షన్‌కు గానీ, ముఠా కక్షలకుగానీ, రాజకీయంగా కానీ ఎలాంటి సంబంధం లేదని జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) బి.సత్య ఏసుబాబు అన్నారు. గురువారం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలో అత్యవసరంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మలమడుగు మండలం దేవగుడికి చెందిన బోరెడ్డి మారుతిరెడ్డిని ప్రొద్దుటూరు పట్టణం నడింపల్లెకు చెందిన నరసాపురం శ్రీనివాసరెడ్డి, రఘునాథరెడ్డిలు మార్కెట్‌యార్డు సమీపంలో దారుణంగా హత్య చేశారన్నారు. ఈ హత్య వెనుకగల కారణాలు ప్రాథమికంగా ఇలా ఉన్నాయని ఆయన వివరించారు. హతుడు మారుతిరెడ్డి సోదరి అనూరాధ ప్రొద్దుటూరుపట్టణంలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తోందన్నారు. అనూరాధకు నిందితుల బావమరిది చంద్రశేఖర్‌రెడ్డితో వివాహేతర సంబంధం ఉందన్నారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రశేఖర్‌రెడ్డి భార్య నిర్మల, ఆమె కుమారుడు అనూరాధ ఇంటికి వెళ్లి వారితో గొడవపడ్డారన్నారు. ఈ వివాహేతర సంబంధం ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థలకు, కక్షలకు దారి తీసిందన్నారు. గురువారం తనపై ఉన్న పాత కేసు వాయిదా కోసం కోర్టుకు హాజరయ్యేందుకు మారుతిరెడ్డి వస్తుండగా నిందితులు హత్య చేశారన్నారు. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారన్నారు. ఈ సమావేశంలో ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ శ్రీనివాసులు, టాస్క్‌ఫోర్స్ సీఐ నాయకుల నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. -
నడిరోడ్డుపై దారుణహత్య
ప్రొద్దుటూరులో వేట కొడవళ్లతో వెంటాడి చంపిన ప్రత్యర్థులు ప్రొద్దుటూరు క్రైం: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో కోర్టు వాయిదాకు వచ్చిన ఓ యువకుడిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. పట్టపగలు నడిరోడ్డులో వేట కొడవళ్లు చేత బట్టుకుని వెంటాడి నరికి చంపిన సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామానికి చెందిన బోరెడ్డి మారుతీప్రసాద్‌రెడ్డి (34) డిగ్రీ చదువుకున్నాడు. మూడేళ్ల కిందట విజయవాడకు చెందిన మహిళతో వివాహం కాగా ఇటీవలే విడాకులు తీసుకున్నాడు. తండ్రి చనిపోవడంతో కొంతకాలం ఇంటివద్దే ఉండి పొలం పనులు చూసుకున్న అతడు తర్వాత సింగపూర్ వెళ్లి కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మూడేళ్ల క్రితం తన సోదరిని తిట్టిందనే కోపంతో నిర్మలమ్మ అనే మహిళను ఆమె ఇంటికెళ్లి బెదిరించాడనే ఆరోపణలపై రూరల్ పోలీస్‌స్టేషన్‌లో మారుతీప్రసాద్‌రెడ్డిపై కేసు నమోదైంది. అయితే చాలాకాలంగా కోర్టు వాయిదాలకు హాజరుకాలేదు. నెలరోజుల కిందట సింగపూర్ నుంచి వచ్చిన అతను గురువారం వాయిదా ఉండటంతో ప్రొద్దుటూరు కోర్టుకు వచ్చాడు. అతడిపై ఫిర్యాదు చేసిన నిర్మలమ్మ, ఆమె బంధువులు కూడా వచ్చారు. కోర్టు వద్ద మారుతీప్రసాద్‌రెడ్డితో వారు వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలోనే తమ వద్ద ఉన్న వేటకొడవళ్లతో అతడిపై దాడికి ప్రయత్నించారు. దీంతో అతను జమ్మలమడుగు రోడ్డువైపు పరుగెత్తాడు. నలుగురు వ్యక్తులు వేట కొడవళ్లతో అతని వెంటపడ్డారు. రెండు కత్తిపోట్లు తగలడంతో మార్కెట్ యార్డు వద్ద కిందపడిన మారుతీప్రసాద్‌రెడ్డిని నిర్మలమ్మ సోదరులు శ్రీనివాసులరెడ్డి, రఘునాథరెడ్డిలు అందరూ చూస్తుండగానే కత్తులతో విచక్షణారహితంగా నరికి హత్యచేశారు. అనంతరం ఇద్దరు నిందితులను త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపారు