breaking news
Markapuram Constituency
-
మిమ్మల్నే గెలిపించుకుంటాం
ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం పరిధిలోని కొనకనమిట్ల వద్ద ఏప్రిల్ 7న 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. షెడ్యూలు ప్రకారం అక్కడ మధ్యాహ్నం 3.30 గంటలకు సభ ప్రారంభమవుతుందని నిర్వాహకులు చెప్పడంతో మధ్యాహ్నం 12 గంటలకే సభా ప్రాంగణంలోకి జనప్రవాహం ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటలకే సభా ప్రాంగణం ఇసుకేస్తే రాలనంతగా జనంతో కిక్కిరిసిపోయింది. ఓ వైపు మండుతున్న ఎండ.. మరో వైపు ఉక్కపోత.. అయినా సభా ప్రాంగణం నుంచి లక్షలాది మంది అక్కడి నుంచి కాలు కదపలేదు. బస్సు యాత్రకు జనం అడుగడుగునా నీరాజనం పలకడంతో సభా ప్రాంగణానికి సీఎం వైఎస్ జగన్ కాస్త ఆలస్యంగా సాయంత్రం 5 గంటలకు చేరుకున్నారు. జననేతను చూడగానే అప్పటిదాకా పడిన ఇబ్బందిని జనం మరిచిపోయి ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. ‘ఇంత మేలు చేసిన మీకు కాకుండా ఎవరికి ఓటు వేస్తాం.. మిమ్మల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మాదే’నంటూ నినాదాలు చేశారు. ఇలా ఎక్కడికక్కడ సీఎం జగన్ పట్ల పెరుగుతున్న ఆదరణ సరికొత్త చారిత్రక విజయానికి బాటలు వేస్తోంది. సాక్షి, అమరావతి: పేదంటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చడానికి.. చంద్రబాబు వంటి మోసగాళ్ల నుంచి రాష్ట్ర భవిష్యత్తును కాపాడేందుకు ‘నేను సిద్ధం.. మీరంతా సిద్ధమా?’ అని సీఎం వైఎస్ జగన్ పిలుపునిస్తే.. సెల్ ఫోన్ టార్చ్‌లైట్ వెలిగించి ‘మేమంతా సిద్ధం’ అంటూ లక్షల గళాలు దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్నాయి. మేమెంతా మీ వెంటేనంటూ అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, అన్నదమ్ములు అడుగులో అడుగు వేస్తున్నారు. ఎక్కడికక్కడ అభిమానం అడ్డుపడుతుండటంతో సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర షెడ్యూల్ సమయం కంటే రెండు గంటలు ఆలస్యంగా సాగుతోంది. ఈ నెల ఒకటవ తేదీన శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోకి షెడ్యూలు సమయం కంటే మూడు గంటలు ఆలస్యంగా సాయంత్రం 5.45 గంటలకు సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర ప్రవేశించింది. మధ్యాహ్నం 2 గంటలకే నేల ఈనిందా అన్నట్లుగా జనంతో కదిరి కిక్కిరిసిపోయింది. అనంతపురం–మదనపల్లె రహదారిపై సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన రోడ్ షోకు అడగడుగునా జనం నీరాజనాలు పలకడంతో కుంభమేళాను తలపించింది. రోడ్ షో సాగినంత దూరం సెల్‌ఫోన్ టార్చ్లైట్లను వెలిగించి జనం సీఎం వైఎస్ జగన్‌కు సంఘీభావం తెలిపారు. రెండు కిలోమీటర్ల పొడవున రోడ్ షో నిర్వహించడానికి 2.10 గంటల సమయం పట్టిందంటే జనం ఏ స్థాయిలో పోటెత్తారన్నది అర్థం చేసుకోవచ్చు. అందరి అభిమతం అదే.. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయ నుంచి పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం గంటావారిపాలెం వరకు ఇప్పటిదాకా సాగిన బస్సు యాత్రలో అడగడుగునా ఇలాంటి దృశ్యాలు సాక్షాత్కారించాయి. సాధారణంగా ఎన్నికల సమయంలో మీకు ఫలాన మేలు చేస్తాం.. మాకు ఓటేయండి.. అని ప్రజలకు నాయకులు హామీలు ఇస్తుంటారు. కానీ.. బస్సు యాత్రలో జనంతో సీఎం వైఎస్ జగన్ మమేకమైనప్పుడు ‘మీ పాలనలో మాకు మంచి జరిగింది. మళ్లీ మీరే రావాలి. మిమ్మిల్నే గెలిపించుకుంటాం’ అంటూ యువతీ యువకుల నుంచి వృద్ధుల వరకు హామీలు ఇస్తుండటం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దేశ రాజకీయ చరిత్రలో ఇలాంటి మహోజ్వల ఘట్టాలను తామెన్నడూ చూడలేదని.. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం బలంగా నాటుకుపోయిందనడానికి ఇవే తార్కాణమని విశ్లేషిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మరో చారిత్రక విజయం సాధించడం ఖాయమనడానికి బస్సు యాత్రలో అడుగడుగునా కన్పిస్తున్న దృశ్యాలే నిదర్శనమని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే టైమ్స్ నౌ–ఈటీజీ, జీన్యూస్ వంటి ప్రతిష్ఠాత్మక జాతీయ మీడియా సంస్థలు డజనుకు పైగా నిర్వహించిన సర్వేల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించడం ఖాయమని తెగేసి చెబుతుండటం గమనార్హం. జైత్ర యాత్రలా బస్సు యాత్ర సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా గత నెల 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ వద్ద మహానేత వైఎస్సార్ ఘాట్ నుంచి సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రను ప్రారంభించారు. వైఎస్సార్, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల మీదుగా ఇప్పటిదాకా బస్సు యాత్ర సాగింది. మండుటెండను లెక్క చేయకుండా స్కూలు విద్యార్థుల దగ్గర నుంచి అవ్వాతాతల వరకు పోటీపడి సీఎం జగన్‌కు సంఘీభావం తెలుపుతున్నారు. బిడ్డలను చంకనేసుకుని సీఎం జగన్‌ను చూసేందుకు బస్సు వెంట యువతీ యువకులతో పోటీపడుతూ మహిళలు పరుగులు తీస్తున్న దృశ్యాలు అడుగడుగునా కన్పిస్తున్నాయి. స్కూలు విద్యార్థులైతే సీఎం జగన్‌ను చూసేందుకు తల్లితండ్రులతోపాటు వస్తున్నారు. సీఎం జగన్‌ను చూడగానే ‘అదుగో జగన్ మామయ్య’ అంటూ చూపుతున్నారు. ఆ పిల్లలను సీఎం జగన్ అక్కున చేర్చుకుంటుండటంతో పిల్లలు ఆనందపరవశులవుతున్నారు. సీఎం వైఎస్ జగన్‌ను దగ్గర నుంచి చూసేందుకు.. మాట కలిపేందుకు.. వీలైతే సెల్ఫీ దిగేందుకు జనం పోటీ పడుతున్నారు. యువత, మహిళలు, రైతులు, వృద్దులు ఇలా అన్ని వర్గాల వారితో సీఎం మేమకమవుతున్నారు. బస్సు యాత్రలో భాగంగా ప్రొద్దుటూరు, నంద్యాల, ఎమ్మిగనూరు, మదనపల్లె, పూతలపట్టు, నాయుడుపేట, కావలి, కొనకనమిట్లలో నిర్వహించిన బహిరంగ సభలకు జనం పోటెత్తడంతో ఒకదానికి మించి మరొకటి సూపర్ హిట్టయ్యాయి. ఏ సమయం అయినా సీఎం వైఎస్ జగన్ నిర్వహించే రోడ్ షోల్లో అభిమాన సంద్రం ఉప్పొంగుతోంది. రాత్రి పొద్దుపోయినా దర్శి జన సంద్రాన్ని తలపించింది. ప్రజల్లో విశ్వసనీయతకు ప్రతీక ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం సీఎం వైఎస్ జగన్ అమలు చేశారు. గత 58 నెలల్లో అర్హతే ప్రామాణికంగా.. ఎలాంటి వివక్షకు తావు లేకుండా.. అత్యంత పారదర్శకంగా నవరత్నాలు, సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో 87 శాతం కుటుంబాల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 కోట్ల ప్రయోజనం చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి రూ.4.49 లక్షల కోట్ల ప్రయోజనం కలిగించారు. దేశ చరిత్రలో ఇదో రికార్డు. వాటిని సద్వినియోగం చేసుకున్న ప్రజలు పేదరికం నుంచి గట్టెక్కుతున్నారు. రాష్ట్రంలో పేదరికం 2015–16లో 11.77 శాతం ఉంటే.. 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. విద్య, వ్యవసాయ, పారిశ్రామిక, వైద్య రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకు పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేసి ఆ వర్గాల సామాజిక సాధికారతకు బాటలు వేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దే ప్రజలకు అందిస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు కొనసాగించి.. సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ నాయకత్వంపై ప్రజల్లో రోజు రోజుకు విశ్వసనీయత పెరుగుతోంది. ఇదే బస్సు యాత్రలో సీఎం వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం పట్టడానికి దారితీస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాబోయేది వైఎస్సార్సీపీ సునామీయే సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి భీమిలి (ఉత్తరాంధ్ర), దెందులూరు (ఉత్తర కోస్తా), రాప్తాడు (రాయలసీమ), మేదరమెట్ల (దక్షిణ కోస్తా)లలో నిర్వహించిన సిద్ధం సభలకు జనం పోటెత్తడంతో ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సిద్ధం సభలు అతి పెద్ద ప్రజాసభలుగా నిలిచాయి. ఇదే సమయంలో ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహిస్తున్న బస్సు యాత్ర జైత్ర యాత్రలా కొనసాగుతోంది. ప్రజాక్షేత్రంలో సీఎం వైఎస్ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోవడానికి భయపడిన చంద్రబాబు.. జనసేనతో జట్టుకట్టి తాడేపల్లిగూడెంలో ఉమ్మడిగా నిర్వహించిన సభ జనం లేక అట్టర్ ప్లాప్ అయ్యింది. దాంతో బీజేపీతో జట్టుకట్టిన టీడీపీ–జనసేన.. సాక్షాత్తు ప్రధానిని రప్పించి చిలకలూరిపేటలో ప్రజాగళం పేరుతో నిర్వహించిన సభకు జనం మొహం చాటేయడంతో కూటమిలో నైతిక స్థైర్యం దెబ్బతింది. పొత్తులో సీట్ల లెక్క తేలాక.. అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యాక, ఆపార్టీలో చెలరేగిన అసమ్మతి కూటమిని చావు దెబ్బతీసింది. కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి వృద్ధులకు ఇంటి వద్ద పెన్షన్ అందించకుండా వలంటీర్లను చంద్రబాబు అడ్డుకోవడంతో కూటమిపై అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఓ వైపు సీఎం బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పడుతుండటం.. మరో వైపు చంద్రబాబు ప్రజాగళం పేరుతో, పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలకు ప్రజలు మొహం చాటేస్తుండటంతో కూటమి అభ్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 21–22 లోక్‌సభ స్థానాలు చేజిక్కించుకుని ఘన విజయం సాధిస్తుందని పలు జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడైంది. ఈ దృష్ట్యా రాబోయేది వైఎస్సార్సీపీ సునామీయేనని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. -
మంత్రుల వద్ద ‘రియల్’ పంచాయితీ
♦ రియల్ ఎస్టేట్ కేసు నుంచి పోలీసులను తప్పించేందుకు మార్కాపురం టీడీపీ మాజీ ప్రజాప్రతినిధి యత్నాలు ♦ అసెంబ్లీకి వెళ్లి మంత్రులకు వినతి ♦ సమస్య నుంచి గట్టెక్కేందుకు శతవిధాలా ప్రయత్నం ♦ మంత్రుల నుంచి లభించని హామీ ♦ అధికార పార్టీ నేతల మాటలు విని ఇప్పటికే ముగ్గురు అధికారుల సస్పెన్షన్ ♦ ఇప్పుడు ఎస్‌ఐౖపైనా వేటు మార్కాపురం: మార్కాపురం రియల్ఎస్టేట్ పంచాయితీ విజయవాడ, హైదరాబాద్ మీదుగా రాజధాని అమరావతి చేరుకుంది. ఈ సంఘటనలో పరోక్షంగా ఉన్న మార్కాపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ మాజీ ప్రజాప్రతినిధి.. కేసు నుంచి పోలీసు అధికారులను తప్పించేందుకు, తన అనుచరుల డబ్బులు ఇప్పించేందుకు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులతో పాటు ముఖ్యమంత్రి తరువాత స్థానంలో ఉన్న మంత్రిని ఆశ్రయించారు. అయితే, గత మూడు రోజులుగా పత్రికలు, టీవీల్లో ఈ సంఘటనపై కథనాలు రావటంతో మంత్రులు కూడా ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. సోమవారం అసెంబ్లీకి వెళ్లిన మాజీ ప్రజాప్రతినిధి మంత్రులను కలిసి మార్కాపురం పరిస్థితులను వివరించగా ఇలా అయితే ఎలా అంటూ ప్రశ్నించి ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం. ఎలాగైనా ఈ గండం నుంచి గట్టెక్కించాలని మార్కాపురం నేత శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు. రియల్ పంచాయితీ కథ ఇదీ.. హైదరాబాద్‌కు చెందిన కందుల రంగారెడ్డి విజయవాడకు చెందిన కె.రామమోహనరావు, మార్కాపురం పట్టణానికి చెందిన మరికొందరు నేతలు రియల్ఎస్టేట్ వ్యాపారం చేయాలని నిర్ణయించుకుని సుమారు రూ.3 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. అయితే, ఆరు నెలల నుంచి పెద్ద నోట్ల రద్దు, కరువు పరిస్థితుల నేపథ్యంలో రియల్ ఎస్టేట్ బూం పడిపోవటంతో నగదు లావాదేవీలపై భాగస్తుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. వీరిలో ఒక భాగస్వామి మార్కాపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ మాజీ ప్రజాప్రతినిధిని ఆశ్రయించటంతో ఆ నేత పోలీసు శాఖలో తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి ఈ గండం నుంచి గట్టెక్కిస్తానని హామీ ఇచ్చాడు. పోలీసు అధికారులతో పక్కా ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగా గత ఏడాది నవంబర్ 19న రామకోటేశ్వరరావుపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి గత నెల 24న రామకోటేశ్వరరావు గుంటూరులో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి నిందితుడిని తీసుకుని వచ్చే క్రమంలో తుపాకీతో బెదిరించారు. ఇవి ప్రసార మాధ్యమాల్లో ప్రసారం కావటంతో మార్కాపురం సంఘటనపై ఎస్పీ త్రివిక్రమవర్మ, పరిపాలన ఓఎస్డీ దేవదానంను విచారణ అధికారిగా నియమించారు. పట్టణ ఎస్సై సుబ్బారావును వీఆర్‌కు బదిలీ చేశారు. మరికొందరు సిబ్బందిపై వేటు పడే అవకాశం ఉంది. ఇప్పటికే ముగ్గురు అధికారుల సస్పెన్షన్: నియోజకవర్గంలో టీడీపీ నేతల మాటలు విని చట్ట విరుద్ధంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులు సస్పెన్షన్‌కు గురయ్యారు. కొనకనమిట్ల మండలంలో భూముల వ్యవహారంలో దేశం నేత మాట విన్న అప్పటి తహశీల్దార్, ఆర్ఐ, వీఆర్వోలు సస్పెన్షన్‌కు గురికాగా, ప్రస్తుతం పట్టణ ఎస్సై సుబ్బారావు కూడా వీఆర్‌లో ఉన్నాడు. దేశం సీనియర్ నేతల్లో ఆందోళన: మార్కాపురం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు సీనియర్ దేశం నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే అధికారుల్లో ఒక రకమైన భయాందోళన వ్యక్తమవుతుండగా, తాజా సంఘటనతో ప్రజల్లో, పార్టీ కార్యకర్తల్లో పార్టీకి చెడ్డ పేరు వస్తుందన్న ఆందోళన నెలకొంది. ఇలా అయితే అధికారుల వద్దకు వెళ్తే తమకు పనులు ఎలా చేస్తారని సీనియర్ నాయకులు వాపోతున్నారు. -
నేనే రారాజునంటే కుదరదు
మార్కాపురం : మార్కాపురం నియోజకవర్గానికి తానే రారాజునంటూ టీడీపీ ఇన్చార్జి కందుల నారాయణరెడ్డి దౌర్జన్యాలు, రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోమని ఆ పార్టీ సీనియర్ నాయకులు ఇమ్మడి కాశీనాథ్, శాసనాల వీరబ్రహ్మం హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో ఉన్న ఇమ్మడి కాశీనాథ్ స్వగృహంలో మార్కాపురం, తర్లుపాడు టీడీపీ నేతలతో కలిసి వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ఇన్చార్జి కందుల నారాయణరెడ్డి శనివారం సాయంత్రం తమను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించటం విడ్డూరంగా ఉందన్నారు. తాము పార్టీ ఆవిర్భావం నుంచి విధేయులైన కార్యకర్తలుగా పనిచేస్తున్నామని గుర్తు చేశారు. మిగిలిన నేతల్తా పార్టీని అడ్డు పెట్టుకుని అవినీతి పనులు, కాంట్రాక్టులు, పర్సంటేజీలు తీసుకోవడం లేదన్నారు. కందుల నారాయణరెడ్డికి పార్టీ అవసరమని, నిజాయితీగా ఉన్న తమను సస్పెండ్ చేసే అధికారం ఆయనకు లేదన్నారు. ఇప్పటికే ఆయన అవినీతి పనుల వివరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ వద్ద ఉన్నాయని, రెండు నెలల్లోనే మార్కాపురం నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నారని కాశీనాథ్, వీరబ్రహ్మం చెప్పారు. అవసరమైతే చంద్రబాబు వద్ద పంచాయితీ పెడతామని హెచ్చరించారు. కందుల వ్యవహారం మంత్రులు శిద్దా రాఘవరావు, రావెల కిశోర్‌బాబు, కరణం బలరాం, దామచర్ల జనార్దన్‌లకు తెలుసన్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నా మార్కాపురంలో పార్టీ కార్యాలయం లేదని, దోర్నాల బస్టాండ్‌లో మూడేళ్ల కిందట ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి ఇంత వరకు ముసుగు తీయకపోవటం శోచనీయమన్నారు. వీటిని ప్రశ్నిస్తే తమకు అసమ్మతి నేతలుగా ముద్ర వేయడం పద్ధతి కాదన్నారు. 2014 ఎన్నికల్లో పార్టీ మారేందుకు ప్రయత్నిస్తే తాము అడ్డుకున్నందునే ఆయన ఇప్పుడు టీడీపీ ఇన్చార్జి పదవిలో ఉన్నాడని గుర్తు చేశారు. ఇన్చార్జి వైఖరితో నియోజకవర్గంలోని తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి మండలాల్లో కొంతమంది నాయకులు అసంతృప్తిగా ఉండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్నారు. కందుల మాట విన్న అధికారులు ఉద్యోగాలు కాపాడుకోవాలని సూచించారు. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా తాము అనేక విషయాలు బయట పెట్టలేకపోతున్నామని చెప్పారు. సమావేశంలో తర్లుపాడు సర్పంచి కందుల విజయ కళావతి, కలుజువ్వలపాడు ఎంపీటీసీ సభ్యుడు సాదుల వీరయ్య, తర్లుపాడు కో ఆప్షన్ సభ్యుడు షేక్ నన్నెసాహెబ్, మాజీ అధ్యక్షుడు నరసింహారావు, నాగులవరం వైస్ ప్రెసిడెంట్ మూల వెంకటేశ్వరరెడ్డి, న్యాయవాదులు సండ్రపాటి ప్రసాద్, షరీఫ్, తిరుమలశెట్టి వీరయ్య పాల్గొన్నారు.