breaking news
marina beach protests
-
ఉద్యమం ఆపేయండి: రజనీకాంత్
జల్లికట్టు ఉద్యమాన్ని అణిచివేయడానికి జరిగిన ప్రయత్నాలు, అందులో జరిగిన హింసాత్మక ఘటనలపై సూపర్‌స్టార్ రజనీకాంత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఉద్యమాన్ని వదిలిపెట్టి, ప్రశాంతంగా మెరీనా బీచ్ నుంచి వెళ్లిపోవాలని ఆయన కోరారు. జల్లికట్టుకు శాశ్వత పరిష్కారం కోసం జరుగుతున్న చారిత్రక ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి ప్రయత్నాలను అభినందిస్తున్నానంటూ ఆయన ఒక లేఖను ట్వీట్ చేశారు. పలువురు ప్రముఖ న్యాయవాదులు, రాజకీయ నాయకులు కూడా ఇప్పటికే దీనికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చినందువల్ల ప్రస్తుతానికి వాళ్ల మాటల మీద గౌరవం ఉంచి, తమ హామీని వాళ్లు నెరవేర్చుకునేవరకు వేచి చూడటమే మంచిదని ఆయన ఆ లేఖలో చెప్పారు. ఈ చారిత్రక ఘటనను కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు సొమ్ము చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాయని, వాళ్లకు అవకాశం ఇవ్వకూడదని చెప్పారు. ఇన్నాళ్లూగా పడిన కష్టం, చేసిన ప్రయత్నాలు, వాటివల్ల యువతకు వచ్చిన గౌరవం వృథాగా పోకూడదని ఆయన అన్నారు. ఉద్యమానికి మద్దతుగా నిలిచిన పోలీసు బలగాలకు ఎలాంటి నష్టం కలిగించకుండా సంయమనం పాటించాలని రజనీకాంత్ కోరారు. pic.twitter.com/twjA7TNPLA — Rajinikanth (@superstarrajini) 23 January 2017 -
నిరసన కాదు.. విప్లవం: హీరో విశాల్
-
నిరసన కాదు.. విప్లవం: హీరో విశాల్
జల్లికట్టును అనుమతించాలంటూ చెన్నైతో పాటు తమిళనాడు వ్యాప్తంగా జరుగుతున్నది కేవలం నిరసన కాదని, అదో విప్లవమని కోలీవుడ్ హీరో విశాల్ అన్నాడు. చెన్నై మెరీనా బీచ్‌లో వినిపిస్తున్న గొంతులు కేంద్రాన్ని చేరుకోవాలని, అప్పుడైనా కేంద్రం ఆర్డినెన్సు జారీ చేయాలని అన్నాడు. జల్లికట్టుకు అనుమతి కోసం చెన్నైలో మొదలైన నిరసన ప్రదర్శనలు.. ఢిల్లీ వరకు వెళ్లాయి. ప్రస్తుతం చెన్నైలో సినిమా షూటింగులు కూడా ఆపేయడంతో పలువురు నటులు ఢిల్లీకి చేరుకున్నారు. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు పలువురు నాయకులు కూడా ఢిల్లీ వెళ్లి, ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసేందుకు ప్రయత్నం చేశారు. సీఎం వరకు మోదీ అపాయింట్మెంట్ దొరికినా, పీఎంకే ఎంపీ అన్బుమణి రాందాస్‌కు మాత్రం దొరకలేదు. దాంతో ఆయన ప్రధాని అధికారిక నివాసం ముందు బైఠాయించారు. మోదీ తనకు సమయం ఇవ్వలేదని, ఆయన తనను కలిసేవరకు ఇంటి బయట కూర్చోవడం తప్ప తనకు వేరే మార్గం లేదని రాందాస్ అన్నారు. అయితే.. మోదీ ఇంటి ముందు బైఠాయించిన ఎంపీని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.