breaking news
mannavaram bhel project
-
మన్నవరం ప్రాజెక్టుపై మంత్రి మేకపాటి క్లారిటీ
సాక్షి, అమరావతి : స్థానిక అవసరాలకు తగ్గట్లు కంపెనీల ఏర్పాటుకు ప్రాముఖ్యత ఇస్తుందని పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. మన్నవరం ఎన్టీపీసీ- బీహెచ్ఇఎల్ పవర్ ప్రాజెక్టు లిమిటెడ్‌కు శంకుస్థాపన, ప్రాజెక్టుకు సంబంధించి తయారీ యూనిట్లను రద్దు చేసిన విషయంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి గురువారం అసెంబ్లీలో ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు తన వెంకటగిరి నియోజకవర్గానికి కేవలం 2 కి. మీ దూరంలోనే ఉందని.. మన్నవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటని అడిగారు. ఈ ప్రశ్నపై మంత్రి సమాధానమిస్తూ.. వెంకటగిరితో తమకు కూడా సంబంధాలున్నాయని తాము కూడా మెట్ట ప్రాంతాల వాసులమేనని అన్నారు. మన్నవరం ప్రాజెక్టులో ఎన్టీపీసీ- బీహెచ్‌ఇయల్ ధర్మల్ ప్రాజెక్ట్స్ చేస్తారని, ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థ అని బీహెచ్‌ఇయల్ ధర్మల్ ప్రాజెక్టులకు అవసరమైన ఉత్పత్తులను తయారు చేస్తుందని వివరించారు. అయితే ఇప్పుడు అక్కడ ప్రత్యామ్నాయాలు కూడా చూస్తున్నామని మంత్రి తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చర్ క్లస్టర్స్ తీసుకువస్తున్నామని మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అన్నారు. ఇప్పటికే వేరే కంపెనీతో చర్చలు జరుగుతున్నాయని అక్కడ ఈఎంసీ-3 ప్రారంభం కాబోతోందని తెలిపారు. ఇప్పటికే ఈఎంసీ-1 అయిపోయిందని.. ఈఎంసీ-2 వచ్చిందని.. త్వరలో ఈఎంసీ-3 కూడా విస్తరించనున్నామని వెల్లడించారు. వెంకటగిరికి వచ్చేసరికి సాంప్రదాయ చేనేత, హస్తకళలు వంటి సానుకూలతలు ఉన్నాయని వివరించారు. అపెరెల్స్, గార్మెంట్స్ ఫ్యాక్టరీలు కూడా అక్కడ ఏర్పాటు చేయవచ్చన్నారు. ఎన్టీపీసీ ఆ భూమిలో సోలార్ ప్లాంట్ యూనిట్ ఏర్పాటు చేయకపోతే.. ప్రత్యామ్నాయాలు చూస్తామని తెలిపారు. అధునాతనమైన వ్యాపార అవకాశాల కల్పనకు ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి తీసుకురావాలని ఎన్నోసార్లు చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మన్నవరం ప్రాజెక్టుపైన కేంద్ర సహకారం కూడా తీసుకొంటామని మేకపాటి గౌతంరెడ్డి సమాధానం ఇచ్చారు. చదవండి: అసెంబ్లీలో భావోద్వేగానికి గురైన చెవిరెడ్డి.. చంద్రబాబుకు మానవత్వం లేదు: సీఎం జగన్ -
‘మన్నవరం ఎన్‌బీపీపీఎల్‌ను తరలించడం లేదు’
న్యూఢిల్లీ: చిత్తూరు జిల్లా మన్నవరంలోని ఎన్టీపీసీ-బీహెచ్ఈఎల్ పవర్ ప్రాజెక్ట్‌ను గుజరాత్‌కు తరలించే ప్రతిపాదన ఏదీ లేదని భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో గురువారం రాజ్య సభలో ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ రెండు దశల్లో 600 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఈ సంస్థ వ్యాపార కార్యకలాపాలను విస్తరించాలని 2010లో ప్రణాళికను రూపొందించినట్లు ఆయన తెలిపారు. తొలి దశ కింద 1200 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈపీసీ ప్రాతిపదికన ప్రాజెక్ట్‌లను చేపట్టడంతోపాటు కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల నిర్మాణానికి అవసరమయ్యే పరికరాల తయారీని చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే రెండో దశ కింద 4,800 కోట్ల రూపాయల పెట్టుబడులతో బాయిలర్, టర్బైన్, జెనరేటర్ల (బీటీజీ) తయారీ యూనిట్లను నెలకొల్పాలని ప్రతిపాదించినట్టు తెలిపారు. మార్చి 2011లో జరిగిన ఎన్బీపీపీఎల్ బోర్డు సమావేశంలో దేశంలో నెలకొన్న వ్యాపార అవకాశాలపై సమీక్ష జరిగింది. అప్పటికే దేశంలో బీటీజీ ఎక్విప్మెంట్ తయారీ రంగంలోకి అనేక జాయింట్ వెంచర్ కంపెనీలు ప్రవేశించడంతో తీవ్రపోటీ నెలకొన్నట్లు సమీక్షలో గుర్తించిన యాజమాన్యం తమ వ్యాపార కార్యకలాపాలను తొలిదశకు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి తెలిపారు. దీనికి తోడు 2011-12 మధ్య కాలంలో దేశీయ పవర్ రంగంలో పెట్టుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. ఫలితంగా ఆర్డర్ల సంఖ్య కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో ఎన్బీపీపీఎల్ తొలి దశ పెట్టుబడులపై తిరిగి దృష్టి సారించవలసిన అవసరం ఏర్పడింది. 2015లో రూపొందించిన ఫీజబులిటీ నివేదిక ప్రకారం తొలి దశలో 363.94 కోట్లు మాత్రమే పెట్టాలని నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. ఎన్‌బీపీపీఎల్‌లో 2018 డిసెంబర్ చివరి నాటికి 130 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్లు మంత్రి చెప్పారు. ఇందులో 100 కోట్లు ప్రమోటర్ కంపెనీలైన ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్ సమకూర్చాయి. ఎన్‌బీపీపీఎల్‌లో వాణిజ్యపరమైన కార్యకలాపాలు 2015 మేలో ప్రారంభమైనట్లు మంత్రి తన జవాబులో పేర్కొన్నారు. వర్శిటీల్లో ప్రొఫెసర్ల నియామకం వాయిదా సెంట్రల్ యూనివర్శిటీలతోపాటు ప్రభుత్వం నుంచి గ్రాంట్-ఇన్-ఎయిడ్ పొందుతున్న అన్ని రాష్ట్ర యూనివర్శిటీలు, డీమ్డ్ యూనివర్శిటీలు, యూజీసీ ఇంటర్-యూనివర్శిటీ సెంటర్లలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ నియామక ప్రక్రియను వాయిదా వేయవలసిందిగా యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గత ఏడాది జూలైలో ఆదేశాలు ఇచ్చినట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ సత్యపాల్ సింగ్ వెల్లడించారు. యూజీసీ ఆదేశాలను అతిక్రమిస్తూ రోస్టర్ పాయింట్లపై స్పష్టత రాకుండానే ఆంధ్రా యూనివర్శిటీలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు యథేచ్చగా సాగిపోతున్న విషయం వాస్తవమేనా అంటూ గురువారం రాజ్య సభలో వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ అలాంటి అవకతవకలేవీ తమ దృష్టికి రాలేదని యూజీసీ తెలియచేసిందని చెప్పారు. విశాఖ స్మార్ట్ సిటీకి నిధుల కొరత లేదు తొలి రౌండ్లోనే స్మార్ట్ సిటీగా ఎంపికైన విశాఖపట్నం నగరంలో 1,602 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మొత్తం 28 ప్రాజెక్ట్‌లు చేపట్టాలని ప్రతిపాదనలు రూపొందించినా ఇప్పటి వరకు 196 కోట్లు మాత్రమే విడుదల చేయడం జరిగినట్లు నగరాభివృద్ధి శాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. రాజ్య సభలో గురువారం వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ 2016లో తొలి రౌండ్లోనే విశాఖపట్నం స్మార్ట్ సిటీల జాబితాలో చోటు సంపాదించున్నట్లు తెలిపారు. 2016-17లో విశాఖపట్నం స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద తొలి విడత వాయిదా కింద 196 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. రెండో వాయిదా కోసం ఎలాంటి విజ్ఞప్తి రానందున 2017-18లో నిధుల విడుదల జరగలేదు. 2018-19లో తొలి విడత నిధుల వినియోగానికి సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు అందిన తర్వాత రెండో వాయిదా కింద 98 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. విశాఖపట్నం స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ 2020-21 నాటికి పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు. -
'బెల్ ప్రాజెక్టు మన్నవరంలోనే కొనసాగించాలి'
తిరుపతి: చిత్తూరు జిల్లా మన్నవరంలో బెల్ ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో కష్టపడి సాధించారని వైఎస్ఆర్ సీపీ నేత బియ్యపు మధుసూదన్‌రెడ్డి తెలిపారు. అలాంటి ప్రాజెక్టు ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వేలాది మంది ఉద్యోగులు అవకాశాలు కోల్పోయే అవకాశం ఉందని చెప్పారు. మన్నవరం బెల్ ప్రాజెక్టు మన్నవరంలోనే కొనసాగించాలంటూ బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతిలో పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర నేటి నుంచి మూడు రోజుల పాటు కొనసాగనుంది. -
'చంద్రబాబుకు చీమకుట్టినట్లు కూడా లేదు'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ నుంచి మన్నవరంలోని భెల్ ప్రాజెక్ట్ మరో రాష్ట్రానికి తరలిపోతున్న చంద్రబాబుకు చీమకుట్టినట్లు కూడా లేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఈ ప్రాజెక్టు శ్రీకాళహస్తిలోనే నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ... ఎమ్మెల్సీ శ్రీనివాసులు రెడ్డి చేపట్టిన దీక్ష శనివారం రెండో రోజుకు చేరుకుంది. తిరుపతిలో శ్రీనివాసులు రెడ్డి చేపట్టిన దీక్ష స్థలి వద్దకు రోజా, పార్టీ నాయకుడు బియ్యపు మధుసూదన్‌రెడ్డి చేరుకుని... సంఘీభావం ప్రకటించారు. శ్రీకాళహస్తిలోనే మన్నవరం ప్రాజెక్టు చేపట్టాలని బియ్యపు మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు.