breaking news
mangalore district
-
'రియాద్'లో మంగళూరు యువకుడికి మోసం.. ప్రధాని మోదీకి లేఖ ప్రయత్నం
కర్ణాటక: మంగళూరు యువకుడు రియాద్ దేశంలో వంచకుల చేతిలో మోసపోయి జైలుపాలయ్యాడు. మంగళూరు జిల్లా కడబ తాలూకా ఐతూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రియాద్‌లో అల్ఫానర్ సెరామిక్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గత ఏడాది సెల్‌ఫోన్‌తోపాటు సిమ్ కొనుగోలుకు వెళ్లగా రెండు సార్లు తంబ్ తీసుకున్నారు. వారం తరువాత అరబిక్ భాషలో ఒక మేసేజ్ రాగా దాన్ని క్లిక్ చేశాడు. 2 రోజుల తరువాత ఒక కాల్ వచ్చింది. సిమ్ వివరాలు అడిగి ఓటీపీ నంబర్ తీసుకున్నారు. అనంతరం దుండగులు అతని పేరుతో ఖాతా ఓపెన్ చేసి ఓ మహిళ ఖాతానుంచి రూ.22వేలు అక్రమంగా బదిలీ చేశారు. ఇదంతా చంద్రశేఖర్‌కు తెలియదు. వారం తర్వాత పోలీసులు చంద్రశేఖర్‌ను అరెస్టు చేశారు. తనను ఎందుకు అరెస్ట్ చేశారని బాధితుడు ఆరా తీయగా నగదు పోగొట్టుకున్న మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దీంతో చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు కేంద్రమంత్రి శోభకరంద్లాజె వద్ద మొరపెట్టుకోగా ఆమె విదేశాంగ మంత్రి జైశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఫలితంలేకుండాపోయింది. దీంతో ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసే ప్రయత్నం చేస్తున్నారు. అన్నీ బాగుంటే చంద్రశేఖర్‌కు గత జనవరిలో వివాహం జరగాల్సి ఉంది. -
జెడ్పీ నూతన అధ్యక్షురాలిగా శోభ
సాక్షి, బళ్లారి : జెడ్పీ అధ్యక్షురాలిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన బీ.శోభ విజయం సాధించారు. గత అధ్యక్షురాలు సుమంగళమ్మ గుబాజీపై కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఆమెను పదవి నుంచి తప్పించారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా పంచాయతీ నజీర్ సభాంగణంలో అధ్యక్ష ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్ ఆదిత్య ఆమ్లన్ బిస్వాస్ వ్యవహరించారు. జెడ్పీ అధ్యక్షురాలిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన బీ.శోభ, బీజేపీ నుంచి గెలుపొందిన (బీఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారురాలు) జీ.సుమంగళమ్మ మంగళవారం మధ్యాహ్నం నామినేషన్ వేశారు. అనంతరం మూడు గంటల సమయంలో అధ్యక్ష ఎన్నిక నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి బీ.శోభ కు 18 ఓట్లు రాగా, బీజేపీ తరుపున పోటీ చేసిన జీ.సుమంగళమ్మకు 17 ఓట్లు వచ్చాయి. దీంతో శోభ జెడ్పీ అధ్యక్షురాలిగా గెలుపొందినట్లు ఎన్నికల అధికారి బిస్వాస్ ప్రకటించారు. అనంతరం నూతనంగా ఎంపికైన జెడ్పీ అధ్యక్షురాలు బెండిగేరి శోభ విలేకరులతో మాట్లాడుతూ తన గెలుపునకు ప్రతి కాంగ్రెస్ సభ్యుడు సహకారం అందించారన్నారు. ముఖ్యంగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరమేశ్వరనాయక్, హరపనహళ్లి ఎమ్మెల్యే రవీంద్ర ఇతర ముఖ్య నాయకులు తాను జెడ్పీ అధ్యక్షురాలు కాబడానికి కృషి చేశారన్నారు. బళ్లారి జిల్లా సర్వతోముఖాభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా తాగునీరు, విద్య తదితర మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. అనంతరం హరపనహళ్లి ఎమ్మెల్యే ఎం.పీ రవీంద్ర, సండూరు ఎమ్మెల్యే తుకారాం, బళ్లారి నగర డీసీసీ అధ్యక్షుడు జే.ఎస్.ఆంజనేయులు, పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు నూతన అధ్యక్షురాలు శోభను అభినందించారు.