breaking news
management kota
-
వారిచ్చిందే మెరిట్
రాష్ట్రంలోని ఓ టాప్ ఇంజనీరింగ్ కాలేజీ.. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో మెరిట్‌ను ప్రాతిపదికగా తీసుకోలేదు. అడ్డగోలుగా డొనేషన్లు వసూలు చేసి, తక్కువ ర్యాంకు వచ్చిన విద్యార్థులకు సీట్లు కేటాయించింది. ఎలాంటి ర్యాంకు లేని వారికి ఇచ్చేసింది. ఈ వ్యవహారంలో ఒక్కో సీటును భారీ మొత్తానికి అమ్ముకున్నట్లు ఆరోపణలున్నాయి. మరో పేరున్న కాలేజీ ముందుగానే సీట్లు అమ్మేసుకుంది. బీటెక్ కంప్యూటర్ సైన్స్ సీట్లను రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల చొప్పున అమ్ముకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ కాలేజీ యాజమాన్యం తక్కువ ర్యాంకు రాని విద్యార్థులకు కూడా సీట్లు కేటాయించింది. ఇటీవల ఉన్నత విద్యా మండలి చేపట్టిన 2018–19 ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్ల ర్యాటిఫికేషన్లలో ఈ అంశాలు బయటపడ్డాయి. అందులో మెరిట్ కనిపించకపోవడంతో వాటిపై ఓ అధికారి ప్రశ్నిస్తే ‘మాకు వచ్చిన దరఖాస్తులు అవే. అదే మెరిట్.. ఆమోదం కోసం పంపిన ఆ జాబితాలో ఉన్న విద్యార్థులే దరఖాస్తు చేశారు. వారికే సీట్లను కేటాయించాం’అని సదరు యాజమాన్యాలు తెగేసి చెప్పాయి. సాక్షి, హైదరాబాద్: కాస్త పేరుండి.. యాజమాన్య కోటా సీట్లను అమ్ముకున్న యాజమాన్యాలన్నింటిదీ అదే తీరు. అయినా ఉన్నత విద్యా మండలికి పట్టట్లేదు. యాజమన్యాలు ఇచ్చిందే మెరిట్‌గా భావించి ఆ ప్రవేశాలకు ఆమోదముద్ర (ర్యాటిఫై) వేస్తోంది. తమ ముందు ఆన్లైన్ దరఖాస్తుల విధానం వంటి ప్రత్యామ్నాయాలు ఉన్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. కొందరు సిబ్బంది ర్యాటిఫికేషన్లలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తమకు ఉన్న అధికారాలను కూడా మండలి పక్కన పడేసి మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీని యాజమాన్యాల ఇష్టారాజ్యానికి వదిలేసిందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దరఖాస్తు చేసిన విద్యార్థుల సంఖ్య ఎక్కడ? రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల కోసం ఎంత మంది దరఖాస్తు చేశారన్నవిషయం ఎవరికీ తెలియదు. యాజమాన్యాలు ఎందరి నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నాయో.. ఎన్ని సీట్లను అమ్ముకుంటున్నాయో అంతా గోప్యమే. యాజమాన్య కోటా సీట్ల భర్తీలో పారదర్శకత పాటించాలని హైకోర్టు స్పష్టం చేసినా ఆ దిశగా ఉన్నత విద్యా మండలి ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు. దాన్ని ఆసరాగా చేసుకున్న కొన్ని టాప్ కాలేజీ యాజమాన్యాలు 2017–18 ప్రవేశాల్లో భారీ దందాకు తెరతీశాయి. 2018–19 విద్యా సంవత్సరం ప్రవేశాల్లోనూ అదే దందాను కొనసాగించాయి. రేట్లు పెంచి మరీ కాలేజీని, కోర్సును బట్టి ఒక్కో సీటుకు రూ.4 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూళ్లకు పాల్పడినట్లు తెలిసింది. కిందటేడాది మెరిట్ కాదు కదా జేఈఈ ర్యాంకు లేని వారికి, ఎంసెట్ రాయని వారికి సీట్లను కేటాయించిన కొన్ని టాప్ కాలేజీ యాజమాన్యాలు దాదాపు 500 సీట్లను అమ్ముకొని మెరిట్ ఉన్న విద్యార్థులకు అన్యాయం చేశాయి. ఆ టాప్ కాలేజీల్లోని యాజమాన్య కోటా సీట్ల కోసం ఎంత మంది విద్యార్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయన్న విషయాన్ని కూడా ఉన్నత విద్యామండలి అడగట్లేదు. విద్యార్థుల నుంచి వచ్చిన దరఖాస్తులు, వారి ర్యాంకులు తెలిస్తేనే.. యాజమాన్య కోటాలో మేనేజ్మెంట్స్ ఏ ర్యాంకుల వారికి సీట్లను కేటాయించారు.. మెరిట్‌ను అనుసరించారా.. లేదా.. అని తెలిసేది. కానీ అవేవీ పట్టించుకోకుండానే, యాజమాన్యాలను అడక్కుండానే వారు చేపట్టిన పవేశాలను ర్యాటిఫై చేస్తుండటంలో ఆంతర్యమేంటన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలేం చెబుతున్నాయి.. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లోని మొత్తం సీట్లలో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో, 30 శాతం సీట్లను మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేస్తారు. ఈ విద్యా సంవత్సరంలో 92,184 సీట్ల భర్తీకి యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. అందులో మైనారిటీ కాలేజీలు, కాలేజీల కన్సార్షియం ద్వారా సొంతంగా భర్తీ చేసుకునే సీట్లు పోగా, 87,900 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో 70 శాతం కన్వీనర్ కోటాలో 61,511 (యూనివర్సిటీ కాలేజీల్లోని 3055 సీట్లు కాకుండా) సీట్లను భర్తీ చేశారు. మిగతా 30 శాతం సీట్లను (26,389) యాజమాన్యాలు భర్తీ చేశాయి. అయితే ఇందులో 15 శాతం సీట్లను జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేయాలి. మిగిలిన 15 శాతాన్ని ఎన్ఆర్ఐలకు, వారు స్పాన్సర్ చేసిన వారికి ఇవ్వాలి. మొదటి 15 శాతం సీట్లను మాత్రం మెరిట్ ఆధారంగానే ఇవ్వాలి. దరఖాస్తు చేసిన వారిలో జేఈఈ మెయిన్ ర్యాంకర్లు లేకుంటే ఎంసెట్ ర్యాంకర్లకు, వారూ లేకుంటే ఇంటర్ మార్కుల ఆధారంగా ఇవ్వాలి. కానీ మంచి ర్యాంకులు రాకపోయినా, ఎంసెట్ ర్యాంకు కూడా లేకపోయినా కొన్ని టాప్ కాలేజీలు సీట్లను కేటాయించాయి. ఆన్లైన్లో దరఖాస్తు విధానం ఉన్నా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు యాజమాన్య కోటా సీట్ల భర్తీలో పారదర్శకత పాటించాలి. కాలేజీకి వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో పొందుపరచాలి. వీలైతే ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలోనే వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు స్వీకరించాలి. వాటిని ఆయా కాలేజీలకు పంపి మెరిట్ ఉన్న వారికి సీట్లు వచ్చేలా చూడాలి. ఆఫ్‌లైన్‌లో, ఆన్లైన్లో కాలేజీలకు వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించాలి. కానీ ఆ దిశగా ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. సాధారణంగా టాప్ కాలేజీల్లో మొదటి 5 వేలలోపు ఎంసెట్ ర్యాంకు ఉన్న విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సీట్లు లభిస్తాయి. ఇక మేనేజ్మెంట్ కోటాలో మాత్రం జేఈఈ ర్యాంకులు ఉన్న వారికి మొదటి ప్రాధాన్యం ఉంటుంది. ఆ తర్వాత ఎంసెట్ ర్యాంకర్లకు సీట్లను కేటాయించాలి. అయితే ఎంసెట్ టాప్ 10 వేల ర్యాంకు వరకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తోంది. కానీ ఆ ర్యాంకు కలిగిన విద్యార్థులకు మేనేజ్మెంట్ కోటాలో సీట్లు లభించడం తక్కువే. అదీ కాలేజీలు అడిగే డొనేషన్లు చెల్లించిన వారికే సీట్లు కేటాయిస్తారు తప్ప ఇతర మెరిట్ విద్యార్థులకు ఇవ్వరని ఓ ఉన్నతాధికారి పేర్కొనడం గమనార్హం. -
పైన పటారం.. లోన లొటారం!
‘మా కాలేజీలో అద్భుత సౌకర్యాలు కల్పిస్తున్నాం.. పరిమిత సీట్లున్నాయి.. మీ పిల్లల్ని వెంటనే చేర్పించండి.. ఆలస్యం చేస్తే సీటు దొరకడమే కష్టం.. అసలే మా కాలేజీకి గిరాకీ పెరిగింది..’ ఉన్నత విద్యా కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం కాలేజీల యాజమాన్యాలు చెప్పే మాటలివి. తీరా లోపలికి వెళ్లాక చూస్తే అక్కడ సగం సీట్లు కూడా భర్తీ కాని పరిస్థితి. ఇలా ప్రతిష్టకుపోయి పైన పటారం.. లోన లొటారం అన్న చందంగా మారింది ప్రస్తుతం కాలేజీల పరిస్థితి. హైదరాబాద్ : రాష్ట్రంలో ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి సీట్ల భర్తీ దారుణంగా పడిపోయింది. అన్ని కోర్సుల్లో కూడా సగానికి పైగా సీట్లు మిగిలిపోయాయి. ఇంజనీరింగ్తోసహా అన్ని కోర్సులదీ ఇదే పరిస్థితి. అనేక కాలేజీలు మూతపడే దశకు చేరుకున్నాయి. కొన్ని కాలేజీలు అరకొర విద్యార్థులతోనే కొనసాగుతున్నాయి. కొన్ని కాలేజీల్లో విద్యార్థులు ఉన్నట్లు లెక్కచూపుతూ వారిని పక్కనే ఉన్న మరో కాలేజీల తరగతులకు పంపిస్తున్నాయి. కాలేజీలు మూతవల్ల వచ్చే ప్రయోజనం ఉండదని, ఏదోలా కొనసాగిస్తే వచ్చే విద్యా సంవత్సరానికైనా చేరికలు పెరుగుతాయన్నది కొన్ని యాజమాన్యాల ఆశ. కాలేజీ ఏర్పాటు చేసి విద్యార్థులు చేరక మూసేశారన్న మాట రాకుండా ప్రతిష్ట కాపాడుకొనేందుకు పిల్లలు లేకపోయినా మరి కొందరు కాలేజీలను కొనసాగిస్తున్నారు. వివిధ ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశానికి ఉన్నత విద్యామండలి ఏటా 8 ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ తదితర కోర్సులకు సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ విభాగంలో ప్రవేశాలకు ఎంసెట్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఐసెట్, బీఈడీ కోర్సులకు బీఎడ్, లా కోర్సుల ప్రవేశానికి లాసెట్, ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సులకు పీజీఈసెట్, బీటెక్ లేటరల్ ఎంట్రీ (డిప్లొమో విద్యార్థులు రెండో ఏడాది ప్రవేశానికి) ఈసెట్, పాలిటెక్నిక్ కోర్సుల కోసం పాలీసెట్లను నిర్వహిస్తోంది. యాజమాన్య కోటాలో మరింత అధ్వానం 2017 విద్యాసంవత్సరానికి సంబంధించి ఈనెలలో నోటిఫికేషన్ వెలువరించనున్న దశలోనూ కొన్ని కాలేజీలు తమ సంస్థల్లో ప్రవేశాలను నిర్వహిస్తూనే ఉన్నాయి. ఈ ప్రవేశాలను అనుమతించాలంటూ అవి ఉన్నత విద్యామండలికి ప్రతిపాదనలూ అందిస్తున్నాయి. గడువు ముగిసిపోయి ప్రవేశాలు జరుపుతున్నా సీట్లు సగానికి దాటకపోవడం విశేషం. కన్వీనర్ కోటాలోని సీట్లే మిగిలిపోయిన తరుణంలో ఇక యాజమాన్యకోటా సీట్ల భర్తీ మరింత అధ్వానంగా ఉంది.