breaking news
Main Aur Charles
-
'మై ఔర్ చార్లెస్' మూవీ రివ్యూ
టైటిల్: మై ఔర్ చార్లెస్ జానర్: బయోగ్రాఫికల్ క్రైమ్ థ్రిల్లర్ తారాగణం: రణదీప్ హుడా, ఆదిల్ హుసెన్, రిచా చడ్డా, టిస్కా చోప్రా దర్శకుడు: ప్రవాల్ రమణ్ నిర్మాత : రాజు చడ్డా, అమిత్ కపూర్, విక్రమ్ కక్కర్ ఇటీవలి కాలంలో బాలీవుడ్ స్క్రీన్ మీద బయోగ్రాఫికల్ సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు సినీ తారలు, క్రీడాకారుల జీవితాలు మాత్రమే తెరకెక్కాయి. 'మై ఔర్ చార్లెస్' సినిమాతో తొలిసారిగా ఓ నేరస్థుడి జీవితాన్ని వెండితెర మీద ఆవిష్కరించారు. ఇండియన్ క్రైం హిస్టరీలో అత్యంత తెలివైన నేరస్థుడిగా పేరు తెచ్చుకున్నచార్లెస్ శోభరాజ్ జీవితగాధతో ఈ సినిమాను తెరకెక్కించారు. మరి ఈ బయోగ్రాఫికల్ మూవీ ఆడియన్స్‌ను ఏ స్థాయిలో ఆకట్టుకుందో చూద్దాం.. కథ: సినిమా కథ అంతా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ చార్లెస్ శోభరాజ్ జీవితంలో జరిగిన సంఘటనల చుట్టూ తిరుగుతుంది. చార్లెస్ జీవితంలోని వ్యక్తులు వాళ్లతో అతనికి ఉన్న సంబంధం, అతడు చేసిన నేరాలు, అందుకు కారణాలు, ఇలా సినిమా అంతా ఓ నవలలా సాగుతుంది. చార్లెస్ శోభరాజ్ కేసును డీల్ చేసిన పోలీస్ ఆఫీసర్ ఆమోద్ కాంత్ చార్లెస్ జీవితంలోని విశేషాలు వివరిస్తున్నట్టు స్క్రీన్‌ప్లేను నడిపించాడు దర్శకుడు. విశ్లేషణ : ఈ సినిమాకు మెయిన్ ఎసెట్ రణదీప్ హుడా. లుక్, బాడీలాంగ్వేజ్ లాంటి విషయాల్లో ఎంతో రీసెర్చ్ చేసి ఈ క్యారెక్టర్ చేసినట్టుగా అనిపిస్తోంది. క్రూరమైన ఆలోచనలు ఉన్న ఓ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో కళ్లకు కట్టినట్టుగా చూపించాడు రణదీప్ హుడా. ఇక దర్శకుడు రమణ్ కూడా సినిమా సక్సెస్‌లో కీ రోల్ ప్లే చేశాడు. ప్రేక్షకులను 1960లలోకి తీసుకెళ్లిన దర్శకుడు ఏ ఒక్క సీన్లోనూ కథ మీద పట్టు కోల్పోకుండా అద్భుతంగా నడిపించాడు. ముఖ్యంగా కథ నడిపించటం కోసం డైరెక్టర్ ఎంచుకున్న కథనం కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంది. అయితే చార్లెస్‌ను అత్యంత తెలివైన కిల్లర్‌గా చూపించే ప్రయత్నంలో అక్కడక్కడా లాజిక్ మిస్ అయ్యాడు దర్శకుడు. ఇతర పాత్రలలో నటించిన రిచా చడ్డా, ఆదిల్ హుసెన్, టిస్కా చోప్రాలు పరవాలేదనిపించారు. ఓవరాల్‌గా మై ఔర్ చార్లెస్ ఒక్కసారి చూడదగ్గ బయోగ్రఫికల్ క్రైం థ్రిల్లర్ -
'బికినీ కిల్లర్'పై సినిమా చేస్తే తప్పేంటి?
సినిమా కంటే ఎక్కువగా ప్రైమ్ టైమ్ లో క్రైమ్ వార్తలు ప్రసారం చేస్తున్న మీడియానే యువతకు నేర సంబంధిత విషయాలు చెబుతుందంటున్నాడు బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా. మరి ఆయన తాజా చిత్రం 'మై ఔర్ చార్లెస్' ఏమైనా శాంతిప్రవచనాలు బోధిస్తుందా? అని ప్రశ్నిస్తే మాత్రం డొంక తిరుగుడుగా.. 'మేము తెరకెక్కిస్తున్న చార్లెస్ శోభరాజ్ సాధారణ వ్యక్తేమీ కాదు. అతని ప్రతి అడుగు ఓ సంచలనమే. బికినీ కిల్లర్ గా పేరు పొందిన ఆయన దేశంలోనే అత్యంత పటిష్ఠమైన తీహార్ జైలు నుంచి పారిపోయాడు. ఫ్రాన్స్ ఫ్యాషన్ రంగంలో పాదం మోపాడు ఎన్నెన్నో దేశాల్లో ఎన్నెన్నో నేరాలు.. ఇలాంటి ట్విస్టుల కంటే ఒక సినిమా కథకు ఇంకేం కావాలి చెప్పాండి' అంటూ సమాధానమిచ్చాడు. ఆగ్నేయ ఆసియా కేంద్రంగా దాదాపు డజనుకు పైగా దేశాలకు చెందిన మహిళలను అతి క్రూరంగా హత్యచేయడంతోపాటు మాదకద్రవ్యాలు, అక్రమ ఆయుధాల సరఫరా తదితర నేరాల్లో ఆరితేరి.. ప్రస్తుతం కఠ్మాండు జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు చార్లెస్ శోభరాజ్. అతడిని పట్టుకునే క్రమంలో ఎదురైన అనుభవాలను వివరిస్తూ ఓ ఢిల్లీ పోలీస్ ఆఫీసర్ పుస్తకం రాశారు. దాని ఆధారంగా దర్శకుడు ప్రవాల్ రమణ్ 'మై ఔర్ చార్లెస్' సినిమా తీశారు. చార్లెస్ శోభరాజ్ పాత్రలో రణదీప్ హుడా, రిచా చడ్డా, ఆదిల్ హుస్సేన్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 30న విడుదల కానుంది.