‘మారీశన్’ మూవీ రివ్యూ: ఒక్క సీన్ కూడా ఊహించలేరు!
పిట్ట కొంచం కూత ఘనం అన్నట్టు కొన్ని సినిమాలు వాటి పోస్టర్లు, ప్రోమోలకు మించి ఉంటాయి. కొన్నాళ్ళ క్రితం ఏదైనా సినిమా చూసేటపుడు ఆ సినిమాలో వచ్చే తరువాత సన్నివేశాన్ని చూస్తున్న ప్రేక్షకులు కాస్తంత ఊహించగలిగారు. ఆపై కాలంలో దాదాపుగా సినిమా మొత్తాన్ని ఊహించగలుగుతున్నారు. కాని నేటి ప్రేక్షకులు సినిమా పోస్టర్, ప్రోమోలను బట్టి పూర్తి కథను అంచనా వేయగలుగుతున్నారు. అయితే కొంతమంది దర్శకుల ఆలోచనలను మాత్రం ప్రేక్షకులు ఇంకా అందుకోలేకపోతున్నారు.ఆ సినిమాలే సూపర్ డూపర్ హిట్లు అవుతున్నాయి. ఆ కోవకు చెందినదే మారీశన్.ఈ సినిమాకు కృష్ణమూర్తి కథ అందించగా సుదీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ప్రముఖ తమిళ కమెడియన్ వడివేలు, మళయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించారు. నిజానికి ఈ సినిమా మొత్తం వీరిద్దరి పాత్రలపైనే నడుస్తుంది. వందల మంది తారాగణం, కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమాలను నిలబెట్టుకోవడం కష్టమైన ఈ రోజుల్లో రెండంటే రెండే పాత్రలతో రెండున్నర గంటల పైన నిడివితో ప్రేక్షకులను మెప్పించడం నిజంగా అభినందనీయం. అంతలా ఏముందీ కథలో ఓ సారి చూద్దాం. దయాలన్ ఓ దొంగ, చాలా సార్లు దొంగతనం చేసి జైలుకి వెళుతున్నా తీరు మార్చుకోని మొండి దొంగ దయ. ఓ రోజు అలవాటుగా దయ ఓ ఇంట్లో దొంగతనం చేస్తుండగా చైన్ తో కట్టిపడేసున్న వేలాయుధం పిళ్ళైని కలుస్తాడు. అదే సమయంలో పిళ్ళైకి అల్జీమర్స్ వ్యాధి ఉందని గ్రహిస్తాడు దయ.మొదట పిళ్ళైని చూసిన దయ కాస్త కంగారు పడినా పిళ్ళై దగ్గర ఉన్న డబ్బు కోసం తనని విడిపిస్తాడు.తన బావమరిదిని కలవడానికి తిరువన్నామలై వెళ్ళాలని చెప్పడంతో దయ పిళ్ళైని తాను తీసుకెళతానని నమ్మిస్తాడు. అలా వాళ్ళిద్దరి ప్రయాణం ప్రారంభమవుతుంది. ఆ ప్రయాణం ఎన్నో అనూహ్య మలుపులు తిరిగి ప్రేక్షకుల మతి పోగొడుతుంది. సినిమా ఆద్యంతం ఆసక్తిని రేపుతుంది. ముందు చెప్పుకున్నట్టు ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకుడు సినిమా కథ కాదు కదా తరువాత సన్నివేశాన్ని కూడా అంచనా వేయలేరు. అంచనాలకు మించి సాగే ఈ సినిమా మీ వీకెండ్ వాచ్ కి మంచి ఛాయిస్.ఎందుకంటే ఇది మామూలు సినిమా అయితే కాదు.-హరికృష్ణ, ఇంటూరు