breaking news
Lorry accident case
-
మోపెడ్‌ను ఢీకొన్న లారీ
తూర్పుగోదావరి, పెద్దాపురం: మోపెడ్‌పై వెళుతున్న కుటుంబ సభ్యులను లారీ ఢీకొనడంతో 11 ఏళ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందగా భార్య, భర్త, కుమారుడు, మనువడు సురక్షితంగా బయటపడ్డారు. గురువారం పెద్దాపురం ఏడీబీ రోడ్డులో జరిగిన ఈ సంఘటనపై స్థానిక పోలీసుల కథనమిలా.. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లుకు చెందిన కుంజా సత్తిబాబు, భార్య చిన్న, మూడో కుమార్తె జ్యోతి, కుమారుడు ఉదయ్‌కుమార్, మనువడు ప్రదీప్‌లతో కలిసి టీవీఎస్ మోపెడ్‌పై వారు నివాసముంటున్న కాకినాడకు బయల్దేరారు. పెద్దాపురం వాలుతిమ్మాపురం దాటే సరికి కాకినాడ వైపునకు వెళుతున్న గుర్తు తెలియని లారీ డ్రైవర్ వాహనాన్ని వెనుకకు తిప్పాడు. దీంతో మోపెడ్ అదుపు తప్పి కిందకు పడగా కుమార్తె జ్యోతి(11) అక్కడిక్కడే మృతి చెందింది. కుటుంబ సభ్యులు నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి పోçస్టుమార్టం కోసం తరలించారు. సంఘటన స్థలం వద్ద తల్లి చిన్న, తండ్రి, తమ్ముడు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసుల అదుపులో..లారీ యజమాని, క్లీనర్
నాయుడుపేటటౌన్ (సూళ్లూరుపేట): చిత్తూరు జిల్లా ఏర్పేడులో 15 మంది మృతికి కారణమైన లారీ ప్రమాదం కేసులో నిందితులైన లారీ యజమాని తంబిశెట్టి రమేశ్‌తో పాటు పరారీలో ఉన్న క్లీనర్ సుబ్రమణ్యంను నాయుడుపేట పోలీసుల చొరవతో చిత్తూరు జిల్లా పోలీసులు శనివారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. నాయుడుపేటలో నివాసముంటున్న రమేశ్ లారీకి దొరవారిసత్రం మండలం అక్కరపాకకు చెందిన గురవయ్య డ్రైవర్‌గా, అదే గ్రామానికి చెందిన సుబ్రమణ్యం క్లీనర్‌గా ఉన్నారు. ఈ నెల 21న ఏర్పేడు వద్ద జరిగిన ప్రమాదంలో లారీలో డ్రైవర్ గురవయ్యతో పాటు క్లీనర్ సుబ్రమణ్యం కూడా ఉన్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. ప్రమాదం జరిగిన రోజే మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ గురవయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురవయ్యకు లైట్ వెహికల్ లైసెన్సు మాత్రమే ఉండటంతో ఇందుకు బాధ్యుడిని చేస్తూ లారీ యజమానితో పాటు పరారీలో ఉన్న క్లీనర్‌పై కూడా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో వీరిద్దరినీ శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.