breaking news
lodha committee recommendation
-
ఆ ‘నాలుగు’ అమలు కష్టమే
న్యూఢిల్లీ: క్రికెట్ బోర్డులో అమలు చేయాల్సిన లోధా కమిటీ సిఫార్సుల్లో ‘ఆ నాలుగు’ ప్రధాన అడ్డంకి అని 12 రాష్ట్రాల సంఘాలు... కోర్టు సహాయకుడి (అమికస్ క్యూరీ)కి నివేదిక అందజేశాయి. తదుపరి విచారణ (మే 11)కు ముందే తమకు అభ్యంతరకరమైన సిఫార్సులేవో కోర్టు సహాయకుడు గోపాల్ సుబ్రమణియంకు తెలియ జేయాలంటూ సుప్రీం కోర్టు గత విచారణ సందర్భంగా బీసీసీఐ, అనుబంధ రాష్ట్ర సంఘాలకు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి అనుబంధంగా ఉన్న 37 సంఘాల్లో 12 సంఘాలు తమకు ఇబ్బందికరమైన నాలుగు సిఫార్సుల్ని ఆ నివేదికలో వివరించాయి. అందులో 1. ఒక రాష్ట్రానికే ఒకే ఓటు, 2. పదవుల మధ్య మూడేళ్ల విరామం, 3. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు, 4.ఆఫీసు బేరర్లు, ప్రొఫెషనల్స్ (కోర్టు నియమించమన్న సీఈఓ, సీఎఫ్ఓ) మధ్య అధికార పంపకం అమలు చేయడం కష్టమని ఆంధ్ర, అస్సాం, గోవా, జార్ఖండ్, కేరళ, ముంబై, రాజస్తాన్, రైల్వేస్, త్రిపుర, యూనివర్సిటీస్, ఉత్తరప్రదేశ్, విదర్భ సంఘాలు తెలిపినట్లు బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరి మీడియాకు వెల్లడించారు. ‘ఒక రాష్ట్రానికి ఒకే ఓటంటే మహారాష్ట్ర (ముంబై, విదర్భ, మహారాష్ట్ర), గుజరాత్ (బరోడా, సౌరాష్ట్ర, గుజరాత్) లాంటి పెద్ద రాష్ట్రాల్లో ఉన్న మూడేసి సంఘాలకు ప్రాతినిధ్యం కరువవుతుంది. పదవికి పదవికి మధ్య కనీసం మూడేళ్ల విరామమంటే ఎన్నికైన ఆఫీస్ బేరర్‌కు కొనసాగే వీలే ఉండదు. ఉన్నతస్థాయి కమిటీ, అధికార పంపకాల వల్ల కొత్త సమస్యలు వస్తాయని క్రికెట్ సంఘాలు వాపోతున్నాయి’ అని అమితాబ్ చెప్పారు. మొత్తం మీద నేడు సుప్రీం కోర్టులో లోధా కమిటీ సిఫార్సులపై విచారణ జరుగనుంది. -
ఫస్ట్ క్లాస్ ప్లేయరా, ఫస్ట్ క్లాస్ క్రికెటరా?
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ పట్ల బీసీసీఐకి మర్యాద, మన్నన లేవని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. జస్టిస్ లోధా కమిటీ ప్రతిపాదనలు ఎందుకు అమలు చేయడం లేదని బీసీసీఐని సూటిగా ప్రశ్నించింది. 24 గంటల్లోగా అమలు చేయకుంటే, రేపు ఉత్తర్వులు జారీ చేస్తామని హెచ్చరించింది. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అర్హతపై సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తింది. ఒకే ఒక్క రంజీ మ్యాచ్ ఆడిన అతడు బీసీసీఐ అధ్యకుడా అని ఆక్షేపించింది. ఫస్ట్ క్లాస్ ప్లేయరా, ఫస్ట్ క్లాస్ క్రికెటరా అని ప్రశ్నించింది. తాము క్రికెటర్లమేనని, న్యాయమూర్తుల జట్టుకు తాను కెప్టెన్ అని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. బీసీసీఐ తీరును సర్వోన్నత న్యాయస్థానికి అమికస్ క్యూరీ గోపాల్ సుబ్రమణియం నివేదించారు. డబ్బు పంపిణీ చేయొద్దని జస్టిస్ లోధా కమిటీ చెప్పినా బీసీసీఐ పట్టించుకోలేదని తెలిపారు. అనుబంధ సంఘాలకు రూ. 400 కోట్లు పంపిణీ చేసిందని వెల్లడించారు. లోధా కమిటీకి వ్యతిరేకంగా ఓట్లు వేయించేందుకే ఈ ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కాగా, 24 గంటల్లో లోధా కమిటీ ప్రతిపాదనలు అమలు చేయలేమని కోర్టుకు బీసీసీఐ తెలిపింది. తమ ఆదేశాలను పాటించకుండా బీసీసీఐ రద్దు దిశగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.