breaking news
Loan waiver complaint
-
ఫిర్యాదుల వెల్లువ
‘రుణమాఫీ ఫిర్యాదులు కర్నూలు జిల్లాలో తక్కువగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈ జిల్లాలో రుణమాఫీ బాగానే జరిగిందనే విషయం స్పష్టమవుతోంది.’ – ఇవీ సోమవారం రుణమాఫీ ఫిర్యాదుల పరిష్కార వేదిక ప్రారంభం సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఆయన అంచనా తప్పని ఒక్కరోజులోనే తేలిపోయింది. తమకు రుణాలు మాఫీ కాలేదని, ఎందరు అధికారులను కలిసినా, ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేదని ఫిర్యాదు చేయడానికి వేలాదిమంది రైతులు తరలివచ్చారు. కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని పంచాయతీ వనరుల కేంద్రంలో రెండోరోజైన మంగళవారం కూడా రుణమాఫీపై ఫిర్యాదుల స్వీకరణ కొనసాగింది. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చిన రైతులతో జెడ్పీ ప్రాంగణం కిటకిటలాడింది. రెండో రోజు దాదాపు ఆరు వేల మంది రైతులు ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చారంటే జిల్లాలో రుణమాఫీ ఏ రీతిలో అమలైందో అర్థం చేసుకోవచ్చు. రైతు సాధికార సంస్థ నుంచి వచ్చిన సాంకేతిక నిపుణుల ద్వారా ఫిర్యాదులను పరిశీలించేందుకు కంప్యూటర్లు, ఇంటర్నెట్ సదుపాయంతో 15 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటర్ వద్ద రైతులు బారులుతీరారు. అర్ధరాత్రి వరకు ఫిర్యాదుల పరిశీలన కొనసాగింది. ఒక్కో రైతుది ఒక్కో వేదన.. పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తే ఒక్కో రైతుది ఒక్కో వేదనగా ఉంది. రుణమాఫీకి అన్ని అర్హతలున్నా ఒక్కరూపాయి కూడా మాఫీ కాని రైతులు 50 శాతం మంది వరకు ఉన్నారు. మిగిలిన వారిలో బంగారంపై తీసుకున్న రుణాలు మాఫీ కాని వారు, మొదటి విడత రైతులకు మాత్రమే నిధులు జమ అయ్యి.. రెండు, మూడు విడతలు రానివారు ఉన్నారు. మాఫీ నిధులు వడ్డీలకు కూడా సరిపోలేదని రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రెండు, మూడు విడతల మాఫీ నిధులను సంబంధిత బ్యాంకులకు విడుదల చేశామని, వెళ్లి బ్యాంకులో కలవాలంటూ అధికారులు పాత పాటే పాడారు. పరిష్కార వేదిక పేరిట హడావుడి తప్ప పెద్దగా ప్రయోజనం లేదనే విమర్శలు రైతుల నుంచి వ్యక్తమయ్యాయి. ఎన్నికల ముందు రైతుల కోసం ఏదో చేస్తున్నారే అభిప్రాయాన్ని ఏర్పరచుకునేందుకు చేస్తున్న ప్రయత్నంగా దుయ్యబట్టారు. బంగారంపై తీసుకున్న రుణం మాఫీ కాలేదు బంగారంపై రూ.78 వేల వ్యవసాయ రుణం తీసుకున్నా. కానీ మాఫీ కాలేదు. అర్హత ఉన్నందున మాఫీ కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఫిర్యాదు చేశా. యథావిధిగా ఎన్ఐసీ పోర్టల్‌లో వివరాలు లేవు. బ్యాంకుకు వెళ్లమని కాగితం చేతిలో పెట్టారు. – బి.గిరప్ప, చాగి, ఆదోని మండలం -
మాఫీ మాయ
- వేలకోట్లలో రుణాలు, వందల కోట్లలో కేటాయింపులు - అన్ని అర్హతలూ ఉన్నా జాబితాలో పేరు లేదు - రుణమాఫీ ఫిర్యాదు కేంద్రాలకు భారీ క్యూలు - అయినా పట్టించుకోని ప్రభుత్వం ఓటరు దేవుడి ‘రుణం’ తీర్చుకుంటానన్నారు. డబ్బు కోసం ఆశించకుండా రుణ విముక్తుల్ని చేస్తానని నమ్మబలికారు. అధికారం చేతికందాక దా‘రుణం’గా మోసం చేశారు. అరకొర నిధులు విదిల్చి సరిపెట్టుకోమన్నారు. రుణమాఫీ దరఖాస్తు కేంద్రాలు రణరంగాలను తలపిస్తున్నా పట్టించుకోలేదు. నిండా మోసపోయిన రైతన్న అప్పులు తెచ్చి బ్యాంకులకు వడ్డీలు చెల్లిస్తున్నాడు. జిల్లాలో ప్రతి పల్లెలో ఇదే పరిస్థితి. రుణమాఫీకి అర్హత కలిగిన 7.03లక్షల రైతుల బ్యాంకు ఖాతాలకు గానూ పూర్తిగా రుణమాఫీ అయ్యింది ఒక్కటీ లేదంటే నమ్మితీరాల్సిందే. సాక్షి, విజయవాడ : జిల్లాలో వేలకోట్ల రూపాయల పంట రుణాలు, బంగారం కుదవ పెట్టి లక్షల సంఖ్యలో రైతులు వ్యవసాయ రుణాలు తీసుకున్నారు. కానీ, వందల మందికి కూడా పూర్తిగా రుణమాఫీ జరగలేదు. జిల్లాలో 2013 సంవత్సరం డిసెంబర్ 31 నాటికి 7.03 లక్షల రైతులు బ్యాంకు ఖాతాలకు సంబంధించి రూ.9,137 కోట్లు మొత్తం బకాయిలుగా ఉన్నాయి. వీటన్నింటినీ పూర్తిగా మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించి జాబితా కూడా సిద్ధం చేసింది. చివరకు కమిటీల పేరుతో కాలయాపన చేసి రుణమాఫీ నాలుగు విడతల్లో చేపడతామని చెప్పి కొద్దినెలల కిందట మొదటి విడత మాఫీ ప్రకటించారు. మొదటి విడతలో 2.84 లక్షల మంది రైతులకు రూ.997 కోట్ల బకాయిలు మాఫీ చేశామని బ్యాంకర్లు ప్రకటించారు. కానీ, వాస్తవ పరిస్థితి వేరేలా ఉంది. 2.84 లక్షల మంది రైతులకు రూ.326 కోట్లు మాత్రమే మాఫీ అయ్యింది. రెండో జాబితాలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. రెండో జాబితాలో 1.40 లక్షల మంది రైతులకు రూ.440 కోట్ల రుణమాఫీ జరిగిందని బ్యాంకర్లు ప్రకటించినా ఇప్పటివరకు రూ.188 కోట్లు మాత్రమే మంజూరయ్యాయి. వచ్చే నాలుగేళ్లలో మిగిలినది మంజూరవుతుందని బ్యాంకర్లు చెబుతున్నారు. అయితే, అసలు కన్నా వడ్డీలే అధికంగా పెరిగి ప్రభుత్వం ఇస్తున్న వేల రూపాయల రుణమాఫీ కనీసం వడ్డీకి కూడా చాలని పరిస్థితి తలెత్తింది. రూ.9,137 కోట్ల బకాయిల్లో రెండు విడతల్లో కలిపి కేవలం ఐదుశాతం మాత్రమే రుణం మాఫీ అయ్యిందంటే జిల్లాలో రుణమాఫీ ఎంత పకడ్బందీగా అమలవుతుందో తెలుస్తోంది. రుణమాఫీకి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటుచేసిన ఫిర్యాదుల కేంద్రానికి ఇప్పటి వరకు 14,500 దరఖాస్తులు వచ్చాయంటే జిల్లాలోని పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది. రూ.50వేలు రుణం తీసుకున్న వారికి మాత్రమే మొదట విడతలో పూర్తిగా రుణమాఫీ జరిగింది. ఆపై మొత్తం తీసుకున్న వారికి సులభ వాయిదాల పద్ధతిలో విడతలవారీగా మంజూరవుతుంది. ఉదాహరణకు ఒక రైతు రూ.లక్ష రుణమాఫీ కావాల్సి ఉంటే.. అన్ని అర్హతలు ఉండి మొదటి విడత జాబితాలో పేరు ఉంటే ఏటా రూ.25వేల చొప్పున నాలుగు విడతల్లో బాకీ మాఫీ అవుతుంది. అయితే, బాకీ మాఫీ అయ్యే నాటికి మరో రూ.30వేలు వడ్డీ పడుతుంది. ఉద్యానవన పంటలకు మాఫీ నిల్ జిల్లాలో ఉద్యానవన పంటల సాగు అధికంగా ఉంది. పశ్చిమ కృష్ణాలోని జగ్గయ్యపేట, నందిగామ, నూజివీడు, తిరువూరు, మైలవరం, జి.కొండూరు, చాట్రాయి తదితర ప్రాంతాల్లో ఉద్యానవన పంటల సాగు అధికంగా ఉంది. మామిడి మూడు లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇదికాకుండా జామ, సపోట, పసుపు, జామాయిల్, కూరగాయలు తదితర పంటల సాగు ఎక్కువగా జరుగుతోంది. ఈ పంటలకు రుణమాఫీ వర్తించకపోవటంతో జిల్లాలో వేలాదిమంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంటకో రుణం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద ఒక్కో పంటకు రుణం రేట్లు నిర్ణయించి ఆ మేరకు బ్యాంకర్లు మంజూరు చేస్తున్నారు. అయితే, అవి కూడా ఖరీఫ్‌లో ఒక విధంగా, రబీలో మరో విధంగా ఉంటాయి. ఉదాహరణకు పత్తికి గరిష్టంగా రూ.28వేలు, వరికి రూ.22వేలు, మిర్చికి రూ.42వేలు, చెరుకు పంటకు రూ.40వేలే బ్యాంకర్లు రుణాలు మంజూరు చేస్తారు. ఖరీఫ్ కంటే రబీ సీజన్‌కు సగటున రూ.2వేలు తక్కువ రుణం మంజూరు చేస్తారు. స్కేల్ వడ్డీ బ్యాంకర్ల వడ్డీ బాదుడు తీవ్రంగా ఉంటోంది. అసలు మీద వడ్డీ, వడ్డీ మీద ఏడాదికి ఒకసారి సీజనల్ ఇంట్రెస్ట్ పేరుతో వడ్డీ విధిస్తుంటారు. రూ.1000 నుంచి రూ.మూడు లక్షల వరకు తీసుకునే రుణాలకు వడ్డీరేటు ఏడాదికి ఏడు శాతంగా ఉంది. రుణం తీసుకున్న ఏడాదిలో చెల్లిస్తే ఏడు శాతం వడ్డీలో మూడు శాతం తగ్గిస్తారు. అంటే.. నాలుగు శాతం మాత్రమే వడ్డీ పడుతుంది. అదే.. ఏడాది దాటితే వడ్డీశాతం భారీగా పెరుగుతుంది. 14.5 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాకుండా రెండు శాతం పీనల్ ఇంట్రస్ట్ పడుతుంది. అలాగే, రూ.లక్షలోపు రుణానికి ఏడాదికి ఏడు శాతం, ఏడాది దాటితే 12 శాతం, దీంతో పాటు 2శాతం పీనల్ ఇంట్రెస్ట్ పడుతుంది. రుణమాఫీ రైతులందరికీ పీనల్ ఇంట్రెస్ట్ వర్తిస్తుంది.