breaking news
Lemon Rice
-
పుష్కర భక్తులకు ఉచితంగా పులిహోర ప్యాకెట్ల పంపిణీ
మిర్యాలగూడ : కృష్ణాపుష్కర భక్తులకు దామరచర్ల మండలం వాడపల్లిలో ఉచితంగా పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేయనున్నట్లు మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి రమేష్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పుష్కర భక్తులకు సుమారు 10 లక్షల రూపాయల విలువైన పులిహోర, మంచినీళ్ల ప్యాకెట్లు 12 రోజుల పాటు ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. ప్రతి రోజు నాలుగు నుంచి ఐదు వేల పులిహోర ప్యాకెట్లను పంపిణీ చేస్తామని తెలియజేశారు. మొదటి రోజు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. సమావేశంలో పంపిణీ కన్వీనర్ రేపాల లింగయ్య, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శులు గౌరు శ్రీనివాస్, గుడిపాటి శ్రీనివాస్, మిల్లర్స్ ప్రతినిధులు రేపాల అంతయ్య, కన్నెగుండ్ల రంగయ్య, పురుషోత్తం, నాగేశ్వర్రావు, లవకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆస్పత్రుల్లో అమ్మ క్యాంటీన్లు
సాక్షి, చెన్నై:రాజధాని నగరంలో అమ్మ పేరిట కొలువు దీరిన క్యాంటీన్లకు విశేష ఆదరణ లభిస్తున్న విషయం తెలి సిందే. ఈ క్యాంటీన్లను రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లకు విస్తరించారు. చెన్నైలో 200 ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్లు పేదలకు, నగరంలో తక్కువ జీతాలకు పనులు చేసుకుంటున్న వాళ్లకు ఎంతో దోహదకారిగా ఉన్నాయి. రూ.6 కే సాంబారన్న, కరివేపాకు అన్నం, లెమన్ రైస్ లభిస్తుండడంతో కడుపు నిండా తినే అవకాశం ఉంది. ఈ క్యాంటీన్లను దేశంలోని పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. తమ రాష్ట్రాల్లో ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వాలు పరుగులు తీస్తున్నాయి. అక్కడి నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చి క్యాంటీన్లను పరిశీలించి వెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఈ క్యాంటీన్లను మరింత విస్తృతం చేయడం లక్ష్యంగా సీఎం జయలలిత నిర్ణయించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద రోగులకు, అక్కడికి వచ్చి వెళ్లే వారికి తక్కువ ఖర్చుతో కడుపునిండా తిండి పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. దీంతో నగరంలో తొలి విడతగా జీహెచ్‌లో ఇది వరకు ఓ క్యాంటీన్ ఏర్పాటు చేశారు. దీనికి అమిత స్పందన రావడంతో నగరంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో, రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ క్యాంటీన్ల ఏర్పాటు దిశగా ముందుకు వెళ్తున్నారు. ఆసుపత్రుల్లో... : నగరంలోని నాలుగు ఆస్పత్రుల్లో సోమవారం క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి. ట్రిప్లికేన్‌లోని కస్తూరిబాయ్ ప్రసూతి ఆస్పత్రి, రాయపేటలోని జనరల్ ఆస్పత్రి, ప్రసూతి ఆస్పతి, కీల్పాకం ఆస్పత్రుల ఆవరణలో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఉదయం ట్రిప్లికేన్ కస్తూరి బాయ్ ఆస్పత్రిని సీఎం జయలలిత ప్రారంభించారు. కొందరికి స్వయంగా ఆమె వంటకాలు వడ్డించారు. అలాగే, కరివేపాకు అన్నం రుచి చూసి చాలా బాగుంది అంటూ అక్కడి సిబ్బందిని అభినందించారు. అనంతరం అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మిగిలిన ఆస్పత్రుల ఆవరణలో ఏర్పాటు చేసిన క్యాంటీన్లను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ సైదై దురై స్వామి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ వర్గీస్ సుంకత్, నగర కమిషనర్ విక్రమ్ కపూర్, నగరాభివృద్ధి శాఖప్రధాన కార్యదర్శి ఫనీంద్ర రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.