breaking news
Legislature Party leader
-
రెండు ముక్కలైన దీదీ పార్టీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో 28 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) రెండు ముక్కలైంది. 58 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు మమతా బెనర్జీ పార్టీని చీల్చేశారు. అసెంబ్లీలో అసలైన టీఎంసీ శాసనసభాపక్షంగా అధికారికంగా గుర్తింపు పొందారు. బహిష్కృత ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. తమను టీఎంసీ శాసనసభాపక్షంగా గుర్తిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లు తిరుగుబాటు వర్గం వెల్లడించింది. మరోవైపు ఇప్పటికీ మమతా బెనర్జీయే తమ నాయకురాలు అని రితబ్రత బెనర్జీ స్పష్టంచేశారు. తమ శాసనసభ బృందానికి ప్రధాన సలహాదారుగా వ్యవహరించాలని, తమకు మార్గనిర్దేశం చేయాలని ఆమెను కోరారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయం తర్వాత దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పెత్తనాన్ని ప్రశ్నిస్తూ ప్రారంభమైన తిరుగుబాటు చివరకు పార్టీని చీల్చడం గమనార్హం. పార్టీ చరిత్రలో ఇలాంటి సంక్షోభం తలెత్తడం ఇదే మొదటిసారి. అంతర్గత పోరు పట్ల వెంటనే అప్రమత్తమైన మమతా బెనర్జీ వర్గం తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన అన్ని సంస్థాగత కమిటీలను, అనుబంధ సంఘాలను తక్షణమే రద్దు చేసింది. ఈ పరిణామాలు టీఎంసీ దుస్థితికి అద్దం పడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీదీ పార్టీ భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మూడింట రెండొంతుల ఎమ్మెల్యేల బలం తృణమూల్ బహిష్కృత ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ బుధవారం తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి స్పీకర్ రతీంద్ర బోసుతో సమావేశమయ్యారు. తమ వర్గాన్ని అసలైన టీఎంసీ శాసనసభాపక్షంగా గుర్తించాలని కోరారు. మొత్తం 58 ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖలను స్పీకర్‌కు సమరి్పంచారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం.. అనర్హత వేటు పడకుండా ఉండాలంటే తిరుగుబాటు వర్గానికి కనీసం మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ లెక్కన 54 మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తే రితబ్రత వర్గంపై అనర్హత వేటు పడదు. అసెంబ్లీలో టీఎంసీకి మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు ఉండగా, రితబ్రతకు 58 మంది మద్దతు ప్రకటించడంతో ఆయన వర్గాన్ని శాసనసభాపక్షంగా స్పీకర్ గుర్తించారు. తగిన సంఖ్యా బలం ఉండడంతో అనర్హత వేటు తప్పినట్లే. తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు సమర్ ముఖోపాధ్యాయ, అరూప్ రాయ్, రతిన్ ఘోస్, జావెద్ ఖాన్, ప్రసూన్ బెనర్జీ సైతం అసమ్మతి వర్గంలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్యేలపై మమతా బెనర్జీ పట్టు కోల్పోయినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రం బయట ఉన్న మరో ఇద్దరు శాసనసభ్యులు సైతం తమకే మద్దతు ఇస్తున్నారని, వారు త్వరలోనే తమ శిబిరంలో చేరుతారని రితబ్రత బెనర్జీ చెప్పారు. తామంతా తృణమూల్ కాంగ్రెస్ గుర్తుపైనే ఎన్నికల్లో గెలిచామని, అసెంబ్లీలో అసలైన టీఎంసీ శాసనసభాపక్షంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని అన్నారు. స్పీకర్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని స్పష్టంచేశారు. అఖ్రుజమన్‌ను చీఫ్ విప్‌గా, జావెద్ అహ్మద్ ఖాన్, సాందీపన్ సాహా, సబీనా యాస్మిన్, షియులీ సాహాను శాసనసభాపక్ష ఉపనేతలుగా నియమించినట్లు చెప్పారు. తమ శాసనసభాపక్షం కొత్త కూర్పును స్పీకర్ ఆమోదించారని, ప్రతిపక్ష నాయకుడి కోసం ఉద్దేశించిన కార్యాలయాన్ని తనకు కేటాయించారని తెలిపారు.ఎందుకీ ముసలం? తృణమూల్ కాంగ్రెస్‌లో శాసనసభాపక్ష నేతగా ఎవరిని నియమించాలన్న దానిపై తొలుత వివాదం మొదలైంది. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో అసెంబ్లీ స్పీకర్‌కు గతవారం లేఖ రాశారు. సీనియర్ ఎమ్మెల్యే శోభన్‌దేవ్ చటోపాధ్యాయను టీఎంసీ శాసనసభాపక్ష నాయకుడిగా, ఫర్హాద్ హకీంను చీఫ్ విప్‌గా నియమించాలని కోరారు. ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను కూడా పంపించారు. దీనిపై రగడ జరిగింది. తమ సంతకాలను ఫోర్జరీ చేశారని రితబ్రత, సాందీపన్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. సీఐడీ విచారణకు కూడా దారితీసింది. అభిషేక్ బెనర్జీకి సీఐడీ అధికారులు సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని సూచించారు. ఈ నేపథ్యంలో అభిషేక్ బెనర్జీ ప్రతిపాదనను స్పీకర్ తిరస్కరించారు. అనంతరం క్రమశిక్షణా చర్యలను ఉల్లంఘించారన్న కారణంతో రితబ్రత బెనర్జీని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు టీఎంసీ నాయకత్వం ప్రకటించింది. ఇదిలా ఉండగా, తమ అధినేత మమతా బెనర్జీ మాత్రమేనని తిరుగుబాటు ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు. ఆమె టీఎంసీ చైర్‌పర్సన్‌గా పనిచేస్తారని వెల్లడించారు. శాసనసభాపక్షానికి సంబంధించిన అంశాల్లో దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పెత్తనాన్ని అంగీకరించబోమని హెచ్చరించారు.వీరవిధేయుడే కానీ...కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీకి విధేయుడిగా పేరుగాంచిన రితబ్రత బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఆమెపైనే తిరుగుబాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. బెంగాల్ దీదీని ఆయన కొంతకాలం క్రితం వరకు రష్యా దివంగత నేత వ్లాదిమిర్ లెనిన్తో పోల్చేవారు. ధీరవనితగా కొనియాడేవారు. అసలు సిసలైన ప్రజా నాయకురాలిగా కీర్తించేవారు. కమ్యూనిస్టు పార్టీ మాజీ నాయకుడైన రితబ్రత బెనర్జీ నేడు తృణమూల్ కాంగ్రెస్ చరిత్రలోనే అతిపెద్ద చీలికను సృష్టించడం గమనార్హం. 28 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో ఎన్నడూ లేని అంతర్గత తిరుగుబాటుకు నేతృత్వం వహించారు. ఆయన మరో ఏక్నాథ్ షిండే కాబోతున్నారంటూ రాజకీయ విశ్లేషణలు ఇప్పటికే మొదలయ్యాయి. ఏకంగా 58 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 46 ఏళ్ల యువకుడైన రితబ్రత వెనుక జట్టుకట్టడం ఆసక్తికరంగా మారింది. రితబ్రత 1979 నవంబర్ 15న కోల్‌కతాలో జని్మంచారు. కోల్‌కతాలోనే గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నారు. కాలేజీలో వామపక్ష భావజాలం ఉండేది. ఆంగ్ల భాషలో అనర్గళంగా మాట్లాడుతూ టీవీ చర్చా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో గుర్తింపు సంపాదించారు. 2008లో వామపక్ష విద్యార్థి విభాగమైన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) ప్రధాన కార్యదర్శిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. చురుకైన యువ నేతగా అందరి దృష్టిని ఆకర్శించారు. 2011లో 31 ఏళ్ల వయస్సులో కోల్‌కతా సౌత్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో సీపీఎం అభ్యర్థిగా పోటీ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి సుబ్రతా బక్షి చేతిలో ఓడిపోయారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు చూశా రు. మూడేళ్ల తర్వాత 2014లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతుతో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పట్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా తట్టుకున్నారు. బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య, సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి ఆయనకు అండగా నిలిచారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా.. కమ్యూనిస్టు నాయకుడైన రితబ్రత బెనర్జీ జీవనశైలి అప్పట్లో విలాసవంతంగా ఉండేది. ఖరీదైన వస్తువులు, ఎల్రక్టానిక్ పరికరాలు ఉపయోగించేవారు. దీనిపై పార్టీలో అసంతృప్తి చెలరేగింది. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. సీనియర్ నాయకులు విమర్శలు గుప్పించారు. క్షమశిక్షణా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. 2017లో రితబ్రతను సీపీఎం నుంచి బహిష్కరించారు. తర్వాత బీజేపీ నేతలు ముకుల్ రాయ్, కైలాశ్ విజయ్‌వర్గియాతో రితబ్రత సన్నిహితంగా మెలిగారు. ఓ మహిళకు సంబంధించిన వివాదంలో పోలీసు కేసు నమోదు కావడంతోపాటు చట్టపరమైన ఇబ్బందుల వల్ల అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. 2020లో రాజ్యసభ సభ్యత్వం గడువు ముగిసిపోవడంతో అధికారికంగా తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ కార్మిక విభాగమైన ఐఎన్టీటీయూసీకి సారథ్యం వహించారు. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి నమ్మినబంటుగా మారారు. ప్రతిఫలంగా 2024లో రాజ్యసభ సభ్యత్వం లభించింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ టిక్కెట్ సైతం దక్కింది. ఎమ్మెల్యేగా గెలిచారు. అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకంగా గొంతెత్తారు. పార్టీలో అతడి ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ తిరుగుబాటు ప్రారంభించారు. -
ఢిల్లీ సీఎం ప్రకటనపై బిగ్ ట్విస్ట్
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ కాబోయే ముఖ్యమంత్రి (Delhi Next CM) ఎవరు? అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేఎల్పీ భేటీ నేపథ్యంలో ఇవాళ సాయంత్రంలోపు స్పష్టమైన ప్రకటన వెలువడొచ్చని అంతా భావించారు. అయితే చివరి నిమిషంలో ఆ భేటీని వాయిదా వేస్తూ బీజేపీ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది.ఇవాళ జరగాల్సిన బీజేఎల్పీ(BJLP) సమావేశాన్ని వాయిదా వేసింది ఆ పార్టీ. ఢిల్లీ స్టేషన్ తొక్కిసలాట ఘటనకు సంఘీభావంగానే సమావేశాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించింది. తిరిగి.. ఫిబ్రవరి 19న ఈ భేటీని నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే అదే తేదీన సీఎంతో పాటు కేబినెట్ కూర్పుపైనా ఓ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ఈలోపు రేపు మరోసారి సీఎం అభ్యర్థిపై అధిష్టానం సమాలోచనలు జరపనున్నట్లు సమాచారం. బీజేపీ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం.. 19వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన బీజేఎల్పీ జరగనుంది. ఆ భేటీలో సీఎం అభ్యర్థి పేరు ప్రకటన ఉంటుంది. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు సరాసరి లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరకు వెళ్తారు. బీజేఎల్పీ నేత, కేబినెట్ పేర్లు ఉన్న వివరాలు అందజేసి ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని ఎల్జీని కోరనున్నారు.అందుకే ఆలస్యం!ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు(Delhi Assembly Elections) పోలింగ్ జరగ్గా.. 8వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 70 స్థానాల్లో బీజేపీ 48, ఆప్ 22 గెలుచుకున్నాయి. సుమారు మూడు దశాబ్ధాల తర్వాత ఢిల్లీ పీఠం కమలం కైవసం చేసుకుంది. అయితే.. సీఎం ఎంపికలో ఆచీచూతీ వ్యవహారించాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు జేపీ నడ్డా నాయకత్వంలో అంతర్గత సంప్రదింపులు సైతం జరిపింది. అదే సమయంలో.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లడంతో ఎంపిక ఆలస్యమైంది. ఈలోపు ఢిల్లీ విషాదంతో.. మరోసారి ఆ భేటీ వాయిదా పడింది. ఇక 19వ తేదీన జరగబోయే బీజేఎల్పీ సమావేశానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శులు సైతం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీ పాలిత ప్రాంతాల్లో మాదిరే.. ఢిల్లీకి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు(Delhi Deputy CMs) ప్రతిపాదనను అధిష్టానం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం.ప్రమాణం ఎప్పుడంటే..ఆ మరుసటిరోజు(ఫిబ్రవరి 20న) రామ్ లీలా మైదానం(Ram Leela Maidan)లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించాలనుకుంటోంది. ఎన్టీయే పాలిత ప్రాంతాలకు ఇప్పటికే ఆహ్వానం వెళ్లింది. గురువారం సాయంత్రం 4గం.30ని. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. మోదీ, అమిత్ షా సహా బీజేపీ అగ్ర నేతల సమక్షంలో సీఎం, మంత్రి వర్గం ప్రమాణం చేయనుంది. ఈ మేరకు కార్యక్ర కో ఆర్డినేటర్లుగా వినోద్ తావ్డే,తరుణ్ చుగ్‌లను బీజేపీ హైకమాండ్ నియమించింది.ఇక.. ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ వర్మ(న్యూ ఢిల్లీ), రేఖా గుప్తా (షాలిమార్ బాగ్), విజేందర్ గుప్తా (రోహిణి), సతీష్ ఉపాధ్యాయ్ (మాల్వియా నగర్), ఆశిష్ సూద్ (జనక్‌పురి), పవన్ శర్మ (ఉత్తమ్ నగర్), అజయ్ మహావార్ (ఘోండా)ర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జనాల్లో ‘క్లీన్ ఇమేజ్’ ఉన్న నేతకే ఢిల్లీ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం ఓ అంచనాకి వచ్చినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: వద్దని తిరిగి వెళ్లిపోతుండగా ప్రాణం పోయింది!! -
హరియాణా బీజేపీఎల్పీ నేతగా సైనీ
చండీగఢ్/ పంచకుల: హరియాణా బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా నాయబ్‌సింగ్ సైనీ ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. బుధవారం పంచకులలో సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యేలు సైనీని తమ నాయకుడిగా ఎన్ను కున్నారు. సైనీ పేరును ఎమ్మెల్యే క్రిషన్ కుమార్ బేడీ ప్రతిపాదించగా.. సీనియ ర్ నేత అనిల్ విజ్ బలపరిచారు. అనిల్ విజ్ సైతం సీఎం పదవిని ఆశించినప్పటికీ బీజేపీ అగ్రనేతలు సైనీ వైపు మొగ్గారు. పరిశీలకుడిగా హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. సైనీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం సైనీ గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఈనెల 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలు నెగ్గి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలన్నీ అంచనా వేసిన కాంగ్రెస్ 37 స్థానాల వద్దే నిలిచిపోయింది. హరియాణా ముఖ్యమంత్రి రెండోసారి సైనీ గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మోదీ, రాజ్‌నాథ్ సింగ్‌లతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎన్డీయే సీఎంలు హాజరుకానున్నారు. -
శాసనసభాపక్ష నేతగా విజేందర్ గుప్తా
న్యూఢిల్లీ: విధానసభలో బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా రోహిణీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా ఎంపికయ్యారు. మొట్టమొదటిసారిగా ఎన్నికల బరిలో దిగి విజయం సాధించిన గుప్తాను పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో సభ్యులు ... శాసనసభా పక్ష నేతగా ఎంపిక చేశారు. కాగా 70 మంది సభ్యులు కలిగిన ఢిల్లీ విధానసభలో 67 మంది ఆప్‌కు చెందినవారే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున ముగ్గురే విజయం సాధించారు. సంఖ్యాబలం బాగా స్వల్పంగా ఉన్న కారణంగా రాజ్యాంగపరంగా బీజేపీకి ప్రతిపక్ష దక్కే అవకాశం లేదు.


