breaking news
leave granted
-
సంతానం పొందేందుకు సెలవు
మదురై: సంతానం పొందేందుకు వీలుగా యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీకి మద్రాస్ హైకోర్టు రెండు వారాల సెలవు ఇచ్చింది. తిరునల్వేలి జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న 40 ఏళ్ల సిద్ధిక్ అలీకి ఈ అవకాశమిచ్చింది. ఆయన భార్య దాఖలుచేసిన హెబియస్‌కార్పస్ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం అలీకి రెండు వారాల సెలవు మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది. అవసరమైతే సెలవును మరో రెండు వారాలు పొడిగించే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. ఖైదీలు తమ జీవిత భాగస్వాములను కలుసుకునే అంశాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించేందుకు ఇదే తగిన సమయమని బెంచ్ అభిప్రాయపడింది. ఈ సౌకర్యం చాలా దేశాల్లో అమల్లో ఉందని గుర్తుచేసింది. జీవిత భాగస్వాములను కలుసుకోవడం ఖైదీల కనీస హక్కని కేంద్రం ఆమోదించిన ఓ తీర్మానాన్ని ప్రస్తావించింది. -
అవిశ్వాస నోటీసుపై చర్చకు ఆమోదం
ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస నోటీసుకు ఆమోదం లభించింది. సభలో ఉన్న మొత్తం సభ్యులలో 10 శాతం మంది కంటే ఎక్కువ మంది దీనికి మద్దతు పలకడంతో చర్చను చేపట్టనున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. ఈ అంశంపై బీఏసీలో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. సభను టీ విరామం కోసం 10 నిమిషాలు వాయిదా వేస్తున్నామని, తర్వాత బీఏసీలో చర్చిస్తామని అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చను ఎప్పుడు చేపట్టాలి, ఎంత సేపు దానిపై చర్చించాలన్న విషయాలను బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు. నిబంధనల ప్రకారం నోటీసు ఇచ్చిన 14 రోజుల్లోపు ఈ అంశంపై చర్చ జరగాల్సి ఉంది. గత 22 నెలల కాలంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని నోటీసులో పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలోను, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలోను అధికార పక్షం ఘోరంగా విఫలమైందని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అంటున్నారు. తాము ప్రజాసమస్యల మీద పోరాడుతుంటే.. చంద్రబాబు సర్కారు మాత్రం తాము అవినీతితో సంపాదించిన సొమ్ముతో మరింత విచ్చలవిడిగా ప్రవర్తిస్తోందని మండిపడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లువుతున్నా, ఏ వర్గానికి చెందిన ప్రజలకూ ఏమీ చేసిన దాఖలాలు కనిపించడం లేదన్నారు.